కరోనావైరస్ లాక్‌డౌన్: సత్తెనపల్లిలో యువకుడి మృతి.. పోలీసుల దాడి కారణమంటూ ఆరోపణలు

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
సత్తెనపల్లిలో యువకుడి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇటీవల ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌కు పోలీసులే కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దానిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని డీజీపీ కూడా ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోనే స‌త్తెన‌ప‌ల్లిలో జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌ వివాదాస్పదమైంది. పోలీసుల దాడిలో ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయారంటూ అతడి బంధువులు ఆందోళ‌న చేపట్టారు. కొంద‌రు పోలీసు అధికారుల‌పై దాడికి కూడా స్థానికులు యత్నించారు. పోలీస్ స్టేష‌న్‌ను ముట్ట‌డించి రెండు గంట‌ల పాటు పెద్ద సంఖ్య‌లో ప్రజలు గుమిగూడటంతో కలకలం రేగింది.

చివ‌ర‌కు పోలీస్ అధికారులు స్పందించి ఎస్సైని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ, ఇలాంంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని పౌర‌సంఘాలు కోరుతున్నాయి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

మందుల చీటీ చూపించినా.. చితక్కొట్టారు

త‌మ కుమారుడు మ‌హ్మ‌ద్ గౌస్ (35) వైద్య అవ‌స‌రాల నిమిత్తం మందుల కోసం బ‌య‌ట‌కు వెళ్తే చెక్ పోస్ట్ వ‌ద్ద పోలీసులు చేయి చేసుకున్నార‌ని మృతుడి తండ్రి ఆదాం ఆరోపిస్తున్నారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ''మా అబ్బాయి సెంట్రింగ్ ప‌నిచేస్తాడు. రెండేళ్ల క్రితం కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. మందులు వాడుతున్నాడు. లాక్ డౌన్ నిబంధ‌న‌లను మేం పాటిస్తున్నాం. అయితే డాక్టర్ల సూచన ప్రకారం మందులు తెచ్చుకోవడానికి చీటీ తీసుకొని బయటకు వెళ్లాడు. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాడని ఆశిస్తున్న మాకు అతడు రోడ్డు మీద పడి ఉన్నట్లు ఫోన్ వచ్చింది.

వెంట‌నే నేను ఆస్ప‌త్రికి తీసుకెళ్లాను. కానీ అప్ప‌టికే చ‌నిపోయాడ‌ని ఆస్ప‌త్రిలో చెప్పారు. ఒంటి మీద దెబ్బ‌లున్నాయి. స‌త్తెన‌ప‌ల్లిలో ఎటువంటి పాజిటివ్ కేసులు లేక‌పోయినా ఇలా దాడి చేసిన వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి'' అని వివరించారు.

స‌త్తెన‌ప‌ల్లిలోని వెంకటపతి కాల‌నీలో నివ‌సించే గౌస్‌కి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

బాప‌ట్ల‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

గుంటూరు జిల్లా బాప‌ట్ల పోలీసులు త‌న‌ను మ‌నోవేదన‌కు గురిచేశారంటూ శ్రీనివాస్ అనే యువ‌కుడు ఏప్రిల్ 2న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. సోష‌ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ప్రాణం తీసుకున్నారు.

కృష్ణా జిల్లా కైక‌లూరుకి చెందిన శ్రీనివాస్ తిరుప‌తి స‌మీపంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో చెన్నై నుంచి ఆయ‌న సొంత ఊరికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. మార్గమ‌ధ్య‌ంలో బాప‌ట్ల వ‌ద్ద పోలీసులు అడ్డుకోవ‌డంతో శ్రీనివాస్ క‌ల‌త చెందారు. త‌న‌ను పోలీస్ స్టేష‌న్‌కి తర‌లించి, దాడి చేసి, అవ‌మానించారంటూ పేర్కొన్నారు. చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ స‌మీపంలోనే ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డారు.

బాప‌ట్ల పోలీసుల చ‌ర్య కార‌ణంగా అతడు ప్రాణాలు తీసుకున్నారంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్ర‌క‌టించారు.

ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లిలో గౌస్ విష‌యంలో మ‌రో పోలీస్ అధికారి తీరు కూడా వివాదాస్పదమైంది. ఈ ఘ‌ట‌న‌లో స్థానికులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి నిర‌స‌న‌కు దిగారు. మృతదేహంతో నేరుగా ఆస్ప‌త్రి నుంచి పోలీస్ స్టేష‌న్‌కి చేరుకున్నారు.

వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన పోలీసుల‌పై కొంద‌రు ఆందోళ‌న‌కారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు.

చివ‌ర‌కు పోలీస్ ఉన్న‌తాధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మృతుడి బంధువుల‌తో మాట్లాడారు. అదే స‌మ‌యంలో ఘ‌ట‌న‌పై విచార‌ణ చేసి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీఐజీ కె.ప్ర‌భాక‌ర్ రావు ప్ర‌క‌టించ‌డంతో వారు శాంతించారు.

