విశాఖ గ్యాస్ లీకేజీ: భోపాల్ నుంచి ఎల్‌జీ పాలిమర్ వరకు... ప్రాణాలు తీస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
విశాఖ గ్యాస్ లీకేజి

విశాఖ నగరంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టిరీన్ గ్యాస్ విడుదలై పదుల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లోనూ ఇటీవల కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు కార్మికులను బలిగొంటున్నాయి.

ఒక్కోసారి సాధారణ ప్రజలూ ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి పరిశ్రమలకు కేంద్రమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏటా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

విశాఖ జిల్లా పరవాడ, దువ్వాడ, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి.. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ఇండస్ట్రియల్ ఏరియాల్లోని వివిధ కర్మాగారాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలు అక్కడి కార్మికులనే కాకుండా చుట్టుపక్కల నివసించే ప్రజలనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి.

తాజాగా విశాఖ నగరంలోని రసాయన వాయువు లీకవ్వడం వందలాది మందిని ప్రమాదంలోకి నెట్టింది.

ఉత్తరాంధ్రలో..

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖ ప్రాంతం, ఔషధ, రసాయన పరిశ్రమలున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తరచూ పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శ్యాంసుందర్ పాణిగ్రాహి అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాలను ఆయన గుర్తు చేశారు.

తాజా ఘటనలోనూ ఎల్‌జీ పాలిమర్స్ నుంచి వెలువడిన స్టిరీన్ భారమైన వాయువు కావడం, రాత్రిపూట కావడంతో గాలిలో తేమ ఉండడం వల్ల అది వేగంగా వ్యాపించలేదని.. లేదంటే భోపాల్ తరహాలో భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విశాఖ స్టీల్ ప్లాంట్

2016లో విశాఖ పరిధిలోని దువ్వాడ ఎస్‌ఈజడ్‌లో జరిగిన ప్రమాదంలో నాలుగు రోజుల పాటు ఆ ప్రాంత ప్రజలు ఆందోళనతోనే గడిపారు. బయోమాక్స్ ఫ్యూయల్ రసాయన పరిశ్రమలో చెలరేగిన మంటలను అదుపు చేయలేకపోవడం, రసాయన వాయువులను అదుపుచేయలేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు కొద్దిరోజుల పాటు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.

అదే ఏడాది భీమిలిలోని దివీస్ లేబొరేటరీస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

సైనార్ లైఫ్‌సైన్సెస్, గ్లోకెమ్ ఇండస్ట్రీస్, రాంకీ వంటి అనేక కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.

విశాఖ ఉక్కు పరిశ్రమలోనూ గత దశాబ్ద కాలంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి.

2012లో బాయిలర్ పేలిన ఘటనలో 18 మంది మరణించారు.2014లో వైజాగ్‌ స్టీల్‌లో ప్రమాదాలు జరిగి ఇంజినీర్లు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

2019లోనూ షార్ట్‌సర్క్యూట్లు, బాయిలర్లు పేలడం వంటి వరుస ప్రమాదాలు జరిగి భారీ ఆస్తినష్టమేర్పడింది.

వారం రోజుల కిందట 2020 మే 1న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సలసల కాగుతున్న 120 టన్నుల ఉక్కు పొంగి బయటకు వచ్చేసింది.

2012లో శ్రీకాకుళం జిల్లా అరిణాం అక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌లో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

దేశంలో అత్యంత విషాదకర పారిశ్రామిక ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

1) భోపాల్ విషవాయు దుర్ఘటన - 1984

ప్రపంచంలోనే అత్యంత విషాద పారిశ్రామిక ప్రమాదంగా దీన్ని చెబుతారు.

1984 డిసెంబరు 2 అర్ధరాత్రి దాటాక ఈ దుర్ఘటన జరిగింది. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసీ) వాయువు లీవకవడంతో 5 లక్షల మందికి పైగా దీని ప్రభావానికి గురయ్యారు.

ఈ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ 2,259 మంది మరణించారని దుర్ఘటన జరిగిన వెంటనే అధికారికంగా ప్రకటించినప్పటికీ 1991లో అనేక అధ్యయనాల తరువాత ఆ సంఖ్యను 3,928కి పెంచారు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,787 మంది చనిపోయినట్లు ప్రకటించింది.

