భారత్‌లో కరోనావైరస్: మరణాలు తక్కువగా ఉండటం వెనకున్న రహస్యం ఏంటి?

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ పరీక్ష

ఫొటో సోర్స్, Ani

దేశంలో నమోదవుతున్న కోవిడ్-19 మరణాలపై అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాలు కొంత ఉపశమనాన్ని, కొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయి.

కరోనావైరస్ కేంద్రీకృతమైన ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చి చూస్తే భారత్‌లో నమోదవుతున్న మరణాల సంఖ్య తక్కువగా ఉంటోందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

దేశంలో కోవిడ్-19 తొలి కేసు నమోదు అయినప్పటి నుంచి ఏప్రిల్ 29 వరకు 31 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో వెయ్యి మందికి పైగా మరణించారు.

మరణాల రేటుని తెలుసుకోవాలంటే మరణాల సంఖ్య రెట్టింపు కావడానికి ఎన్ని రోజులు పడుతుందో అర్ధం చేసుకోవడం అవసరం.

భారత్‌లో ప్రస్తుతానికి ఇది 9 రోజులుగా ఉంది. ఏప్రిల్ 25వ తేదీ నాటికి 825 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 16 నాటికి అందులో సగం సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

అయితే, అమెరికాలోని న్యూయార్క్‌లో మాత్రం రెండు మూడు రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు అవుతోందని నిపుణులు గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఏప్రిల్ 28 వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్ మరణాలు 886.

భారత్‌లో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు విధించిన కఠిన లాక్‌డౌన్ చర్యలు ఉపయోగపడ్డాయని కొంత మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగకుండా నిలువరించేందుకు లాక్‌డౌన్ ఉపయోగపడిందని లాన్సెట్ మెడికల్ జర్నల్ పేర్కొంది.

కోవిడ్- 19తో వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉందని, కానీ దేశ జనాభాలో ఎక్కువగా యువత ఉండటం వల్ల మరణాల రేటు తక్కువగా ఉండి ఉండవచ్చని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

భారత్‌కు కాస్త తక్కువ ప్రభావం చూపే వైరస్ వచ్చిందని, ఇక్కడి వాతావరణం వేడిగా ఉండటం వలన వైరస్ బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉందని కొందరు అంటున్నారు.

అయితే, ఈ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచంలో మిగతా దేశాల్లో వచ్చిన వైరసే ఇక్కడ కూడా వచ్చిందని కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు అంటున్నారు.

కరోనావైరస్ మరణాల విషయంలో భారత్‌ ఏమైనా ప్రత్యేకంగా నిలుస్తుందా?

"నిజం చెప్పాలంటే నా దగ్గర దీనికి సమాధానం లేదు. అలాగే ప్రపంచం దగ్గర కూడా సమాధానం లేదు" అని భారతీయ అమెరికన్ వైద్యుడు, ఆంకాలజిస్టు సిద్ధార్థ ముఖర్జీ అన్నారు.

ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే ఇంకా కొంచెం ఎక్కువ స్పష్టత వచ్చి ఉండేదని, కరోనావైరస్ సోకిన వారికి, దాని నుంచి కోలుకున్నవారికి ఇద్దరికీ పరీక్షలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కోవిడ్ 19 మరణాలను భారత్ సరిగ్గా నమోదు చేయలేకపోతోందా అనేది ఇంకొక సందేహం.

కరోనావైరస్ బారిన పడిన చాలా దేశాలలో మరణాల సంఖ్యను సరిగ్గా నమోదు చేయటం లేదు. మార్చి నెలలో అధికారికంగా ధృవీకరించిన మరణాలు కాకుండా మరో 40,000 మంది మరణించారని 12 దేశాలలో మరణాల రేటుని అధ్యయనం చేసిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అవి కేవలం కరోనావైరస్ వల్ల సంభవించిన మరణాలు కావు.

అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య కంటే 60 శాతంపైనే మరణాలు ఉండి ఉండవచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ అధ్యయనంలో భారతదేశం గురించి ప్రస్తావన లేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

భారతదేశంలో కోవిడ్ 19 ఐసొలేషన్ వార్డ్

దేశంలో చోటు చేసుకుంటున్న మరణాలన్నిటినీ నమోదు చేస్తేనే సరైన సంఖ్య చెప్పడానికి వీలవుతుందని, యూనివర్సిటీ అఫ్ టొరంటో‌కు చెందిన ప్రభాత్ ఝా అన్నారు.

భారత్‌లో 80 శాతం మరణాలు ఇంటి దగ్గరే చోటు చేసుకుంటాయి. ఇందులో మలేరియా, న్యూమోనియాల బారిన పడి మరణించిన కసులు ఉంటాయి. ప్రసూతి మరణాలు, ప్రమాదాలు, హృద్రోగ మరణాలు హాస్పిటళ్లలో నమోదు అవుతాయి.

"చాలా మంది ఆస్పత్రుల్లో కొంత కాలం చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లి కొంత కాలానికి మరణిస్తారు” అని ఝా చెప్పారు. కేవలం ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న మరణాలను లెక్కించడం వలన కోవిడ్- 19 మరణాల సంఖ్య పూర్తిగా రాదని ఝా అన్నారు.

