భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి జనరల్(రిటైర్డ్) వీపీ మాలిక్ ఇంటర్వ్యూ

భారత్, చైనా సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులో చెలరేగిని తాజా ఉద్రిక్తతలను ఎలా చూడాలి? ఈ అంశంపై భారత సైన్యాధికారిగా పనిచేసిన జనరల్ (రిటైర్డ్) వీపీ మాలిక్‌ను బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ ఇంటర్వ్యూ చేశారు.

వాస్తవాధీన రేఖ సమీపంలోని వివాదాస్పద ప్రాంతాల్లో భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను పెంచుకోవడం, చైనాలో అంతర్గత పరిస్థితులు మొదలైన అంశాల గురించి జనరల్ (రిటైర్డ్) వీపీ సింగ్ తన విశ్లేషణ అందించారు.

ఆ వివరాలు..

నితిన్: సర్.. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ తాజా పరిస్థితులపై మీ స్పందనేంటి?

జనరల్ (రిటైర్డ్) వీపీ మాలిక్: అసలు ఈ వివాదం సరిహద్దుల్లోని ఈ ప్రాంతం(లైన్‌ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని అక్సాయ్ చిన్ దగ్గర)లోనే ఎందుకు జరుగుతోంది, ఈ సమయంలోనే ఎందుకు జరుగుతోంది అన్న విషయాలను మనం పరిశీలించాల్సి ఉంది. (అక్సాయ్ చిన్ తమదేనని చైనా అంటుంది. దీన్ని కూడా కలిపి భారత్ తాజాగా మ్యాప్‌లు విడుదల చేసింది)

మొదట అక్కడే ఎందుకు జరుగుతోందో నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను.

మనం కొన్నేళ్లుగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచాలనుకుంటున్నాం.

ఇటీవలే సరిహద్దుల సమీపంలో ఉన్న ఓ నదిపై వంతెన కూడా నిర్మించాం, దాన్ని మన రక్షణ శాఖ మంత్రి ప్రారంభించారు. ఇది మనకు చాలా కీలకమైనది.

రెండో విషయానికొస్తే.. ఆ సరిహద్దు ప్రాంతం ఎప్పటి నుంచో వివాదాల్లో ఉంది. దాన్ని క్రమంగా ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తోంది.

మనకు ఈ దారి చాలా ముఖ్యమైనది. ఇది కారకోరం వరకూ వెళ్తుంది.

వివాదంలో ఉన్న ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమించాలని చైనా చూస్తోంది.

గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే చైనా చేసింది. బహుశా ఇప్పుడు కూడా అదే కావచ్చని నేను భావిస్తున్నాను.

కశ్మీర్‌ విభజన కూడా చైనాకు ఇష్టం లేదు. దానికి కారణం పాకిస్తాన్‌తో చైనాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం. భారత్ విడుదల చేసిన కొత్త మ్యాప్ విషయంలో చైనా తన అసంతృప్తిని వెళ్లగక్కింది.

నితిన్: కోవిడ్-19 తర్వాత చైనాపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఓ రకంగా అంతర్జాతీయంగా దౌత్య పరంగా చిక్కుల్లో పడింది కూడా. అలాగే చైనాకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవడంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్ని కేంద్రం కఠినతరం చేసింది. బహుశా భారత్ విషయంలో చైనా ఇలా వ్యవహరించడానికి అవి కూడా కారణాలు కావచ్చని మీరు భావిస్తున్నారా?

జనరల్ (రిటైర్డ్) వీపీ మాలిక్: చైనాలో అంతర్గతంగా తలెత్తుతున్న పరిస్థితులు, బహిర్గతంగా షీ జింగ్‌పింగ్‌పై వస్తున్న విమర్శలు మొదలైనవి కూడా కారణాలు కావొచ్చు. తమవి అనుకుంటున్న ప్రాంతాలను త్వరగా చేజిక్కించుకోవాలని భావిస్తుండొచ్చు. ఆ క్రమంలోనే సమాచార పరంగా, మిలటరీ పరంగా యుద్ధ సన్నాహాలు చేస్తుండొచ్చు.

ఇరు దేశాల మధ్య విశ్వాసం ఆధారంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి నడుస్తాయి. కానీ, ఇక్కడ ఇరు దేశాల మధ్య విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఎఫ్‌డీఐ, 5జీ వంటి విషయాల్లో భారత ప్రభుత్వం ఆలోచించే చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో కూడా చైనా ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చు.

నితిన్: మాలిక్ గారు.. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ముఖ్యంగా కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వివిధ రకాల నిర్మాణాలను భారత్ వేగవంతం చేసింది. బహుశా అది కూడా సరిహద్దుల్లో ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారా?

