కౌన్సిల్ హౌజ్‌లో బాంబులు వేసేందుకు ఆనాడు భగత్ సింగ్ అనుసరించిన వ్యూహం ఇదే...
- రేహాన్ ఫజల్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, CHAMAN LAL
భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ (పాత చిత్రం)
ఇప్పుడున్న పార్లమెంటు భవనమే అప్పట్లో కౌన్సిల్ హౌజ్. దిల్లీలోని గొప్ప భవనాల్లో అదొకటి. 1929, ఏప్రిల్ 6న, కౌన్సిల్ హౌజ్‌లో సేఫ్టీ బిల్ ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ అక్కడికి వెళ్లారు. పబ్లిక్ గ్యాలరీ ఎక్కడుంది? అక్కడి నుంచి ఎలా బాంబులు వేయొచ్చు? అనేవి పరిశీలించేందుకు వాళ్లు వెళ్లారు.
వాళ్లు వేసే బాంబుల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హాని జరగకూడదనే వాళ్ల ప్రయాస.
అప్పటికి ‘ట్రేడ్ డిస్ప్యూట్ బిల్’ ఆమోదం పొందింది. కార్మికులు చేపట్టే అన్ని రకాల నిరసనలపై ఆ బిల్లు ద్వారా ఆంక్షలు విధించారు.
కానీ, ‘పబ్లిక్ సేఫ్టీ బిల్’పై అధ్యక్షుడు విట్టల్ భాయ్ పటేల్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు. ఈ బిల్లు ప్రకారం అనుమానితులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే బంధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
కౌన్సిల్ హౌజ్‌లోకి ఇలా వెళ్లారు
ఏప్రిల్ 8న హౌజ్ కార్యకలాపాలు మొదలవ్వకముందు ఉదయం 11 గంటలకు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ అక్కడికి వచ్చారు. ఎవరి చూపూ తమ మీద పడకుండా చూసుకున్నారు.
ఖాకీ రంగు కమీజ్, హాఫ్ ప్యాంట్ ధరించి, పైన బూడిద రంగు కోటు వేసుకున్నారు. కోటుకు బయటవైపు మూడు జేబులు, లోపలివైపు ఒక జేబు ఉంది. నూలు సాక్సులు కూడా వేసుకున్నారు.
తనను ముందుగానే ఎవరూ గుర్తుపట్టకూడదని భగత్ సింగ్ ఓ విదేశీ ఫెల్ట్ టోపీ పెట్టుకున్నారు. దాన్ని లాహోర్‌లోని ఓ దుకాణంలో కొన్నారు.
హౌజ్ గేట్ దగ్గర ఓ భారతీయ సభ్యుడు వారికి పాస్ ఇచ్చి, అటు నుంచి అటే వెళ్లిపోయారు. వీక్షకుల గ్యాలరీ జనంతో నిండిపోయింది.
ఫొటో సోర్స్, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
భగత్ సింగ్ ధరించిన ఖాకీ రంగు కమీజ్ ఇదే
‘భగత్ సింగ్ - ద ఎటర్నల్ రెబల్’ పేరుతో పుస్తకం రాసిన మల్విందర్ జీత్ సింగ్ అందులో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు.
‘‘భగత సింగ్, బటుకేశ్వర్ బాంబులు వేసేందుకు వెళ్లిన అవే దుస్తులు ధరించి, అంతకుముందు ఏప్రిల్ 3న కశ్మీరీ గేట్‌లోని రామ్‌నాథ్ ఫొటోగ్రాఫర్ షాప్‌లో ఫొటోలు తీయించుకున్నారు. ఆ ఫొటోల కోసం ఏప్రిల్ 6న మరోసారి ఆ దుకాణానికి వచ్చారు’’ అని ఆయన రాశారు.
