సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు గోదావరి నీళ్ళు - ప్రెస్‌రివ్యూ

రంగనాయక సాగర్

ఫొటో సోర్స్, TWITER/trsharish

ఫొటో క్యాప్షన్,

రంగనాయక సాగర్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయకసాగర్‌లోకి నీళ్లొచ్చాయంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది. ఆ వివరాలు ఇవి.

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారకరామారావు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని సర్జ్‌పూల్‌ పంపుహౌజ్‌లో మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్‌లోకి నీళ్లు వదిలారు.

రంగనాయకసాగర్‌తో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. లాక్‌డౌన్‌తో రంగనాయకసాగర్‌ ప్రారంభోత్సవాన్ని నిరాడంబంరంగా చేపట్టారు. పరిమిత సంఖ్యలో అధికారులు, నేతలు, కూలీలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు.

రెండు మోటర్ల ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ నుంచి తుక్కాపూర్‌, అక్కారం, మర్కూక్‌ పంపుహౌజ్‌ల ద్వారా నీటిని కొండపోచమ్మసాగర్‌కు తరలించనున్నారని నమస్తే తెలంగాణ పత్రిక ఈ కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్:హైదరాబాద్‌కు కేంద్ర బృందాలు

హైదరాబాద్‌కి కేంద్ర బృందం

హైదరాబాద్‌కు కేంద్ర బృందం రానుందంటూ ఈనాడు దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా ఉధృతితో హైదరాబాద్ మహానగరంలో పరిస్థితులు సీరియస్‌గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నగరంలోని పరిస్థితులను సమీక్షించేందుకుగాను కేంద్ర బృందాన్ని పంపించనున్నట్టు వెల్లడించింది.

అహ్మాదాబాద్, సూరత్, ఠానే, చెన్నైల్లోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఆ నగరాలకు కూడా బృందాలను పంపిస్తామని చెప్పింది. ఈ బృందాలకు అదనపు కార్యదర్శి స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు రెండు చొప్పున, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు బృందాలను ఇప్పటికే కేంద్రం పంపించింది. పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన బృందాలను తొలి రోజు అక్కడ ప్రభుత్వం అడ్డుకోవడం మినహా అంతా సజావుగానే సాగింది.

నగరాల్లో జన సాంద్రత కారణంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో అక్కడి పరిస్థితులను అంచనా వేసి, వైరస్ నియంత్రణకు అవసరమైన సూచనలు చేయడం ఈ బృందాలను పంపడం వెనుక అసలు ఉద్ధేశం.

కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. కోవిడ్ రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యులపై దాడులు చేయడం దగ్గర నుంచి, పోలీసులపై దాడులు, మార్కెట్లలో భౌతిక దూరం పాటించడక పోవడం, క్వారైంటేన్ల ఏర్పాటును వ్యతిరేకించడం వంటి రూపాల్లో ఉల్లంఘనలు ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర బృందాలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించి వాటిని చక్కదిద్దడంలో అధికారులకు సూచనలిస్తాయి. ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలిస్తాయని ఈనాడు ఈ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ISTOCK

ఫొటో క్యాప్షన్,

ఏపీలో బోధనా మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ

పాఠశాలల్లో బోధన మాధ్యమంపై 3 ఆప్షన్లు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది.

గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది.

తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో టిక్‌ చేసి సంతకం చేసి ఇవ్వాలి.

హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్‌ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది.

మొదటిది తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం , రెండోది కేవలం తెలుగు మీడియం, మూడోది ఇతర భాషా మీడియం అని సాక్షి ఈ కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

బాల్ టాంపరింగ్‌కి అనుమతిచ్చే యోచనలో ఐసీసీ

క్రికెట్‌లో బాల్ టాంపరింగ్‌ను అధికారం చేసే ఆలోచనలో ఐసీసీ ఉందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది ఆ వివరాలు ఇవి.

కొవిడ్‌-19 కారణంగా మున్ముందు జరగబోయే క్రికెట్‌ సిరీ్‌సల్లో బౌలర్లు బంతికి ఉమ్మిని పూయడం ప్రమాదకరమనే చర్చ అంతటా సాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఐసీసీ కూడా ఈ అంశంపై దృష్టి సారించింది.

అందుకే ఇక నుంచి బంతి మెరుపు కోసం ఉమ్మిని కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. అయితే, దీన్ని అంపైర్ల సమక్షంలోనే చేయాలన్న నిబంధన కూడా పెట్టాలని ఐసీసీ భావిస్తోంది.

గతంలో బంతికి ఉమ్మిని కాకుండా మరే పదార్థాన్ని ఉపయోగించినా బాల్‌ ట్యాంపరింగ్‌గా పరిగణించి శిక్షించేవారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా వార్నర్‌, స్మిత్‌ల సూచన మేరకు బాన్‌క్రాప్ట్ శాండ్‌పేపర్‌తో బంతికి మెరుపు తెచ్చేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

అయితే, ఇప్పుడు క్రికెట్‌ ముందుకెళ్లాలంటే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భావిస్తోంది. ఐసీసీ మెడికల్‌ కమిటీ కూడా ఇక నుంచి బంతికి ఉమ్మిని పూయడం ఏమాత్రం మంచిది కాదని గురువారం జరిగిన ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో స్పష్టం చేసింది.

ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో బంతి మెరుపు కోసం బౌలర్లు తరచూ తమ ఉమ్మిని పూస్తుంటారు. ఇలా అయితే, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలమని వారు భావిస్తుంటారని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)