కరోనావైరస్ లాక్డౌన్: సంక్షోభం దిశగా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు... దిక్కుతోచని స్థితిలో లక్షలాది కార్మికులు
- దీప్తి బత్తిని
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
లాక్డౌన్ కారణంగా అత్యవసరం కానీ సేవల్ని అందించే అన్ని పరిశ్రమలూ మూతబడ్డాయి
భారత్‌లో విధించిన లాక్డౌన్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతోన్న అనేక రంగాల్లో పరిశ్రమల రంగం ఒకటి. ఐటీ సంస్థల లాగా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించే వెసులుబాటు ఆ రంగాలకు ఉండదు. దాంతో, అది ఉత్పత్తితో పాటు లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా తీవ్రప్రభావం చూపుతోంది.
ఒకవేళ ఈ లాక్డౌన్ నాలుగు వారాల కంటే ఎక్కువ రోజులు కొనసాగితే దేశంలోని దాదాపు 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) మూతబడే ప్రమాదం ఉందని అఖిల భారత తయారీదారుల సంస్థ అంచనా వేస్తోంది.
అదే లాక్డౌన్ 8 వారాలకుపైగా కొనసాగితే 43 శాతం పరిశ్రమలు మూతబడతాయని, ఆ ప్రభావం లక్షలాది ఉద్యోగులపై ఉంటుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
భారత్‌లో దాదాపు 6.9 కోట్ల ఎంఎస్ఎంఇ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లు ఉన్నాయి. ఈ లాక్డౌన్ కారణంగా సప్లయ్ చెైన్ పూర్తిగా చెదిరిపోయిందని ఆ పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.
ఆహార, ఫార్మా, వైద్య పరికరాలకు సంబంధించిన పరిశ్రమలకు ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, మిగిలిన వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి.
తెలంగాణ విషయానికొస్తే, అక్కడ 70 వేల ఎంఎస్ఎంఇలు ఉంటే, వాటిలో లాక్డౌన్ మినహాయింపు ఉన్న కేవలం 8 శాతం సంస్థలే ప్రస్తుతం నడుస్తున్నాయి.
కేపీఎంజీ అంచనా ప్రకారం, భారతదేశ జీడీపీలో 30-35 శాతం ఎంస్ఎంఇల నుంచే వస్తుంది. ఈ సంస్థల ద్వారా దాదాపు 11 కోట్ల 40 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపార పరిస్థితులను అంచనా వేస్తూ, తగిన సూచనలను కేపీఎంజీ అనే నెట్వర్క్ చేస్తుంది.
ఎంఎస్ఎంఇలకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి?
‘‘ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే. వీటికి తోడు బ్యాంకు లోన్లకు వడ్డీలు, కరెంటు బిల్లులను చెల్లించాలి. కానీ, కొన్ని రోజులుగా నగదు లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఇక మార్చి 22 తరువాత వస్తువుల ఉత్పత్తి, మార్కెటింగ్ పూర్తిగా నిలిచిపోయింది’’ అని చెప్పారు సీలింగ్ ఫ్యాన్ల విడి భాగాలను తయారు చేసే సంస్థ నిర్వాహకుడు ఆదిత్య చచన్.
ఇంజినీరింగ్ రంగంలో ఉన్న ఏఎన్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ప్రియాంక రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
‘‘ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. సప్లై చెయిన్ దెబ్బతిన్న కారణంగా ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపైన కూడా ఉంటుంది. సంస్థల టర్నోవర్లు పడిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆరోగ్యం, ఇతర అత్యవసర రంగాలకు నిధుల మళ్లింపును అర్థం చేసుకోవచ్చు.
కానీ, లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇతర సంస్థలు ఎలా సర్దుకోవాలో, మళ్లీ ఎలా నిలదొక్కుకుని నడిపించాలో తలచుకుంటేనే భయమేస్తోంది. కార్మికులను రప్పించి, ఉత్పత్తిని ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయన్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ, లాక్డౌన్ వ్యవధి పెరిగే కొద్దీ అంతర్గతంగా అనేక సమస్యలు పరిశ్రమలను చుట్టేస్తాయి’’ అన్నారామె. ప్రభుత్వానికి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఎక్కువగా ఏఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ చేపడుతూ ఉంటుంది.
ఇతర పారిశ్రామికవేత్తల్లోనూ ఇలాంటి భయాలే అలముకున్నాయి. అఖిల భారత తయారీదారుల సంస్థ (ఎఐఎంఒ) ఏప్రిల్ 6వ తేదీన ఒక సర్వే వివరాలు ప్రకటించింది. దాని ప్రకారం, వారు సర్వే చేసిన 5 వేల సంస్థల్లో.. 71 శాతం సంస్థలు ఉద్యోగులకు జీతాలను పూర్తిగా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి.
