ప్రధాని నరేంద్ర మోదీ 2.0: ఏడాది పాలనలో కనిపించిన ధోరణులు ఇవీ...

 • జుబేర్ అహ్మద్
 • బీబీసీ ప్రతినిధి
మోదీ చెప్పిన ఆత్మనిర్భరతను స్వదేశీ అంశంతో ముడిపెట్టి చూడవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మోదీ చెప్పిన ఆత్మనిర్భరతను స్వదేశీ అంశంతో ముడిపెట్టి చూడవచ్చు

మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చి, ఏడాది గడిచింది. విదేశాంగ విధానం విషయంలో మొదటి దఫా మోదీ ప్రభుత్వానికి, రెండో దఫా ప్రభుత్వానికి తేడా ఏమైనా వచ్చిందా? కరోనావైరస్ మహమ్మారి తర్వాత ఏర్పడే ప్రపంచంలో వచ్చే నాలుగేళ్లలో భారత్ వరల్డ్ పవర్‌గా అవతరిస్తుందన్న మాటలు నిజమవుతాయా?

ఏ దేశానికైనా ఒక ఏడాదిలో విదేశాంగ విధానంలో భారీగా మారిపోయే విషయాలు ఉండవు. కానీ, కొన్ని ధోరణులను మాత్రం అర్థం చేసుకోవచ్చు.

మోదీ ప్రభుత్వం రెండో దఫా తొలి ఏడాది పాలనలో కనిపించిన ధోరణులు ఇవే...

 • ఆత్మనిర్భరత పిలుపు
 • భారీగా తగ్గిన ప్రధాని విదేశీ పర్యటనలు
 • కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో పెరిగిన ఉద్రిక్తతలు
 • సీఏఏ విషయంలో విదేశాల్లో ఆందోళనలు
 • దిల్లీ అల్లర్లపై విదేశాల్లో విమర్శలు
 • భారత్‌లో ట్రంప్ తొలి పర్యటన
 • భారత్‌లో ఇస్లామోఫోబియా విషయమై సౌదీ అరేబియా, యూఏఈల నుంచి తీవ్ర స్పందనలు
 • పొరుగుదేశాలతో దెబ్బతిన్న సంబంధాలు
 • కరోనావైరస్ సంక్షోభంలో దౌత్యం

ఫొటో సోర్స్, REUTERS/DANISH SIDDIUI

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్ వ్యాప్తిలో తబ్లీగీ జమాత్ పాత్ర తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై గల్ఫ్ దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి

ఆత్మ నిర్భరత

మే 12న జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఆత్మనిర్భరత విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఆత్మనిర్భరతను స్వదేశీ అంశంతో ముడిపెట్టి చూడవచ్చు. ఆర్థిక విధానంలో వస్తున్న మార్పులకు ఇది సంకేతంగా కనబడుతోంది. సమస్తం అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచంలో సంరక్షణవాద విధానాన్ని అనుసరిస్తూ విజయం సాధించలేం.

కరోనావైరస్ కారణంగా జరిగిన నష్టం తర్వాత ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని చర్చలు జరుగుతున్నాయి.

ఆత్మనిర్భరత విధానం ఓ చరిత్రాత్మక మార్పు అని కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎమ్‌జే అక్బర్ అభిప్రాయపడ్డారు.

‘‘కొత్త ప్రపంచ వ్యవస్థ అంటే ఒకరిపై ఆధారపడటం అవకూడదు. ఆధారపడటం మొదలైన రోజు కొత్త ఆర్థిక బానిసత్వం వస్తుంది. 1967-68లో దేశంలో పెద్ద కరవు వచ్చినప్పుడు మన పరిస్థితి దయనీయంగా మారింది. ఆ తర్వాత మన రైతులు ఆహారం విషయంలో ఆత్మ నిర్భరత సాధించారు. ఇప్పుడు మనం తల ఎత్తుకుని తిరగగలుగుతున్నాం’’ అని అన్నారు.

ఔషధాల తయారీలో భారత్ ఆత్మనిర్భరత సాధించిందని అన్నారు.

‘‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై ఆంక్షలు విధించారు. కానీ, మాట మాత్రమైనా బయటకు చెప్పకుండా, మన ఔషధాలను ఇప్పుడు తీసుకుంటున్నారు’’ అని అక్బర్ అన్నారు.

