విశాఖపట్నం గ్యాస్ లీకేజీ: స్టైరీన్ అంటే ఏమిటి?

ఎల్జీ పాలిమర్స్

విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరీన్ అనే ర‌సాయన వాయువు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. 12 మంది చ‌నిపోయారు.

ఈ స్టైరీన్ అత్యంత ప్రమాదకరమైన ర‌సాయ‌నం. సాధారణంగా ఇది ద్రవరూపంలో ఉంటుంది. కానీ, ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా లీక్ కావడానికి ముందు వాయు రూపంలోకి మారిపోయింది.

ఇది నీటిలో తక్కువగా కరుగుతుంది. దీని అణు నిర్మాణం .. C6H5CHCH2. ఇదో పాలిమర్. దీన్ని స్టైరిల్ అని, వినైల్ బెంజీన్ అని కూడ పిలుస్తారు. బెంజీన్, ఎథిలీన్ వంటి పాలిమర్ల మిశ్రమాల రసాయన చర్యతో ఇది ఉత్పత్తి అవుతుంది. ద్రవరూపంలో ఉండే దీనికి రంగు, వాసన ఉండవు. కానీ చాలా వేగంగా ఇది గాల్లో కలసిపోతుంది.

అంటే, ఈ వాయువు గాల్లో కలిస్తే మనకు తెలియకుండానే దాన్ని పీల్చేస్తాం. అది మన శరీర వ్యవస్థ మీద ప్రభావం చూపే వరకూ మనకు ఆ సంగతి కూడా తెలియదు. ముఖ్యంగా గాఢంగా ఉన్న ఈ వాయువును పీల్చినప్పుడు, ముక్కు, గొంతు భాగాలు ముందుగా దీని ప్రభావానికి గురవుతాయి. ఆపై ఇది నేరుగా మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. తీవ్రంగా ఈ వాయువు పీల్చితే...విపరీంగా కళ్లు తిరగడం, తలనొప్పి, తుమ్ములు, దగ్గు, వాంతులవ్వడం, శరీరంలో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించడం, కళ్లు తిరగడం, నిలబడలేకపోవడం, అయోమయ స్థితిలోను కావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ మీద ఊపిరితిత్తుల మీద ప్రాణాంతకంగా పనిచేయగలదు.

ఎలా నిల్వ చేస్తారు?

సాధారణంగా ఈ స్టైరీన్ ను ద్రవరూపంలో రిఫ్రిజరేషన్ స్థితిలో చల్లటి వాతావరణంలో ఉంచుతారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది గాల్లో కలసిపోతుంది. ఈ స్టైరీన్ ను దీర్ఘకాలం నిల్వ చేస్తే కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. ఇది మండే స్వభావం కల ద్రవం. ఇది గాలిలో తేలికగా ఆవిరైపోయి, వేగంగా వ్యాపిస్తుంది. పాలీ స్టైరీన్ అన్నది వివిధ రకాల కోపాలిమర్ల రసాయన సమ్మేళనాలకు మూలం. దీనిని ప్లాస్టిక్, డిస్పోజబుల్ కంటైనర్లు, సింథటిక్ రబ్బర్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు.

నిజానికి దాల్చిన చెక్క, కాఫీ బీన్స్, వేరుశెనగ గింజల్లో ఇది అత్యంత తక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. మోటారు వాహనాల పొగ, పొగాకు సంబంధిత పొగ నుంచి కూడా ఇది కొద్ది పాటి స్థాయిలో విడుదల అవుతుంది. సహస సిద్ధంగా ఉండే స్టైరీన్ కన్నా.... పాలిమర్లతో రసాయన ప్రక్రియల వల్ల తయారయ్యే స్టైరీన్ అత్యంత ప్రమాదకరమైనది. దీన్ని పీలిస్తే... వెంటనే నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

ఎంత ప్రమాదకరం?

గ్లోబల్లీ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ లేబిలింగ్ ఆఫ్ కెమికల్స్ నిర్ధరించిన రసాయన పరిమాణాల ప్రకారం స్టైరీన్ ప్రమాదకరమైన వాయువు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే రసాయనాల వాటిని వర్గీకరించి, వాటి వల్ల కలిగే దుష్ఫరిణామాలను కోడ్ రూపంలో వెల్లడిస్తుంది. సాంకేతికంగా స్టెరీన్ కు ఉన్న లక్షణాలు, అవి శరీరంపై చూపించే ప్రభావాలు ఇవీ.

H372 : ఎక్కువగా పీలిస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం

H226 : మండే స్వభావం కల వాయువు, వేగంగా ఆవిరైపోతుంది.

H315 : చర్మంపై పడితే దురద, దద్దుర్లు వస్తాయి

H319 : కంటిలో పడితే తీవ్రంగా మంట పుడుతుంది.

H332 : శ్వాసద్వారా పీల్చితే తీవ్రమైన ప్రభావం

H316d : గర్భిణులు పీల్చినప్పుడు కడుపులో బిడ్డకు ప్రమాదం

కెమికల్ వెపన్‌గానూ స్టైరీన్

ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన ఈ గ్యాస్... అత్యంత ప్రమాదకరమైన వాయువు అని సైంటిస్ట్ ఎంవీ ఆంజనేయులు బీబీసీకి తెలిపారు. ఇది జీవుల నాడీ వ్యవస్థపై చాలా వేగంగా, విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. దీనిని కొన్ని కెమికల్ వెపన్స్‌లో కూడా ఉపయోగిస్తారని ఆయన అన్నారు.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ప్రమాదకర రసాయనాలపై ఇచ్చిన నివేదికలో స్టైరీన్ కూడా ఒకటి. దీని ప్రకారం చూస్తే.. స్టైరీన్ అన్నది చాలా ప్రమాదకరమైన పాలిమర్. ప్లాస్టిక్, రబ్బరు వంటి వాటిల్లో మిశ్రమంగా ఉన్నప్పుడు దీని ప్రభావం మనుషులపై చాలా తక్కువగా ఉంటుంది. కానీ నేరుగా ద్రవరూపం నుంచి గాల్లో కలసినప్పుడు, దాన్ని పీల్చడం వల్ల మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావం కలుగుతుంది. ఈ వాయువుని గాఢంగా పీల్చినప్పుడు గుండెకొట్టుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. శ్వాస ఇబ్బందులు తీవ్రమైతే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలియచేసింది. ఈ ఆరోగ్య దుష్ప్రభావాలను స్టైరీన్ సిక్‌నెస్ అంటారు. ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ మన శరీరం మీద పడినప్పుడు చర్మం దాన్ని పీల్చుకుంటుంది. ఆపై ఆ వాయువు పీల్చితే ఇది నేరుగా మన కేంద్రీయ నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు... ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ చేసిన పరిశోధనల్లో ఈ వాయువు ప్రభావానికి దీర్ఘకాలం గురైతే... మనుషులు, జంతువులు క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం స్వల్పంగా ఉన్నట్లు గుర్తించింది. అంతే కాదు... గర్భిణులు ఈ వాయువును పీలిస్తే.. అది కడుపులో బిడ్డ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిర్థరించింది. ఈ వాయువు పెద్దల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. పిల్లలపైనా అదే ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)