కరోనావైరస్: కోవిడ్-19 భారత్‌లోని న్యూస్ రూమ్స్‌ను ఎలా ధ్వంసం చేస్తోంది?
- సౌతిక్ బిశ్వాస్
- ఇండియా కరస్పాండెంట్

ఫొటో సోర్స్, AFP
టీవీ జర్నలిస్టులు, కెమేరాపర్సన్స్ ఎక్కువగా కోవిడ్ ప్రభావానికి గురయ్యారు.
ముంబయి నగరంలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. గతవారం ముంబయిలో ఓ న్యూస్ నెట్‌వర్క్‌కు చెందిన కెమెరా ఆపరేటర్ తన స్నేహితులతో కలిసి కరోనా టెస్టు చేయించుకోడానికి వెళ్లాడు. కొన్నిరోజుల తర్వాత కరోనా టెస్టు ఫలితాల్లో అతనికి పాటిజివ్ అని తేలింది. కానీ అతనిలో అప్పటి వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. ''ఇది మాకు షాక్ కలిగించే విషయం. పని కోసం అతను ఈ మధ్య బైటికి కూడా వెళ్లలేదు'' అన్నారు జై మహారాష్ట్ర ఎడిటర్ ప్రసాద్ కాతే.
ఆ తర్వాత అదే మరాఠీ ఛానల్లో పని చేస్తున్న 15మందికి కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. వారిలో చాలామంది రిపోర్టర్లు, కెమెరామెన్లు ఉన్నారు. మూడు వారాల కిందటే ఆ ఛానల్ తమ జర్నలిస్టులను ఫీల్డులోకి వెళ్లకుండా నిలిపేసింది. వారిలో చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలో జర్నలిస్టులకు కోవిడ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ అంటువ్యాధి కారణంగా అంధేరిలోని ఎనిమిదంతస్తుల బిల్డింగ్‌లో, 12,000 చదరపు అడుగుల స్థలంలో పని చేస్తున్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన రెండు న్యూస్ రూమ్‌లను మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడక్కడ ఒక ఎలక్ట్రీషియన్, ఒక టెక్నీషియన్ మాత్రమే ఉన్నారు.
జర్నలిస్టుల నుంచి టెక్నీషియన్లు, డ్రైవర్ల వరకు మొత్తం 120మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఒక్కొక్కటిగా ఫలితాలు వచ్చాయి. వ్యాధిబారిన పడిన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.''వైరస్ ప్రభావం కారణంగా న్యూస్ ఛానళ్లను నడపటం కష్టంగా మారింది'' అని ఎడిటర్ కాతే అన్నారు. ''ఛానల్ నడపటానికి మళ్లీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది'' అన్నారాయన.
గత మూడు వారాలుగా ఓ డైరెక్ట్ టు హోం నెట్వర్క్ ఒక్కో బులిటెన్ 28 నిమిషాల నిడివితో 6 బులిటెన్లు నడిపిస్తోంది. గతంలో ఇలాంటివి 18 బులిటెన్లు వచ్చేవి. ఇప్పుడు మిగిలిన సమయంలో రికార్డెడ్ బులిటెన్లు, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు.
ఇలా కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నది ఈ ఒక్కటే ఛానలే కాదు. దేశంలో 42,000కు పైగా కేసులు నమోదు కాగా, అందులో జర్నలిస్టులే 100మంది ఉన్నారంటే అది చిన్నవిషయమేమీ కాదు.
కొందరు యాంకర్లు తమ ఇరుకైన ఇళ్లలోనే, కెమెరాలు ఏర్పాటు చేసుకుని, వెనక తమ ఛానల్ బ్రాండ్‌నేమ్ పెట్టుకుని న్యూస్ బులిటెన్లు చదివేస్తున్నారు. వాటిని తమ ఇంటి నుంచి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారానో, 4జి నెట్వర్క్ ద్వారానో తమ ఆఫీసులకు లింక్ చేస్తున్నారు.