“ఎక్కువగా కూలీలు, నాన్ రెగ్యులర్ ఉద్యోగులను ఉపయోగించుకునే 5 వేల ట్రేడర్లు, ఎంఎస్ఎంఇలపై ఈ సర్వే చేశాం. సంప్రదాయ తయారీరంగ నగరాలైన రాయ్‌పూర్, సూరత్, రాయగఢ్, విజయవాడ, ఫిరోజాబాద్, పానీపట్, శివకాశిలతో పాటూ, పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్న పెద్ద నగరాలైన పుణె, చెన్నై, బెంగళూరు, దిల్లీ వంటి చోట్ల కూడా సర్వే నిర్వహించాం. వీటిలో ఐటీ, ఐటీ ఆధారితాలు కాని సేవా రంగ సంస్థలు కూడా ఉన్నాయి.
వాటిలో దాదాపు 71 శాతం సంస్థలు ఏప్రిల్ 5లోగా మార్చి నెల జీతాలు పూర్తిగా చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. ఉత్పత్తి, రవాణా, నగదు లావాదేవీల సమస్యలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు” అన్నారు ఏఐఎంఒ మాజీ అధ్యక్షులు కెఇ రఘునందన్.
నగదు కొరత, చెల్లింపుల్లో ఆలస్యాలు, నగదు రొటేషన్ ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. అప్పులపై వడ్డీ చెల్లింపులు కూడా భారంగా మారాయి. ప్రస్తుతానికి బ్యాంకులు చెల్లింపులు వాయిదా వేసుకోవడానికి అవకాశం కల్పించినా, కాంపౌండ్ వడ్డీ విషయంలో బ్యాంకులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
“కాంపౌండ్ వడ్డీ అనేది చాలా ఆందోళనకర విషయం. ఎంఎస్ఎంఇలు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కాంపౌండ్ వడ్డీపైన సరైన నిర్ణయం తీసుకోకపోతే దీర్ఘ కాలంలో అది పరిశ్రమల పాలిట పెనువిపత్తుగా మారుతుంది” అన్నారు సిఐఐ మాజీ అధ్యక్షురాలు, ఎలైకో సంస్థ వైస్ ఛైర్మన్ వనిత దాట్ల.
సాధారణంగా మార్చి నెలలో లభించే ప్రభుత్వ టెండర్ల కోసం చాలా సంస్థలు పెద్ద ఎత్తున ముడి సరకు సిద్ధం చేసుకుంటాయని వనిత చెప్పారు. “ప్రభుత్వానికి కావల్సిన వస్తువులను టెండర్ల ద్వారా సేకరిస్తారు. చివరి మూడు నెలల (త్రైమాసికం) టెండర్లు ఇంకా పిలవలేదు. దీంతో మా దగ్గర ముడిసరకుతో పాటు ఉత్పత్తులు కూడా కుప్పలుగా పేరుకున్నాయి. ఆర్థిక లావాదేవీలకు ఈ పరిస్థితి అడ్డంకిగా మారింది’’ అని వివరించారు వనిత దాట్ల.
ఫొటో సోర్స్, Getty Images
లాక్డౌన్ మరో ఎనిమిది వారాలు కొనసాగితే తయారీ రంగం కుదేలవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు
ఏ రంగాలపై ఎంత ప్రభావం?
‘‘భారీ పరిశ్రమలకు ముడిసరకును అందించే సంస్థలు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీదార్లు, ఆతిథ్య రంగ సంస్థలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసే కార్పొరేటేతర సంస్థలు,
పెద్ద పరిశ్రమలకు ఉత్పత్తులు అందించే అనుబంధ పరిశ్రమలు, బార్ అండ్ రెస్టరెంట్లు, వినోద పరిశ్రమ, మాంసం, చేపలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రవాణా వంటి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్ని ఎంఎస్ఎంఇలు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, ఈ రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడ్డ వ్యాపారవేత్తల ఆదాయాలూ కుప్ప కూలే పరిస్థితుల్లో ఉన్నాయి’’ అన్నారు కెఇ రఘునందన్.
ప్రస్తుతానికి అత్యవసర సేవల్లో ఉన్న ఎంఎస్ఎంఇలు పనిచేస్తున్నప్పటికీ, వారు కూడా ఈ ఆర్థిక మందగమన ప్రభావం నుంచి తప్పించుకోలేరని, పైగా నగదు లావాదేవీలు, మార్కెట్ పరిస్థితి, కొనుగోలు శక్తీ వారిపై కూడా ప్రభావం చూపుతుందని రఘునాథన్ తెలిపారు.
“కన్జ్యూమర్ గూడ్స్, దుస్తులు, చెప్పులు, పాత్రలు, ఆటోమొబైల్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ముడి సరకును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే రంగాలైన ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగ సంస్థలు కూడా ఇబ్బంది పడతాయి. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో ఎగుమతులపైన ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని కెపిఎంజి అంచనా వేసింది.
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
ఎంస్ఎంఇలు ఏం కోరుతున్నాయి?
ప్రభుత్వం తమ ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేస్తుందన్న సందేహం అందరిలో నెలకొంది. “ఈ విషయంపై ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో, స్పష్టత లోపించింది. ఈ పరిస్థితి రానున్న ఆర్థిక సంవత్సరాలపై కూడా ప్రభావం చూపుతుంది’’ అన్నారు వనిత.
