కరోనావైరస్: లాక్‌డౌన్‌లో శానిటరీ నాప్కిన్ల కొరత.. బాలికల ఇబ్బందులు

  • కమలేష్
  • బీబీసీ ప్రతినిధి
శానిటరీ నాప్‌కిన్ల కొరత

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌ వ్యాపించకుండా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా కిరాణా షాపులు, మెడికల్ దుకాణాలు తెరిచే ఉన్నాయి. కానీ మారుమూల గ్రామాల్లో బాలికలకు ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు.

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే బాలికలు శానిటరీ నాప్కిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

రాజస్థాన్‌ బాలికలు దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాశారు. ఇక ఝార్ఖండ్‌లో బాలికలు స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లు చేసి తమకు సాయం చేయాలని అడుగుతున్నారు.

ఈ బాలికలకు తమ స్కూళ్ల నుంచి ప్రతి నెలా శానిటరీ ప్యాడ్స్ అందేవి. కానీ లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూతబడ్డాయి. మార్కెట్ కూడా దూరం కావడం, రవాణా సౌకర్యాలు ఏవీ లేకపోవడంతో ఈ బాలికలు మెడికల్ షాపుల వరకు కూడా వెళ్లలేకపోతున్నారు.

రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్‌లోని చాలా మంది బాలికలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతే కాదు, వారు తమ సమస్య గురించి గట్టిగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

శానిటరీ నాప్‌కిన్ల కొరత

లాక్‌డౌన్‌లో సమస్య తీరేదెలా?

రాజస్థాన్‌లో స్కూళ్లు, అంగన్‌వాడీల ద్వారా బాలికలకు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అందించేవారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల వాటిని మూసేయడంతో వారందరూ ఇబ్బంది పడుతున్నారు.

ఉదయ్‌పూర్‌ దగ్గర మారుమూల గ్రామాల్లో నివసించే బాలికలు ఇటీవల శానిటరీ నాప్కిన్ల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డారని రాజస్థాన్ జర్నలిస్ట్ మొహర్ సింగ్ చెప్పారు.

అక్కడి బాలికలకు వారు చదివే స్కూళ్లలో శానిటరీ ప్యాడ్లు ఇచ్చేవారు, ఇప్పుడు అవి మూతబడ్డాయి. ఏదైనా దుకాణానికి వెళ్లి కొనుక్కుందామంటే, అవి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

నెలసరి, శానిటరీ ప్యాడ్స్ గురించి మహిళలే బాహాటంగా చెప్పుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ బాలికలు శానిటరీ ప్యాడ్స్ తీసుకురమ్మని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలంటే ఒక పెద్ద సవాలులా భావిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

ముఖ్యమంత్రికి బాలికలు రాసిన లేఖ

ఇక్కడి బాలికలు తమ శానిటరీ ప్యాడ్స్ సమస్యను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. కానీ, ఇప్పుడు లాక్‌డౌన్ ఉండడంతో ఆ లెటర్ ఎలా పోస్ట్ చేయాలో కూడా వారికి అర్థం కాలేదు.

“గత రెండు, రెండున్నరేళ్లుగా నేను మా స్కూల్లో ఇచ్చే శానిటరీ నాప్కిన్లనే ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు స్కూల్ మూసేశారు. మా ఇంటి చుట్టుపక్కల కిరాణా షాపులు కూడా లేవు. ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక మెడికల్ షాపు ఉంది. లాక్‌డౌన్ వల్ల అక్కడకు కూడా వెళ్లలేకపోతున్నా” అని గుర్జర్లకు చెందిన గుడా గ్రామంలో నివసించే కవిత అనే బాలిక తన లేఖలో చెప్పింది.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

శానిటరీ నాప్‌కిన్ల కొరత

“ఇంట్లో మమ్మీ, చెల్లి తప్ప అందరూ మగవాళ్లే. వారికి నేనీ విషయం చెప్పలేను. మమ్మీకి చెబితే ఆమె బట్ట ఇస్తుంది. దానివల్ల ఒరిపిడి ఉంటుంది. అందుకే మాకు శానిటరీ ప్యాడ్స్ అందే ఏర్పాటు చేయాలని మా గ్రామంలోని బాలికలందరి తరఫునా రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నా” అంది.

