కృత్రిమ మేధస్సు: కరోనావైరస్ను ఈ అధునాతన సాంకేతికత అడ్డుకోగలదా?
- జుబైర్ అహ్మద్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన అంకుర సంస్థ.. పోస్ట్ఎరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది
కరోనావైరస్కు వ్యాక్సీన్ కనిపెట్టే రేసులో ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా పరుగులు తీస్తోంది. కరోనావైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న తరుణంలో వైరస్‌ను కట్టడిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), అల్గారిథమ్స్, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) నిపుణులతో పరిశోధకులు, రసాయన శాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తున్నారు.
"ఏఐ రాకముందు వ్యాక్సీన్, కొత్త ఔషధాలను కనిపెట్టేందుకు ఏళ్లు పట్టేది. వేర్వేరు రసాయన సమ్మేళనాలను పరీక్షించడం, మాలిక్యులర్ డిజైన్లను విశ్లేషించడం లాంటి పనులకు చాలా సమయం ఖర్చయ్యేది. జంతువులపై ప్రయోగానికి ఏళ్లు పట్టేది. ఇప్పుడైతే ఏఐ, ఎంఎల్‌ల సాయంతో ఈ పని రోజుల్లో పూర్తవుతోంది. ఎంఎల్ వేదికల సాయంతో శాస్త్రవేత్తలు వేర్వేరు సమ్మేళనాల పరీక్షల సమయాన్ని ఏళ్ల నుంచి వారానికి తగ్గించగలిగారు" అని ఆరోగ్య రంగంలో ఏఐ, ఎంఎల్ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న యోగేశ్ శర్మ వివరించారు.
"కరోనావైరస్కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన అంకుర సంస్థ.. పోస్ట్ఎరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తుంది. ఏఐ సాయంతో వ్యాక్సీన్ అభివృద్ధికి అవసరమైన సమ్మేళనాలను విశ్లేషిస్తోంది" అని ఇండస్ట్రీ మ్యాగజైన్ కెమిస్ట్రీవరల్డ్ తెలిపింది. "ప్రపంచంలోని ప్రముఖ రసాయన శాస్త్రవేత్తల విజ్ఞానానికి ఏఐ అల్గారిథమ్‌లను జోడించి కరోనావైరస్ను కట్టడిచేయాలని పోస్ట్ఎరా భావిస్తోంది."
ఫొటో సోర్స్, Getty Images
భారత ఆరోగ్య నిపుణులకు ఏఐ, ఎంఎల్ సాంకేతికతలు కొత్తేమీ కాదు
కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేసేందుకూ ప్రస్తుతం ఏఐను ఉపయోగించడం విశేషం. భారత్‌లో కరోనావైరస్ కేసులు మొదలైన తర్వాత రెండు నెలల వరకు పరీక్షల కోసం.. ఎక్కువగా స్వాబ్ టెస్టులనే ఆశ్రయించేవారు. వీటి ఫలితాలు వచ్చే సరికి రెండు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. అయితే ఎక్స్-రే, సీటీ స్కాన్లతో ఐదే నిమిషాల్లో కోవిడ్-19ను నిర్ధారించొచ్చని ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో పీయూష్ సోమణి తెలిపారు.
"ఏఐ, ఎంఎల్ సాఫ్ట్వేర్ల సాయంతో ఏఏ+ కోవిడ్-19 టెస్టింగ్ సొల్యూషన్ పరీక్షా విధానం ఫలితాలను ఇస్తుంది. ఓ వ్యక్తికి కోవిడ్-19 సోకిందో లేదో దీని సాయంతో కేవలం ఐదే నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తక్కువ ధరకే ఇది అందుబాటులోకి వస్తుంది. కేవలం కరోనావైరస్ మాత్రమే సోకితే ఈ విధానంలో 98 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయి. అదే ఊపిరితిత్తులు ఇతర రుగ్మతలు కూడా రోగుల్లో ఉంటే ఇది.. 87 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుంది. కొన్ని ప్రభుత్వాసుపత్రులు ఇప్పటికే ఈ కొత్త సాంకేతిక సాయంతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి."