ఫొటో సోర్స్, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
భగత్ సింగ్ గడియారం. దీన్ని ఆయన తన సహచరుడు జయదేవ్ కు ఇచ్చారు
కౌన్సిల్ హౌజ్‌కు రావడానికి ముందు భగత్ సంగ్ తన జేబు గడియారాన్ని సహచరుడు జయ్‌దేవ్‌కు ఇచ్చారు. ఈ గడియారానికీ ఓ చరిత్ర ఉంది. గద్దార్ పార్టీ సభ్యుడొకరు 1915లో దీన్ని కొన్నారు. ‘బంధీ జీవన్’ అనే పుస్తకం రాసిన శచీంద్ర్ నాథ్ సన్యాల్‌కు రాస్ బిహారీ బోస్ దాన్ని ఇచ్చారు. సన్యాల్ దాన్ని భగత్ సింగ్‌కు ఇచ్చారు.
అప్పట్లో నేషనల్ అసెంబ్లీలో మోతిలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, ఎన్సీ కేల్కర్, ఎమ్ఆర్ జయకర్ కూడా ఉన్నారు.
బాంబులు వేయడం వల్ల బిల్లు చట్టంగా మారడం ఆగదని భగత్ సింగ్‌కు తెలుసు. నేషనల్ అసెంబ్లీలో బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి లోటు లేదు. పైగా చట్టం చేసేందుకు వైశ్రాయ్‌కు అసాధారణ అధికారాలు ఉన్నాయి.
ప్రపంచానికి తెలిపింది దుర్గా దాస్
భగత్ సింగ్ బాంబులు వేసిన ఘటన గురించి ‘ఇండియా ఫ్రమ్ నెహ్రూ టు కర్జన్ అండ్ ఆఫ్టర్’ అనే పుస్తకంలో దుర్గాదాస్ సవివరంగా రాశారు.
‘‘ఏప్రిల్ 8న నేషనల్ అసెంబ్లీలో స్పీకర్ విట్టల్భాయ్ పటేల్ రూలింగ్ ఇచ్చేందుకు నిల్చోగానే, అసెంబ్లీ గచ్చుపైకి భగత్ సింగ్ బాంబును విసిరారు. నేను పాత్రికేయుల గ్యాలరీ నుంచి బయటకు వచ్చి, ప్రెస్ రూమ్ వైపు పరిగెత్తా. ఏపీఐ న్యూస్ డెస్క్‌తో ఓ సందేశం రాయించి, లండన్‌లోని రాయిటర్స్‌కు, మొత్తం భారత్‌కు ఫ్లాష్‌గా పంపించమన్నా. మరోవైపు ఫోన్లో నేను మరిన్ని వివరాలు చెబుతుండగానే, లైన్ డెడ్ అయ్యింది. పోలీసులు వెంటనే అసెంబ్లీ ప్రధాన ద్వారాన్ని మూసేశారు. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్లను నా కళ్ల ముందు అదుపులోకి తీసుకున్నారు. నేను సమాచారం అందించి, మూడు గంటలైనా రాయిటర్స్ వార్త వేయలేదు. ఎందుకంటే దాని గురించి మరింత సమాచారామేదీ వాళ్లకు లేదు. ఎలా ఉంటుంది? పాత్రికేయులందరినీ అసెంబ్లీ హాల్ నుంచి బయటకే వెళ్లనివ్వలేదు. ఇక కమ్ముకుంటున్న పొగ మధ్యే విట్టల్భాయ్ పటేల్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఫొటో సోర్స్, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
అసెంబ్లీ బాంబు కేసులో లాహోర్ సీఐడీ ఈ షెల్ ని స్వాధీనం చేసుకుంది
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు
అక్కడ కూర్చున్న సభ్యులకు దూరంగా బాంబు పడేలా భగత్ సింగ్ జాగ్రత్త తీసుకున్నారు. అది పెద్దగా చప్పుడు చేస్తూ పేలింది. అసెంబ్లీ హాల్లో చీకటి అలుముకుంది. వీక్షకుల గ్యాలరీలో గందరగోళం రేగింది.
అప్పుడే బటుకేశ్వర్ దత్త్ రెండో బాంబు విసిరారు. గ్యాలరీలో ఉన్న జనం ద్వారం వైపు పారిపోవడం మొదలుపెట్టారు.