''దీనివల్ల పిక్చర్ క్వాలిటీ దెబ్బతింటోంది. ఒక్కోసారి యాంకర్స్ న్యూస్ చదువుతుండగా కరెంటు పోతోంది. ఒక్కోసారి ఇంటర్నెట్ కట్ అవుతుంది. ఒక్క బులిటెన్ కూడా మిస్ కాకుండా ఇలా నడపడం చాలా కష్టం. అయినా నడిపిస్తున్నాం'' అన్నారు కాతే.ఇండియాలో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తోంది. వ్యాపారాలు ఆగిపోయాయి. ట్రాన్స్‌పోర్టు లేదు.ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. కరోనావైరస్ కరోనా కారణంగా గతంలో కనీవిని ఎరుగని లాక్డౌన్ పరిస్థితులను అనుభవిస్తున్నారు ప్రజలు. కానీ, చాలామంది జర్నలిస్టులు, ముఖ్యంగా పెద్దనెట్ వర్క్‌లలో పని చేసేవారు చాలామంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు.
చెన్నై నగరంలో దాదాపు 35మంది జర్నలిస్టులకు ఈ వ్యాధి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కోల్‌కతాకు చెందిన ఓ స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ ఇటీవల మరణించారు. అతని మరణానికి కోవిడ్-19 కారణమని డాక్టర్లు అనుమానిస్తున్నారు. లూథియానా కేంద్రంగా పనిచేసే పంజాబ్ కేసరి మీడియా గ్రూప్‌లో 19మంది ఉద్యోగులు ఈ వ్యాధిబారిన పడ్డట్టు తెలింది. దీంతో గత నెల మొదట్లోనే ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేయాలని సంస్థ ఆదేశించింది.
ఫొటో సోర్స్, Getty Images
కాకపోతే, ఎక్కువ కేసులు ముంబయి నుంచి రిపోర్ట్ అయ్యాయి. 11,000 కేసులతో ముంబయి నగరం కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉంది. భారత ఆర్ధిక, వినోద రాజధానిగా పేరున్న ఈ నగరంలో ఇప్పటి వరకు 340మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు.
167మంది జర్నలిస్టులకు టెస్టులు జరపగా, వారిలో 53మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 36మంది చికిత్స తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. మిగిలిన వారు ఇంకా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చాలామంది జర్నలిస్టులు ఇళ్లలో, హోటళ్లలో క్వారంటైన్ అయ్యారు. ఇంకా 170మంది దాకా జర్నలిస్టులు టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇన్ఫెక్షన్కు గురైన చాలామంది టీవీ జర్నలిస్టులు, కెమెరామెన్లలో చాలామందిలో ఆశ్చర్యకరంగా కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదు. కానీ ఇండియాలో వ్యాధిబారినపడిన వారిలో చాలామందిలో ముందుగా లక్షణాలు బైటపడ్డాయని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ అంటోంది.
ఫొటో సోర్స్, Abhijit Addy
రోనీ రాయ్ ఏప్రిల్ 24న చనిపోయారు. కోవిడ్ వ్యాధితోనే ఆయన ఆకస్మికంగా మరణించారని అనుమానిస్తున్నారు.
జర్నలిస్టులు ఎక్కువమంది ఎందుకు వైరస్‌బారిన పడుతున్నారు?
''దీనికి చాలా కారణాలున్నాయి. లాక్డౌన్ సంబంధించిన వార్తల కోసం జర్నలిస్టుల మీద సంస్థల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరికొందరు ఉత్సాహపరులైన జర్నలిస్టులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే ఫీల్డులోకి వెళ్లడంతో ఈ సమస్యలు తలెత్తాయి. చాలామంది జర్నలిస్టులు హాట్స్పాట్లకు వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకువస్తున్నారు, విజువల్స్ సేకరిస్తున్నారు '' అన్నారు ముంబయి టీవీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ జగ్దలే.
చాలామంది జర్నలిస్టులు కంపెనీ ఇచ్చిన వాహనాలను వాడుతున్నారు. ఇతర ఉద్యోగుల కోసం ఈ ట్యాక్సీలను షేర్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులే కాదు, వారిని వివిధ ప్రాంతాలకు తిప్పిన ముగ్గురు డ్రైవర్లకు కూడా కరోనావైరస్ సోకింది.
