కరోనావైరస్: ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో స్వస్థలాలకు వస్తున్న శ్రీకాకుళం మత్స్యకారులు
- విజయ్ గజం
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడులోని చెన్నైకి, గుజరాత్‌లోని వీరావల్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఏటా వలస వెళ్తుంటారు. అలా వెళ్లినవారంతా ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆయా ప్రాంతాల్లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.
కొందరైతే స్వస్థలాలకు వచ్చేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. చెన్నైలో చిక్కుకుపోయినవారు సముద్ర ప్రయాణం చేసి శ్రీకాకుళం చేరుకుంటున్నారు. అలా వచ్చినవారిని అధికారులు గుర్తిస్తూ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
గుజరాత్లో ఉన్న మత్స్యకారులు ఏపీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మత్స్యకారులకు అందిస్తున్న సాయంపై గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు.
రాష్ట్ర మొత్తం మీద 541 మత్స్యకార గ్రామాలూ, 3 లక్షల మంది పూర్తి స్థాయి చేపల వేటగాళ్లు (యాక్టివ్ ఫిషర్ మెన్) ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో 1.5 లక్షల మంది జనం ఉన్నారు.
శ్రీకాకుళంలో జెట్టీలు లేకపోవడంతో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరావల్, చెన్నైల్లో బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తున్నారు.
ఏటా ఆగస్టు నెలలో వీరావల్‌కు వలసలుంటాయి. ప్రతి ఏడాది 10 నుంచి 15 వేల మంది గుజరాత్‌కు, మరో 5 వేల మంది వరకూ చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.
ఇలా వెళ్లినవాళ్లంతా ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు.
బోట్లు కొనుక్కుని వస్తున్నారు
గత ఐదు రోజుల్లో చెన్నై నుంచి 89 మంది వరకూ మత్స్యకారులు సముద్ర మార్గంలో శ్రీకాకుళం తీరానికి చేరుకున్నారు.
ఏప్రిల్ 18న కవిటి మండలం ఇద్దవానిపాలేనికి చెన్నై నుంచి 12 మంది మత్స్యకారులు సముద్రమార్గంలో వచ్చారు. 11న వీళ్లు చెన్నై నుంచి నాలుగు బోట్లలో బయల్దేరారు. ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు.
15న చెన్నై నుంచి బయలు దేరిన మరో 27 మంది మత్స్యకారులు 19న అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని డోన్కూరు బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ ప్రయాణం కోసం వీళ్లే రూ.1.7 లక్షలు పెట్టి సొంతంగా బోటును కొనుక్కున్నారు.