ఆ బాంబులు చాలా తక్కువ తీవ్రత కలిగనివని, ఎవరూ చనిపోకుండా వాటిని విసిరారని కుల్దీప్ నయ్యర్ ‘వితౌట్ ఫియర్ - ద లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్’ అనే పుస్తకంలో రాశారు.
‘‘బాంబులు వేసిన వెంటనే వీక్షకుల గ్యాలరీ నుంచి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్థిల్లాలి) అని నినాదాలు చేశారు. కరపత్రాలను గాల్లోకి విసరారు. వాటిని స్వయంగా భగత్ సింగ్ రాశారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ పార్టీ లెటర్ హెడ్‌తో 30-40 కాపీలను చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు దుర్గాదాస్ హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధిగా ఉన్నారు. ఆ రోజు ఆ పత్రిక ప్రత్యేకంగా సాయం కాలం ఎడిషన్‌ను ముద్రించి ఆ వార్తను దేశానికి చెప్పింది.
ఫొటో సోర్స్, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
సాండర్స్ మర్డర్ కేసులో న్యాయమూర్తి ఈ పెన్నుతోనే భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లకు ఉరిశిక్ష లిఖించారు
‘ఆ చెవులకు వినపడాలంటే పేలుళ్లే సరి’
కరపత్రాల్లో మొదటగా ఉన్న పదం ‘గమనిక’.
‘చెవిటి చెవులకు వినపడలాంటే పేలుళ్లు అవసరం’ అని ఫ్రెంచ్ అమరవీరుడు అగస్త్ వైలో చెప్పిన మాటలు అందులో ఉన్నాయి.
చివర్లో కమాండర ఇన్ చీఫ్ బాల్‌రాజ్ అని పేరు ఉంది.
బాంబు నుంచి వెలువడిన పొగ వెలుతున్న కొద్దీ అసెంబ్లీలో సభ్యులు ఎవరి సీట్ల వద్దకు వాళ్లు వెళ్తూ ఉన్నారు. భగత్ సింగ్, బటుకేశ్వర్ తప్పించుకునేందుకు ప్రయత్నించలేదు. వాళ్ల పార్టీ ముందుగానే ఆ నిర్ణయం తీసుకుంది. వాళ్లు ఉన్న చోటునే ఉండిపోవాలని తీర్మానించుకుంది.
అక్కడున్న పోలీసు సిబ్బంది వద్ద ఆయుధాలు లేవు. దీంతో వాళ్లు భగత్ సింగ్, బటుకేశ్వర్ల దగ్గరికి వెళ్లలేదు. భగత్ సింగ్ తన ఆటోమేటిక్ పిస్టల్‌ను పోలీసులకు అప్పగించారు. సాండర్స్ శరీరంలో తూటాలు దింపింది ఆ పిస్టల్‌తోనే. సాండర్స్ హత్యలో తనను ఇరికించే అతిపెద్ద సాక్ష్యం ఆ పిస్టల్ అన్న విషయం భగత్ సింగ్‌కు బాగా తెలుసు.
విడివిడిగా విచారించే ఉద్దేశంతో భగత్ సింగ్‌ను, బటుకేశ్వర్లను వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు. భగత్ సింగ్‌ను ప్రధాన కొత్వాలీకి, బటుకేశ్వర్ను చాందినీ చౌక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఫొటో సోర్స్, SUPREME COURT OF INDIA
భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ (పాత చిత్రం)
లాహోర్‌కు వెళ్లి విచారణ
కౌన్సిల్ హౌజ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు చొరబాటుదారులు ఎవరినీ హత్య చేయలేదని పేర్కొంటూ వైశ్రాయ్ ఓ ప్రకటన జారీ చేశారు. వాళ్లు అనుకుని ఉంటే విధ్వంసానికి పాల్పడగలిగేవారేనని కూడా ఆయన అంగీకరించారు. వారి లక్ష్యం సెంట్రల్ అసెంబ్లీ అని వెల్లడించారు.
