రానా దగ్గుబాటికి త్వరలో పెళ్ళి... ప్రేయసి ఎవరు, ఏం చేస్తారు? - ప్రెస్ రివ్యూ

రానా, మిహిక

ఫొటో సోర్స్, Rana Daggubati/Facebook

ఫొటో క్యాప్షన్,

రానా, మిహిక

సినీ నటుడు రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నారని ‘ఈనాడు’ కథనం తెలిపింది. ఆమె ఓకే చెప్పిందంటూ రానా ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో కూడా వెల్లడించారు.

‘రానా హైదరాబాద్‌కు చెందిన మిహికా బజాజ్‌తో ప్రేమలో ఉన్నారు. ఎట్టకేలకు తన ప్రేమ ఫలించిందని, ఆమె అంగీకరించిందని రానా మంగళవారం ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు.

రానా ప్రేయసి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

* ముంబయిలోని రచనా సంసాద్‌లో మిహిక ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో డిప్లమా పూర్తి చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్‌ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేశారు.

* మిహిక ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు. ఆమెకు భారతీయ వాస్తుశిల్ప కళంటే ఇష్టమట. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిసింది.

* ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను బట్టి మిహికలో రచయిత్రి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆమె Pixie Dust పేరుతో బ్లాగ్‌ నడుపుతున్నారు.

* మహీక తల్లి బంటీ బజాజ్‌ జ్యువెలరీ డిజైనర్‌. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

* మిహికకు సోదరుడు సమర్థ్‌ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్‌ను చూసుకుంటుంటారట’’ అని ఆ కథనంలో వివరాలు అందించారు.

ఫొటో సోర్స్, facebook/YSJaganMohanReddy

ఫొటో క్యాప్షన్,

జగన్

మా నీరు మేం వాడుకుంటే తెలంగాణకు ఎందుక అభ్యంతరం?: జగన్

‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కేటాయించిన మేరకే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాలి. కృష్ణా బోర్డు కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా వాడుకునే అవకాశం లేదు. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మన హక్కుగా తీసుకెళ్లడానికి మన భూ భాగంలో మనం కట్టుకుంటున్న ప్రాజెక్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి.. తాగు, సాగు నీటి అవసరాల కోసం కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన అంశాలు:

  • ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత ప్రాంతం రాయలసీమకు నీళ్లు తరలించడానికి ఒక సదుపాయం ఏర్పాటు చేసుకుంటుంటే పరిమితులు విధించాలని తెలంగాణ సర్కారు అనడం ఎంతవరకు సమంజసమని ఆక్షేపించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీళ్లను మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
  • 854 అడుగుల్లో 7 వేల క్యూసెక్కులు కూడా కష్టం
  • పుష్కర కాలం తర్వాత ఎన్నడూ లేని రీతిలో శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది 1782 టీఎంసీల వరద వచ్చిందని.. కేవలం స్పిల్‌ వే గేట్ల ద్వారానే 888 టీఎంసీలను దిగువకు విడుదల చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేసినట్లు సమాచారం.
  • నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని.. కృష్ణా డెల్టాకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేస్తూనే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 800 టీఎంసీలకుపైగా వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశామని వివరించారని తెలిసింది.
  • సముద్రంలో కలుస్తున్న వరద జలాలను.. అదీ మన రాష్ట్రానికి కేటాయించిన మేరకు నీటిని కరవు పీడిత ప్రాంతాలకు తరలించడానికి ఒక ప్రాజెక్టు చేపడితే తప్పుపట్టడం సమంజసం కాదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నట్లు తెలిసింది.
  • శ్రీశైలంలో ఒకవైపు 800 అడుగులు, ఇతర తక్కువ నీటి మట్టాల స్థాయి నుంచి నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం?
  • కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారమే ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించి.. కృష్ణా బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా దీన్ని రాజకీయం చేసే ఆలోచన చేయడం సమంజసం కాదు’’ అన్నారని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/kcr

ఫొటో క్యాప్షన్,

కేసీఆర్

చెప్పింది పండిస్తేనే రైతు బంధు: కేసీఆర్

ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, మార్కెట్‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరని కేసీఆర్ అన్నారు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దని, డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు.రైతులకు లాభం చేయాలనే లక్ష్యంతో నియంత్రిత పద్థతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిలో ఈ వర్షాకాలంలోనే వరి సాగు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటుపై కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ సారి తమ ప్రభుత్వం మొత్తం పంటను కొంటోందని కేసీఆర్‌ చెప్పారు. గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడమని కేసీఆర్‌ అన్నారు.

డిమాండ్‌ ఉన్న పంటలు పండించాలని, అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలని స్పష్టం చేశారు. ఈ వర్షాకాలంలో వరి పంటతో నియంత్రిత పద్థతిలో సాగు ప్రారంభం కావాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో సన్నరకాలు, దొడ్డు రకాలు ఉండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకం పండించాలని నిర్దేశించనున్నారు.

50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సహిస్తారు.

ఏ ప్రాంతంలో ఎవరు ఏ రకం, ఎంత విస్తీర్ణంలో పండించాలో త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా విత్తన నియంత్రణ అధికార సంస్థ ఏర్పాటు చేయాలని, అవసరమైతే విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రేతలను గుర్తించి, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించార’’ని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Namaste Telangana

ఫొటో క్యాప్షన్,

ఖైరతాబాద్‌లో గత ఏడాది ప్రతిష్ఠించిన 61 అడుగుల వినాయకుడు

ఖైరతాబాద్‌లో ఈసారి బుజ్జి గణేశుడు

ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 11 అడుగుల ఎత్తులోనే దర్శనమివ్వనుందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది మాత్రం 61 అడుగులతో శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతి రూపంతో విగ్రహాన్ని తయారుచేశారు. ప్రస్తుతం 11 అడుగులతో ఏర్పాటుచేయనున్నారు.

దీన్ని గణేశ్‌ మండపం పక్కనున్న గణపతి దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు. విగ్రహం తయారీకి ప్రతి ఏడాది తొలి ఏకాదశి రోజు (ఈ నెల 18న) నిర్వహించే కర్రపూజ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, కన్వీనర్‌ సందీప్‌రాజ్‌, ఉపాధ్యక్షుడు ఎం మహేశ్‌యాదవ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సింగరి సుదర్శన్‌ మంగళవారం వెల్లడించార’’ని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)