కరోనావైరస్ లాక్‌డౌన్: జైలు నుంచి విడుదలైనా ఇంటికి వెళ్ళలేకపోతున్న ఖైదీ కథ

  • సౌతిక్ బిశ్వాస్
  • ఇండియా కరస్పాండెంట్
ఉత్తరప్రదేశ్ జైలు నుంచి విడుదలైన ఖైదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉత్తరప్రదేశ్ జైలు నుంచి విడుదలైన ఖైదీ

ఆరిఫ్(పేరు మార్చాం) మార్చి 31న జైలు నుంచి విడుదలయ్యాడు. కరోనావైరస్ పుణ్యమా అని జైలు నుంచి విడుదల చేయడంతో ఇంటికి వెళ్లేందుకు ఆరాటపడ్డాడు.

కానీ, పదిహేను రోజులైనా ఇంటికి చేరుకోలేకపోయాడు. ఇంటికెళ్లే దారిలో రెండు నగరాల్లో మూడు సార్లు పోలీసులు అతడిని అడ్డుకున్నారు. చివరికి యాచకులను ఉంచే ఒక షెల్టర్ హోంలో అతడికి ఆశ్రయం దొరికింది.

కానీ, అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరేందుకు మళ్లీ విఫలయత్నాలు చేశాడు. ఇప్పుడతను ఒక స్నేహితుడి ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు.

ముప్ఫయి రెండేళ్ల ఆ బక్క పల్చని ఆరిఫ్ జీవనోపాధి కోసం ట్యాక్సీ నడిపేవాడు. మొబైల్ ఫోన్ దొంగిలించాడన్న అభియోగంతో ఆయన ఆరు నెలలుగా మహారాష్ట్రలోని తలోజా జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు.

బెయిలు తీసుకోవడానికి అతనికి అవకాశం ఉన్నా అందుకు కావాల్సిన రూ. 15 వేలు లేకపోవడంతో కొద్దినెలలుగా జైలులోనే ఉన్నాడు. వ్యక్తిగత పూచీకత్తు, పెరోల్ పొడిగింపులతో జైలు నుంచి విడుదలైన 22 వేల మందిలో ఆరిఫ్ కూడా ఒకడు.

భారత్‌లో కిక్కిరిసిపోయిన జైళ్లలో కోవిడ్-19 వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా కొందరు ఖైదీలను విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను కోరిన నేపథ్యంలో ఆరిఫ్ వంటివారిని విడిచిపెట్టారు.

ఏడేళ్లు, అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను.. విచారణ ఖైదీలను విడిచిపెట్టొచ్చని కోర్టు చెప్పింది. భారత్‌లో 1,339 జైళ్లలో 4,50,000 మంది ఖైదీలున్నారు.అయితే, ఆరిఫ్‌ను జైలు నుంచి విడిచిపెట్టిన రోజున ఆయన్ను తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు.

ఆరిఫ్ స్వస్థలం మహాడ్. తలోజా జైలు నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన తండ్రి చనిపోయారు. మద్యానికి బానిసయ్యాడంటూ ఏడాది కిందట భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది.

అంగవికలుడైన సోదరుడు ఉన్నాడు. వయసై పోయిన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఊళ్లోనే ఒక చిన్న అద్దెగదిలో ఉంటూ ఇరుగుపొరుగువారిపై ఆధారపడి బతుకీడుస్తోంది.

అందుకే ఆరిఫ్ జైలు నుంచి విడుదలయ్యేటప్పటికి ఎవరూ అతడి కోసం రాలేదు.. దాంతో జేబులో చిల్లిగవ్వ లేని ఆరిఫ్ ఇంటికి చేరుకునేందుకు నడక ప్రారంభించాడు. హైవేపై వెళ్లే అత్యవసర వాహనాలను లిఫ్టు అడిగి మరుసటి రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు.

కానీ... అక్కడ ఇరుగుపొరుగు వారు అతడిని రానివ్వలేదు. ముంబయి నుంచి వచ్చాడన్న కారణంతో ఆయన్ను అక్కడ ఉండేందుకు అంగీకరించలేదు. ముంబయిలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారతదేశంలోని 1,400 పైచిలుకు జైళ్ళలో దాదాపు 4.5 లక్షల మంది ఖైదీలుగా ఉన్నారు.

ఇక చేసేదేంలేక ఆరిఫ్ తన తల్లి దగ్గర 400 రూపాయలు, ఒక మొబైల్ ఫోన్ తీసుకుని వెనుదిరిగాడు.ఒక వ్యాను డ్రైవర్‌కు 200 రూపాయలిచ్చి మళ్లీ ముంబయి చేరుకున్నాడు.

అక్కడ తన తోటి ఖైదీ ఇంట్లో ఆశ్రయం పొందాడు.కానీ, అక్కడా అతడికి ఇబ్బందులు తప్పలేదు.

ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఆయన్ను ఉండనివ్వలేదు.దీంతో.. ఆరిఫ్ మళ్లీ రోడ్డున పడ్డాడు.

మనోహర్ ఫనేస్కర్ అనే ఒక సామాజిక కార్యకర్తకు ఆరిఫ్ తల్లి ఫోన్ చేసి తన కొడుకును ఏదో ఒక ఒడ్డుకు చేర్చాలని కోరింది. మనోహర్ జైలు ఖైదీల సంక్షేమం కోసం పనిచేస్తుంటారు.

