కరోనావైరస్: ముంబయిలో 53 మంది జర్నలిస్టులకి కోవిడ్-19 పాజిటివ్
- మయాంక్ భగవత్, జాన్హవీ మూలే
- బీబీసీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలో సుమారు 53 మంది జర్నలిస్టులకి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ అయింది. గత వారం ముంబయి టీవీ జర్నలిస్ట్స్ అసోసియేషన్, బ్రిహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కలిసి 167 మంది జర్నలిస్టులకి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 53 మందికి పాజిటివ్ అని నిర్ధరణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ విషయంపై కొందరు రాజకీయ నాయకులు ట్విటర్లో విచారం వ్యక్తం చేశారు.
"వైరస్ రాకుండా అరికట్టడానికి ఉన్న ప్రధాన మార్గం అది సోకకుండా చూసుకోగలగడం ఒక్కటే. కొంత మంది జర్నలిస్టులకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందింది. ఇది చాలా విచారించాల్సిన విషయం. విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోమని మేం జర్నలిస్టులకి సూచిస్తున్నాం. సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలి" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్టుల సమస్యలు
"మాకు వ్యాధి గురించి భయం లేదు. కానీ, మేము ఇంటి దగ్గర నుంచి పని చేస్తే మా ఉద్యోగాలు పోతాయేమో అనే భయం ఉంది. రానున్న రోజుల్లో ఉద్యోగాల కోత విధించవచ్చు. ఇంటి దగ్గర నుంచి పని చేస్తే ఉద్యోగాలు పోతాయేమోననే భయం చాలా మందికి ఉంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మహిళా జర్నలిస్ట్ చెప్పారు.
ఒక ఫొటోగ్రాఫర్ కూడా తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.
"నేను లాక్ డౌన్లో కూడా పని చేస్తూనే ఉన్నాను. ఫీల్డ్‌లో పని చేస్తున్నప్పుడు మేం చాలా చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రమాదం ఉన్నా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి మాకు వైరస్ సోకిందో కచ్చితంగా చెప్పడం కష్టం. రోజూ మేం చాలా మందిని కలుస్తూ ఉంటాం. నాకు కరోనా సోకినట్లు ఆఫీస్‌లో చెప్పినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదు.
ముంబయిలో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిన జర్నలిస్టుల్లో ప్రముఖ టీవీ ఛానెళ్ళకి చెందినవారు కొంత మంది ఉన్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
"నాకు లక్షణాలు కన్పించలేదు. నేను వార్తలు రాసే పనిలో భాగంగా ముంబయిలో చాలా ప్రాంతాలకి వెళ్లాను. ధారావి కూడా వెళ్లాను. విలాసవంతమైన ప్రాంతాల నుంచి మురికివాడల వరకు అన్నీ తిరిగాను. ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నా పనిలో భాగంగా పరిశీలించాను. కానీ, నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే నమ్మలేకపోయాను. నేను అవసరమైన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాను. అయినా నాకు పాజిటివ్ వచ్చింది" అని ముంబయిలో కరోనా పాజిటివ్ అని తేలిన ఓ జర్నలిస్ట్ చెప్పారు.
ముంబయిలో కరోనా ప్రబలిన వెంటనే కొన్ని టీవీ ఛానెళ్ల వారు రిపోర్టర్లని, కెమెరామన్లను తమ ఆఫీస్‌ల లోపలికి రానీయలేదు.
"లాక్ డౌన్ మొదలవగానే మా లాంటి ఫీల్డ్ రిపోర్టర్లని, కెమెరా వాళ్ళని లోపలికి రానీయలేదు. కెమెరాలు, మిగిలిన పరికరాలు ఇంటికి తీసుకుని వెళ్లిపొమ్మని చెప్పారు. మేము ఒక వారం పని చేస్తే, తర్వాత వారం పూర్తిగా సెలవు తీసుకున్నాం. ఆ విధంగా రోస్టర్ వేశారు" అని ఒక కెమెరామన్ చెప్పారు.
"మేం ఫీల్డులో పని చేస్తుండగా మాకు కరోనా సోకింది. మా కుటుంబ సభ్యుల గురించి మాకు విచారం ఉండదా? వాళ్లకి ఏమవుతుంది? వాళ్లకి ఎవరు సహాయం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో పని మానేయడం ఒకటే మార్గం కాదు కదా. ఆఫీస్ యాజమాన్యం ఇవన్నీ ఆలోచించాలి" అని ఒక రిపోర్టర్ అన్నారు.
