కరోనావైరస్: ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- వి.శంకర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ క్వారంటైన్ కేంద్రాల్లో అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి? వైద్య పరీక్షల్లో నెగటివ్ అని వస్తే వెంటనే ఇంటికి పంపేస్తున్నారా? బాధితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
"మార్చి 31న మాకు అనుమానం వచ్చింది. మా కుటుంబం నుంచి ఐదుగురిని సాయంత్రం సమయంలో కాకినాడ తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత రాత్రికి వచ్చిన నివేదికలో మాలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత పాజిటివ్ ఉన్న వారిని రాజమండ్రి జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వాళ్లని కాకినాడలోనే ఉంచారు.
14 రోజుల తర్వాత మళ్లీ అందరికీ పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. కానీ మా కుటుంబంలో ఒకరిని మాత్రం డిశ్ఛార్జ్ చేశారు. మరో ఇద్దరినీ ఇవాళ, రేపు అంటున్నారు.
ఎందుకు ఉంచుతున్నారో కూడా మాకు తెలియడం లేదు. అందరికీ నెగిటివ్ వచ్చినప్పుడు ముగ్గురినీ డిశ్ఛార్జ్ చేసినట్టు ప్రకటించిన అధికారులు ఇద్దరిని ఇంకా ఎందుకు ఆస్పత్రిలో ఉంచారన్నది అర్థం కావడం లేదు" అంటున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కరోనా బాధిత కుటుంబ సభ్యుడు.
క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాల గురించి అడినప్పుడు.. "రోజూ మూడు పూటలా ఆహారం ఇచ్చేవారు. పప్పు, ఒక కూర, పెరుగుతో అన్నం పెట్టేవారు. టిఫిన్ కూడా ఇచ్చారు. ఐసోలేషన్‌లో ఉన్న వారికి అదనంగా సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చారు. ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఒకసారి ఫిర్యాదు కూడా చేశాం. దాంతో పాటుగా మాకు రోజూ బీ కాంప్లెక్స్, విటమిన్ సి, సిట్రోజెన్ ఇచ్చేవారు. మాకు ఎవరికీ జ్వరం లేకపోవడంతో ఎటువంటి మందులూ అదనంగా ఇవ్వలేదు. స్వేచ్ఛగానే ఉండేది. టీవీ చూస్తూ కాలయాపన చేశాం. సీసీ కెమెరాలు పెట్టారు. అక్కడి నుంచే డాక్టర్లు పర్యవేక్షించేవారు. బీపీ, టెంపరేచర్ చెక్ చేయడానికి రోజూ సిస్టర్స్ వచ్చే వారు" అని ఆయన వివరించారు.
వైద్యపరీక్షల నివేదిక
సదుపాయాలపై భిన్నాభిప్రాయాలు..!
కర్నూలులోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వ్యక్తిని సంప్రదించగా అలాంటి పరిస్థితే ఉందని తెలిపారు.
"ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ అవి మాకు చేరడం లేదు. ఇక్కడ ఉన్న వారిని మేం అడిగినా ప్రయోజనం కనిపించడం లేదు. జ్వరం, ఇతర లక్షణాలున్న వారి మీద తగిన శ్రద్ధ పెడుతున్నారు. లక్షణాలు కనిపించని వారిని మాత్రం సాధారణంగానే ఉంచుతున్నారు. ఆహారం కూడా నాణ్యంగా లేదు. 14 రోజులు గడిచినా రిపోర్టులు ఇంకా రాలేదనే పేరుతో కొందరిని కొనసాగిస్తున్నారు. అవి సకాలంలో వచ్చేలా చూస్తే అందరికీ మంచిది" అని ఆయన అన్నారు.
అంతకుముందు తిరుపతిలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో 14 రోజుల పాటు ఉండి, డిశ్చార్జ్ అయిన బ్రిటన్ దేశస్తుడు ఒకరు మీడియాతో మాట్లాడారు.
క్వారంంటైన్ కేంద్రంలో అందించిన సేవలను ఆయన ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ లేఖ కూడా రాశారు. సొంత ఇంట్లో కన్నా ఎక్కువగా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారంటూ వివరించారు.
56 సంవత్సరాల ఈ జాగ్రఫీ ప్రొఫెసర్ మార్చి 18న తిరుమలలో దర్శనం కోసం వచ్చారు. అప్పటికే విదేశీయులకు అనుమతి లేదని నిర్ణయం తీసుకున్న టీటీడీ ఆయన్ని క్వారంటైన్‌కి తరలించింది. ఆయన 3వారాల తర్వాత ఏప్రిల్ 15న క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
వైద్యులు ఏమంటున్నారు?
క్వారంటైన్ ఐసోలేషన్‌లో ఉన్న వారు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు బీబీసీకి తెలిపారు.
"ఐసోలేషన్‌లో ఉన్న వారికి అన్ని సదుపాయాలు అందిస్తున్నాం. వైద్య సేవల విషయంలోనూ జాప్యం లేదు. లక్షణాలను బట్టి ఐసీయూ, నాన్-ఐసీయూ పేషెంట్లుగా విభజిస్తున్నాం. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాం. రోగుల మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. ఎక్స్-రేలు తీయిస్తున్నాం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల అదనపు శ్రద్ధ పెడుతున్నాం. ఆహారంలో నాణ్యత గానీ, వైద్య సదుపాయాలు కల్పించడంలో గానీ లోపం లేదు. ఇప్పటికే మా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన వారంతా సేవలు, సదుపాయాల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని చోట్లా అదే రీతిలో జరుగుతోంది" అని వివరించారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
ఏపీలో ఎన్ని కేంద్రాలున్నాయి?
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలు నిర్వహిస్తోంది. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారు, ఆ తర్వత తబ్లీగీ జమాత్‌కి హాజరైన వారితో పాటుగా కాంటాక్ట్ కేసుల మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరినీ ఎక్కడికక్కడ క్వారంటైన్ చేశారు.
ఏపీలో మొత్తంగా ఏప్రిల్ 19 నాటికి మొత్తం 339 కేంద్రాల్లో క్వారంటైన్, ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. 5,876 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. రాష్ట్ర స్థాయిలో చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో నాలుగు కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ జిల్లా స్థాయి కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.
మెరుగైన ఆహారం, సదుపాయాలు కల్పిస్తున్నాం
క్వారంటైన్లో ఉన్న వారితో పాటు బాధితులందరికీ తగిన సదుపాయాలు కల్పిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
"క్వారంటైన్లో ఉన్న వారికి మంచి ఆహారం అందించే ఏర్పాట్లు చేశాం. పళ్లు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ సహా రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం అందిస్తున్నాం. ఆయా కేంద్రాల్లో ప్రతి ఒక్కరికీ అవసరమైన 15రకాల వస్తువులతో కిట్లు అందిస్తున్నాం. ప్రత్యేకంగా దుస్తులు, దుప్పట్లు, తువాళ్లతో పాటుగా పేస్ట్, టూత్ బ్రష్, సబ్బు సహా అన్నీ ఇచ్చాం. క్వారంటైన్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నాం. అన్ని జాగ్రత్తలతో వైద్యుల బృందం తగిన పరీక్షలు సకాలంలో చేస్తోంది" అని జవహర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- ‘కరోనావైరస్తో ఐసొలేషన్ వార్డులో నేను ఎలా పోరాడానంటే...’ - తెలంగాణలో పేషెంట్ 16 స్వీయ అనుభవం
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో రోడ్లపైకి వచ్చిన సింహాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)