ఓ విధంగా ప్రపంచంతో అనుసంధానమవుతూనే, ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా ఓ ప్రసంగంలో అన్నారు.

‘‘ఆత్మనిర్భరత అంటే ప్రభుత్వం ఉద్దేశం మనకు మనంగా, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటం కాదు. ఆత్మనిర్భర భారత్ స్వభావరీత్యా మరింత ప్రపంచవాదిగా ఉంటుంది’’ అని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

దిల్లీ అలర్లను పాకిస్తాన్‌తో పాటు ఇరాన్, టర్కీ వ్యతిరేకించాయి. బంగ్లాదేశ్‌లో వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి

తగ్గిన విదేశీ పర్యటనలు

తొలి దఫా మోదీ ప్రభుత్వం పాలన కాలం పూర్తిగా ప్రధాని విదేశీ పర్యటనలతో నిండిపోయింది. కానీ, రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చాలా తగ్గిపోయాయి.

నేపాల్ లాంటి పొరుగు దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో కొన్నేళ్లుగా భారత ప్రధానుల పర్యటనలు జరగలేదని, అలాంటి సమయంలో మోదీ తొలి దఫా ప్రభుత్వం ఈ బంధాలను బలపరుచుకోవడంపై దృష్టి పెట్టిందని ఎమ్‌జే అక్బర్ అన్నారు.

‘‘మోదీ విదేశీ పర్యటనలు భారత్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాయి. భారత్‌పై చిన్న దేశాల ఆశలు పెరిగాయి. ఫ్రాన్స్‌తో భారత్ సంబంధాలు బలపడ్డాయి. పరస్పర వాణిజ్యం కూడా వేగంగా పెరిగింది’’ అని ఫ్రాన్స్‌కు చెందిన జర్మలిస్ట్ ముసిన్ ఎనైమీ అన్నారు.

మొదట దఫా పాలనలో మోదీ పర్యటనల గురించి అంతర్జాతీయంగా చర్చ జరిగిందని బ్రిటన్‌కు చెందిన పాత్రికేయురాలు వెనెసా వారీక్ అన్నారు. కానీ, రెండో విడత పాలనలోని తొలి ఏడాది పర్యటనలు తగ్గిపోవడంతోపాటు భారత్‌లో జరిగిన కొన్ని ఘటనలు ప్రభావం చూపించాయని అభిప్రాయపడ్డారు.

కశ్మీర్

గత ఏడాది ఆగస్టు 5న కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. అక్కడ లాక్‌డౌన్ విధించింది. ఈ పరిణామం తర్వాత కశ్మీర్ మళ్లీ చర్చనీయాంశమైంది. భారత్ చర్యపై పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. ఐరాసను ఆశ్రయించింది.

కానీ, భారత్ విశ్వసనీయత బలంగా ఉండటంతో పెద్ద దేశాలేవీ పాక్‌ను పట్టించుకోలేదు. అంతర్జాతీయ మీడియాలో కొద్ది రోజులు ఈ అంశం గురించి చర్చ జరిగింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

భారత్‌లో దీన్ని మోదీ ప్రభుత్వ విజయంగా చూశారు.

సీఏఏపై విదేశాల్లో ఏమన్నారంటే..

గత డిసెంబర్‌లో పార్లమెంటు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చట్టం చేసింది. విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. ఈ చట్టం ముస్లింలపై వివక్షపూరితంగా ఉందని ఆరోపించాయి. నేషనల్ సిటిజెన్‌షిప్ రిజిస్టర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌తో కలిపి దీన్ని ఉపయోగించి ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయమై మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంది. ఐరాస కూడా ఈ చట్టంలోని అంశాలను ఖండించింది.

అయితే, ఇది భారత్ అంతర్గత విషయమని... విదేశీ ప్రభుత్వాలు గానీ, సంస్థలు గానీ ఇందులో జోక్యం చేసుకోవడం అనవసరమని భారత ప్రభుత్వం జవాబు చెప్పింది.

సీఏఏతో విదేశాల్లో భారత్ ప్రతిష్ఠకు నష్టం జరిగిందని దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నరేంద్ర నాగర్వాల్ అన్నారు.

