కరోనా లాక్‌డౌన్: రాయలసీమ నుంచి వేలాది వలస కార్మికుల రైలు ప్రయాణం

  • బండి హృదయ విహారి
  • బీబీసీ కోసం
రాయలసీమ జిల్లాల నుంచి రైళ్ళలో సొంత ఊళ్ళకు పయనమైన వలస కార్మికులు
ఫొటో క్యాప్షన్,

రాయలసీమ జిల్లాల నుంచి రైళ్ళలో సొంత ఊళ్ళకు పయనమైన వలస కార్మికులు

రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. బిహార్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, రాజస్థాన్, అస్సాం, ఇతర రాష్ట్రాల ప్రజలు పొట్టచేత పట్టుకుని పెద్ద ఎత్తున దక్షిణ భారత దేశానికి వలస వస్తుంటారు.

ఇలా వచ్చిన వారి జీవితాల మీద.. మార్చి 22న జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపింది.

లాక్‌డౌన్‌తో దేశం మొత్తం స్థంభించడంతో ఉపాధి లేక, పూట గడవని పరిస్థితుల్లో వలస కూలీలంతా రోడ్లపైకి వచ్చారు. సొంత గూటికి చేరుకుంటే చాలన్న ఆశతో వందల వేల కిలోమీటర్లను సైతం లెక్కచేయకుండా జాతీయ రహదారులపై నడక సాగించారు. దీంతో స్పందించిన భారత ప్రభుత్వం వీరి కోసం ‘శ్రామిక్ రైల్’ పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో ఉన్న బిహార్, రాజస్థాన్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్ ఇతర రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకు పంపుతోంది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఇప్పటిదాకా 12 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు గుంతకల్ డి.ఆర్.ఎం అలోక్ తివారి బీబీసీకి తెలిపారు. ఈ జిల్లాల నుంచి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎక్కువగా ప్రయాణించినట్లు ఆయన చెప్పారు.

‘‘వలస కూలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మేం రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. మే నెల 6వ తారీఖున చిత్తూరు జిల్లా నుంచి మొదటి రైలును ప్రారంభించాం. ఇప్పటిదాకా గుంతకల్ డివిజన్ నుండి 12 శ్రామిక్ రైళ్లను నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరితే వలస కూలీల కోసం మరిన్ని రైళ్లను ఏర్పాటు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని తివారి వివరించారు.

లాక్‌డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక స్లీపర్ కోచ్‌లోని 72 సీట్లలో కేవలం 54 సీట్లతో మాత్రమే రైలు నడిపేవారమని, మే 18 తర్వాత కోచ్‌లోని మొత్తం 72 సీట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. గతంలో ఒక రైలులో దాదాపు 1,300 మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం 1,600 మంది ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా

లాక్‌డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉండిపోయారు. ఈ జిల్లా నుండి మే 19 రాత్రి ప్రత్యేక శ్రామిక్ రైలులో సుమారు 1,552 మంది వలస కార్మికులు తమ తమ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని 33 మండలాల నుండి వలస కూలీలందరిని 52 బస్సుల్లో అనంతపురం రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి, వారికి భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించారు. అలాగే మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ప్రత్యేక ట్రైన్‌లో వలస కూలీలు ప్రయాణించేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 14 లక్షల రూపాయలు కేటాయించి టికెట్లు కొనుగోలు చేసి వారికి అందించారు. సుమారు 2,483 కిలోమీటర్ల రైలు ప్రయాణానికి 42 గంటల దాకా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మే 19 రాత్రి బయలుదేరిన శ్రామిక్ రైలు మే 21న బిహార్ రాష్ట్రం గయ, సోనాపూర్ రైల్వే స్టేషన్ల మీదుగా ముజఫర్‌పూర్‌కు చేరుకుందని చెప్పారు.

లాక్‌డౌన్‌ వల్ల జిల్లాలో చిక్కుకుపోయిన రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు మే 22వ తేదీన సొంత రాష్ట్రానికి ప్రత్యేక శ్రామిక్ ట్రైన్లో బయలుదేరివెళ్లారు. శుక్రవారం రాత్రి 9:45 గంటలకు అనంతపురం నుంచి రాజస్థాన్ రాష్ట్రం లోని నాగోర్‌కు ప్రత్యేక శ్రామిక్ ట్రైన్ బయలుదేరింది.

ఈ సందర్భంగా డిఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయిన రాజస్థాన్‌కు చెందిన 917 మంది వలస కూలీలను ఈ రోజు వారి సొంత రాష్ట్రానికి ప్రత్యేక ట్రైన్లో పంపించాం. అందులో అనంతపురం జిల్లాకు చెందిన 499 మంది, కర్నూలు జిల్లాలో చిక్కుకుపోయిన 183 మంది, కడప జిల్లాలో చిక్కుకుపోయిన 235 మంది ఉన్నారు. వలస కూలీలకు ట్రైన్ టికెట్ ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి 8 లక్షల 68 వేల రూపాయలను రైల్వేకు అందజేశాం’’ అని తెలిపారు.

వలస కూలీలకు ఆర్.డి.టి స్వచ్ఛంద సంస్థ తరఫున భోజనం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 7 వేల నుండి 8 వేల మంది వలస కూలీలను ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా వారి స్వస్థలాలకు పంపించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. మే 21 మధ్యాహ్నం చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి బిహార్ రాష్ట్రానికి ప్రారంభమైన రెండో శ్రామిక్ రైలుకు ఉపముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.

