కరోనావైరస్: గర్భంతో ఉన్న విద్యార్థి సఫూరా జర్గర్‌ను ఎందుకు జైల్లో పెట్టారు?

సఫూరా జర్గర్
సరిగ్గా మధ్యాహ్నం 2.30కు ఆగ్నేయ దిల్లీలోని సఫూరా జర్గర్ ఇంటికి పోలీసులు వచ్చారు. నిద్రపోతున్న ఆమెను లేపి, తమతో రావాలని అడిగారు.
జామియా మిలియా యూనివర్సిటీలో సోషియాలజీ విద్యార్థిని అయిన 27ఏళ్ల సఫూరాకు 19 నెలల కిందట పెళ్ళయింది. వారం రోజుల క్రితమే గర్భం దాల్చినట్లు ఆమెకు తెలిసింది.
"తనకు వాంతులు అవుతున్నాయి. చాలా నీరసంగా కూడా ఉంది"అని ఆమె భర్త బీబీసీకి తెలిపారు.
దిల్లీ పోలీసుల్లోని ఉగ్రవాద నిరోధక విభాగమైన స్పెషల్ సెల్ నుంచి తాము వచ్చామని, సెంట్రల్ దిల్లీలోని తమ కార్యాలయానికి తమతో రావాలని ఆమెకు చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఆమె పాత్రపై కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నామని చెప్పారు. ముస్లింలపై వివక్ష చూపేలా ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. దిల్లీలో అయితే మత ఘర్షణలూ చోటుచేసుకున్నాయి.
పోలీస్ స్టేషన్లో కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఏప్రిల్ 10, శుక్రవారం, రాత్రి 10.30కు సఫూరాను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ఒకవైపు లాక్డౌన్ అమలవుతుండగా, నెల రోజుల నుంచీ ఆమెను కిక్కిరిసిన తీహార్ జైల్లో ఉంచారు. గర్భిణులకు కోవిడ్-19 సోకే ముప్పు ఎక్కువని ప్రభుత్వం విడుదల చేసిన అడ్వయిజరీ చెబుతోంది.
బెయిల్ దొరకడం దాదాపు అసాధ్యమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద సఫూరాపై అభియోగాలు మోపారు.అరెస్టు అయిన తర్వాత, కేవలం రెండుసార్లు ఐదేసి నిమిషాలపాటు ఫోన్ చేసేందుకు ఆమెకు అనుమతించారు. దీంతో ఆమె ఒకసారి భర్తకు, మరోసారి లాయర్‌కు ఫోన్‌చేశారు. అయితే కోవిడ్-19 ఆంక్షల నడుమ వీరిద్దరూ ఆమెను కలిసేందుకు అనుమతించలేదు.
ఫొటో సోర్స్, Getty Images
ఈశాన్య దిల్లీలో సీఏఏ ఘర్షణల్లో ధ్వంసమైన ప్రాంతం
మార్చి 25న లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ అరెస్టు అవుతున్న ముస్లిం విద్యార్థులు, సామాజిక కార్యకర్తల్లో సఫూరా కూడా ఒకరు. కరోనావైరస్ లాక్‌డౌన్‌ను అసమ్మతి గళాన్ని నొక్కేసేందుకు వాడుకుంటున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు కూడా వస్తున్నాయి.
జామియా కో-ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) సభ్యురాలైన సఫూరా.. ఈశాన్య దిల్లీలో శాంతియుత నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించడంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆమె చాలా ధైర్యవంతురాలని, నిజాయితీగా ఉంటారని, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేవారని ఆమె సోదరి సమీయా చెప్పారు.
అయితే, దిల్లీ ఘర్షణల ప్రధాన కుట్రదారుల్లో సఫూరా కూడా ఒకరని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణల్లో 53 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు.
ఫొటో సోర్స్, Reuters
మహమ్మద్ జుబేర్‌ను దారుణంగా కొడుతున్న ఈ చిత్రం దిల్లీ ఘర్షణలకు ప్రతీకగా నిలిచింది.
సఫూరాపై ఆరోపణలను ఆమె కుటుంబం ఖండిస్తోంది. "ఆమేమీ నేరస్థురాలు కాదు. ఓ విద్యార్థిగా, సామాజిక కార్యకర్తగా తన నిరసన తెలిపే హక్కులను ఆమె ఉపయోగించుకున్నారు" అని ఆమె సోదరి చెప్పారు. "ఓ విద్యార్థిగా, తోటి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె ఎప్పుడూ వెళ్తుంటార"ని అన్నారు.