2006లో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ ప్రకారం ఈ దుర్ఘటన వల్ల 5,58,125 మంది గాయపడ్డారు.

వీరిలో 38,478 మంది పాక్షికంగా గాయపడగా 3,900 మంది శాశ్వత వైకల్యానికి గురయ్యారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్విరానమెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియా సంయుక్త అధ్యయనం ప్రకారం భోపాల్ విషవాయు దుర్ఘటన బాధితుల్లో 2 లక్షల మంది 15 ఏళ్ల లోపువారు కాగా.. 3,000 మంది గర్భిణులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జార్ఘండ్‌లోని ధన్‌బాద్ బొగ్గు గని

2) చస్నాలా గని ప్రమాదం - 1975

ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉన్న ధన్‌బాద్‌లో బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 372 మంది చనిపోయారు.

భారతదేశ చరిత్రలో జరిగిన భారీ పారిశ్రామిక ప్రమాదాలలో దీన్ని కూడా చెబుతారు.

1975 డిసెంబరు 27 సాయంత్రం మీథేన్ గ్యాస్‌కు మంటలు అంటుకుని పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది.

పేలుడు జరిగింది బొగ్గు గనిలో కావడంతో మంటలు భారీగా వ్యాపించి ప్రాణనష్టం పెరిగింది.

అంతేకాదు.. ఈ ప్రమాదం వల్ల గని కూలిపోయి పక్కనే ఉన్న రిజర్వాయర్ నుంచి నిమిషానికి 70 లక్షల గ్యాలన్న పరిమాణంలో నీరు నిండడంతో పేలుడు ప్రాంతానికి దూరంగా ఉన్న కార్మికులూ చనిపోయారు.

1976 జనవరి 19 వరకు గనిలో గాలించినా ఒక్కరు కూడా ప్రాణాలతో కనిపించలేదు.. మృతుల్లోనూ ఎందరివో శవాలు దొరకలేదు.

372 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్థానిక కార్మిక సంఘాలు 700 మందికిపైగా చనిపోయారని చెబుతాయి.

ఈ ఘటన నేపథ్యంలో బాలీవుడ్‌లో కాలాపత్తర్ అనే సినిమా తీశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముంబయి నౌకాశ్రయంలో 1944లో జరిగిన భారీ ప్రమాదంలో చనిపోయిన 71 మంది ఫైర్‌మెన్‌లకు నివాళి సమర్పిస్తున్న దృశ్యం.

3) బాంబే రేవులో పేలుడు - 1944

1944 ఏప్రిల్ 14న ముంబయి(అప్పట్లో బొంబాయి) రేవులోని విక్టోరియా డాక్‌లో పత్తి బేళ్లు, బంగారం, మందుగుండు, 1400 టన్నుల పేలు పదార్థాలతో ఉన్న ఓడలో మంటలు చెలరేగి రెండు భారీ పేలుళ్లు సంభవించాయి.

మంటలకు భారీ నిప్పు కణికలు ఎగసిపడి రెండు కిలోమీటర్ల దూరం వరకు జనావాసాలు కూడా తగలబడిపోయాయి.

ఈ ప్రమాదంలో 800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నవాదనలూ ఉన్నాయి.

231 మంది నౌకాశ్రయ సిబ్బంది, 66 మంది అగ్నిమాపక సిబ్బంది, 500 మంది సాధారణ ప్రజలు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2500 మంది గాయపడ్డారు.13 ఓడలు నాశనమయ్యయి. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది.

ఈ పేలుడు కారణంగా ఓడ శకలాలు 12 కిలోమీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి.

పేలుడు తీవ్రతకు బొంబాయికి 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జైపూర్ క్రూడ్ ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం (2009)

4) జైపూర్ చమురు డిపో అగ్ని ప్రమాదం - 2009

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌ శివారులోని సీతాపూర్ పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) డిపోలో 8 వేల కిలోలీటర్ల సామర్థ్యం(2,80,000 ఘనపుటడుగులు) గల చమురు ట్యాంకర్ పేలిపోవడంతో 12 మంది మరణించారు.

200 మందికిపైగా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.5 లక్షల మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.