వలస కార్మికులపై తుపాను తుపాను ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ మేరకు రైళ్లను ఏర్పాటుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గుంతకల్లు డీఆర్ఎం అలోక్ తివారి పేర్కొన్నారు. అయితే, వలస కూలీలను పంపడం సమస్య కాదని, వారిని స్వీకరించేందుకు వారి సొంత రాష్ట్రాలు కూడా అంగీకరించాలని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ తుపాను ప్రభావం, ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికుల మీద ఉందన్నారు. ఆంఫన్ తుపాను ప్రభావంతో మే 26 వరకు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమవారిని రాష్ట్రంలోకి అనుమతించలేమని, అందుకని మే 26 వరకు ఎలాంటి శ్రామిక్ రైళ్లను బెంగాల్‌కు పంపవద్దని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నుంచి లేఖ అందినట్లు అలోక్ తివారి బీబీసీకి తెలిపారు.

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపు 7 వేల మంది వలస కూలీలను 5 శ్రామిక్ రైళ్లలో తమ రాష్ట్రాలకు పంపామని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బీబీసీకి చెప్పారు. ఇప్పటిదాకా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారిని తమ గమ్యస్థానాలకు చేర్చామని, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారిని కూడా త్వరలోనే పాంపాల్సివుందని పేర్కొన్నారు.

‘‘పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు దాదాపు 600 మంది జిల్లాలో ఉన్నారు. వీరితో పాటు అస్సాంకు చెందినవారు కూడా ఉన్నారు. అయితే, విజయవాడ అధికారులు అస్సాంకు చెందిన వలస కూలీలను వారి రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి, కర్నూలు జిల్లాలోని అస్సాం ప్రజలను విజయవాడకు పంపుతున్నాం. అక్కడి నుంచి వారు తమ సొంత రాష్ట్రం చేరుకుంటారు. నేషనల్ హైవేల వెంబడి నడిచే వలస కూలీలకు గత 10 రోజులుగా మేం ఆశ్రయం కల్పించి, వారికి భోజన వసతి కల్పిస్తున్నాం. ఇప్పటిదాకా 260 మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించి, బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేర్చాం. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు రావడంతో, కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సివుంది. అనుమతి రాగానే, పశ్చిమ బెంగాల్‌కు మరో శ్రామిక్ రైలు బయల్దేరుతుంది’’ అని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ బీబీసీతో అన్నారు.

కడప జిల్లా:

కడప జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌కు రెండు, బిహార్‌కు ఒక శ్రామిక్ రైలును పంపామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ బీబీసీకి తెలిపారు. రాయలసీమలోని ఇతర జిల్లాల అధికారులను సంప్రదించి, పూలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఒక ట్రైన్ బయల్దేరాలంటే 1300-1400 మంది ప్రయాణికులు కావాలని, అంతమంది తమ జిల్లాలో లేనపుడు వారిని పక్క జిల్లాకు పంపి, అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని వివరించారు.

‘‘కడప జిల్లా వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందినవారిని 5,500 మందిని గుర్తించాం. ఇప్పటిదాకా బస్సులు, శ్రామిక్ రైళ్ల ద్వారా దాదాపు 4,500 మందిని వారివారి ప్రాంతాలకు తరలించాం. ఇక తక్కిన వెయ్యిమంది వరకు కడప జిల్లాలో మిగిలి ఉండొచ్చు. వారిని కూడా వీలైనంత త్వరగా తరలిస్తాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం వలస కూలీలను తీసుకోవడానికి ఎన్ఓసీ ఇవ్వడంలేదు. ఒక్క కడప జిల్లాలోనే పశ్బిమ బెంగాల్‌కు చెందినవారు దాదాపు 600 మంది ఉన్నారు’’ అని కలెక్టర్ పేర్కొన్నారు.

వలస కూలీలను శ్రామిక్ రైళ్లలోకి పంపే ముందే వారి టికెట్ ఖర్చుల కోసం డబ్బును రైల్వే శాఖకు డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు. మూడు పూటలా భోజనంతోపాటు వారికి డ్రైఫ్రూట్స్, పళ్లు, నీళ్లు కూడా ఇస్తున్నామన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అరటి పంట విరివిగా పండటంతో, ప్రయాణికులకు అరటి పండ్లను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు.

జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు: రైల్వే బోర్డు చైర్మన్

జూన్ ఒకటో తేదీ నుంచి మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన శనివారం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాధారణ పరిస్థితులను తిరిగి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతుంది’’ అని చెప్పారు.

రైలు ప్రయాణాల్లో 80 శాతం మంది ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల ప్రయాణాలేనని ఆయన పేర్కొన్నారు.

‘‘మే 1న శ్రామిక్ స్పెషల్ రైళ్లు ప్రారంభించాం. ప్రయాణికులందరికీ ఉచిత భోజనం, తాగునీరు అందించాం. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సామాజిక దూరం, పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నాం’’ అని వివరించారు.

అలాగే, మే 12వ తేదీ నుంచి దిల్లీ నుంచి 15 ప్రధాన నగరాలను కలుపుతూ స్పెషల్ పాసింజర్ రైళ్లను కూడా ప్రారంభించినట్లు వినోద్ కుమార్ ప్రస్తావించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)