కరోనావైరస్ లాక్ డౌన్: ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన పాలు, పాల ఉత్ప‌త్తుల‌ విక్ర‌యం... కష్టాల్లో పాడి రైతులు

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
కృష్ణా మిల్క్ యూనియ‌న్

ఫొటో సోర్స్, facebook/krishnamilkunionvijayawada

లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్ర‌భావితం అవుతున్నాయి. చివ‌ర‌కు పాలు, పాల ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు కూడా భారీగా పడిపోతున్నాయి.

స‌హ‌జంగా మార్చి నుంచి జూన్ నెల వ‌ర‌కూ సీజ‌న్‌గా భావించే పాల ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌కు ఈసారి పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. ర‌వాణా స‌మ‌స్య‌లు, ఇత‌ర ఇక్క‌ట్లు క‌లిపి పాల విక్ర‌యాల‌ను 25 శాతానికే ప‌రిమితం చేశామని కొన్ని డెయిరీలు చెబుతున్నాయి.

దాంతో పాడి రైతుల నుంచి పాల కొనుగోళ్ళ విష‌యంలోనూ నియంత్ర‌ణ త‌ప్ప‌డం లేదని చెబుతున్నారు. తీసిన పాలు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని రైతులు చెబుతుంటే, చివ‌ర‌కు డెయిరీ సిబ్బందిలో కూడా కోత త‌ప్ప‌డం లేదు.

పాలు, పాలు ఉత్ప‌త్తులు ఎంత ప‌డిపోయాయి?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఒక‌టైన‌ విజ‌య‌వాడ జ‌నాభా 2011 లెక్క‌ల ప్ర‌కారం, 10.34 ల‌క్ష‌లు. న‌గ‌రంలో స‌గ‌టున రోజుకి 7 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు విక్ర‌యం జ‌రిగేది.

అందులో విజ‌యా డెయిరీ త‌రఫున గ‌త ఏడాది ఏప్రిల్‌లో 1.6 ల‌క్ష‌ల లీట‌ర్ల చొప్పున విక్ర‌యాలు జ‌రిగాయి. కానీ, ప్ర‌స్తుతం అది అనూహ్యంగా ప‌డిపోయింది. గ‌తవారం రోజులుగా రోజుకి పాలు 40 వేల లీట‌ర్ల‌కు మించ‌డం లేద‌ని విజ‌యా డెయిరీ సంస్థ ప్ర‌క‌టించింది. అంటే నాలుగోవంతు అమ్మ‌కాలు మాత్ర‌మే జ‌రుగుతున్నాయి.

పెరుగు అమ్మ‌కాలు కూడా అలాగే ప‌డిపోయాయి. న‌గ‌రంలో మొత్తం 500 ట‌న్నుల పెరుగు నిత్యం అమ్మ‌కాలు సాగేవి. విజ‌యా డెయిరీ స‌గ‌టున 125 ట‌న్నుల పెరుగు అమ్మితే, వేస‌వి సీజ‌న్ కావ‌డంతో ఏప్రిల్ నెల‌లో అది 200 ట‌న్నుల వ‌ర‌కూ కూడా ఉండేది. కానీ, ప్ర‌స్తుతం 35 ట‌న్నుల‌కే ప‌రిమితం అవుతోంది. పెరుగు విక్ర‌యాలు కూడా భారీగా ప‌డిపోయిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక విజ‌యా డెయిరీ త‌రుఫున వివిధ పాల ఉత్ప‌త్తులు, ముఖ్యంగా స్వీట్లు విరివిగా అమ్ముడుపోయేవి. రోజుకి స‌గ‌టున 5 ట‌న్నుల వ‌ర‌కూ అమ్మకాలు జరిగేవని విజ‌యా డెయిరీ చెబుతోంది. కానీ, ప్ర‌స్తుతం అది నామ‌మాత్రంగానే ఉన్న‌ట్టు చెబుతున్నారు. స్వీట్ల అమ్మ‌కాలు ఒక ట‌న్నుకి ప‌రిమితం అయిపోయాయ‌ని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, facebook/krishnamilkunionvijayawada

వేస‌వి ఉత్ప‌త్తుల‌కు కూడా గ‌డ్డుకాల‌మే..

డెయిరీ ఉత్ప‌త్తుల్లో ప్ర‌ధానంగా ల‌స్సీ, మ‌జ్జిగ వంటివి వేస‌విలోనే ఎక్కువ‌గా అమ్మ‌కాలు సాగుతూ ఉంటాయి. కానీ ప్ర‌స్తుతం పూర్తిగా ప‌డిపోయాయి. ముఖ్యంగా ఉద‌యం 6 నుంచి 9 గంటల వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపు ఉన్న స‌మ‌యంలో మాత్ర‌మే అమ్మ‌కాల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని కృష్ణా మిల్క్ యూనియ‌న్ ప్ర‌తినిధి పి.ర‌మేష్ బీబీసీకి తెలిపారు.