అలాగే శ్మశానాలు, ఫ్యునెరల్ హోమ్‌ల నుంచి కూడా సమాచారం సేకరించడం కష్టమైన పనే. భారత్‌లో చాలా మంది చనిపోయిన వారిని ఊరి చివర ఉన్న శ్మశానాలలో ఖననం చేస్తారు. ఫ్యునెరల్ హోమ్స్‌కి వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు అతి తక్కువ సంఖ్యలో ఉంటారు.

ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న మరణాలు విపరీతంగా ఉన్నాయని ఇప్పటి వరకు నివేదికలు లేవని, అలా జరిగే పక్షంలో తెలియకుండా ఉండటం అసంభవమని, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కే శ్రీనాథ్ రెడ్డి అన్నారు. (ఆయన ఉదాహరణగా ఉత్తర భారతదేశంలో చోటు చేసుకున్న శిశు మరణాల నమోదు తీరు గురించి ప్రస్తావించారు)

అలాగే ఇంటి దగ్గర సంభవిస్తున్న మరణాలు కూడా తెలియకుండా ఉండవని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రజా ఆరోగ్య పర్యవేక్షణ పటిష్టంగా లేని పక్షంలో కోవిడ్- 19 మరణాలను తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్లు వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో 8.5 కోట్ల మందికి పైగా ప్రజలు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. గ్రామాలలో జరుగుతున్న మరణాల గురించి టోల్ ఫ్రీ నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని వాళ్ళను అడగవచ్చని అంటున్నారు. అలా చేసినట్లయితే అధికారులు ఆ ప్రాంతాలకి వెళ్లి మరణాలకు గల కారణాన్ని ధృవీకరించడానికి వీలవుతుందని తెలిపారు.

దేశంలో మరణాల సంఖ్యను లెక్కపెట్టడం ఎప్పుడూ ఒక అస్తవ్యస్త పద్దతిలోనే సాగుతోంది. దేశంలో ప్రతి ఏటా ఒక కోటి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు భారతదేశంలో మరణాల సంఖ్య ఎక్కువగా అంచనా వేస్తారని మిలియన్ డెత్త్స్ అనే అధ్యయనం పేర్కొంది.

2005లో దేశంలో ఎచ్‌ఐవీ మరణాల సంఖ్య 1,00,000. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిన మరణాల సంఖ్యలో పావు వంతు మాత్రమే.

కొన్ని సార్లు మరణాల సంఖ్యని తక్కువగా అంచనా వేస్తారని (ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిన మలేరియా మరణాలకన్నా ఐదు రెట్లు ఎక్కువ మలేరియా మరణాలు దేశంలో ఉన్నాయి) అలాగే, దేశంలో కేవలం 22 శాతం మరణాలు మాత్రమే వైద్య పరంగా ధృవీకరిస్తారని ప్రభుత్వమే పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

ఇండోర్‌లోని ఆస్పత్రిలో కరోనా కేసులు భారీగా పెరిగాయి

కోవిడ్ 19 మరణాన్ని ధ్రువీకరించడం ఎలా?

దేశంలో ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా, చికిత్స తీసుకోకుండా కూడా కోవిడ్ 19కి గురై చాలా మంది మరణిస్తున్నారని కొంత మంది డాక్టర్లు చెప్పారు. అలాగే, దేశంలో డాక్టర్లు మరణానికి సరైన కారణం కనిపెట్టడంలో విఫలమవుతున్నారనే అభియోగం కూడా ఉంది.

భారతదేశంతో సహా మరికొన్ని దేశాలలో కోవిడ్ 19 మరణాలు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని బెల్జియం ఏరస్మే యూనివర్సిటీ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్‌లో పని చేస్తున్న జీన్ లూయిస్ విన్సన్ట్ అన్నారు.

చనిపోవడానికి ముందు ఒక వేళ రోగి జ్వరంతో కానీ, శ్వాస సంబంధిత సమస్యలతో కానీ బాధపడితే ఆ మరణాన్ని కోవిడ్-19 మరణంగా భావించే ప్రమాదం ఉంది. అయితే, అది కోవిడ్ మరణం కాకపోవచ్చని అన్నారు.

వైద్య పరీక్షలు నిర్వహించని పక్షంలో చాలా మరణాలని కోవిడ్ 19 మరణాలుగా లేదా సాధారణ మరణంగా భావించే ప్రమాదం ఉంది. 1918లో సంభవించిన స్పానిష్ ఫ్లూ మరణాల సంఖ్యలో అందుకే ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయనే ఆలోచనతో కూడా చాలా ప్రభుత్వాలు మరణాల సంఖ్య వెల్లడించకపోవడానికి ఒక కారణం కావచ్చు.

"అయితే, ఎవరూ కావాలని మరణాల సంఖ్యని దాచి పెట్టటం లేదు. పెద్ద సంఖ్యలో సంభవిస్తున్న మరణాలను దాచిపెట్టడం కష్టం“ అని ఝా అన్నారు.

వైరస్ సోకిన వారిని కనిపెట్టడం కన్నా మరణాలను నమోదు చేయడం తేలికైన పని అని ఆయన అన్నారు.

"మరణాలను నమోదు చేయటంలో భారతదేశంలో కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు. కానీ, ఇక్కడ చోటు చేసుకుంటున్న మరణాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, దేశంలో మరణాల సంఖ్య తక్కువ ఉందని ఇప్పట్లో చెప్పలేం" నిజం చెప్పాలంటే మనకి ఇంకా ఏమి తెలియదని" ఒక నిపుణుడు అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)