ఆంధ్రప్రదేశ్‌: వైసీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య పెరుగుతున్న మాట‌ల యుద్ధం, తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతున్న నేత‌లు

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ

ఫొటో సోర్స్, FACEBook/Twitter

ఏపీలో క‌రోనావైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే రాజ‌కీయ విమ‌ర్శ‌ల పరంపర కూడా పెరుగుతోంది. పార్టీల నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటి దాకా వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య అలాంటి ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు వైసీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య కూడా విమర్శల పర్వం మొద‌లైంది.

వైసీపీ ఎంపీ, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు రాజ‌కీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఆయ‌న‌కు స‌మాధానంగా బీజేపీ నేత‌లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. దాంతో ఈ ప‌రిణామాలు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశమయ్యాయి.

క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల మీద దృష్టి సారించాల్సిన నేత‌లు ఇలాంటి రాజ‌కీయ వాదోప‌వాదాల‌కు దిగ‌డం స‌మంజ‌సం కాద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఫొటో సోర్స్, ycp

ఫొటో క్యాప్షన్,

ఇప్పటి దాకా బీజేపీ, వైపీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు పెద్దగా ఉండేవి కాదు

బీజేపీ అధిష్ఠానంతో స‌న్నిహిత సంబంధాలు

ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంలోని అధికార బీజేపీతో వైసీపీ నేత‌లు కొంత స‌ఖ్య‌త‌గానే మెలుగుతున్నారు. స‌న్నిహితంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయం కూడా ఉంది. వివిధ అంశాల‌లో ఇరు పార్టీల కీల‌క నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం క‌నిపిస్తుండ‌డం దానికి నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. అందుకు అనుగుణంగా వైసీపీ నేత‌లు కూడా ప్ర‌త్యేక హోదా వంటి డిమాండ్ల‌ను దాదాపుగా ప‌క్క‌న పెట్టేశారు.

ఇటీవ‌లి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో రిల‌యన్స్ ప్ర‌తినిధికి ఎంపీ సీటు కేటాయింపు కూడా కేంద్రంలో ప్ర‌ధాని, హోంమంత్రితో భేటీ అనంత‌రం వెలువడిన నిర్ణ‌యం కావ‌డంతో వారి ప్ర‌భావం ఉంటుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ శాఖ‌లో మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్ల భిన్న వాద‌న‌లున్నాయి.

కొంద‌రు బీజేపీ నేత‌లు ముఖ్యమంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాలను స‌మ‌ర్థిస్తుంటే, ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ స‌హా ఇంకొంద‌రు నేత‌లు మాత్రం విమర్శిస్తున్నారు. రాజ‌ధాని అంశం నుంచి అన్ని విష‌యాల్లోనూ ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌దే ప‌దే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

క‌రోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే విష‌యంలో కూడా ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా లేద‌ని మండిప‌డ్డారు. శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

ఫొటో సోర్స్, TWITTER/KLNBJP

కన్నా అమ్ముడుపోయారంటూ వైసీపీ విమ‌ర్శ‌లు

కొంత‌కాలంగా క‌న్నా లక్ష్మీనారాయణ స‌హా బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా స్పందించ‌ని వైసీపీ నేత‌లు, తాజాగా అనూహ్యంగా స్పందించారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్ర‌బాబుకు అమ్ముడుపోయారంటూ విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో సుజ‌నా చౌదరి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించారని కూడా ఆయన అన్నారు.

విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఎంపీ సుజ‌నా చౌద‌రి మండిప‌డ్డారు. బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వాకాటి నారాయ‌ణ రెడ్డి కూడా ఈ ఆరోపణలను త‌ప్పుబ‌ట్టారు. ఆ పార్టీ ఏపీ శాఖ ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి కూడా వైసీపీ ప్ర‌భుత్వం, పెద్ద‌ల తీరు మీద ఘాటుగా స్పందించారు.

ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటున్న క‌న్నా

విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను తాను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నానని, ఆయనపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని క‌న్నా లక్ష్మీనారాయణ అన్నారు.

“క‌రోనావైరస్ పరీక్షల కిట్ల గురించి వైసీపీ ప్ర‌భుత్వంలో ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. దానిని ప్ర‌శ్నించినందుకు నా మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. నిజంగా ఆ మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటే కాణిపాకం ఆల‌యంలో ప్ర‌మాణం చేయాలి. సిద్ధ‌మేనా? లేదంటే నేను ప‌రువు న‌ష్టం దావా వేస్తా.

టెస్టింగ్ కిట్ల గురించి మాట్లాడితే ఇంత తీవ్రంగా స్పందించ‌డం చూస్తుంటే ఆయ‌న‌కు అందాల్సిన క‌మీష‌న్ ద‌క్క‌డం లేద‌నే బాధ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది” అని కన్నా విమర్శించారు.

ఫొటో సోర్స్, TWITTER/KLNBJP

మ‌రింత తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల‌ు చేసిన విజ‌య‌సాయి రెడ్డి

బీజేపీ నేత‌లు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా స్పందించిన త‌ర్వాత విజ‌య‌సాయి రెడ్డి మ‌రింత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఏకంగా బీజేపీ ఎన్నిక‌ల ఫండ్‌ని కూడా క‌న్నా దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు.

“బీజేపీ అధిష్ఠానం నుంచి ఎన్నిక‌ల ఫండ్ ఎంత వ‌చ్చిందో నాకు తెలుసు. దానిని ఎంత దుర్వినియోగం చేశారో కూడా లెక్క‌లున్నాయి. కానీ, అది వారి అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం కాబ‌ట్టి వివ‌రాలు బ‌య‌టపెట్ట‌డం లేదు. వారి అధిష్ఠానానికి అప్ప‌గించ‌మంటారా? మొత్తం వివ‌రాల‌న్నీ లెక్క‌ల‌తో స‌హా ఉన్నాయి.

ఆ పార్టీలో క‌న్నా, పురంధేశ్వ‌రి వంటి వారు ఎంతెంత తీసుకున్నారు.. నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎంతెంత ఇచ్చారో కూడా నాకు తెలుసు. క‌న్నా రూ.20 కోట్ల‌కు అమ్ముడుపోయార‌నే విష‌యంలో అవ‌స‌రమైతే కాణిపాకంలో ప్ర‌మాణం చేసేందుకు సిద్ధం. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య స‌త్సంబంధాలున్నాయి. వాటికి ఢోకా లేదు” అని తాజాగా విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, facebook.com/VijayaSaiReddyOfficial

సంయ‌మ‌నం అవ‌స‌రం

ఏపీలో ఓవైపు టీడీపీతోనూ, మ‌రోవైపు బీజేపీతోనూ వైసీపీ నేత‌లు మాట‌ల యుద్ధానికి దిగుతున్న తీరు విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుడు కె.కృష్ణ‌కుమార్ అన్నారు.

“అధికార పార్టీ కొంత సంయ‌మ‌నం ప్ర‌ద‌ర్శించాలి. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు ఇప్పుడు స‌మ‌యం కాదు. ఆరోప‌ణ‌లు ఎన్ని ఉన్నా అంద‌రూ క‌లిసి క‌రోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జల‌ను క‌ష్ట‌కాలం నుంచి గ‌ట్టెక్కించే ప‌నిపై దృష్టి పెట్టాలి.

అన్ని పార్టీలు త‌మ తీరు మార్చుకోవాలి. ఇలాంటి వైఖ‌రి ఏ నాయ‌కుడికీ స‌రికాదు. లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతుంటే నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు కాలుదువ్వుతున్న‌ట్టు క‌నిపించ‌డం మంచిది కాదు” అని కృష్ణ‌కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)