అత్య‌వ‌స‌ర స‌రుకుల కింద పాలు అమ్మ‌కానికి అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ, బ‌య‌ట‌కు వ‌చ్చేవారు లేనందున ఇక అమ్మ‌కాలు సాధ్యం కాదు క‌దా అంటున్నారు. పాల విక్రయ కేంద్రాల నిర్వ‌హ‌ణ కూడా భారంగా మార‌డంతో చాలా మంది తాత్కాలికంగా మూసివేశారని ఆయ‌న తెలిపారు.

“వేస‌విలో శుభ‌కార్యాలు జోరుగా జ‌రిగేవి. దానికి త‌గ్గ‌ట్టుగా పాలు, పెరుగు, స్వీట్ల అమ్మ‌కాలు ఉండేవి. అందుకే ఏటా ఏప్రిల్, మే నెల‌ల్లో డెయిరీకి మంచి లాభాలు వ‌చ్చేవి. కానీ, ఈసారి సీజ‌న్ మొత్తం పోయింది. ఎటువంటి శుభ‌కార్యాలు లేవు. ఇత‌ర ఫంక్ష‌న్ల‌కు అవ‌కాశం లేదు. దాంతో పాలు, పాల ఉత్ప‌త్తులు కొనేవాళ్లు లేరు. విజ‌యా డెయిరీ మాత్ర‌మే కాదు.. దాదాపు అన్ని డెయిరీల ప‌రిస్థితి అంతే. అమ్మ‌కాలు 25 శాతానికి మించ‌డం లేదు” అని ర‌మేష్ వివ‌రించారు.

ఫొటో సోర్స్, facebook/krishnamilkunionvijayawada

గృహ వినియోగం క‌న్నా వ్యాపార అవ‌స‌రాల‌కే ఎక్కువ‌గా పాల విక్ర‌యాలు జ‌రుగుతాయ‌ని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో సంగం డెయిరీ పాల అమ్మ‌కందారుడు దొంతిరెడ్డి దామోద‌ర్ అంటున్నారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ, “ఈ సీజ‌న్‌లో మాకు పాలు అమ్మ‌డానికి కూడా దొరికేవి కాదు. ఉద‌యం 9, 10 గంటల త‌ర్వాత మా ద‌గ్గ‌ర స్టాక్ అయిపోయేది. డిమాండ్ ఆ స్థాయిలో ఉండేది. కానీ, ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంది. మా దుకాణం నుంచి నాలుగు టీ స్టాళ్లు, రెండు హోట‌ళ్ల‌కు పాలు స‌ర‌ఫ‌రా అయ్యేవి. మేము దుకాణంలో అమ్మేదానికంటే మూడింత‌ల ఎక్కువ పాలను నేరుగా వారికే పంపించేవాళ్లం. కానీ, ఇప్పుడు దాదాపుగా అవ‌న్నీ మూత‌ప‌డ్డాయి. రెండు టీ స్టాళ్లు న‌డుస్తున్నా వినియోగం స‌గానికి త‌గ్గిపోయింది. ప్ర‌భుత్వ కార్యాలయాలన్నీ ఉంటే కొంత కార్య‌క‌లాపాలు ఉండేవి. ఇప్పుడు అవి మూత‌ప‌డ‌డంతో టీ అమ్మ‌కాలు కూడా క‌నిపించం లేదు. పైగా 9 గంట‌ల త‌ర్వాత తెరిచేదానికి అవ‌కాశం కూడా లేదు. తెరిచినా ఎవ‌రూ రావ‌డం లేదు. దాంతో మా వ్యాపారం ముప్పావు వంతు కోల్పోయాం” అని వివ‌రించారు.

ఉత్ప‌త్తి త‌గ్గించేశాం..సిబ్బందిలో కోత కూడా త‌ప్ప‌దు

పాలు, పాల ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు 24 గంట‌ల పాటు నిరంత‌రాయంగా సాగేవి. వ‌ర‌ద‌లు, తుపాన్లు వ‌చ్చినా పాల స‌ర‌ఫ‌రా గానీ, అమ్మ‌కాల‌కు గానీ ఆటంకాలు తాత్కాలికంగానే ఉండేవి. కానీ, ఈ సారి దీర్ఘ‌కాలం పాటు కొనసాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా రోజూ 4 గం.ల‌కు మించి అమ్మ‌కాలు లేవ‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో పాల ర‌వాణా స‌మ‌స్య‌లు కూడా తీవ్రంగా ఉన్న‌ట్టు మోడ‌ల్ డెయిరీ ప్ర‌తినిధి న‌ర‌సింహ‌రావు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook/krishnamilkunionvijayawada

“పాల వంటి నిత్యావ‌స‌రాల స‌రఫ‌రాకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ, ఆచ‌ర‌ణ‌లో అనేక స‌మ‌స్య‌లున్నాయి. కొన్ని చోట్ల పోలీసుల ఆంక్ష‌లు త‌ప్ప‌డం లేదు. మ‌రికొన్ని చోట్ల ర‌వాణాకి సిబ్బంది కొర‌త కూడా కొంత ఉంది. గ్రామాల నుంచి పాలు తీసుకొచ్చే స‌మ‌యంలో పలు చోట్ల బ‌య‌టి వాహ‌నాలంటూ ఊళ్ల‌లోకి అనుమ‌తించ‌డం లేదు.

