కరోనావైరస్ లాక్‌డౌన్: రెడ్, ఆరెంజ్, గ్రీన్... ఏ జోన్‌లో ఎలాంటి ఆంక్షలున్నాయి?

గ్రామీణ ప్రాంతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల నిర్మాణ పనులూ ప్రారంభించవచ్చు.

దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం, మే 4 నుంచి వచ్చే రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించిన ప్రభుత్వం, దేశమంతటా అన్ని ఆస్పత్రిల్లోనూ ఓపీ సేవలకు అనుమతి ఉంటుందని తెలిపింది.

కొన్ని ఆంక్షలు జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయని పేర్కొంది. ఆ ఆంక్షలు ఏంటంటే...

 • దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలన్నీ బంద్.(అత్యవసర సేవల విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది)
 • రైళ్లు బంద్.
 • అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం
 • పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలన్నీ బంద్‌
 • హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, వ్యాయామ కేంద్రాలు తెరవొద్దు
 • స్విమ్మింగ్‌ పూళ్లు, క్రీడా మైదానాలన్నీ మూసి ఉంటాయి
 • అన్ని ప్రార్థనా స్థలాలు, ప్రజలు గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం

కంటైన్‌మెంట్ జోన్లలో

 • నిత్యవసర సరకుల కోసం, అత్యవసర వైద్యం కోసం మాత్రమే రాకపోకలను అనుమతిస్తారు.
 • తనిఖీ చేయకుండా ఏ వ్యక్తినీ, వాహనాన్నీ అనుమతించరు.
 • బయటకు, లోపలికి వెళ్లే వ్యక్తుల వివరాలను నమోదు చేస్తారు.

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్,

అన్ని రకాల అత్యవసర సేవలకూ దేశవ్యాప్తంగా అనుమతి ఉంటుంది

రెడ్ జోన్లలో (హాట్‌స్పాట్స్) [కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల]

 • సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలకు అనుమతి ఉండదు.
 • ట్యాక్సీలు, క్యాబులకు అనుమతి ఉండదు.
 • జిల్లా, అంతర జిల్లాల బస్సు సర్వీసులు బంద్
 • కటింగ్ షాపులు, సెలూన్లు, స్పాలు తెరవకూడదు
 • అనుమతించిన పనుల కోసం మాత్రమే వ్యక్తిగత వాహనాలపై వెళ్లొచ్చు. ఫోర్ వీలర్ వాహనాలలో డ్రైవర్‌తో పాటు గరిష్ఠంగా మరో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.
 • ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్లాలి.
 • పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు: ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌) మాత్రమే, ఎగుమతి ఆధారిత పరిశ్రమలు నడుస్తాయి.
 • మందులు, ఔషధాలు, వైద్య పరికరాలు, వాటి ముడి పదార్థాలు సహా అత్యవసర, నిత్యవసర వస్తువుల తయారీ సంస్థలు పనిచేస్తాయి.
 • నిరంతర ఉత్పత్తి, సరఫరా అవసరమయ్యే తయారీ యూనిట్లు, ఐటీ హార్డ్ వేర్ తయారీ పరిశ్రమలకు అనుమతి ఉంటుంది.
 • జనపనార పరిశ్రమల్లో సిబ్బంది షిఫ్టుల వారీగా, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగించొచ్చు.
 • ప్యాకేజింగ్ మెటీరియల్ తయారీ పరిశ్రమలకు కూడా అనుమతి ఉంటుంది.
 • గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పరిశ్రమల్లోనూ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
 • పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు: నిర్మాణం జరిగే చోటే కార్మికులు నివాసం ఉంటేనే పనులకు అనుమతి ఇస్తారు. బయటి నుంచి కార్మికులను తీసుకొచ్చి పనిచేయించేందుకు అనుమతి ఉండదు.
 • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించవచ్చు.
 • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల నిర్మాణ పనులకూ అనుమతి ఉంటుంది.
 • పట్టణ ప్రాంతాల్లోని( మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో) మాల్స్, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు మూసి ఉంటాయి. అయితే, అత్యవసర, నిత్యవసర వస్తువులను విక్రయించే దుకాణాలకు, మార్కెట్ సముదాయాలకు అనుమతి ఉంటుంది.
 • పట్టణ ప్రాంతాల్లోని నివాస సముదాయాలలో ఒంటరిగా ఉండే అన్ని దుకాణాలనూ తెరవొచ్చు.
 • మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలను తెరవొచ్చు. ప్రతి చోటా తప్పనిసరిగా రెండు మీటర్ల సామాజిక దూరం పాటించాలి.
 • అత్యవసర, నిత్యవసర వస్తువులను డెలివరీ చేయడానికి మాత్రమే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది.
 • గరిష్ఠంగా 33 శాతం మంది సిబ్బందితో ప్రైవేటు కార్యాలయాలు పనిచేసుకోవచ్చు. మిగతా సిబ్బందికి ఇళ్ల నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించవచ్చు.
 • ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సెక్రటరీ, అంతకంటే పై స్థాయి అధికారులందరూ 100 శాతం హాజరువుతారు. మిగతా సిబ్బందిలో అవసరాన్ని బట్టి గరిష్ఠంగా 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్తారు.
 • అత్యవసర సేవల విభాగాలు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేస్తాయి.
 • వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చు. ఆయుష్ శాఖతో సహా అన్ని ఆరోగ్య సేవలు పనిచేస్తాయి.
 • ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే సంస్థల కార్యకలాపాలు కొనసాగుతాయి. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), బీమా, క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలు, కో-ఆపరేటివ్ సొసైటీలతో సహా అన్నీ పనిచేస్తాయి.
 • విద్యుత్, నీరు, పారిశుధ్యం, ఫోన్, ఇంటర్నెట్ వంటి సేవలన్నీ పనిచేస్తాయి. ఇవే కాకుండా, కొరియర్, పోస్టల్ సేవలు కూడా కొనసాగుతాయి.

ఆరెంజ్ జోన్లలో

 • జిల్లా, అంతర్ జిల్లా బస్సులకు అనుమతి లేదు.
 • ట్యాక్సీలు, క్యాబులలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి మించి ప్రయాణించకూడదు.
 • అనుమతించిన పనులకోసం మాత్రం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఫోర్ వీలర్ వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది.

గ్రీన్ జోన్లలో

దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించిన కార్యకలాపాలు మినహా, గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలూ నడుస్తాయి.

ఈ ప్రాంతాల్లో బస్సులు నడుస్తాయి. కానీ, వాటిలో 50 శాతం మంది ప్రయాణికులు మాత్రమే ఉండేలా చూడాలి.

సరుకు రవాణా రైళ్లు తిరుగుతాయి. సరకు రవాణా చేసే వాహనాలకు, రైళ్లకు ఎక్కడా ఆటంకాలు ఉండవు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)