"మొదట కొన్ని నెలల వరకు ప్రభుత్వం స్వాబ్ టెస్టులపైనే ఆధారపడింది. కోవిడ్-19 రోగులకు ఎక్స్-రే టెస్టు సురక్షితం కాదని ఐసిఎంఆర్ కూడా నిషేధం విధించింది. కేవలం స్వాబ్ టెస్టులపై ఆధారపడటంతో కేసులు బాగా పెరిగాయి" అని సోమణి వివరించారు.
"ప్రస్తుతం ఎక్స్-రే, సీటీ స్కాన్ టెస్టులకూ అనుమతించడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. మా కంపెని రోజుకు 10,000 పరీక్షలు చేస్తోంది. భారత్‌లో పరిస్థితి అర్థం చేసుకొని ఈ పరీక్షలను మేం మొదలుపెట్టాం. దీంతో వైద్యులపై చాలా వరకు ఒత్తిడి తగ్గుతోంది. వారు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు"అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఎక్స్-రే, సీటీ స్కాన్లతో ఐదే నిమిషాల్లో కోవిడ్-19ను నిర్ధారించొచ్చని ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తెలిపింది
ఆరోగ్య రంగంతో దృఢమైన బంధాలు
భారత ఆరోగ్య నిపుణులకు ఏఐ, ఎంఎల్ సాంకేతికతలు కొత్తేమీ కాదు. సర్జరీలు, క్లిష్టమైన వ్యాధుల నిర్ధారణ ప్రక్రియలకు ఎప్పటినుంచో ఈ పరిజ్ఞానాన్ని డాక్టర్లు ఉపయోగిస్తున్నారు.
గత ఏడాది ఉజ్బెక్ పౌరుడొకరు విఫలమైన కిడ్నీలతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. అదృష్టవశాత్తు ఆయన్ను తీసుకొచ్చిన వ్యక్తే కిడ్నీ ఇచ్చేందుకూ అంగీకరించారు. ఓ రోబో తన మేనల్లుడి కిడ్నీని తీసి.. తన భర్తకు అమర్చిన విధానాన్ని మమూరా అఖ్మదేఖోజీవా ప్రత్యక్షంగా చూశారు. ఇది చాలా క్లిష్టతరమైన శస్త్రచికిత్స. అయితే దాన్ని నిర్వహించిన డాక్టర్ల మొహంలో ఎలాంటి బెదురూ కనిపించలేదు. కొంచెం భయం అనిపించిందికానీ, అద్భుతంగా ఆపరేషన్ నిర్వహించారని మమూరా వ్యాఖ్యానించారు.
"మా మేనల్లుడి కిడ్నీని రోబో చేత్తో పట్టుకోవడం చూశాను. అది ఎక్కడ కింద పడిపోతుందేమోనని భయం వేసింది. అది కింద పడితే మరొక దాతని ఎక్కడి నుంచి తేవాలి దేవుడా అనుకున్నాను. అల్లా దయతో ఆ రోబో చాలా చక్కగా పనిచేసింది." అని మమూరా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఆ కుటుంబం తాష్కెంట్‌లోని తమ ఇంటికి చేరుకుంది. అధునాతన సాంకేతికత వారి జీవితంలో అద్భుతాలు చేసింది. కిడ్నీ దానం చేసిన వ్యక్తితోపాటు రోగి కూడా ఇప్పుడు కోలుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ (ఆర్ఏఎస్)లను నిర్వహిస్తుంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సా విధానాల్లో రోగులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆసుపత్రుల్లో చాలా ఎక్కువ రోజులు వారు ఉండాల్సి వస్తుంది. అంతేకాదు శస్త్రచికిత్స ఎంత కచ్చితంగా జరుగుతుందనేదీ చెప్పడం కష్టమే. అయితే ఆర్ఏఎస్ సాయంతో సమయం, డబ్బులు.. రెండూ ఆదా అవుతాయి.