అలాంట‌ప్పుడు పాలను త‌ర‌లించ‌డం పెద్ద స‌మ‌స్య అవుతోంది. ఇక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో రోజూ 4 గంట‌ల పాటు పాయింట్లు తెరిచినా నేరుగా వ‌చ్చి కొనేవాళ్లు కూడా త‌గ్గిపోయారు. పాల‌ ప్యాకెట్ల ద్వారా క‌రోనా వ్యాపిస్తుందనే ప్ర‌చారం కూడా దానికి ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

ఇంటింటికీ పాలు స‌ర‌ఫ‌రా చేసే డెలివ‌రీ బాయ్స్ కూడా కొన్ని చోట్ల అందుబాటులో ఉండ‌డం లేదు. అన్ని స‌మ‌స్య‌లూ క‌లిసి ఇప్పుడు పాల అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూప‌డంతో చివ‌ర‌కు అనివార్యంగా ఉత్ప‌త్తి కుదిస్తున్నాం. దాంతో సిబ్బందిని కూడా త‌గ్గించ‌క త‌ప్ప‌డం లేదు” అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, facebook/krishnamilkunionvijayawada

మూడు షిఫ్టుల‌లో ప‌నిచేసే డెయిరీలు దాదాపుగా అన్ని చోట్లా ప్ర‌స్తుతం రెండు షిఫ్టుల‌కే ప‌రిమితం అయ్యాయి. దాంతో సిబ్బంది త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ఒక్క విజ‌యా డెయిరీలోనే దిన‌స‌రి వేత‌నాల‌కు ప‌నిచేసే సుమారు 900 మందిని తాత్కాలికంగా నిలుపుద‌ల చేశారు. రెగ్యుల‌ర్, క‌న్సాలిటేడెట్ సిబ్బంది విష‌యంలోనూ కోత‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం విశాఖ డెయిరీ సిబ్బందిలో క‌నిపిస్తోంది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌మ‌స్య‌లు ఉన్నా కూడా కొన్ని డెయిరీలు పాల సేక‌ర‌ణ ఆప‌డం లేదు. రైతుల నుంచి సేక‌రిస్తున్న పాలను పొడిగా మార్చి, పెద్ద మొత్తంలో నిల్వ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ ఇప్ప‌టికే పాల పొడి నిల్వ‌లున్న డెయిరీల‌లో మాత్రం అది సాధ్యం కావ‌డం లేదు. దాంతో పాలు నిల్వ చేసుకునే మార్గాలు లేక సేక‌ర‌ణ‌ను కుదిస్తున్నాయి.

ఒక్కో డెయిరీ ఒక్కో ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కొంద‌రు ఉద‌యం పూట పాలు సేక‌రిస్తూ, సాయంత్రం నిరాక‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం రెండు పూట‌లా స‌గం పాలు తీసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. ఇది పాడి రైతుల‌కు పెద్ద స‌మ‌స్య అవుతోంది.

త‌మ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారుతోందని పాడి రైతు పాలిక బాబ్జీ అంటున్నారు.

తూర్పు గోదావ‌రి జిల్లా తుని మండ‌లానికి చెందిన ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ... “మా ఊరి నుంచి నాలుగు డెయిరీల‌కు పాలు పోస్తాం. కానీ ఇప్పుడు కొంద‌రే రెండు పూట‌లా పాలు తీసుకుంటున్నారు. కొంద‌రు మాత్రం స‌గం తీసుకుంటామ‌ని, కొంద‌రు ఒక పూట తీసుకుంటామ‌ని చెబుతున్నారు. దాంతో పాల ఉత్ప‌త్తి మీద ఆధార‌ప‌డి జీవించే వాళ్ల ప‌రిస్థితి ఏం కావాలి? లాక్‌డౌన్ త్వ‌ర‌గా ముగిస్తే కొంత ఫ‌ర్వాలేదు గానీ కొన‌సాగితే చిక్కులే. పూట‌కి 12 లీట‌ర్ల పాలు మేము హెరిటేజ్‌కి పోస్తాం. మాకు 10 రోజుల‌కు ఓసారి రూ.10 వేలు వ‌ర‌కూ వ‌స్తాయి. అది త‌గ్గిపోతే ఇక జీవాల‌ను పోషించ‌డం కూడా క‌ష్ట‌మే అవుతుంది” అని చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)