వలస కూలీలకు సహనం లేదు - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

  • జుగల్ ఆర్ పురోహిత్
  • బీబీసీ ప్రతినిధి
నరేంద్ర సింగ్ తోమర్

ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్,

నరేంద్ర సింగ్ తోమర్

లాక్‌డౌన్‌తో తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలు, సైకిళ్ల మీద వెళ్తున్న కూలీలు, రైళ్లు ఎక్కటానికి గుంపుగా రైల్వే స్టేషన్లకు చేరుకున్న కూలీలు ‘కాస్త అసహనం’గా ఉన్నారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.

ఆయన శనివారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆ కూలీలు వేచివుండాల్సింది’’ అని అభిప్రాయపడ్డారు.

దేశంలో తొలి విడత లాక్‌డౌన్‌ ప్రణాళికను రూపొందిస్తున్నపుడు.. వలస కూలీల సంక్షోభాన్ని ప్రభుత్వం ముందుగా అంచనా వేసిందా? రాగల పర్యవసానాలపై చర్చించిందా? అని ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘జనం మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం ఒక చోటు నుంచి మరొక చోటుకు వలస పోతుంటారని ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తెలుసు. పూర్తి సమాచారం ఉంది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో జనం అభద్రతలో ఉన్నట్లు భావించటం చాలా సహజం. జనం ఇంటికి వెళ్లాలనుకోవటమూ సహజం. అదే జరిగింది’’ అని చెప్పారు.

కానీ ఇంత భారీ సంఖ్యలో జనం వలస పోతుండటం, పోయిన ప్రాణాల సంఖ్య, కనిపించిన దయనీయ పరిస్థితులు.. ప్రణాళికా లోపాన్ని, అమలు చేయడంలో లోపాన్ని ఎత్తి చూపడం లేదా?

ఇంటికి వెళ్లటానికి ప్రయత్నిస్తున్న వలస కార్మికుల్లో మే 26వ తేదీ నాటికి కనీసం 224 మంది చనిపోయారని బీబీసీ నిర్ధారించుకోగలిగింది.

‘‘క్లిష్ట సమయాల్లో అందరూ సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ జనం సహకరించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కానీ, ఆరోగ్య విషయాలకు సంబంధించి కానీ మార్గదర్శకాలను పాటించారు. నడుచుకుంటూ వెళుతున్నపుడు, రైలు పట్టాల మీద ప్రాణాలు పోవటం నిజంగా దురదృష్టకరం. అయితే.. ప్రతి వ్యక్తీ చాలా తొందరగా ఇళ్లకు చేరుకోవాలని అనుకుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు ఒక చోటుకు వెళ్లటానికి ఒక రైలు అందుబాటులో ఉంది. కానీ.. పది చోట్ల నుంచి జనం పోగవుతారు. కాబట్టి తర్వాతి రైలు వచ్చే వరకూ జనం వేచి ఉండకతప్పదు. కొన్నిచోట్ల మన కార్మిక సోదరులు కొంత అసహనంగా ఉన్నారు. అందుకే వేచివుండకుండా కొందరు సైకిళ్ల మీద, కొందరు నడుచుకుంటూ బయలుదేరారు. కష్టాలు అందరూ ఎదుర్కొన్నారు. చివరికి ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా.’’

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మార్చి 28వ తేదీన దిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద జన సమూహం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు వలస కార్మికుల పరిస్థితి గురించి వ్యాఖ్యానిస్తూ.. ‘‘ఇంతటి తీవ్రస్థాయి సంక్షోభంలో.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగలేదని కచ్చితంగా ఎవరూ వాదించలేరు. మన కార్మికులు, వలస కూలీలు, చిన్న తరహా పరిశ్రమల్లో చేతివృత్తుల వారు, వీధి విక్రేతలు తదితర సహ దేశస్థులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు’’ అని తెలిపారు.

కోటి మందికి పైగా వలస కార్మికులను తరలించామని, కార్మికులు తమ ఇళ్లకు వెళ్లాలని కోరుకున్నట్లయితే అందరినీ పంపించేంత వరకూ తమ కృషి ఆగదని కేంద్ర ప్రభుత్వం మే 28వ తేదీన సుప్రీంకోర్టులో చెప్పింది. వలస కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో, రవాణాలో, వారికి ఆహారం, తాగునీరు అందించటంలో పలు లోపాలు ఉన్నాయని న్యాయస్థానం ప్రస్తావించింది.

లాక్‌డౌన్ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లో పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో పోగవటం కనిపించింది. కొన్నిచోట్ల పోలీసులు కార్మికుల గుంపును వెనక్కు నెట్టేయాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల ప్రభుత్వ ఉత్తర్వుల ఫలితంగా ఈ కూలీలు గుంపులుగా తరలివచ్చారు.