లాక్డౌన్ దీర్ఘకాలంపాటు కొనసాగితే, అది చాలా సంస్థల ఉపాధి కల్పన సామర్థ్యం మీద పడుతుంది. అర్హత ఉన్న ఎంఎస్ఎంఇలకు కొన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వాలు ప్రకటించాలి. ఉద్యోగులను తొలగించకుండా, జీతాలు సక్రమంగా అందించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పీఎఫ్, ఇఎస్ఐ వంటివి ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఆర్థిక సంవత్సరం వ్యవధిని పెంచే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి’’ అన్నారు వనిత.
బ్యాంకులు కూడా పరిశ్రమల విషయంలో సానుకూలంగా స్పందించాలన్నారు ఏఎన్ఆర్ ఇన్ఫ్రా ఈడీ ప్రియాంక రెడ్డి. “నా ఉద్యోగుల్లో చాలా మంది వలస కార్మికులే. వారిప్పుడు సొంతూళ్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ తరువాత వారందర్నీ వెనక్కు రప్పించడం కూడా సమస్యే. ఒకవేళ మేం పనులు పూర్తి చేశాక కూడా మాకు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర తగిన నిధులు ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకమే’’ అన్నారు ప్రియాంక.
చిన్న చిన్న పరిశ్రమల్లో యజమానులూ, కార్మికుల మధ్య భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయని, వారిని విధుల్లోంచి తొలగించడం కూడా కష్టమేనని చెబుతారు మరో ఎంఎస్ఎంఇ యజమాని. ‘‘నాకు ఉద్యోగులను తీసేయాలని లేదు. మాది చిన్న సంస్థ. పెద్ద కంపెనీల్లా కాకుండా, ఇక్కడ పనిచేసే వారూ, వారి కుటుంబ సభ్యులంతా నాకు తెలుసు. అందుకే జీతాలు, ఉద్యోగాల కోత గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి నాది’’ అని ఆయన్నారు.
అందుకే ఎన్పీయేల (నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్) నుంచి ఎంఎస్ఎంఇ ఖాతాలను తొలగించాలని కేపీఎంజీ సూచిస్తోంది.
పట్టణాలలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వెళ్లిన వారిలో నీరజ్ దంపతులు కూడా ఉన్నారు
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
ఎంఎస్ఎంఇల విషయమై కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు పంపినట్టు తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బీబీసీకి తెలిపారు.
“మేం ఎంఎస్ఎంఇలపై కరెంటు బిల్లుల భారం తగ్గించాలని కోరాం. ఆలస్యమైన ఈఎంఐలపై వడ్డీలు కూడా వసూలు చేయవద్దని రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదన పంపాలని మేం నిర్ణయించుకున్నాం’’ అని ఆయన అన్నారు.
5 లక్షల వరకూ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిఫండులను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఎంఎస్ఎంఇలు సహా లక్షల మంది వ్యాపారులకు ఉపయోగపడేలా జీఎస్టీ, కస్టమ్స్ రిఫండులు కూడా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం దాదాపు రూ.18 వేల కోట్లు ఉంటుంది.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. వార్షిక టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు వడ్డీని, ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
అయిదు కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా పెనాల్టీ, లేట్ ఫీజులు చెల్లించనవసరం లేదు. వడ్డీని కూడా తగ్గించిన 9 శాతం రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీన సర్వర్ మీద భారం పడకుండా చేసేందుకు వివిధ రంగాలకు వేరు వేరు తేదీలను ప్రకటిస్తారు.
కార్మికుల పీఎఫ్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి, సంస్థల నుంచి చెల్లించే ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది ఉద్యోగుల సంఖ్య 100లోపు ఉన్న కంపెనీలకు, ఉద్యోగి వేతనం రూ.15,000కు మించనివారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనం వచ్చే 3 నెలల పాటు కొనసాగుతుంది.
‘‘తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్స్‌ను అందించేందుకు పీఎఫ్ రెగ్యులేషన్ నిబంధనలను సవరిస్తాం. ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తంలోని 75శాతం వరకూ లేదా 3 నెలల వేతనం.. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం. ఇది 80 లక్షల ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ సమస్యలన్నీ కూడా లాక్డౌన్ ప్రభావమేనా?
ఈ ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు వినిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎగుమతులపైన ఆ ప్రభావం కొన్ని నెలలుగా పడుతోంది.
“కాకపోతే స్వదేశంలో డిమాండ్ వల్ల భారత్‌కు ఇబ్బంది రాలేదు. ఈ సమయంలో కూడా భారత్‌కు కాస్త సానుకూల వాతావరణం ఉంది. పెరుగుతున్న చైనా వ్యతిరేకత కారణంగా, సరైన వ్యూహాలతో ముందుకు వెళ్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు లభించవచ్చు. అది తయారీ రంగ పరిశ్రమలకు లాభసాటిగా మారుతుంది’’ అని చెబుతారు వనిత దాట్ల.
వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
- కరోనావైరస్ లాక్డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
- కరోనావైరస్: లాక్డౌన్లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- కరోనావైరస్-లాక్డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)