హైకోర్టుకు చేరిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వివాదం ఏమిటి? ఎందుకు?
- వి. శంకర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ రావు తీరు రాజకీయ వివాదంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు ఆస్కారం ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా వైద్యుడిగా పనిచేస్తూ సస్ఫెండ్ అయిన డాక్టర్ సుధాకర్ తాజాగా విశాఖ ఉదంతంతో మళ్లీ తెరమీదకు వచ్చారు. ప్రస్తుతం ఆయనకి విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.
తాను కోలుకున్నానని, తనకు మళ్లీ విధుల్లో చేరేందుకు అవకాశం ఇవ్వాలని సుధాకర్ చెబుతుండగా, జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు పూనుకుంటున్నారు. రెండు వారాలు అబ్జర్వేషన్ లోనే ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు.
విశాఖలో రోడ్డు మీద ఘటనపై భిన్నాభిప్రాయాలు
విశాఖపట్నంలోని పోర్ట్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు మీద అర్థనగ్నంగా ఉన్న డాక్టర్ సుధాకర్ నోటికి వచ్చినట్టు కొందరిపై దురుసుగా ప్రవర్తించడం, అదే సమయంలో పోలీసులు కూడా ఆయన్ని నియంత్రించే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వీడియోల రూపంలో ఉంది.
అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా డాక్టర్ సుధాకర్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
కానీ గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గానూ ప్రభుత్వ వైద్యుడిని వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుధాకర్ కి మద్ధతుగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్పీ మీనా వాదన ప్రకారం డాక్టర్ సుధాకర్ అదుపు తప్పి వ్యవహరించడం వల్ల చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. తాజా ఘటన గురించి ఆయన బీబీసీకి వివరించారు.
"మొదట ఆయన డాక్టర్ సుధాకర్ అని పోలీసులకు తెలియదు. మీడియా వచ్చిన తర్వాత మాత్రమే సస్ఫెండ్ అయిన డాక్టర్ అని గుర్తించారు. అప్పటికే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నేషనల్ హైవేపై ఓ వ్యక్తి మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని డయల్ 100కి ఫోన్ కాల్ రావడంతో 4వ పట్టణ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు".
అప్పటికే తన కారులోంచి దిగి అసభ్యంగా మాట్లాడుతూ, తను షర్ట్ కూడా తీసి విసిరేసి రోడ్డు మీద అందర్ని తిడుతూ ఉన్నారు. పోలీసులు అతన్ని అపే ప్రయత్నం చేశారు. ఎంతసేపు ప్రయత్నం చేసినా ఆగలేదు. దాదాపు 45 నిమిషాల పాటు గందరగోళం సృష్టించారు. చివరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
స్థానికులే సుధాకర్‌ని తాళ్లతో కట్టేశారు. ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి, లాఠీ ఉపయోగించడంతో అతనిపై చర్యలు తీసుకున్నాం. సస్ఫెండ్ చేశాము. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లినా మద్యం మత్తులో అడ్డూ అదుపులేకుండా వ్యవహరించడంతో చివరకు కేజీహెచ్ కి తీసుకెళ్ళి పరీక్షలు చేయించాం. అక్కడి డాక్టర్లు చెప్పడంతోనే మెంటల్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది’’ అని పోలీసు కమిషనర్ వివరించారు.
ఫొటో సోర్స్, UGC
వేధిస్తున్నారంటున్న డాక్టర్ సుధాకర్
అప్పు తీర్చడానికి వెళుతున్న తనను అడ్డుకుని తీవ్రంగా వేధించారని డాక్టర్ సుధాకర్ అంటున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు.
"నేను రూ.10లక్షలు తీసుకుని బ్యాంకుకి వెళుతున్నాను. అప్పు తీర్చడం కోసం డబ్బులు సమకూర్చుకుని వెళుతుంటే మర్రిపాలెం దగ్గర నన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత పోర్ట్ ఆసుపత్రి వద్దకు వచ్చిన తర్వాత కారు ఆపేసి చాలా దౌర్జన్యం చేశారు. నా కారులో వైన్ బాటిళ్లు పెట్టారు. నా సెల్ ఫోన్, డబ్బు కూడా లాగేసుకున్నారు. లారీ కిందకి తోసేయాలని కూడా చూశారు. గట్టిగా కొట్టారు కూడా. నన్ను చాలాకాలంగా ఫోన్లలో వేధిస్తున్నారు. 5 రూపాయాల మాస్క్ కోసం సస్ఫెండ్ అవుతావురా అంటూ పదే పదే ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు నన్ను అడ్డుకుని దాడి చేశారు’’ అని తెలిపారు.
