కరోనావైరస్: 'ప్రభుత్వ లెక్కల ప్రకారం మా జీవితం విలువ 30 రూపాయలే' - ఓ ఆశావర్కర్ ఆవేదన

  • శ్రీకాంత్ బంగలే
  • బీబీసీ మరాఠీ
ఆశావర్కర్
ఫొటో క్యాప్షన్,

కరోనావ్యాప్తిపై సర్వే చేస్తున్న ఆశా వర్కర్

భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టే పోరాటంలో సుమారు 90,000 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు పోరాడుతున్నారు. అయితే, వీరికి తగిన రక్షణ కానీ, సరైన వేతనాలు కానీ లభించటం లేదు.

"ప్రభుత్వ అంచనాల ప్రకారం మా జీవితం ఖరీదు కేవలం 30 రూపాయిలు మాత్రమే" అని అల్కా నలవాడే అనే మహారాష్ట్ర లోని ఒక ఆరోగ్య కార్యకర్త అన్నారు.

కరోనా సంబంధిత పనుల కోసం ప్రభుత్వం మాకు నెలకి 1000 రూపాయిలు చెల్లిస్తున్నారని చెప్పారు.

“మా జీవితాలు పణంగా పెడుతున్నందుకు రోజుకి 30 రూపాయిలు”.

మహారాష్ట్ర లో ఉన్న 70000 ఆశ(అక్రెడిటేడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్) వర్కర్లలో నలవడే ఒకరు. ఆమె గత పది సంవత్సరాల నుంచి పరవాడ గ్రామంలో ఇదే పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారతదేశంలో అత్యధిక కరోనాకేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

ఆశా కార్యకర్తలని సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. గ్రామీణ ఆరోగ్య పధకాల నిర్వహణలో వీరు పోషించే పాత్ర చాలా కీలకం.

వీరు ఇంటింటికీ వెళ్లి, మహిళా శిశు ఆరోగ్యం గురించి, గర్భనిరోధక సాధనాలు, టీకాలు, పరిశుభ్రత లాంటి అంశాల పై ప్రజలకి అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు.

కోవిడ్ 19 సమయంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి వెళ్లి వైరస్ లక్షణాలు వివరించి తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. అలాగే కోవిడ్ 19 లక్షణాలు ఉన్నవారెవరైనా ఉన్నారేమోనని కూడా పరిశీలిస్తున్నారు.

కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికున్న ముప్పు చాలా ఎక్కువ

ఆశ కార్యకర్తలకి సరైన మాస్క్లు గాని, హెడ్ గేర్ కానీ, శానిటైజేర్ కానీ మరే ఇతర రక్షణ పరికరాలు కానీ అందుబాటులో లేవు. భారతదేశంలో రక్షణ పరికరాలకి తీవ్ర కొరత ఉంది.చాలా మంది డాక్టర్లకి, నుర్సులకు కూడా ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.

చాలా మంది ఆశ కార్యకర్తలు క్లాత్ మాస్క్లు ధరిస్తున్నట్లు చెప్పారు. శానిటైజేర్ కోసం స్పిరిట్ ని నీటితో కలిపి వాడుతున్నట్లు చెప్పారు.

తనతో పాటు స్కార్ఫ్ ని తీసుకుని వెళ్లి ముఖాన్ని కప్పుకుంటున్నట్లు కరుణ షిండే అనే ఆశ కార్యకర్త చెప్పారు.

తగిన రక్షణ పరికరాలు లేని చోట స్కార్ఫ్ లు వాడమని సూచించామని మహారాష్ట్ర ఉప ఆరోగ్య మంత్రి రాజేంద్ర యద్రావకర్ చెప్పారు.

“ఆశ కార్యకర్తలు తమ జీవితాలని పణంగా పెడుతున్నారు. వాళ్లకి తగిన రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం పై ఉంది".

అయితే ఈ మాటలు ఆశ కార్యకర్తల కుటుంబాలకి ఏ మాత్రం ఆశ కల్పించటం లేదు.

"నన్ను పనిలోకి వెళ్లవద్దని నా భర్త అంటారు. డాక్టర్లు, నర్సులకు చాలా జీతాలు వస్తున్నాయి. ఈ పనులను కూడా వాళ్ళని చేయనీ అని ఆయన అంటారు."

ఇన్ఫెక్షన్ వ్యాప్తి మాత్రమే కాకుండా తమ కుటుంబాల భద్రత గురించి కూడా ఆశ కార్యకర్తల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తల పై కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో దాడులు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత్‌లోని ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ దుస్తులు కూడా తగిన సంఖ్యలో అందుబాటులో లేవు

ఇప్పుడు ఇస్తున్న కేవలం 1000 రూపాయలతో తమ కష్టం తీరదని నలవాడే అన్నారు.

ఒక పొలంలో రోజు కూలీగా పని చేసుకుంటే దీనికి పది రెట్లు డబ్బు సంపాదించుకోవచ్చు. "30 రూపాయలతో మేము ఇంటిని ఎలా నడపాలి? నాకు ఒకవేళ వైరస్ సోకితే నా పరిస్థితి ఏమిటి? నన్నెవరు చూసుకుంటారు? ఈ 30 రూపాయలతో నాకు చికిత్స అందిస్తారా”?

తన పని తను చేస్తున్నందుకు సామాజిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నానని ఆమె చెప్పారు.

“మేము ఒకవేళ వైరస్ ని వ్యాప్తి చేస్తామేమోననే భయంతో చాలా మంది మమ్మల్ని ఇంటి లోపలికి కూడా రానివ్వరు”.

"మేము ప్రజల కోసం పని చేస్తుంటే వాళ్ళే మా పట్ల ఇలా ప్రవర్తిస్తే మేమింక ఏమి చెయ్యాలి?"

వాళ్ళ పనికి తగిన గుర్తింపు కూడా ఉండదని ఆమె అన్నారు.

"మేము చేసే పని గురించి ఎవరూ మాట్లాడారు అని అంజలి వాంఖడే అనే ఆశ కార్యకర్త చెప్పారు.

'ప్రధాన మంత్రి నుంచి ముఖ్య మంత్రి వరకూ అందరూ డాక్టర్లని, పోలీసులని మాత్రమే పొగుడుతారు."

గణాంకాల కోసం మేము సేకరించిన సమాచారం మీదే ఆధారపడిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని ఆమె అన్నారు.

"ప్రతి ఇంటికి వెళ్లి మేము ప్రభుత్వానికి గణాంకాలు అందచేస్తాం. ప్రభుత్వం మేమిచ్చిన లెక్కల ఆధారంగానే ప్రకటనలు చేస్తుంది. కానీ, మా గురించి ఎవరూ మాట్లాడరు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)