గోగుందాలోని సునీతా పాలీవాల్, పింకీ ఖటీక్ కూడా ఇలాంటి లేఖే రాశారు. బాలికలందరికీ ప్రస్తుతం ఇదో పెద్ద సమస్యగా మారింది. నాప్కిన్లు స్వయంగా వెళ్లి కొనుక్కోలేక, వేరే ఎవరికైనా చెప్పి తెప్పించుకోలేక సతమతం అయ్యారు.

అయితే, ఈ సమస్య ఉదయ్‌పూర్ కలెక్టర్ ఆనందీ దృష్టికి వెళ్లగానే ఆమె సంబంధిత అధికారులకు చెప్పి ఇంటింటికీ శానిటరీ నాప్కిన్లు అందించే ఏర్పాట్లు చేశారు. దీంతో, చాలా మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్ చేరాయి.

“స్కూళ్లు మూతపడ్డం వల్ల బాలికలకు ప్యాడ్స్ అందించలేకపోయాం. అందుకే, ఇప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలను ఇంటింటికీ పంపించి వారికి అవి అందేలా చేశాం” అని ఉదయ్‌పూర్ మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహావీర్ ఖరాడీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌లో పరిస్థితి?

"బిహార్‌లో విద్యార్థినులకు స్కూళ్లలోనే స్వచ్ఛంద సంస్థల ద్వారా శానిటరీ నాప్కిన్లు అందించేవారు. కానీ ప్రస్తుతం వారి సేవలు ఆగిపోయాయి" అని బీబీసీ ప్రతినిధి సీటూ తివారీ చెప్పారు.

బిహార్‌లో ఉంటున్న శుభమ్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాసింది. ఆమె పట్నా జిల్లా నౌబత్‌పూర్ ప్రాంతంలోని సరిస్తాబాద్ గ్రామంలో ఉంటుంది. ఖగోల్‌లో చదువుతున్న ఈ బాలిక అంతకు ముందు హైస్కూల్ విద్యార్థినిగా ఉంది.

“తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నేను మొదటిసారి శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించాను. ప్యాడ్ వల్ల చాలా సౌకర్యంగా ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల నేను, అక్క గత 4 ఏళ్లలో మొదటిసారి బట్టలు ఉపయోగించాల్సి వచ్చింది” అని శుభం చెప్పింది.

“మా ఊళ్లో రెండు కిరాణా షాపులు ఉన్నాయి. కానీ వాటిలో శానిటరీ ప్యాడ్స్ ఏవీ దొరకవు. ఇక మెడికల్ షాపులకు వెళ్లాలంటే, అవి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి” అంటుంది శుభం.

శుభం తండ్రి దేవేంద్ర రవిదాస్ కార్మికుడు. ఆయన ఆదాయం అంతంత మాత్రమే. కానీ ఆయన పెద్ద కూతురు లక్ష్మి కుట్టు మిషన్ ద్వారా వచ్చే సంపాదనతో ఇద్దరు అమ్మాయిల శానిటరీ ప్యాడ్స్ ఖర్చు గడిచిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images

గ్రామంలో మిగతా అమ్మాయిలు కూడా అదే సమస్యతో సతమతం అవుతున్నారని శుభం చెప్పింది. ప్రభుత్వం ఇళ్లకు సరుకులు ఎలా చేరుస్తోందో.. అలాగే మాకు శానిటరీ నాప్కిన్స్ కూడా అందించాలి అంటోంది.

బిహార్‌లో కొన్ని స్కూళ్లలో విద్యార్థినులకు సౌకర్యంగా ఉండేలా కొన్ని స్వచ్చంద సంస్థలు శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషిన్ పెట్టాయి. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ.

పట్నాలో ఉన్న బాంకీపూర్ గర్ల్స్ హైస్కూల్‌లో వెండింగ్ మెషిన్ ఉంది.

“వెండింగ్ మెషిన్‌లో రెండు, ఐదు రూపాయల శానిటరీ నాప్కిన్స్ వస్తాయి. ఇప్పుడు స్కూల్ మూసి ఉంది కాబట్టి, విద్యార్థినులే వాటిని సొంతంగా కొనుక్కోవాల్సి ఉంటుంది” అని బీబీసీతో ఫోన్లో మాట్లాడిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ మీనా కుమారి అన్నారు.

ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్‌ ఖర్చుల కోసం బిహార్ ప్రభుత్వం ఏటా 300 రూపాయలు ఇస్తుంది. అంటే నెలకు 25 రూపాయలు ఇస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఝార్ఖండ్‌లో ఆగిన పంపిణీ

“ఝార్ఖండ్‌లో బాలికలకు స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నుంచి శానిటరీ నాప్కిన్లు ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆ రెండూ మూతపడ్డంతో వారికి అవి అందడం లేదు” అని ఝార్ఖండ్ నుంచి బీబీసీ ప్రతినిధి రవి ప్రకాశ్ చెప్పారు.

లాక్‌డౌన్ వల్ల రాష్ట్రాల్లో అన్ని అంగన్‌వాడీలకూ తాళాలు వేసున్నాయి. అందులో పనిచేసే పనిచేసే టీచర్లు, ఆయాలు ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి సరుకులు పంచే పనిలో ఉన్నారు. దాంతో బాలికలకు శానిటరీ నాప్కిన్లు పంచడం ప్రస్తుతం ఆగిపోయింది.

నిజానికి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వివిధ సఖి మండళ్ల దీదీ (మహిళా సభ్యులు)లకు శిక్షణ ఇచ్చి వారితో శానిటరీ నాప్కిన్లు తయారు చేయించేవారు. వాటిని స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందరికీ అందిస్తూ వచ్చారు. ఇప్పుడు స్కూళ్లు, అంగన్‌వాడీలూ మూతపడి ఉన్నాయి.

“సఖి మండళ్ల దీదీలు ప్రస్తుతం వివిధ పంచాయతీల్లో ఆకలితో ఉండేవారికి ఆహారం సరఫరా చేసేందుకు ‘ముఖ్యమంత్రి దీదీ కిచెన్’ నిర్వహిస్తున్నారు. అందుకే శానిటరీ ప్యాడ్స్ తయారీ, వాటి సరఫరా ప్రస్తుతం సాధ్యం కావడం లేదు” అని సఖి మండళ్లను నిర్వహించే ఝార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (జేఎస్ఎల్‌పీఎస్) సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

మిడ్ డే మీల్ బదులు ఇస్తున్న ధాన్యాన్ని టీచర్ల ద్వారా పిల్లల ఇళ్లకు చేరేలా ఏర్పాట్లు చేశారు. కానీ వాటిలో శానిటరీ ప్యాడ్స్ మాత్రం చేర్చలేదు.

ఫొటో సోర్స్, Getty Images

సాయం కోసం బాలికల ఫోన్లు

శానిటరీ ప్యాడ్స్ కోసం తమకు రోజూ బాలికల నుంచి ఫోన్లు వస్తుంటాయని గోడ్డా జిల్లాలో వివేకానంద అనాథాశ్రమంలో పనిచేసే బందనా దూబే చెప్పారు.

“గోడ్డా జిల్లాలో 8 కస్తూర్బా స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో స్కూల్లో సుమారు 400 మంది బాలికలు చదువుతారు. ప్రస్తుతం అవి మూతపడ్డంతో శానిటరీ ప్యాడ్స్ వారికి అందడం లేదు” అన్నారు.

“కాస్త ఉన్న కుటుంబాల్లో బాలికలు శానిటరీ నాప్కిన్లు కొనుక్కుంటూ ఉండచ్చు. కానీ మిగతా బాలికలు వాటికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మేం మాకు వీలైనంత వరకూ సాయం చేస్తున్నాం. కానీ అందరి దగ్గరకు వెళ్లి ప్యాడ్స్ ఇవ్వడం మాకు సాధ్యం కాదు” అంటున్నారు.

బందనా దూబేను సాయం కోరిన శాంతి బస్కీ కస్తూర్బా స్కూల్‌లోనే చదువుతుంది. కానీ స్కూల్ మూసేయడంతో ఆమె శానిటరీ ప్యాడ్స్ లేక ఇబ్బంది పడుతోంది.

“ప్రతి నెలా శానిటరీ ప్యాడ్లు అందేవి. కానీ ఇప్పుడు దొరకడం లేదు. సర్ఫ్, సబ్బు లాంటి వస్తువులు కూడా దొరకడం లేదు. అందుకే, మాకు శానిటరీ ప్యాడ్స్ తీసుకొచ్చి ఇవ్వగలరా అని మేం బందనా దూబేకు ఫోన్ చేశాం. మేం ఇక్కడనుంచి ఎటూ వెళ్లలేకపోతున్నాం” అని శాంతి చెప్పింది.

ప్రస్తుతం కొన్ని సంస్థలు ఈ బాలికలకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)