ఉదాహరణకు.. మార్చి 28న దిల్లీ సమీపంలో చిక్కుకుపోయిన కూలీలను తీసుకెళ్లటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1,000 బస్సులను ఏర్పాటు చేసిందని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ఆ ఉత్తర్వుతో వలస కూలీలు పెద్ద సంఖ్యలో బస్ స్టేషన్లకు చేరుకోవాలనుకున్నారు.. కానీ సమయానికి రాలేకపోయారని బీబీసీ ఒక కథనంలో వివరించింది.

కార్మికులు, వలస కూలీలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్తున్నా కూడా ఇలా జరిగింది.

మార్చి 31న.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,00,000 మందికి పైగా వలస కార్మికుల కోసం 21,064 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, 23 లక్షల మంది వలసలు, ఇతరులకు ఆహారం అందిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ‘‘ఇంతకుముందు కనిపించిన వలసల వెల్లువ ఇప్పుడు నియంత్రణలో ఉంది’’ అని కూడా పేర్కొంది.

వలస కార్మికులు ఉన్నచోటును వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా కానీ, తగ్గించగలిగేలా కానీ.. నగదు బదిలీ అంశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు, దశల వారీగా లాక్‌డౌన్ చేసేలా ఎందుకు ప్రణాళిక రూపిందించలేదు అని ప్రశ్నించినపుడు.. ‘‘ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశించటం సహజం. వారి కోసం కేంద్రం, రాష్ట్రం రెండూ తాము చేయగలిగినవి చేశాయి’’ అని తోమర్ బదులిచ్చారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం రెండో విడత పాలన మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వివిధ శిబిరాల్లో వలస కార్మికులకు సాయం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ. 11,000 కోట్లు పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారం, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చినా కూడా తమ ఇళ్లకు చేరుకోవటానికి కాలినడకన బయలుదేరిన ఎంతో మంది వలస కార్మికులను బీబీసీ కలిసింది.

దాదాపు వారందరూ కూడా.. తమకు ఆహార సరకులు సరిపోయినంతగా అందటం లేదనో, అసలు ఏమీ అందలేదనో చెప్పారు. అయినా కానీ.. రోజుకు ఒక పూట భోజనం కోసం చాలా వేడి వాతావరణంలో గంటల తరబడి పొడవాటి వరుసల్లో నించోవాల్సి వస్తోందని వివరించారు.

ఇటువంటి సంక్షోభ సమయంలో తమ ఇళ్లలో తమ వారి దగ్గర ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

మొదటి లాక్‌డౌన్ సందర్భంగా ప్రకటించిన తొలి ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం తమకు అందలేదని మేం మాట్లాడిన చాలా మంది వలస కూలీలు చెప్పారు. దేశంలోని నిరుపేద వర్గాల వారికి సాయం చేయటానికి ఇంకా నేరుగా నగదు బదిలీలు చేయాలని నిపుణులు సూచించారు.

‘సమయం వచ్చినపుడు నగదు బదలీలపై నిర్ణయం’

దేశంలో 20 కోట్ల మంది మహిళా జన్‌ధన్ ఖాతాదారులకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మార్చి 26న ప్రకటించింది. ఈ బదిలీ జూన్ నెలలో ముగుస్తుంది.

ఈ పథకాన్ని ఇంకా పొడిగిస్తారా?

‘‘మార్చి 26న మేం చేసిన ప్రకటన.. చాలా అంశాల సమాహారం. జనం విమర్శించాలనుకున్నపుడు వాళ్లు ఒక అంశాన్ని ఎంచుకుంటారు. జనం మరింత ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేయగలరు. కానీ వారి సొంత ప్రభుత్వాలు ఉన్నచోట వాళ్లు ఇవ్వరు. కాంగ్రెస్ తాము పరిపాలిస్తున్నరాష్ట్రాల్లో డబ్బులు ఇవ్వటం ఎందుకు మొదలుపెట్టలేదు? ఇప్పటికైతే మూడో విడత ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకుంటున్నాయి. కోవిడ్ వ్యాధి నుంచి మనం బయటపడుతున్నాం. కాబట్టి సమయం వచ్చినపుడు, పరిస్థితులను బట్టి, ప్రభుత్వం నిర్ణయిస్తుంది’’ అని తోమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ 19 వ్యాప్తి

కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 16వ తేదీన భారతదేశంలో కోవిడ్-19 కేసులేవీ లేని జిల్లాలు 325 ఉన్నాయి. ఇప్పుడు అలాంటి జిల్లాలు కేవలం 168 కన్నా తక్కువే మిగిలాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి అని మేం కేంద్ర మంత్రిని అడిగాం.