వారం రోజుల వరకు మంటలు అదుపులోకి రాలేదు. ట్యాంకర్ నుంచి పైప్‌లైన్లోకి పెట్రోలు విడిచిపెడుతుండగా పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు నిర్ధరించారు.ఈ పేలుడు వల్ల రిక్టర్ స్టేల్‌పై 2.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.

3 కిలోమీటర్ల దూరం వరకు ఇళ్ల కిటికీలు విరిగిపోయాయి.120 అడుగుల ఎత్తు వరకు మంటలు వ్యాపించడంతో 30 కిలోమీటర్ల దూరంలోని ప్రజలు కూడా ఈ మంటలను చూశారు.

జాతీయ రహదారి పక్కనే ఈ ప్లాంట్ ఉండడంతో 20 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజలను ఖాళీ చేయించడానికి సైన్యాన్ని దించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోర్బాలో చిమ్నీ కుప్పకూలిన ప్రమాదంలో 45 మంది చనిపోయారు

5) కోర్బాలో కూలిన చిమ్నీ - 2009

చత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో 2009 సెప్టెంబరు 23న భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(బాల్కో)లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోవడంతో 45 మందికిపైగా చనిపోయారు.

790 అడుగుల ఎత్తు వరకు నిర్మించిన చిమ్నీ కూలిపోయినప్పటికీ అక్కడ 100 మందికిపైగా ఉన్నారు.

ఆ సమయంలో మెరుపులతో వర్షం, భారీ గాలి దుమారం రావడంతో దాన్నుంచి తప్పించుకోవడానికి వీరంతా చిమ్నీ పక్కకు చేరగా అది కూలిపోవడంతో దాని కింద నలిగిపోయారు.

వేదాంత రిసోర్సెస్ నిర్వహణలోని బాల్కోలో 902 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం చేపట్టగా మధ్యలోనే అది కూలిపోయి కార్మికుల ప్రాణాలు తీసింది.డిజైన్‌లో లోపాలు, నిర్మాణ సామగ్రి నాణ్యమైనది కాకపోవడం వల్లే ఈ టవర్ కూలిపోయిందని రాయ్‌పూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం తేల్చింది.

ఏటా ఎక్కడో ఒక చోట

ఇవి కాకుండా అనేక ఇతర ప్రమాదాల్లోనూ పెద్ద సంఖ్యలో ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించాయి.

* 2017 నవంబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహర్‌లో ఉన్న ఎన్టీపీసీలో బాయిలర్ పేలి 38 మంది మరణించారు.

* 2012లో తమిళనాడులోని శివకాశిలో బాణసంచా కర్మాగారంలో పేలుడు వల్ల 40 మంది చనిపోయారు.

* 2006లో పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని లెదర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 30 మంది మరణించారు.

* 1965 మే‌లో ధన్‌బాద్ సమీపంలోని బొగ్గు గనిలో పేలుడు వల్ల 268 మంది చనిపోయారు.

* 1954లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని గనిలో జరిగిన ప్రమాదంలో 63 మంది మరణించారు.

* మాయాపురి రేడియోధార్మిక ప్రమాదం - 2010దిల్లీలోని మాయాపురిలో 2010 ఏప్రిల్‌లో రేడియో ధార్మిక ప్రమాదం జరిగింది. దిల్లీ యూనివర్సిటీకి చెందిన ఏఈసీఎల్ గామా సెల్ 220 రీసెర్చ్ ఇరేడియేటర్‌ను నిరుపయోగంగా ఉందన్న కారణంతో 2010 ఫిబ్రవరిలో వేలం పాట ద్వారా మాయాపురికి చెందిన ఒక స్క్రాప్ వర్తకుడికి విక్రయించారు. ఆ పరికరం స్వభావం తెలియని అక్కడి కార్మికులు దాన్ని విడదీయగా అందులోని కోబాల్డ్-60 సోర్స్‌ను ముక్కలుగా చేశారు. రేడియోధార్మికత వల్ల పెద్ద సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. ఒకరు చనిపోయారు. అయితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ వెంటనే రంగంలోకి దిగి ఆ భాగాలన్నిటినీ స్వాధీనం చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

(ఆధారం: మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఏపీఐఐసీ, ఎన్ఐటీ రాయ్‌పూర్, ఎన్విరానమెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియా, ఎన్‌టీపీసీ, బీబీసీ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)