భారత్‌లో 500కుపైగా ఆసుపత్రులు, క్లినిక్స్‌లో ఆర్ఏఎస్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇది ఏఐ యుగం
అయితే భారత్‌లో ఉపయెగిస్తున్న ఆర్ఏఎస్ సాధనాలు, సాఫ్ట్వేర్లు ఇక్కడ అభివృద్ధి చేసినవి కాదు. ఆరోగ్య రంగంలో భారత్ అంకుర సంస్థలు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఏఐ, ఎంఎల్‌ల పరిశోధన, ఆవిష్కరణలు, భారీ డిజైన్లు.. ఇలా అన్నీ అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. ఈ రంగాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అలీబాబా, బైడూ చాలా పెట్టుబడులు పెట్టాయి. చైనాలో ఈ పరిశ్రమ ఇప్పటికే 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అంతేకాదు ఇక్కడ ఏటా 40 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, చైనా పశ్చిమ ప్రాంతంలోని దిగ్గజ సంస్థలు.. ఏఐలో వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇవి మన జీవన విధానంతోపాటు ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. మనుషుల్లానే నవ్వే, ఏడ్చే బాబునూ ఏఐ ఉత్పత్తి చేసింది. అంతేకాదు మాటతీరు, ప్రవర్తనల్లో ఎలాంటి తేడాలేని ఓ మనిషి డూప్లికేట్నూ ఏఐ తయారుచేసింది.
ఏఐలో పురోగతి, డేటా మైనింగ్, మెషీన్ లెర్నింగ్‌లలో కొత్త ఆవిష్కరణలపై గూగుల్ గతేడాది వరుస డాక్యుమెంటరీలు రూపొందించింది. ఇప్పుడు కొత్త యుగంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అనే మాటతో ఈ డాక్యుమెంటరీలు మొదలవుతాయి.
అయితే ఎంతవరకు వీటిని ఉపయోగించచ్చు? అనే నైతిక ప్రశ్నలూ నేడు ఉత్పన్నం అవుతున్నాయి. రోబోల తయారీ అనంతరం మానవుల భావోద్వేగాలను వాటికి అందించే దిశగా నేడు పరిశోధనలు జరుగుతున్నాయి. మనం సరైన దిశలోనే వెళ్తున్నామా?
"ఇప్పటివరకు ఏఐని చాలా చక్కగా ఉపయోగించుకున్నాం. అయితే మనం రోబోట్లకు ఇంకా కొత్త సంగతులు నేర్పిస్తే.. ఆవి మనుషుల కంటే తెలివి మీరి కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ముప్పుంది" అని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గతంలో వ్యాఖ్యానించారు.
"నేను చనిపోయినా.. ఈ డిజిటల్ రోబో బతికే ఉంటుంది. అది నాకు అసలు ఇష్టంలేదు" అని తనను పోలిన రోబోను తయారుచేసిన వ్యక్తి కూడా చెప్పారు.
కొన్ని తడబాట్లు ఉన్నా..
కొన్ని అభ్యంతరాలు, తడబాట్లు ఉన్నప్పటికీ ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న రోగి.. తనకు తాను డాక్టర్‌గా మారబోయే రోజులూ త్వరలో చూసే అవకాశముంది. చిన్న చిన్న విషయాలకు వైద్యులను సంప్రదించడమూ తగ్గుతుంది. డాక్టర్ల కంటే తన స్మార్ట్ఫోనే.. ఆరోగ్య సంగతుల గురించి ఎక్కువ చెబుతుంది. 2022 నాటికి 44 కోట్ల స్మార్ట్ఫోన్లతో భారత్‌లో ఆరోగ్య రంగం భారీ ఏఐ హబ్‌గా మారే అవకాశముంది. ఈ సాంకేతికతను సరైన పద్ధతుల్లో నియంత్రిస్తూ, ప్రోత్సహిస్తే మన జీవిత కాలం 66 నుంచి కొన్నేళ్లు పైకి వెళ్లే అవకాశముంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి?