ఏప్రిల్‌లో ముంబయి వీధుల్లో ఆరిఫ్‌ను వెతికిపట్టుకున్నారు మనోహర్. అక్కడి నుంచి ముంబయి శివారుల్లో యాచకుల కోసం ఉన్న ఒక షెల్టర్ హోంలో ఆయనకు ఆశ్రయం కల్పించారు.

మూడు వారాల పాటు అక్కడున్న ఆరిఫ్ ఏప్రిల్ 30న పారిపోయి ఇంటికి ప్రయాణమయ్యాడు.

‘‘నేను ఇంటికి వెళ్తాను. అందరూ ఎవరిళ్లకు వారు వెళ్తున్నారు. మా అమ్మ రమ్మంటోంది. నాకు డబ్బులిస్తే ఇంటికెళ్తాను’’ అని పారిపోవడానికి ముందు ఒక సామాజిక కార్యకర్తతో చెప్పాడు ఆరిఫ్.

అయితే, ఆరిఫ్ ఇంటికైతే చేరుకున్నాడు కానీ ఈసారీ ఇరుగుపొరుగువారు అతడిని రానివ్వలేదు.దాంతో అక్కడే ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

అక్కడ పూటుగా తాగేసి ఒక రిక్షా తీసుకుని తన తల్లిని చూడ్డానికి మళ్లీ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరడానికి ముందే రిక్షా యజమానితో అతడికి గొడవ జరిగింది. ఆరిఫ్ ఆ రిక్షాను ధ్వంసం చేశాడు.

దాంతో రిక్షా యజమానికి రూ. 4 వేలు ఇవ్వడానికి ఇప్పుడా కుటుంబం డబ్బు కోసం చూస్తోంది.ఆరిఫ్ మళ్లీ తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడని, అక్కడ తాగుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

విడుదలైన ఖైదీలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు

ఖైదీలను లాక్‌డౌన్ సమయంలో విడిచిపెట్టడం వల్ల వారిలో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆరిఫ్‌ను విడుదల చేసిన రోజునే ఆ జైలు నుంచి ఒక మహిళా ఖైదీనీ విడిచిపెట్టారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె ఎవరో తెలియకపోయినా మరో ఖైదీ ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు.

మహారాష్ట్రలోని లాతూరులో సామాజిక కార్యకర్తలు 24 మంది ఖైదీలను ఇంటికి చేరుకునేందుకు వాహనాలు సమకూర్చారు. మరోవైపు జైళ్లలోని మిగతా ఖైదీలు కూడా తమను విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మార్చిలో కోల్‌కతాలోని ఒక జైలులో జరిగిన అల్లర్లలో 28 మంది గాయపడ్డారు.. ఒక ఖైదీ మరణించాడు.

‘‘లాక్‌డౌన్ కారణంగా కుటుంబ సభ్యులు వారిని చూడ్డానికి రాలేకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడంతో ఖైదీలు ఉద్వేగానికి లోనయి ఆందోళన చేస్తున్నార’’ని కామన్వెల్త్ మానవ హక్కుల కార్యక్రమంలో పనిచేసే మధురిమ ధనుకా అన్నారు.

ఖైదీల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని విడిచిపెట్టాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ఫీల్డ్ ప్రాజెక్ట్ ప్రయాస్‌ వంటివి ఖైదీలు, వారి కుటుంబాలకు రేషన్, నగదు అందిస్తూ సాయం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముంబయి ఆర్ధర్ రోడ్డులోని జైలులో 70 మందికి పైగా ఖైదీలకు కరోనోవైరస్ సోకింది

కోవిడ్-19 కాలంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు ఖైదీలను విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఒకవైపు సూచించగా మరోవైపు లాక్‌డౌన్ ఉల్లంఘన, ఇతర కారణాలతో పోలీసులు అనేకమందిని జైళ్లలో పెడుతున్నారు.

‘‘ఖైదీలను విడిచిపెట్టడం ద్వారా 5 నుంచి 10 శాతం మాత్రమే జైళ్లలో రద్దీ తగ్గించారనుకుంటాను. మన జైళ్లు ఇంకా కిక్కిరిసే ఉన్నాయి. భారీ విపత్తు సంభవించబోతోంది జైళ్లలో’’ అన్నారు ప్రయాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ రాఘవన్.

విజయ్ రాఘవన్ చెబుతున్న ఉత్పాతం ఇప్పటికే మొదలైనట్లుగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా జైళ్లు కోవిడ్-19 వ్యాప్తి కేంద్రాలవుతున్నాయి.

ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైళ్లో 2600 మంది ఖైదీల్లో 77 మందికి ఇప్పటికే కరోనావైరస్ సోకింది. అక్కడ 26 మంది జైలు అధికారులూ ఈ వైరస్ బారినపడ్డారు.మహారాష్ట్రలోనే సతారా జిల్లాలో మరో జైలులోనూ ఖైదీ ఒకరు కరోనావైరస్ బారినపడ్డారు.

వైరస్ బారినపడిన ఖైదీలను ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జైలు సీనియర్ అధికారి దీపక్ పాండే చెప్పారు.ఇదిలా ఉండే ఆరిఫ్ జైలు నుంచి విడుదలై నెలన్నర అయినా ఇంకా తన ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)