అయితే, తాము నిజాయితీగా, ఎలాంటి పక్షపాతం లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని పోలీసులు చెప్పారు. ఫొరెన్సిక్ ఆధారాల పరిశీలన, విశ్లేషణ తర్వాతే అరెస్టులు చేశామని వివరించారు.
అయితే, కావాలనే పోలీసులు ఘర్షణలతో విద్యార్థులకు ముడిపెడుతూ అరెస్టులు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
"ఇవి దురుద్దేశపూరిత వేధింపుల్లా అనిపిస్తున్నాయి" అని బీబీసీతో లాయర్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వివరించారు.
"ప్రభుత్వం అసమ్మతిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. విద్యార్థులను, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నిరసనలూ లేకుండా చూడాలని వారు అనుకుంటున్నారు"
"ఈ హింసలు ముస్లింలు బాధితులవుతున్నారు. వారు వేధింపులను ఎదుర్కొంటున్నారు"
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వెలుపల 2020 జనవరిలో విద్యార్థులు నిరసన
ఫిబ్రవరి 23 నుచి రెండు రోజులపాటు హిందూ నినాదాలు చేస్తూ కర్రలు, రాళ్లతో కొన్ని హిందూ మూకలు.. ముస్లిం నివాస ప్రాంతాలపై దాడులు చేస్తూ కనిపించాయి.
కొందరు ముస్లింలపై మూక దాడులు జరిగాయి. వారి వ్యాపారాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. మసీదులను పడగొట్టారు. దీంతో వేల మంది ముస్లింలు తాత్కాలిక శిబిరాలకు తరలివెళ్లారు. వీటిలో తమ తప్పేమీ లేదని పోలీసులు చెబుతున్నా.. కొన్నిసార్లు చూసీచూడటనట్లు వ్యవహరించారని, మరికొన్నిసార్లు ఘర్షణలకు తెగబడేవారివైపు నిలిచారని చెప్పే ఆధారాలు బయటపడ్డాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులూ నిరసనలకు ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియోల్లో కనిపించారు.
ముగ్గురు బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉంది.
ముస్లింలకు వ్యతిరేకంగా కావాలనే ఈ ఘర్షణలను రెచ్చగొట్టారని చాలా మంది పత్రికల్లో వ్యాఖ్యానాలూ రాశారు.
అయితే, బీజేపీ నాయకులు, మూకలపై చర్యలు తీసుకోవడానికి బదులు ముస్లిం విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు. కోవిడ్-19 ఆంక్షలతో కోర్టులు అంతంత మాత్రంగా పనిచేస్తున్న సమయంలో యూఏపీఏ కింద అరెస్టు చేయడం, దేశద్రోహం అభియోగాలు మోపడం లాంటి చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు.
ఫిబ్రవరి ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 800 మందిని అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో అరెస్టులు లాక్డౌన్ సమయంలోనే జరిగాయి. మోదీ ప్రభుత్వం కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు.
సఫూరాతోపాటు జామియా కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు మీరన్ హైదర్, జామీయా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు షీఫా ఉర్ రెహ్మాన్, ఎంబీఏ విద్యార్తి గుల్ఫిషా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రాత్ జహాన్లనూ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు.
ఘర్షణలకు కుట్ర పన్నారని, విద్వేష వ్యాఖ్యలతో మూకను రెచ్చ గొట్టారని ఆరోపిస్తూ యూఏపీఏ కింద వీరిని అరెస్టు చేశారు.
"ఇది అధికార దుర్వినియోగం, అక్రమం" అని ఈ అరెస్టులను మానవ హక్కుల సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఖండించారు.
ఫొటో సోర్స్, Reuters
సీఏఏ ఘర్షణల సమయంలో మంటల్లో చిక్కుకుని దెబ్బతిన్న మసీదు
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేపట్టినవారిని అక్రమంగా అరెస్టు చేయడం, భయపెట్టడం, వేధింపులకు గురిచేయడం లాంటివి ఇప్పటికైనా ఆపాలని వందల సంఖ్యలో మహిళా ఉద్యమకారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
"శాంతియుతంగా నిరసనలు చేపట్టినవారిపై తప్పుడు కేసులు బనాయించడం ఆపాలి. వారిపై మోపిన అవాస్తవ అభియోగాలను కొట్టివేసి విడుదల చేయాలి"
నాలుగు నెలల గర్భవతి అయిన సఫూరా.. ప్రస్తుతం విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ప్రభుత్వ అణచివేతకు ముఖచిత్రంగా మారారు.