"53 మంది జర్నలిస్టులకి కరోనా సోకడం చాలా బాధాకరం" అని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య అన్నారు. ప్రభుత్వం, వార్తా సంస్థల యాజమాన్యాలు వారి వైద్యానికి సహాయం చేయాలని కోరారు. వాళ్లకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు.
మహిళ, శిశు సంరక్షణ మంత్రి యశోమతి ఠాకూర్ కూడా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 6.5 లక్షల మంది నివసించే ముంబయిలోని ధారావి ప్రాంతం
చాలా మంది జర్నలిస్టులకి నిర్బంధంలోకి వెళ్లడం కష్టంగా ఉంది. కొంత మంది ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. కొంత మంది మహిళా జర్నలిస్టులు ఇంటి పనులు పూర్తి చేసుకుని బయట పని చేయడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో పనివాళ్లని పెట్టుకోవడం కూడా కష్టమైన పనే. కొంత మంది మహిళా జర్నలిస్టులు తమ కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు.
కరోనావైరస్ సోకిన జర్నలిస్టులు అందరినీ గోరె గావ్ ఫెర్న్ హోటల్లో క్వారంటైన్ చేసి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు ముంబయి మున్సిపాలిటీ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు సోనావానే చెప్పారు.
ఫొటో సోర్స్, AFP
ముంబయి, పూణె నగరాలు కరోనాకి హాట్ స్పాట్లుగా మారాయి. ముంబయిలో కరోనా సోకిన రోగుల సంఖ్య 2700కి చేరింది. ఇప్పటికే మహారాష్ట్రలో 223 మంది కరోనా బారిన పది మరణించారు. ఇందులో 132 మరణాలు ఒక్క ముంబయిలోనే చోటు చేసుకున్నాయి.
ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచి పని చేయడం మొదలుపెడితే ఉద్యోగాలు పోతాయేమో అనే భయం ఉంది. ఫీల్డులో పని చేసే కొంత మంది జర్నలిస్టులదీ ఇదే భయం.
ఇదొక క్లిష్టమైన సమయం. ప్రజలకి కూడా బయట ఏం జరుగుతుందో సమాచారం తెలపాల్సిన అవసరం ఉంది. ప్రజలకు, పాలనాధికారులకు మధ్య జర్నలిస్టులు వారధి లాంటి వారని మరో అభిప్రాయం ఉంది. దీంతో, ప్రజలకి అవసరమైన ఈ సమయంలో తమ సేవలు అందించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.
ముంబయి జనాభా దృష్ట్యా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పూర్తిగా నిర్బంధంలో ఉండడమనేది సాధ్యం కాని పని.
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ లాంటి నగరాల్లో చాలా మందికి సొంతంగా కార్లు గాని, బైకులు గాని ఉంటాయి. దాంతో వాళ్ళు సొంతంగా ఎక్కడికైనా వెళ్లి రాగలరు. ముంబయిలో చాలా మంది ప్రజా రవాణాపైనే ఆధారపడతారు. జర్నలిస్టులకి సొంతంగా వాహనాలు ఉండవు. చాలా ఆఫీస్‌లు తమ ట్రాన్స్‌పోర్ట్‌ను సిబ్బందికి ఇస్తారు. అయితే ఈ పరిస్థితుల్లో చాలా ఆఫీస్‌లు ఒకే డ్రైవర్‌ను కానీ, కారుని గానీ సిబ్బందికి ఇవ్వటం లేదు. ఇటీవల కొంత మంది డ్రైవర్లకి కరోనా సోకింది. ఇది ఆఫీస్ వాహనాలను వాడడాన్ని కూడా సందిగ్ధంలో పడేసింది.
గత వారంలో ఒక డ్రైవర్ కరోనా సోకిన ప్రాంతం నుంచి రోజూ ఆఫీస్‌కి వచ్చారు. కొంత మంది రిపోర్టర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఆ డ్రైవర్ని ఇంటి దగ్గరే ఉండమని చెప్పారు. ఇదొక జీవితానికి, జీవనోపాధికి మధ్యనున్న సందిగ్ధ పరిస్థితి ఇది.
రిపోర్టింగ్ చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడాల్సి ఉంటుంది. పత్రికల్లో పని చేసేవారు కొంత వరకు ఇంటి దగ్గరే ఉండి సమాచారం సేకరించవచ్చు. కానీ అప్పుడు కూడా పూర్తి సమాచారం రాదని కొంత మంది చెప్పారు. ఒక్కొక్కసారి వ్యక్తులని కలిసి, పరిస్థితులని నేరుగా పరిశీలిస్తే తప్ప సమగ్ర సమాచారం సేకరించలేం. టీవీలో పనిచేసే వారికైతే మనుషుల్ని కలవడం తప్పనిసరి. టీవీ రిపోర్టర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది.