కంప్యూటర్ను మనుషుల్లా ఆలోచింపజేసే టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ టెక్నాలజీ తన చుట్టూ ఉన్న సమాచారాన్ని తీసుకొని దానికి తగిన విధంగా స్పందిస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ టెక్నాలజీ మనమిచ్చే సమాచారాన్ని అర్థం చేసుకొని తన స్పందనను భవిష్యత్తులో మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తుంది. ఇది సరైన స్పందన ఇవ్వాలంటే చాలా నాణ్యమైన డేటా అవసరం అవుతుంది. మెషీన్ లెర్నింగ్, అల్గారిథమ్‌ల సాయంతో ఇది తప్పులను సరిచేసుకుంటుంది.
“ప్రతి వెయ్యి మందికి ఒకరి కంటే తక్కువ డాక్టర్లు ఉన్న భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు” అని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది.
భారత్‌కు ఏఐ వ్యూహం ఉందా?
రెండేళ్ల క్రితం కేంద్ర మేధోమథన సంస్థ నీతీ ఆయోగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లపై ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనికి “ఏఐ ఫర్ ఆల్” అని వినసొంపైన ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ల సాయంతో వైద్య, వ్యవసాయ, విద్య, స్మార్ట్ సిటీల నిర్మాణం, పట్టణ రవాణా వ్యవస్థలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని పత్రంలో పేర్కొన్నారు.
వైద్య రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడంతోపాటు నియంత్రణకూ నేషనల్ ఈ హెల్త్ (నేహా) అథారిటీని నిర్మించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే మనకు ఇప్పటికే నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది. ప్రపంచం లోనే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణా పథకంగా చెబుతున్న ఆయుష్మాన్ భారత్ అమలు కోసం దీన్ని తెరపైకి తీసుకొచ్చారు.
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ చాలా వెనుకంజలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో వ్యూహంతోపాటు సరైన నిబంధనలు లేకపోవడంతో హానికర స్థాయిలో ఏఐ పరిశ్రమ వెళ్తోందని చెబుతున్నారు.
ఏఐ రంగంలో చైనాతో భారత్ పోటీ పడలేదని నీతీ ఆయోగ్ పత్రం అంగీకరించింది. అయితే చైనాయేతర, పశ్చిమ దేశాలేతర మార్కెట్లకు భారత్ హబ్‌గా మారే అవకాశముందని పేర్కొంది. పత్రం రూపొందించడంతో తొలి అడుగు పడినా.. ఇప్పటివరకు తదుపరి చర్యలేవీ తీసుకోలేదు.
ఆరోగ్య రంగంలో ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ ఇంకా శైశవ దశలో ఉందని సోమణి అభిప్రాయపడ్డారు.
కొన్ని కంపెనీలు మాత్రమే ఇక్కడ ఆరోగ్య రంగంలో ఏఐ మీద దృష్టిపెట్టాయి. ప్రపంచంలోని మిగతా దేశాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి. క్లిష్టతరమైన శస్త్రచికిత్సల నుంచి రక్త మార్పిడి వరకు చాలా పనులు ఏఐలతోనే జరుగుతున్నాయి.
కరోనావైరస్ లాంటి మహమ్మారులు వ్యాపిస్తున్న నేటి రోజుల్లో ఏఐ, ఎంఎల్‌లతో ఎంతో ఉపయోగం ఉంటుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో కొన్ని కాలాల్లో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతుంటారు. ఆ సమయంలో పెద్దయెత్తు వైద్య పరీక్షలు అవసరం అవుతుంటాయి. ఈ పరీక్షలను మనుషుల కంటే వేగంగా చేయగలదని ఇప్పటికే ఏఐ నిరూపించింది.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)