"అసమ్మతి, వాక్ స్వేచ్ఛ లాంటి హక్కులపై కేంద్ర ప్రభుత్వం చాలా అసహనంతో ఉంది" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
"కరోనావైరస్ వ్యాపిస్తున్న సమయంలో గర్భంతో ఉన్న సఫూరాను అరెస్టుచేసి కిక్కిరిసిన జైలుకు పంపడం దారుణం. దేశంలో అణచివేతను ఈ ఘటన కళ్లకు కడుతోంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు ప్రభుత్వానికి మద్దతుపలికే కొందరు.. అరెస్టవుతున్న సామాజిక కార్యకర్తలపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
గతవారం వందల మంది అతివాదులు, సఫూరాను ట్విటర్లో ట్రోల్ చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు ఆమెకింకా పెళ్లికాలేదని వ్యాఖ్యలు చేశారు. ఆమె గర్భం దాల్చడంపైనా ప్రశ్నలు సంధించారు.
వి సపోర్ట్ నరేంద్ర మోదీ పేరుతో నిర్వహిస్తున్న ఓ ఫేస్బుక్ పేజీ.. ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసిన పోర్న్ ఇమేజ్ను షేర్ చేసింది. "ఈ గ్రూప్ అసత్య ప్రచారాలు చేసే గ్రూప్. మోదీ, బీజేపీపై ఈ గ్రూప్ ప్రశంసలు కురిపిస్తుంటుంది. విపక్షాలను విమర్శిస్తుంటుంది"అని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ తెలిపింది.
మరోవైపు ఘర్షణల్లో అమాయకుల మరణాలకు సఫూరా కారణమని కొన్ని అతివాద సంస్థలకు చెందిన, ప్రభుత్వం వైపు పనిచేసే మీడియా సంస్థలు ఆరోపించాయి.
అయితే, కోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే ఆమె దోషో కాదో తెలుస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. విచారణ ప్రక్రియలు పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియలే ఒక శిక్ష అని చెప్పొచ్చు.
సఫూరాపై చేస్తున్న ట్రోలింగ్, దూషణలు.. ఆమె కుటుంబానికి తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. గతవారంతో సఫూరాతో మాట్లాడిన ఆమె భర్త.. ఈ ట్రోలింగ్, దూషణల గురించి ఆమెకు చెప్పలేదు.
"నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను. అయితే సగం చెప్పేసరికే సమయం అయిపోయింది" అని ఆయన వివరించారు.
ఐదు నిమిషాల ఫోన్ కాల్లో ఆమె ఆరోగ్యం, తీసుకుంటున్న ఆహారం, జైలులో పరిస్థితులు, లాక్డౌన్ నడుమ తనకు అవసరానికి ఏమైనా డబ్బులు ఇవ్వడం గురించి మాట్లాడుకున్నామని చెప్పారు.
"తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువుల గురించి ఆమె అడిగింది. తన గురించి బాధపడుతున్నారేమోనని తెలుసుకోవాలని అనుకుంది. మన కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పాను" అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అస్సాం: "రక్తమిచ్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్నే చంపేశారు".. ఎందుకు?
- 'గోల్డెన్పాస్పోర్టుల' కోసంసంపన్నులంతాఎందుకుఎగబడుతున్నారు?
- మగవాళ్ళకుగర్భనిరోధకమందునుకనిపెట్టినబారత్
- విమానంలోప్రయాణికురాలినితేలుకుట్టింది
- ఏపీలోఎర్రచందనంస్మగ్లర్లనుంచితెలంగాణలోరేప్నిందితులవరకు.. ఎన్కౌంటర్లలోనిజమెంత
- పౌరసత్వంఅమ్ముతున్నారు... కొనుక్కుంటారా? ఒక్కోదేశానికిఒక్కోరేటు
- పదిరోజులు... 3,000 కిలోమీటర్లప్రయాణం: యెమెన్నుంచితప్పించుకునిసముద్రమార్గంలోభారత్కు
- బిల్లా, రంగాఎవరు.. వాళ్లనుఉరితీయాలనిదేశమంతాఎందుకుకోరుకుంది...
- బ్రిటన్ఎన్నికల్లోకశ్మీర్అంశంప్రభావంచూపుతుందా?
- 'అతడినీడపడినచోటమృత్యువుకాటేస్తుంది'.. బాలీవుడ్సినిమాపైపొరుగుదేశంలోఆగ్రహం
- మిస్‌యూనివర్స్ 2019 జోజిబినితుంజీ: ఫైనల్రౌండ్ప్రశ్న, సమాధానంఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)