జనరల్ (రిటైర్డ్) వీపీ మాలిక్: నితిన్.. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిర్మాణాలను చేపట్టడం అన్నది కొత్త విషయమేం కాదు. 2000వ సంవత్సరం నుంచే అక్కడ వివిధ నిర్మాణాలను చేపట్టాలని భారత్ యోచిస్తూ వచ్చింది. 2012 తర్వాత అవి కార్యరూపం దాల్చుతూ వస్తున్నాయి. అవి ఏవీ ఇవాళ మొదలు పెట్టినవి కావు. చాలా ఏళ్ల నుంచే అక్కడ రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. వంతెనల నిర్మాణం కూడా చాలా ఏళ్ల నుంచే జరుగుతూ వస్తోంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు షోగ్ నదిపై ఇటీవల ప్రారంభించిన వంతెన అందులో భాగమే. బహుశా అది కారణం కాకపోవచ్చు.

నితిన్: మాలిక్ జీ.. ఇప్పుడు మనం మన మిలటరీ గురించి మాట్లాడుకుందాం. గతంలో డోక్లం వివాదం చెలరేగిన సమయంలో రెండు దేశాల సైన్యం ముఖా ముఖి తలపడింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఇరు దేశాధినేతలు జోక్యం చేసుకొని చర్చలు జరపడంతో పరిస్థితి శాంతించింది. ఇటీవల గాల్వన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్ని మన ఆర్మీ చీఫ్ మొదట చిన్నవిగా కొట్టి పారేశారు. ఆ తర్వాత లద్ధాఖ్ నుంచి సిక్కిం వరకు ఆ ఘర్షణలు పాకాయి. అంటే చైనా మిలటరీ శైలి ఆ విధంగా ఉంటుందని భారత్ ఊహించలేదా? ముఖ్యంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న ఈ సమయంలో..

జనరల్(రిటైర్డ్) వీపీ మాలిక్: భారత్-చైనా దేశాల మధ్య శాంతి, సామరస్యాలే లక్ష్యంగా చాలా ఒప్పందాలు జరిగాయి. అలాగే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు ఏ విధంగా జరుగుతున్నాయో అలాగే ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. జరగడం లేదని చెప్పడానికి ఏంలేదు. జరుగుతూనే ఉంటాయి. బహుశా ఈసారి వ్యూహాత్మకంగా జరిగి ఉంటాయే తప్ప సాంకేతికంగా జనిగినవి కావు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణం కావొచ్చు. సరిహద్దుల్లో అప్పుడప్పుడు చైనా సైన్యం తన దుందుడుకు స్వభావాన్ని చూపించాలనుకుంటూ ఉంటుంది. కనుక ఇది మనకు తెలిసిన విషయమే, ఇందులో ఎలాంటి ఆశ్చర్యం ఏమీ లేదు. మన సైన్యం కూడా ఎప్పుడూ ఎక్కడెక్కడ ఇటువంటి ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందో అక్కడ వారిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP

నితిన్: జనరల్ మాలిక్ గారు మరో ప్రశ్న. ఇలా ఉన్నట్టుండి తలెత్తే ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి? చివరికి ఇవి ఏ మలుపు తిరుగుతాయి? ఇరు దేశాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరతాయా?

జనరల్(రిటైర్డ్) వీపీ మాలిక్: గతంతో పోల్చితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందనే చెప్పవచ్చు. ఈ సారి ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు తలెత్తాయి. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే మిలటరీ స్థాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయనే చెప్పవచ్చు. ఈ ముఖాముఖి ఘర్షణలు మరికొంత కాలం పాటు కొనసాగే సూచనలు కూడా లేకపోలేదు. దౌత్య స్థాయిలో లేదా రాజకీయ స్థాయిలో మాత్రమే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు రెండు దేశాల బలగాలు అప్రమత్తంగానే ఉంటాయి. అయితే సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో భాగంగా రెండు దేశాల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. అయినప్పటికీ చైనా వాటిని ఉల్లంఘిస్తూనే వస్తోంది. నేను కొన్నేళ్లుగా చూస్తున్నా.. చైనా ఎప్పటికప్పుడు అదే పని చేస్తోంది. అలా చెయ్యడానికి గల వ్యూహాత్మక కారణమేంటన్నది మనం పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందనే అనుకుంటున్నాను.

డోక్లాంలోనూ, మరికొన్ని చోట్ల ఇలా కాలుదువ్విన ప్రతిసారీ చైనాయే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అయినాసరే పదే పదే చైనా ఈ పని చేస్తోందంటే బహుశా అందుకు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని నేను భావిస్తున్నాను.

నితిన్: మీ విశ్లేషణకు ధన్యవాదాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)