ఫొటో సోర్స్, WIN MCNAMEE/GETTY IMAGES

దిల్లీ అల్లర్లపై విమర్శలు

సీఏఏ, దిల్లీ అల్లర్ల విషయంలో భారత్ తీరును మలేషియా ప్రధాని హోదాలో ముహాతిర్ మహమ్మద్ బహిరంగంగానే విమర్శించారు. అంతకుముందు కశ్మీర్ అంశం గురించి కూడా ఆయన ఇలాగే వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దిల్లీ అల్లర్ల గురించి ట్వీట్లు చేశారు. ఇరాన్, టర్కీ కూడా దిల్లీ అలర్లను వ్యతిరేకించాయి. బంగ్లాదేశ్‌లో వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.

దిల్లీ అల్లర్లతోపాటు కరోనావైరస్ వ్యాప్తి సమయంలోనూ ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంపై గల్ఫ్ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

ట్రంప్ పర్యటన

మోదీ రెండో విడత పాలన తొలి ఏడాది విజయాల్లో ట్రంప్ పర్యటన కూడా ఒకటి.

భారత్ దౌత్య విజయంగా దాన్ని వాషింగ్టన్‌లోని భారత సంతతి పాత్రికేయులు వర్ణించారు.

ఈ పర్యటన సందర్భంగా రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందాలు కుదిరాయి.

కానీ, ఓ వైపు చాలా దేశాల్లో కరోనావైరస్ వ్యాపిస్తుండగా, అహ్మదాబాద్‌లోని ఓ పెద్ద క్రికెట్ స్టేడియంలో ట్రంప్‌కు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ట్రంప్, మోదీ ఒకరినొకరు దగ్గరి మిత్రులుగా వర్ణించుకుంటారు. కానీ, ట్రంప్ ఆగ్రహాన్ని కూడా మోదీ చవిచూశారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై భారత్‌పై ఆంక్షలు విధించినప్పుడు, దీనికి బదులు తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

ఆ తర్వాత వెంటనే మోదీ ప్రభుత్వం అమెరికాకు ఔషధాలు పంపిస్తున్నట్లు ప్రకటించింది.

గల్ఫ్ దేశాల్లో అభ్యంతరాలు

కరోనావైరస్ వ్యాప్తిలో తబ్లీగీ జమాత్ పాత్ర తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై గల్ఫ్ దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక కామెంట్లు చేసిన కొందరు బారతీయ హిందువులను ఉద్యోగాల్లోంచి తీసేశారు.

ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలాంటి ఘటనలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని ఓ గల్ఫ్ దేశంలోని రాచ కుటుంబానికి చెందిన వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నేపాల్ ప్రధానమంత్రి ఓలీతో భారత ప్రధాని మోదీ

పొరుగు దేశాలతో దెబ్బతిన్న బంధాలు

మోదీ ప్రభుత్వ రెండో దఫా పాలన తొలి ఏడాది చివరికి వచ్చేసరికి పొరుగు దేశాలు నేపాల్, చైనాతో భారత్ సంబంధాలు దెబ్బతిని ఉన్నాయి.

నేపాల్ ఓ కొత్త రాజకీయ మ్యాపు రూపొందించుకుని... కాలాపానీ, లింపియాధురా, ఉత్తరాఖండ్‌లో లిపులేఖ్‌లను తమ ప్రాంతాలుగా చూపించుకుంది.

భారత్ అవి తమ ప్రాంతాలని గట్టిగా స్పందించింది.

భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఇస్లామిక్ దేశాల సంఘం ఓఐసీలో మాల్దీవులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడింది. ప్రభుత్వానికి ఇది ఓ మంచి పరిణామమని భావించవచ్చు.

ఇప్పుడు రాబోయే కాలంలో పొరుగు దేశాలతో, ముఖ్యంగా చైనా, నేపాల్‌లతో ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవడం మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు.

కరోనావైరస్ సంక్షోభ సమయంలో మోదీ జీ20 దేశాలను సంప్రదించి, పొరుగు దేశాలతో మాట్లాడారు. ఈ సమయంలో 133 దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి చెప్పారు.

21వ శతాబ్దంలో ప్రపంచానికి నేతృత్వం వహించ గలిగే అతి కొన్ని దేశాల్లో భారత్ ఒకటని, రాబోయే నాలుగేళ్లు ఆ కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు ఉంటాయని ఎమ్‌జే అక్బర్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)