చాలా మందికి ఈ పరిస్థితి అర్ధం కాదు.
ఫొటో సోర్స్, Getty Images
కొన్ని ప్రాంతీయ ఛానెళ్లలో రిపోర్టర్ల మీద ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం నిర్దిష్ట నిబంధనలు అమలు చేస్తే తప్ప ఫీల్డ్ రిపోర్టింగ్‌ని ఆపరు. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి.
కొన్ని సంస్థలు వార్తలు కంటే కూడా వార్తా మాధ్యమమే అంతరించిపోతుందేమో అనే భయంలో ఉన్నారు. ప్రస్తుతం కొన్ని పత్రికా యాజమాన్యాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రకటనలతో వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఇది మరిన్ని సమస్యలకి దారి తీస్తుందేమో అనే భయం కూడా వారిలో ఉంది.
టీవీ డెస్కుల్లో ఉండే పని ఒత్తిడి, పోటీతత్త్వం కూడా రిపోర్టర్లను ఫీల్డులో పని చేయడానికి ఒత్తిడి చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కూడా కొంత మంది రిపోర్టర్లను.. "ఇతర ఛానెళ్లలో ఈ వార్త వచ్చింది, మనకెందుకు రాలేదు" అని అడుగుతున్నారు. మా ఆఫీస్‌లో ఈ సమస్య లేకపోవడం ఒక అదృష్టం.
కొంత మంది జర్నలిస్టులకి కూడా అవగాహన లేదు. కొంత మంది "మేం పట్టించుకోం" అనే ధోరణిలో పని చేస్తున్నారు. కొంత మంది ఇంటర్వ్యూలు చేయడానికి కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లారు. ఒకరు అలా చేయగానే మరో ఛానల్ ఎడిటర్ వారి సిబ్బందిని, "నువ్వు ఎందుకు అలా చేయకూడదు" అని అడుగుతారు. ఇదంతా ఒక పిచ్చి ప్రమాదకరమైన పరుగు.
ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్న రిపోర్టర్లకి చాలా సంస్థలు నిబంధనల్ని రూపొందించాయి. అయితే, ఫీల్డులో పని చేస్తున్న రిపోర్టర్లకి చాలా సంస్థలు నిబంధనలు అమలు చేయలేదు.
ఒక టీవీ ఛానెల్లో ఒక రిపోర్టర్‌కి, ఒక వీడియో జర్నలిస్ట్‌కి కరోనా సోకింది. కానీ, మిగిలిన సిబ్బందికి ఆ సంస్థ ఎటువంటి పరీక్షలూ చేయించలేదు.
కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకి కరోనా పాజిటివ్ అని తెలిస్తే తమ సంస్థ పరువు పోతుందేమో అని భయపడుతున్నారు. చాలా ఛానళ్ళు రిపోర్టర్లని ఆఫీస్‌కి రానివ్వటం లేదు. కొంత మందిని వారి సమస్యలకి వారినే వదిలేశారు.
"చాలా మంది రిపోర్టర్లకి స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం కష్టంగా ఉంది. మాకు ఇంట్లో తల్లి తండ్రులు, పిల్లలు, ఉన్నారు. కొన్ని సార్లు మేము హైరిస్క్ ప్రాంతాలకి వెళ్లి వస్తూ ఉంటాం. నాకు తెలిసిన కొందరు రిపోర్టింగ్‌కు వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కానీ అందరూ అలా చేయలేరు కదా" అని ఒక స్థానిక ఛానెల్ రిపోర్టర్ అన్నారు.
"మేం కొంత ముప్పుని ఎదుర్కొంటున్నాం. ఇది మాకు, మా కుటుంబాలకి కూడా ప్రమాదమేనని ప్రతి రోజు చాలా భయంగా ఉంటోంది".
ఇవి కూడా చదవండి.
- కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై ఎందుకీ వదంతులు... 'బ్రెయిన్ డెడ్' వార్త నిజమేనా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- సత్తెనపల్లిలో యువకుడి మృతి.. పోలీసుల దాడి కారణమంటూ ఆరోపణలు
- ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?
- హరియాణా స్కూళ్లలో తెలుగు భాషా బోధన... అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అంటూ మాట్లాడుతున్న విద్యార్థులు
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
- జ్యోతిరాదిత్య సింధియా: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా... మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం
- యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ కొన్నారా?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- కరోనావైరస్: చైనాలో రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన క్యాన్సర్ పేషెంట్... ఆ తర్వాత ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)