కాంగ్రెస్‌లో ప్రగతిశీలవాదిగా పేరుపొందిన చమన్ లాల్ అందరి కన్నా ముందు విప్లవకారుల ఈ చర్యను ఖండించారు. బాంబులు విసరడాన్ని పిచ్చి పనిగా వర్ణించారు.
కరపత్రాలు రాసిన శైలి ఇదివరకు కూడా కనిపించినట్లు బ్రిటీష్ నిఘా విభాగం భావించింది.
ఓ సీనియర్ పోలీసు అధికారి లాహోర్‌కు వెళ్లి, సాండర్స్ హత్య తర్వాత అక్కడి గోడలకు అంటించిన పోస్టర్లను పరిశీలించారు. అక్కడి పోస్టర్లకు, ఈ కరపత్రాలకు పోలిక ఉంది. రెండింటినీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, బాల్‌రాజ్ పేర్లతోనే ఉన్నాయి. రెండూ ‘గమనిక’ అన్న పదంతోనే మొదలై... ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్న పదంతో ముగిశాయి.
ఫొటో సోర్స్, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN
అసెంబ్లీ బాంబు కేసులో భగత్ సింగ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ (ఉర్దూలో రాశారు)
భగత్ సింగ్ తరఫున ఆసఫ్ అలీ వాదనలు
సాండర్స్ హత్యలో భగత్ సింగ్ పాత్ర ఉందని బ్రిటీష్ వాళ్లకు మొదట సాక్ష్యాలు ఇక్కడే దొరికాయి.
విచారణ సాగుతున్న కొద్దీ, వాళ్ల అనుమానం మరింత బలపడింది. కరపత్రాలు, పోస్టర్లను భగత్ సింగే స్వయంగా రాశారని స్పష్టమైపోయింది.
బాంబు పేలుళ్లకు సంబంధించి భారత శిక్షాస్మృతిలోని 307 సెక్షన్ ప్రకారం హత్యాయత్నం కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆసఫ్ అలీ భగత్ సింగ్ తరఫున వాదించడం మొదలుపెట్టారు.
తొలిసారి ఆసఫ్ అలీని కలిసినప్పుడు భగత్ సింగ్.. ‘‘నేను పిచ్చివాడిని కాదని చమన్లాల్కు చెప్పండి’’ అని ఆయనతో అన్నారు. ‘‘మేం చరిత్ర, దేశ పరిస్థితులు, ఆకాంక్షలను లోతుగా అధ్యయనం చేస్తున్నవాళ్లం’’ అని అన్నారు.
ఫొటో సోర్స్, chaman lal
లాహోర్‌లోని నేషనల్ కాలేజీ ఫొటో. తలపాగా పెట్టుకున్న వ్యక్తి భగత్ సింగ్ (నిలబడ్డవారిలో కుడివైపు నుంచి నాలుగో వ్యక్తి)
ఈ పరిణామాల తర్వాత భగత్ సింగ్, బటుకేశ్వర్ భారత యువతకు హీరోలైపోయారు. వాళ్లకు జనాదరణ ఎంతగా పెరిగిందంటే, బ్రిటీష్ ప్రభుత్వం జైల్లోనే కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఉన్న భవనంలో అప్పట్లో ఈ జైలు ఉండేది.
ఈ కేసులో బ్రిటీష్ ప్రభుత్వం తరఫున రాయ్ బహదూర్ సూర్యనారాయణ న్యాయవాదిగా ఉన్నారు. అదనపు మేజిస్ట్రేట్ పీబీ పూల్ జడ్జిగా ఉన్నారు. కేసు విచారణ జరిగినన్ని రోజులు భగత్ సింగ్ తల్లిదండ్రులు కూడా కోర్టుకు వచ్చారు.