ఎక్కువమంది జర్నలిస్టులను ఇంటి నుంచి పని చేయమనడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ''జర్నలిస్టుల్లో ఒక భయం ఏర్పడింది. చాలామందిని బైటికి రావద్దని చెప్పారు. వాళ్ల బాసులు కూడా విజువల్స్, స్టోరీల కోసం ఒత్తిడి చేయడం తగ్గించారు'' అన్నారు జగ్దలే.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
ఆరేళ్ల కిందట బీబీసీ న్యూస్ సైట్ కోసం పనిచేసిన కోల్‌కతాకు చెందిన రోనీ రాయ్‌కు మొన్నటి వరకు అలాంటి భయం ఉండేది కాదు. ఆయన మార్చిలో రాజ్‌కోట్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను కవర్ చేశారు. ముఖానికి మాస్కు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
కానీ, అతను ఇంటికి వచ్చిన కొన్నివారాల తర్వాత కొద్దిపాటి జ్వరం వచ్చింది. పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడంతో అతను గతవారం చనిపోయారు. ఏప్రిల్ 24 ఉదయం అతను శ్వాస తీసుకోడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ''శ్వాస తీసుకోలేక పోతున్నాను. త్వరగా అంబులెన్స్ తీసుకుని రా. లేకపోతే నేను చచ్చిపోతా'' అని తన సహచర ఫోటోగ్రాఫర్‌కు ఫోన్ చేసి చెప్పారు రాయ్.
ఫోన్ చేసిన మూడుగంటల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రికి చేరిన గంట తర్వాత అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ''అతనికి టెస్టులు నిర్వహించే టైమ్ కూడా ఆసుపత్రి వారికి దొరకలేదు'' అని వాపోయారు కుటుంబ సభ్యులు. రాయ్ మరణానికి కోవిడ్-19 కారణమై ఉండొచ్చని అనుమానించిన ఆరోగ్యశాఖ అధికారులు, అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరుకాకుండా అడ్డుకున్నారు.
ఫొటో సోర్స్, Prashant Tyagi
ప్రయాణించే సందర్భాల్లో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పిన జర్నలిస్ట్ బర్ఖా దత్
కోవిడ్-19ను కవర్ చేసే జర్నలిస్టుల రక్షణ కోసం అనేక నిబంధనలు, సూచనలు ఉన్నాయి. వారు వాటిని పాటించడం చాలాముఖ్యం. ఈ మహమ్మారి మీద, లాక్డౌన్ విపరిణామాల మీద అనేకవార్తలు కవర్ చేసిన జర్నలిస్టు బర్ఖాదత్, తాను ప్రతిసారి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు.
ఢిల్లీ కేంద్రంగా రిపోర్టింగ్ చేసే బర్ఖాదత్, నెలరోజుల్లో ఐదు రాష్ట్రాలను కవర్ చేస్తూ సుమారు 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈనెల రోజులపాటు తన కెమెరామెన్‌ను, డ్రైవర్‌ను, ఇతర టెక్నికల్ సిబ్బందిని మార్చలేదు బర్ఖాదత్. ''ముందు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి'' అని అన్నారు బర్ఖాదత్.
''మా ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లవ్స్ ఎప్పుడూ ధరించి ఉండేవాళ్లం. మరీ దగ్గరగా ఉండకుండా, మా మైకులను కర్రకు కట్టి దూరం పాటిస్టూ ఇంటర్వ్యూలు తీసుకోవడం మేమెప్పుడూ మర్చిపోలేదు'' అన్నారు దత్.
షూటింగ్ ముగిసిన ప్రతిసారి మా చేతులకున్న గ్లవ్స్, మాస్కులు తొలగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఎక్విప్మెంట్ను ఎప్పటికప్పుడు యాంటీసెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేయడం విధిగా చేసింది ఆమె బృందం. కోవిడ్-19 హాట్‌స్పాట్ సిటీ ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిని సందర్శించిన తర్వాత వారు మరింత జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆ ఆసుపత్రి నుంచి బయలుదేరాక ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా నేరుగా వారు ఇంటికే వచ్చేలా జాగ్రత్తలు పాటించారు. ''ఎనిమిదిగంటలు ఏకధాటిగా ప్రయాణించి నాలుగైదుగంటలు షూటింగ్ చేసి, మళ్లీ ఎనిమిదిగంటలపాటు ప్రయాణించి ఇంటికి చేరుకోవడం మామూలు విషయం కాదు'' అని ఆమె అన్నారు.
ఒక్కపక్క మహమ్మారి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నా... కరోనా కవరేజ్ అన్నది అత్యంత కష్టమైన , సాహసోపేతమైన జర్నలిజం అని చెప్పక తప్పదు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)