కరోనావైరస్: కశ్మీర్‌లోని అతి పెద్ద హాట్‌స్పాట్ బండిపోరాలో ఒక్క వెంటిలేటరూ లేదు
- అమీర్ పీర్జాదా
- బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌లో కోవిడ్-19 కేసులు అత్యధిక సంఖ్యలో బండిపోరా జిల్లాలో ఉన్నాయి. కానీ జిల్లాలో నాలుగు లక్షల మంది జనాభాకు ఈ వ్యాధి ముదిరితే ప్రాణాలను కాపాడగల వెంటిలేటర్ ఒక్కటి కూడా లేదు.
ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో కేసుల సంఖ్య 127కు పెరగటంతో ఇది ఇక్కడ అతిపెద్ద హాట్‌స్పాట్‌గా మారింది. జిల్లాలోని హజీన్ తహసీల్ పరిధిలో గల గుండ్ జహంగీర్ అనే చిన్న గ్రామంలోనే అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 6వ తేదీన ఈ గ్రామానికి చెందిన 52 ఏళ్ల వృద్ధుడు శ్రీనగర్‌లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చనిపోయినపుడు తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధరణ అయింది. ఆ వ్యక్తి పండ్ల వ్యాపారి. ఆయన కరోనావైరస్ సోకిన ప్రాంతంలో ప్రయాణించిన చరిత్ర కాని, ఎవరైనా పాజిటివ్ కేసుతో కాంటాక్టు అయిన చరిత్ర కానీ లేదు.
‘‘ఆయన వేరే అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోవిడ్-19 సోకే అవకాశం ఉందని మేం పరిగణించిన వ్యక్తుల్లో ఆయన లేరు. ఆయన ఆస్పత్రిలో చేరిన రోజు రాత్రే చనిపోయారు’’ అని బండిపోరా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తాజముల్ హుసేన్ ఖాన్ తెలిపారు. ఆయనకు కోవిడ్-19 సోకినట్లు ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నిర్ధరణ అయిందన్నారు.
చనిపోవటానికి ముందు ఆయన ఉత్తర కశ్మీర్లో తిరిగారు. తన గ్రామానికి చెందిన చాలా మంది ప్రజలను కలిశారు. అప్పటి నుంచి గుండ్ జహంగీర్ గ్రామంలో వైరస్ ఆందోళనకరమైన వేగంతో విస్తరించింది.
అధికారులు ఆయన కాంటాక్టులను వెతికి పట్టుకుని, ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆయన గ్రామంలో చాలా మందిని క్వారంటైన్లో ఉంచారు.
‘‘గుండ్ జహంగీర్‌లో అత్యధిక పాజిటివ్ కేసులు చనిపోయిన ఆ 52 ఏళ్ల వ్యక్తి కాంటాక్టులేనని చెప్పొచ్చు’’ అని డాక్టర్ ఖాన్ బీబీసీతో పేర్కొన్నారు.
ఈ ప్రాంతాన్ని ఇప్పుడు భద్రతా బలగాలు దిగ్బంధించాయి. నిర్మానుష్యంగా మారిన గ్రామంలో వీధులు, ఇళ్లను పారిశుధ్య కార్మికులు ప్రక్షాళన చేస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్నీ రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఈ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి తీవ్రతను నిర్ధరించటానికి గరిష్ట సంఖ్యలో శాంపిల్స్ సేకరిస్తున్నామని జిల్లా నోడల్ అధికారి మెహ్రాజ్ వాని చెప్పారు.
‘‘మా గ్రామంలో సుమారు 3,700 మంది ఉన్నారు. కానీ రోజుకు కేవలం 60 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే ఊర్లో అందరికీ పరీక్షలు పూర్తి చేయటానికి ఎంత కాలం పడుతుందో ఊహించండి. పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయాలని మేం కోరుతున్నాం. లేదంటే వ్యాధి వచ్చిందేమోనని ఆందోళనతో కుంగిపోతున్నాం’’ అని స్థానికుడు మెహ్రాజ్ దిన్ పేర్కొన్నారు.
బండిపోరా జిల్లాలో ఇప్పటివరకూ సుమారు 1,877 మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
‘‘పరీక్షలు చేయటానికి శాంపిల్స్‌ను శ్రీనగర్ స్కిమ్స్ ఆస్పత్రికి పంపించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 100 నుంచి 200 శాంపిల్స్ పంపిస్తున్నాం’’ అని డాక్టర్ ఖాన్ తెలిపారు.
ఇప్పటికైతే జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయటానికి కేవలం 4 కేంద్రాలే ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకూ 19,746 పరీక్షలు నిర్వహించారు.
మొత్తం నాలుగు లక్షల జనాభా ఉన్న బండిపోరా జిల్లాలోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల కృత్రిమ శ్వాస యంత్రం (వెంటిలేటర్) ఒక్కటి కూడా లేదు.
