విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ కర్మాగారాన్ని అత్యవసరంగా తెరిచేందుకు, 30 మంది సిబ్బంది ఆ భవనంలోకి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ కర్మాగారంలో విషతుల్యమైన పాలిమర్స్ ఉన్నాయన్న సంస్థ వాదన మేరకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
గ్యాస్ లీక్ వ్యవహారంపై రకరకాల కమిటీలను నియమించారని, తాము ఎంత మంది ముందు హాజరు కావాలని సంస్థ అడగ్గా.. ఈ విషయాలను హైకోర్టుకే నివేదించాలని సూచించింది.
కర్మాగారంలోకి ప్రవేశించే 30 మంది సిబ్బంది వివరాలను 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు అందించాలని ఆదేశించింది.
తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది.
ఫొటో సోర్స్, Getty Images
ఎల్జీ పాలిమర్స్ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. తమపై 7 రకాల విచారణలు జరుగుతున్నాయని, వాటన్నింటికీ తాము ఎలా హాజరు కాగలమని అడిగారు. విచారణకు సహకరిస్తామని చెబుతున్నప్పటికీ ఇలా చేయడం తగదన్నారు. తాము అన్ని విధాలా సహకరిస్తామని, తాము ఎక్కడికీ పారిపోవటం లేదని అన్నారు.
హైకోర్టు తమ ప్లాంటును సీజ్ చేసిందని, ప్లాంటును మూసేయడం చాలా ప్రమాదకరమని, మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు. ఆ ప్లాంటును తక్షణం తెరవాల్సి ఉందని చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు, చట్టపరమైన అంశాల నేపథ్యంలోనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, తమ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందన్నారు. హైకోర్టే ఒక కమిటీలాగా వ్యవహరిస్తోందని తెలిపారు.
ఇప్పుడు తమ ప్లాంటులోకి హైకోర్టు (సూచించినవారు) తప్ప మరెవరూ వెళ్లే పరిస్థితి లేదని, ఈ విషయంపై తమకు మాట్లాడే అవకాశాన్ని కూడా (హైకోర్టు) ఇవ్వలేదని వివరించారు.
ఏమిటీ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం.. వివాదం
విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి రసాయన వాయువులు వెలువడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అర్ధరాత్రి దాటాక నగరంలోకి కమ్ముకొచ్చిన రసాయన వాయువును నిద్రలోనే పీల్చి ఆ నిద్రలోనే స్పృహ తప్పినవారు కొందరైతే.. దాన్నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ పడిపోయినవారు మరికొందరు.ఎక్కడికి వెళ్లాలో... ఎంతదూరం వెళ్తే ఈ విషవాయువు నుంచి ప్రాణాలు కాపాడుకోగలమో తెలియకపోయినా నగరం దాటిపోయేందుకు నడుస్తూ, పరుగెడుతూ, వాహనాలపైనా ప్రాణభయంతో పారిపోయారు.
అయినా విషవాయువు స్టైరీన్ 12 మందిని బలితీసుకుంది.. మరికొందరిని ఆసుపత్రిపాల్జేసింది.
ఎక్కడుందీ ప్లాంట్...
విశాఖ నగరంలోని గోపాలపట్నానికి సమీప ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురం. అక్కడికి దగ్గర్లోనే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉంది.
కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఈ కంపెనీ కూడా కొన్నాళ్లుగా పనిచేయడం లేదు.
అయితే.. లాక్డౌన్ ఉన్నప్పటికీ గ్రీన్ జోన్లలో పరిశ్రమలు నడవడానికి అనుమతులు ఇవ్వడంతో ఎల్జీ పాలిమర్స్ కూడా పనిచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2.30 గంటల సమయంలో ప్లాంటులోని ట్యాంకు నుంచి ఈ విషవాయువు పొంగుకొచ్చింది. స్మోక్ డిటెక్టర్లు వెంటనే గుర్తించి శబ్దం చేసినప్పటికీ అప్పటికే దట్టంగా వాయువు కమ్ముకోవడంతో ప్లాంటు సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోయారు.
101కి ఫోన్ చేసి సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీకేజినీ ఆపడానికి ప్రయత్నాలు చేశారు.
ఫొటో సోర్స్, APCM FB
బాధితులను పరామర్శిస్తున్న ఏపీ సీఎం జగన్
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హుటాహుటిన ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, రెండు మూడు రోజులు చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి అదే సంస్థలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ గ్యాస్ లీక్: 'ఎల్జీ పాలిమర్స్ భద్రత నియమాలు పాటించలేదు' - బీబీసీతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- విశాఖ గ్యాస్ లీక్ కేసు: రూ. 50 కోట్లు జమ చేయాలన్న ‘గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల్లో జోక్యం చేసుకోం’ - సుప్రీంకోర్టు
- భోపాల్ నుంచి వైజాగ్ ఎల్జీ పాలిమర్ వరకు... ప్రాణాలు తీస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- WHO: ‘కరోనావైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొద్దు’.. క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత
- తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం? ఎవరికి ప్రాణాంతకం?
- విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: పాడైపోయిన ఆకు కూరలు, కూరగాయలు.. సాగు నష్టపోయిన 400 రైతు కుటుంబాలు
- ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- వీడియో: ఫేస్ మాస్కులు ధరించడంలో తప్పులు, ఒప్పులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)