‘యువతను రెచ్చగొడుతున్నారు’: కశ్మీర్లో యువ పాత్రికేయురాలిపై యూఏపీఏ కింద కేసు
- రియాజ్ మస్రూర్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
మొస్రత్ జహ్రా
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలోనే కశ్మీర్లో మొస్రత్ జహ్రా అనే స్థానిక యువ పాత్రికేయురాలిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కశ్మీర్లో నాలుగేళ్లుగా మొస్రత్ జహ్రా ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. వివిధ భారత మీడియా సంస్థలు, అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం ఆమె పనిచేశారు.
కశ్మీర్లో హింస ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల పరిస్థితికి సంబంధించిన కథనాలను ఆమె ఎక్కువగా వెలుగులోకి తెస్తుంటారు. సాధారణ కశ్మీరీలపై హింస ప్రభావం ఎలా ఉందో చూపే ప్రయత్నం చేస్తుంటారు.
కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని గత ఏడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ప్రాంతంలో ఆందోళనలను అదుపు చేసేందుకు లాక్డౌన్ కూడా విధించింది.
ఈ సమయంలో మొస్రత్ జహ్రా అందించిన కథనాలకు చాలా ప్రశంసలు వచ్చాయి.
మొస్రత్ కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
సోపా ఇమేజెస్, ఎన్యూఆర్ ఫొటోస్, జూమా ప్రెస్ లాంటి ఫొటో ఏజెన్సీలకు మొస్రత్ పనిచేశారు.
అల్ జజీరా, టీఆర్టీ వరల్డ్, వాషింగ్టన్ పోస్ట్, అల్ అరేబియా వంటి పత్రికల్లోనూ ఆమె కథనాలు వచ్చాయి. భారత్‌లో ద క్వింట్, కారవాన్ మ్యాగజీన్ వంటి వాటిలో ఆమె ఫొటో కథనాలు ప్రచురితమయ్యాయి.
అయితే, పోలీసులు మాత్రం ఆమెను ఓ ఫేస్బుక్ యూజర్‌గా పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టేలా కశ్మీరీ యువతను రెచ్చగొట్టేలా ఆమె పోస్టులు పెడుతున్నారని అభియోగాలు మోపారు.
మొస్రత్ భారత్‌కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని, మతపరమైన ఓ వ్యక్తిని ‘ఉగ్రవాదుల’తో పోల్చారని పోలీసులు పేర్కొన్నారు.
ఆమె పోస్టులు కశ్మీరీ యువతను ‘ఉగ్రవాద కార్యకలాపాల’ వైపు ఆకర్షించేలా ఉంటున్నాయని తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఫొటో సోర్స్, FACEBOOK/MASRAT ZAHRA
మొస్రత్ జహ్రా
కశ్మీరీ మహిళల బాధల గురించి చేసిన ఓ కథనంలో భాగంగా గాందర్బల్ జిల్లాలో ఓ మహిళను ఇంటర్వ్యూ చేశానని మొస్రత్ బీబీసీతో చెప్పారు.
ఆ మహిళ భర్త 20 ఏళ్ల క్రితం ఓ ‘అనుమానిత’ ఎన్కౌంటర్లో చనిపోయారని మొస్రత్ వివరించారు. ఈ కథనానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పారు.
మొస్రత్కు శ్రీనగర్‌లోని సైబర్ పోలీస్ స్టేషన్ సమన్లు విధించింది. అనంతరం స్థానిక పాత్రికేయులు సమాచార శాఖ అధికారి సహరీశ్ అస్గర్‌ను సంప్రదించారు.
‘‘ఈ కేసు ముగిసిందని, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని సహరీశ్ నాకు చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఎస్ఎస్పీ సమన్లు విధించారని అంటున్నారు. మంగళవారం నేను అక్కడికి వెళ్లాల్సి ఉంది’’ అని మొస్రత్ అన్నారు.
మొస్రత్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ‘దేశ వ్యతిరేక’ పోస్టులు పెట్టడానికి దూరంగా ఉండాలని, అలా చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మొస్రత్ జహ్రా
మరోవైపు ద హిందూ పత్రికకు పనిచేస్తున్న ఆషిక్ పీర్జాదా అనే పాత్రికేయుడికి శ్రీనగర్‌కు 60 కి.మీ.ల దూరంలోని అనంత్‌నాగ్ పోలీస్ స్టేషన్ సమన్లు విధించింది.
షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్లో కొడుకును కోల్పోయిన ఓ జంట గురించి తాను కథనం రాసినట్లు ఆషిక్ చెప్పారు.
ఆషిక్‌పై కేసు ఏమీ నమోదు కాలేదు. కానీ, పోలీస్ స్టేషన్ పిలుపే ఓ శిక్ష లాంటిదని ఆయన అన్నారు.
‘‘అధికారుల వాదన కథనంలో లేదని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ, నేను డీసీపీకి చాలా సార్లు ఫోన్ చేశా. మేసెజ్‌లు పెట్టా. వాళ్లే స్పందించలేదు. నా జవాబుతో పోలీసులు సంతృప్తి చెందారు. అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగి వచ్చా’’ అని ఆషిక్ చెప్పారు.
కశ్మీర్లో పాత్రికేయులకు పోలీసులు సమన్లు విధించడం ఇదేమీ కొత్త కాదు. కానీ, యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టడమైతే ఇదే తొలిసారి.
గత ఏడాది యూఏపీఏ చట్టానికి భారత పార్లమెంటు సవరణ తెచ్చింది. ఈ చట్టం కింద కశ్మీర్లో చాలా మంది మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసింది.
‘‘కశ్మీర్లో పనిచేయడమే ప్రమాదకరం. ప్రస్తుతం ఇంటర్నెట్పై ఆంక్షలు ఉన్నా, కరోనావైరస్ ముప్పు ఉన్నా పాత్రికేయులు కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా రకరకాల ఆంక్షలు పెడుతూ, వారిని అడ్డుకుంటున్నారు’’ అని కశ్మీర్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మోవుజ్జమ్ మహమ్మద్ అన్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా? BBC Reality Check
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- మహారాష్ట్ర: పాల్ఘర్లో సాధువులను కొట్టిచంపిన మూక... 110 మంది అరెస్ట్
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)