కనీస వైద్య రక్షణ పరికరాలు కూడా లేకపోవటంతో కరోనావైరస్ కేసులను శ్రీనగర్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు పంపిస్తున్నారు.
‘‘ఇప్పటివరకూ అయితే ఇక్కడ వెంటిలేటర్ అవసరం రాలేదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉత్పన్నమైతే సంక్షోభంలో చిక్కుకుంటాం’’ అని తన వివరాలు వెల్లడించవద్దంటూ బండిపోరా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు ఒకరు చెప్పారు.
‘‘వైద్య అత్యవసర పరిస్థితి ఎప్పుడు ఎదురైనా మేం శ్రీనగర్‌కు పంపిస్తాం. కానీ శ్రీనగర్‌లోని ఆస్పత్రులు నిండిపోతే మా పేషెంట్ల పరిస్థితి ఏమిటో ఊహించండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జిల్లాలో వెంటిలేటర్లు అందుబాటులో లేవని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఖాన్ అంగీకరించారు. అయితే, పేషెంట్లను శ్రీనగర్‌కు తరలించటానికి వెంటిలేటర్ సదుపాయం గల క్రిటికల్ కేర్ అంబులెన్సు సిద్ధంగా ఉందని చెప్పారు.
‘‘వెంటిలేటర్లను కొనుగోలు చేశాం. రెండు రోజుల్లో అవి ఇక్కడికి రావచ్చు’’ అని కూడా తెలిపారు.
కానీ వెంటిలేటర్లు వచ్చినా వాటిని అమర్చటానికి స్థలం కానీ, నిర్వహించటానికి సిబ్బంది కానీ లేరని, కాబట్టి ఉపయోగం లేదని డాక్టర్లు అంటున్నారు.
అయితే, సిబ్బందిని వారం, రెండు వారాల పాటు స్వల్పకాలిక శిక్షణకు పంపించి సిద్ధం చేయగలమని డాక్టర్ ఖాన్ పేర్కొన్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కశ్మీర్లో 70 లక్షల మందికి పైగా జనాభా ఉంటే, కేవలం 100 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. అందులో చాలా వరకూ ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.
బండిపోరా అధికార యంత్రాంగం కరోనా లెవల్-2 ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇందులో లక్షణాలేవీ లేని రోగులకు, స్వల్ప లక్షణాలు గల రోగులకు చికిత్స చేయగలరు. విషమ పరిస్థితిలో ఉన్న వారిని 60 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు పంపించాల్సి ఉంటుంది.
మొత్తం జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రిలో 25 బెడ్లు ఉన్నాయి. దీనితో పాటు మూడు కమ్యూనిటీ హెల్త్ సెంట్లరు, ఆరు ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్లలో కలిపి మొత్తం 200 బెడ్ల సామర్థ్యం మాత్రమే ఉంది.
జిల్లాలో మొత్తంగా సుమారు 90 మంది డాక్టర్లే ఉన్నారు. అంటే దాదాపు 4,500 మంది జనాభాకు ఒకరు చొప్పున ఉన్నట్లు. ప్రతి 1,000 మందికి ఒక వైద్యుడు చొప్పున ఉండటం అవసరమనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిష్పత్తి కన్నా ఇది చాలా ఎక్కువ.
జిల్లాలో ఇప్పటివరకూ 33 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 437 మంది ఇంకా క్వారంటైన్‌లోనే ఉండగా, 12,761 మందిని నిశిత పరిశీలనలో ఉంచారు.
జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. అందులో 8 మంది చనిపోయారు.
పరిశీలన జాబితాలో ఇంకా 70,000 మంది ఉన్నారు. మరో 50,000 మంది మీద 28 రోజుల పరిశీలన ముగిసింది.
జమ్మూకశ్మీర్‌లోని పాజిటివ్ కేసుల్లో 80 శాతం పైగా లక్షణాలు లేని వారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ మీడియాతో చెప్పారు.
మరోవైపు, ప్రభుత్వ యంత్రాంగం 1.30 కోట్ల మందికి ఆరోగ్య సర్వే చేపట్టింది. రాష్ట్రమంతటా ప్రభుత్వ సిబ్బందితో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని, ప్రయాణ చరిత్రను సర్వే చేస్తున్నాయి.
మొత్తంగా 45,000 మంది క్షేత్ర స్థాయి అధికారులు, కోవిడ్ క్లినిక్‌లకు చెందిన 3,000 మంది డాక్టర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం చెప్తోంది.
ఒక్క శ్రీనగర్‌లోనే గత మూడు రోజుల్లో 1,50,000 మందికి పైగా ప్రజలను సర్వే చేవారు.
కానీ పాజిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం లక్షణాలు లేని వారే అంటున్నపుడు ఈ సర్వేతో ఫలితం ఉంటుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)