‘‘అవును. కోవిడ్-10 లేని జిల్లాల సంఖ్య తగ్గింది. కానీ కార్యకలాపాలు మొదలువుతున్నపుడు కేసులు పెరుగుతాయి. ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. మేం ఆరోగ్య సామర్థ్యాలను బలోపేతం చేశాం’’ అని ఆయన బదులిచ్చారు.

ముంబై వంటి పట్టణ ప్రాంతాలు సతమతమవుతున్న సమయంలో.. ప్రత్యేకించి సదుపాయాలు పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు తట్టుకోగలవా?

‘‘ప్రతి గ్రామంలో అవసరమైన స్థాయిలో ఆరోగ్య సదుపాయాలు ఉండటం పూర్తిగా సాధ్యం కాదు. ఇతర దేశాల్లో కూడా జరగదు. కానీ జిల్లా స్థాయిలో మనకు సదుపాయాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమాచార సరఫరా చాలా ఎక్కువగా ఉంది కనుక.. మన గ్రామస్థులు లెక్కలోకి రాని కేసులను కూడా వ్యవస్థకు నివేదిస్తున్నారు. ఏ గ్రామానికీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం 15 నుంచి 20 కిలోమీటర్లకు మించి దూరం లేదు. అక్కడ కనీస వైద్య సదుపాయం అందుబాటులో ఉంది. జిల్లా ఆస్పత్రుల్లో తగినన్ని వనరులు, సదుపాయాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే ముందస్తు సన్నద్ధత కూడా ఉంది. ప్రభుత్వం ఆ పని చేసింది’’ అని మంత్రి పేర్కొన్నారు.

రోజుల్లోనే చర్యలు...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ ప్యాకేజీని ప్రకటిస్తూ.. రైతులకు మెరుగైన ధరలు లభించేలా సాయం చేయటంతో పాటు, వ్యవసాయ రంగాన్ని ఆకర్షణీయంగా చేయటం కోసం నిత్యావసర వస్తువుల చట్టం 1955కి సవరణలు చేస్తామని చెప్పారు.

ఈ పరిపాలనా, చట్టపరమైన చర్యలు చేపట్టటానికి నిజంగా ఇంకెంత కాలం పడుతుందని అడిగినపుడు.. ‘‘వ్యవసాయ సంస్కరణల మీద ఇప్పటికే కృషి జరుగుతోంది. చేసిన ప్రకటనల్లో కొన్నిటి గురించి ఇంతకుముందలి మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిష్కరించాం. మిగిలిన వాటి గురించీ రాబోయే సమావేశాల్లో చర్చిస్తాం. కొన్ని రోజుల్లోనే మీరు ఈ సంస్కరణలను చూస్తారు’’ అని మంత్రి బదులిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినట్లు 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయటం గురించి, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ అంశం ప్రభుత్వ ప్రాధాన్యతగా కొనసాగుతుందా అనే దాని గురించి మాట్లాడుతూ.. ‘‘కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ చేస్తున్న పనిని హేతుబద్దమైన ముగింపుకు తీసుకెళతాం. కోల్పోయిన సమయాన్ని పుంజుకోవటానికి కృషి చేస్తాం. లక్ష్యానికి కట్టుబడి ఉంటాం’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI

‘మిడతల దాడి పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది’

భారతదేశంలో మిడతల దండు దాడులను ఎదుర్కోవటానికి మోదీ ప్రభుత్వం ఎలా సన్నద్ధమవుతోందనే అంశం గురించీ మంత్రి మాట్లాడారు.

గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు గ్రామాల్లోని పంట పొలాలతో పాటు నగరాల మీదా మిడతల దండు దండయాత్రను చవిచూస్తున్నాయి.

ఈ మిడతల దండు మరింత తీవ్రంగా వరుస దాడులు చేస్తుందని.. వాటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తోమార్ చెప్పారు.

‘‘ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 50 బృందాలు పని చేస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది మరింత తీవ్రమవుతుందనేది అంచనా. బ్రిటన్ నుంచి మరో 60 స్ప్రేయింగ్ మెషీన్లు తెప్పిస్తున్నాం. కానీ లాక్‌డౌన్ వల్ల వాటి రాక ఆలస్యమయింది. పిచికారీ కోసం డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తాం. సెప్టెంబర్ కల్లా ఈ సమస్య ముగిసిపోతుంది’’ అని ఆయన వివరించారు.

ఇప్పటివరకూ ఎంత విస్తీర్ణం మీద ప్రభావం చూపిందని అడిగినపుడు.. ‘‘నాలుగు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మిడతల దాడిని ఎదుర్కోవటానికి మేం ప్రయత్నించాం’’ అని మంత్రి బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)