స‌త్తెన‌ప‌ల్లి టౌన్ ఎస్సై దాడి చేయ‌డం వ‌ల్లే గౌస్ మృతి చెందిన‌ట్టు ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం. ఉద‌యం 7.30 గంటల ప్రాంతంలో ఘ‌ట‌న జ‌రిగింది. ఎస్సై మ్యాన్ హ్యాండ్లింగ్ వ‌ల్లే గౌస్ మ‌ర‌ణించినట్లు చెబుతున్నారు. స‌త్తెన‌ప‌ల్లిలో ఎలాంటి కరోనా కేసులూ నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప‌రిస్థితి ఎదురవడం బాధాక‌రం. వారి కుటుంబానికి ప్ర‌భుత్వం తరఫున కూడా స‌హాయం అందిస్తాం. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై జిల్లా స్థాయి పోలీస్ అధికారుల‌తో మాట్లాడాను. త‌గిన విచార‌ణ చేసి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు చెప్పారు'' అని వివ‌రించారు.

ఫొటో సోర్స్, Getty Images

కేసు నమోదు.. ఎస్సై సస్పెన్షన్

గౌస్ మృతి ఘటనలో కేసు న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించామ‌ని గుంటూరు రేంజ్ డీఐజీ కె.ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ఎస్సై మీద ఆరోప‌ణలు రావ‌డంతో సస్పెండ్ చేశాం. కేసు కూడా న‌మోదు చేశాం. విచార‌ణ చేస్తున్నాం. గుంటూరు రూర‌ల్ ఎస్పీ విచార‌ణ నిర్వ‌హించారు. చెక్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తున్న సత్తెనపల్లి టౌన్ ఎస్సై అటు వచ్చిన గౌస్ బండిని ఆపి అనవసరంగా బయటికి రాకూడదని హెచ్చరించారు.

స్కూటీపై వచ్చిన అత‌ను కంగారుపడి చెమటలు పట్టి కింద పడిపోగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. అప్పటికే గౌస్ చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఈ కేసుని అసహజ మరణం కింద ప‌రిగ‌ణిస్తున్నాం. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చేత శవ పంచనామా చేయించి, డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నప్పుడు వీడియో కూడా తీయించాం. ఆధారాల‌ను బ‌ట్టి బాధ్యుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

''క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి''

స‌త్తెన‌ప‌ల్లి ఘ‌ట‌న‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి విచార‌ణ చేయాల‌ని పౌర‌హ‌క్కుల సంఘం నేత చిలుక చంద్ర‌శేఖ‌ర్ డిమాండ్ చేశారు. తాజా ప‌రిణామాల‌పై ఆయ‌న బీబీసీతో మాట్లాడారు.

"పౌర హ‌క్కులు ప‌రిర‌క్షించాల్సిన పోలీసులు అనేక చోట్ల హ‌ద్దులు దాటుతుండ‌డం స‌రికాదు. ఇలాంటి ప‌రిస్థితులు పున‌రావృతం కాకుండా చూడాలి. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచాల్సింది పోయి, లాఠీల‌కు ప‌ని చెప్పాల‌నుకోవ‌డం చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌. స‌త్తెన‌ప‌ల్లిలో గౌస్ ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు క‌నిపిస్తోంది. త‌క్ష‌ణం క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి. పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి బాధ్యులంద‌రినీ క‌ఠినంగా శిక్షించాలి'' అని కోరుతున్నామని తెలిపారు.

లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు తీవ్రమైన ఒత్తిడి మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తమ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క లాక్ డౌన్‌ సమయంలో విధుల నిర్వ‌హ‌ణకు అనుమ‌తి ఉన్న వారి ప‌ట్ల కూడా కొంద‌రు పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు వెలుగులోకి వ‌స్తోంది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

లాక్ డౌన్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏపీలో గ్రీన్ జోన్ల వ‌ర‌కూ కొంత స‌డ‌లింపు ఇచ్చారు. ముఖ్యంగా మండ‌లాల ప్రాతిప‌దిక‌న కేసులు లేని మండ‌లాల్లో సాధార‌ణ కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఎటువంటి ప‌రిమితులు లేవు.

అదే స‌మ‌యంలో అనుమ‌తి ఉన్న పారిశ్రామిక కార్య‌క‌లాపాల‌కు కూడా ఆటంకం లేదు. వాటికి తోడుగా ఉపాధి హామీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి.

ఇక ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించి, భౌతిక‌దూరం పాటిస్తూ నిత్యావ‌స‌రాలు, ఇత‌ర స‌రకుల కోసం రోడ్డు మీద‌కు రావ‌డానికి కూడా ఆటంకాలు లేవు. ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కూ రెడ్ జోన్లు మిన‌హా అన్ని ప్రాంతాల్లోనూ ఒంట‌రిగా రావ‌డానికి, వెళ్ల‌డానికి చ‌ట్ట ప్ర‌కారం అనుమతి ఉంది.

అయినా ఎక్క‌డిక‌క్క‌డ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల‌లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది వ్య‌వ‌హార‌శైలి కార‌ణంగా కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్టు పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)