మొదటి సారు కోర్టుకు వచ్చినప్పడు, భగత్ సింగ్ తన పిడికిలి పైకెత్తి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. దీంతో నిందితులు ఇద్దరికీ బేడీలు వేయమని జడ్జి ఆదేశించారు. ఇనుప రెయిలింగ్ వెనుక ఉన్న బెంచీలో వాళ్లిద్దరినీ కూర్చోబెట్టారు.
భగత్ సింగ్ ఏమీ మాట్లాడలేదు. తాను చెప్పాల్సిందంతా సెషన్స్ జడ్జి ముందు చెప్తానని అన్నారు.
ఫొటో సోర్స్, chaman lal
భగత్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్
ప్రభుత్వం తరఫున సార్జెంట్ టెరీ ప్రధాని సాక్షిగా ఉన్నారు. అసెంబ్లీలో అరెస్టు చేసిన సమయంలో భగత్ సింగ్ వద్ద పిస్టల్ దొరికిందని ఆయన కోర్టుకు చెప్పారు.
‘‘భగత్ సింగ్ కుడి చేతిలో పిస్టల్ ఉంది. ఆయన నేలవైపు చూస్తూ ఉన్నారు’’ అని టెరీ చెప్పారు.
కానీ ఇది అబద్ధం. భగత్ సింగ్ స్వయంగా పిస్టల్‌ను పోలీసులకు అప్పగించారు. తనను అరెస్టు చేయమని ఆయనే కోరారు.
భగత్ సింగ్ దగ్గర తూటాలతో ఉన్న మ్యాగజైన్ దొరికిన మాట వాస్తవం.
భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా 11 మంది సాక్ష్యం చెప్పారు. భగత్ సింగ్, బటుకేశ్వర్ ఒక జేబులో బాంబును, మరో జేబులో డొటోనేటర్ను పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని, ప్రమాదవశాత్తు పేలకుండా చాలా నెమ్మదిగా కదిలారని విచారణలో వెల్లడైంది.
ఫొటో సోర్స్, CHAMAN LAL
భగత్ సింగ్
భగత్ సింగ్‌కు కోర్టులో మాట్లాడే అవకాశం కల్పించినప్పడు, తనకు జైల్లో దినపత్రికలు అందించాలని ఆయన కోరారు.
కానీ, కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. సాధారణ నేరస్థుడిలానే కోర్టు ఆయన్ను చూసింది.
జూన్ 4న కేసు సెషన్స్ జడ్జి లియోనార్డ్ మిడిల్‌టౌన్ వద్దకు వెళ్లింది. 6న నిందితులు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. 10న విచారణ ముగిసింది. 12న తీర్పు వచ్చింది. జనాల ప్రాణాలు తీసే ప్రమాదమున్న బాంబు పేలుళ్లకు భగత్ సింగ్, బటుకేశ్వర్ కావాలనే పాల్పడ్డట్లుగా కోర్టు తేల్చింది. వాళ్లిద్దరికీ జీవిత ఖైదు విధించింది.
భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త్ బాంబులు విసురుతుండగా చూశానని సాక్ష్యం చెప్పిన వారిలో సర్ శోభా సింగ్ (ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ తండ్రి) కూడా ఉన్నారు.
దీనిపై అప్పీలుకు వెళ్లకూడదని భగత్ సింగ్, బటుకేశ్వర్ అనుకున్నారు. విప్లవ సందేశానికి ప్రచారం లభిస్తుందన్న కారణంతో, చివరికి వాళ్లను ఒప్పించి, అప్పీలు చేశారు.
కానీ, ఊహించినట్లుగానే 1930 జనవరి 13న హైకోర్టు వాళ్ల అప్పీళ్లను తిరస్కరించింది. 14 ఏళ్ల కారాగార శిక్షకు పంపింది.
కానీ, ఆ తర్వాత సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్‌ను ఉరి తీశారు.
ఇవి కూడా చదవండి:
- భగత్‌సింగ్ ఇల్లు చూద్దాం రండి..
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్లోనే
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- 'జలియన్‌వాలాబాగ్ నరమేధానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందే'
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ఈ 'భారత ఎడిసన్' గురించి ఎంతమందికి తెలుసు...
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)