ఆ తర్వాత మరో వీడియో కూడా విడుదల చేశారు.
"అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికి జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఇంకా ఐదేళ్ల సర్వీసు ఉంది. నా సర్వీసు నాకు ఇస్తే, నేను పనిచేసుకుంటాను. ప్లీజ్’’ అంటూ ఆయన విన్నవించారు.
మెంటల్ ఆస్పత్రి వైద్యులు ఏమంటున్నారు?
ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ కి ప్రాధమికంగా సమస్య ఉన్నట్టు గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. మరో రెండు వారాల పాటు ఆయన్ని పరిశీలనలో ఉంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు.
"డాక్టర్ సుధాకర్‌కి ఎక్యూట్ అండ్ ట్రాన్సియంట్ సైకోసిస్ సమస్య ఉందని ప్రాధమికంగా గుర్తించాము. అయితే అది పూర్తిగా నిర్ధరణ అయ్యేందుకు రెండు వారాల సమయం పట్టవచ్చు. అప్పటి వరకూ అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంది. ఈ విషయం పోలీసులకు తెలియజేశాం. ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు. చికిత్స సాగుతోంది’’ అని ఆమె తెలిపారు.
‘నాకొడుకుని మళ్లీ మాకు అప్పగించండి’
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వేధింపుల కారణంగానే తన కొడుకు పరిస్థితి ఇలా తయారయ్యిందని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ బాబు అంటున్నారు.
"ఎంతో మంచి డాక్టర్‌గా పేరు సంపాదించారు. ఎందరో జీవితాలను కాపాడే వృత్తిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇలా కావడానికి కారణం వేధింపులే. అందరూ ఫోన్లు చేసి మీ అబ్బాయికి ఇలా అయ్యిందట కదా అని అడుగుతుంటే చాలా బాధగా ఉంది. ఇంకా ఎంతో సర్వీసు ఉంది. మంచి మనిషిని మానసికంగా వేధించి ఒత్తిడికి గురిచేశారు. నాకు 74 ఏళ్లు. వాడి కోసం కుటుంబంలో అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంతకముందు నన్ను చూడడానికి వచ్చేవాడు. ఈ మధ్య అది కూడా లేదు. అయినా వాడిని మళ్లీ మామూలు మనిషిగా మాకు అప్పగించాలి" అని సుధాకర్ తల్లి విజ్ఞప్తి చేస్తున్నారు . డాక్టర్ గా సర్వీసు చేయడానికి అవకాశం ఇవ్వాలి అంటూ కోరుతున్నారు.
ఫొటో సోర్స్, UGC
ఏప్రిల్‌లో మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపైన, స్థానిక ఎమ్మెల్యేపైన ఆరోపణలు చేశారు
వివాదం ఎలా మొదలైంది?
ఆరోపణలు, క్షమాపణలు చెప్పిన సుధాకర్ విశాఖలో నడిరోడ్డు మీద అర్థనగ్నంగా కనిపించిన వీడియో లు వైరల్ కావడంతో డాక్టర్ సుధాకర్ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు ఆస్కారం ఇచ్చింది.
కానీ అంతకు ముందే ఆయన నర్సీపట్నం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే వివాదం మొదలయ్యింది. ఏప్రిల్ 2వ తేదీన నర్సీపట్నంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారికి అక్కడి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితులపై వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేష్ ఆధ్వర్యంలో వైద్యులు, పోలీసులతో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా డాక్టర్ సుధాకర్ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆయన్ని సమావేశం నుంచి బయటకు పంపించారు. ఆ వెంటనే అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుధాకర్ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
కోవిడ్-19 విధుల నిర్వహణలో ఉన్న వైద్యులకు, సిబ్బందికి తగిన సదుపాయాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. ఓ వీడియో కూడా విడుదల చేసి ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించారు. ఎన్ 95 మాస్క్ ఒకటి ఇచ్చి 15 రోజులు వాడుకోమని చెబుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీయడంతో చివరకు నిబంధనలు ఉల్లంఘించారంటూ డాక్టర్ సుధాకర్ ని సస్ఫెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏప్రిల్ మొదటి వారంలో ఉత్తర్వులు విడుదల చేశారు.
ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహిస్తూ, ఏదైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయాలి తప్ప మీడియా ముందుకు రావడం నిబంధనలకు విరుద్ధమని, అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న వారి మానసిక స్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించారని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు.
చివరకు సుధాకర్ సీఎంకి క్షమాపణలు కూడా చెప్పారు. తను తప్పు తెలుసుకున్నానని, మన్నించాలి అంటూ, తనపై విధించిన సస్ఫెన్షన్ రద్దు చేయాలని కోరుతూ మరో వీడియో విడుదల చేశారు. అయితే ఆయనకు సానుకూలంగా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.
వాస్తవానికి అంతకుముందు కూడా అనస్థీషియా వైద్యుడిగా ఉన్న డాక్టర్ సుధాకర్ విధుల నిర్వహణలో సస్ఫెండ్ అయ్యారు. డెలివరీకి వచ్చిన మహిళలకు మత్తు ఇవ్వాల్సిన సమయంలో నిరాకరించారంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ హెచ్ వై దొర ఫిర్యాదు చేసిన అనుభవం కూడా ఉంది.
ఇలాంటి పలు వివాదాల్లో ఉన్న సుధాకర్ పేరు తాజాగా విశాఖ ఘటనతో మాత్రం పెద్ద సంచలనంగా మారింది
‘దళిత వైద్యుడు ప్రశ్నించినందుకే ప్రభుత్వ వేధింపులు’ - ప్రతిపక్ష టీడీపీ విమర్శ
కరోనా బాధితులకు వైద్య సేవలందించే క్రమంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు దళిత వైద్యుడిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తోంది.
డాక్టర్ సుధాకర్ అరెస్ట్, పోలీసు కేసులకు నిరసనగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నిరసన దీక్ష కూడా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన నిరసన తెలుపుతూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘జగన్ కుట్రలో భాగంగానే సుధాకర్‌ను పిచ్చివాడిగా చిత్రించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మద్యపానమే సేవించని సుధాకర్ తాగుబోతు ఎలా అవుతాడు? హోం మంత్రికి చిత్తశుద్ధి , నైతిక విలువలుంటే రాజీనామా చేయాలి. కక్షపూరితంగా సుధాకర్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలి. దళిత డాక్టర్ సుధాకర్ పై దాడి జరిగినందుకు వైసీపీ మంత్రులు సిగ్గుపడాలి. నర్సీపట్నం ఆసుపత్రిలో సుధాకర్ ను తిరిగి నియమించాలి. సుధాకర్ కుటుంబానికి ఏమి జరిగినా ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత’’ అన్నారు. సుధాకర్ స్వేచ్చగా జీవించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘టీడీపీ కుట్రలో భాగంగానే సుధాకర్ నాటకం’ - అధికార వైసీపీ విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో భాగంగానే డాక్టర్ సుధాకర్‌ని బలిపశువుని చేశారంటున్నారు వైసీసీ ఎంపీ నందిగం సురేష్.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా డాక్టర్ సుధాకర్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ కోసం కూడా ప్రయత్నించారు. దళిత డాక్టర్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని చూశారు. వారి కుట్రలకు మతిస్థిమితం లేని సుధాకర్‌ని వాడుకున్నారు. పథకం ప్రకారం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాల ద్వారా దళితులకు విలువ లేకుండా చేయాలనేది వారి కుట్ర’’ అని వ్యాఖ్యానించారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి పరస్పర ఆరోపణలు వినిపిస్తుండగానే పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ఒకటి.. ఐపీసీ 353 (ప్రభుత్వ విధుల నిర్వహణను అడ్డుకున్నందుకు), రెండు.. 427 (సెల్ ఫోన్ సహా వివిధ వస్తువులు విసిరినందుకు, రెచ్చిపోయినందుకు) కేసు నమోదు అయ్యింది.
కాగా, ఈ వ్యవహారంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు డాక్టర్ సుధాకర్‌ను ఈనెల 20వ తేదీ బుధవారం తమ ముందు హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కరోనావైరస్ లాక్ డౌన్: భారత్‌లో స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమానికి బాటలు వేస్తుందా?
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- ‘80 ఏళ్ల క్రితం అంటువ్యాధులపై మా డాక్టర్ తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా?’
- ఓవర్ అయినా.. హ్యాంగోవర్ ఉండదు!
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)