భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?
- అజిత్ వడ్నేర్కర్, భాషా శాస్త్రవేత్త
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
జీ-20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ఇచ్చే విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై వివాదం రాజుకుంది.
రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికలో ఎప్పుడూ ఉపయోగించే ''ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'' అనే పదానికి బదులుగా ''ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'' అని రాయడం వల్ల ఈ వివాదం తలెత్తింది.
'ఇండియా' అనే పదాన్ని దేశం పేరుగా ఉపయోగించడం మానేసి, దాని స్థానంలో ఇప్పుడు 'భారత్' అని మాత్రమే పిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యకు పాల్పడినట్లుగా విపక్షాలు ఆరోపించాయి.
విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌లు తమ ఆహ్వాన లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందులో ''ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'' అనే రాసి ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, TWITTER@DHARMENDRA PRADHAN
కేంద్రం చర్యను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ''జీ20 సదస్సుకు హాజరయ్యే అతిథులకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన లేఖలో ''ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా''కు బదులుగా ''ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'' అనే పదాన్ని వాడారు. ''ఇండియా'' కూటమి అంటే ఇంత భయమా? ఇది విపక్షాలపై మోదీ సర్కారుకు ఉన్న ద్వేషమా? లేదా ఒక నియంత ఇష్టారాజ్యామా?'' అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది.
సోషల్ మీడియాలో రాష్ట్రపతి పేరిట వచ్చిన ఈ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది.
'ఇండియా' కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే... రాజ్యాంగంలో భాగమైన 'భారత్' అనే పేరును ఉపయోగించడంలో ఎలాంటి తప్పు లేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
అయితే, దేశం పేరు మార్పు గురించి వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ అంశంపై గతంలో కూడా చర్చ జరిగింది. ఏకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.
రాజ్యాంగంలోని ''ఇండియా దట్ ఈజ్ భారత్'' అనే మాటను మార్చి కేవలం భారత్ అని ఉంచాలనే డిమాండ్లు వచ్చాయి.
దీని గురించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దీనిపై 2020 మే 3న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కూడా జరిగింది.
‘ఇండియా’ అనేది గ్రీకు మాట ‘ఇండిక’ నుంచి వచ్చిందని, ఆ పేరును తొలగించాలని పిటిషనర్ కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-1లో మార్పులు తీసుకురావాలని, దేశం పేరును ‘భారత్’గా మాత్రమే ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని అపీల్ చేశారు.
సుప్రీంకోర్టుకు అప్పట్లో చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. రాజ్యాంగంలో ఇంతకు ముందే ‘భారత్’ ప్రస్తావన ఉందని చెప్పింది.
ఈ పిటిషన్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించాలని, ప్రభుత్వం ముందు పిటిషనర్ తన డిమాండ్లు ఉంచవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
చాలా దేశాలు తమ పేర్లు మార్చుకున్నాయి. అది కొత్త విషయమేం కాదు.
ఇంతకీ భారత్ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఎలా అయ్యింది?
అసలు భారత్‌ను ఎన్ని రకాల పేర్లతో పిలుచుకుంటారు? ఆ పేర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాచీన కాలంలో భారతభూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు జంబూద్వీపం, భరతఖండం, హిమవర్షం, అజనాభవర్ష్, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా అనేవారు.
కానీ వీటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నది, జనాదరణ పొందినది భారత్.
పేరు గురించి చాలా ఎక్కువ భావనలు, తేడాలు కూడా భారత్ గురించే ఉన్నాయి. భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతిలాగే దానికి వివిధ కాలాల్లో రకరకాల పేర్లు కూడా వచ్చాయి.
దేశానికి వచ్చిన ఆ పేర్లు ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచారాల, వ్యవహారాల వల్ల వచ్చాయి.
హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా వచ్చాయి. ఈ పేర్లు రావడానికి మూలంగా సింధూ నది ప్రముఖంగా కనిపిస్తోంది. కానీ సింధు అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు.
సింధు అంటే నది, సముద్రం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే దేశంలో నైరుతి ప్రాంతాన్ని ఒకప్పుడు సప్తసింధు లేదా పంజాబ్ అనేవారు. అంటే అక్కడున్న ఒక విశాల సారవంతమైన ప్రాంతం, అక్కడ ప్రవహించే ఏడు లేదా ఐదు ప్రముఖ ప్రవాహాల వల్ల దానిని గుర్తించారనే చెప్పుకోవచ్చు.
అలాగే భారత్ అనే పేరు వెనక ‘సప్త సైంధవ’ క్షేత్రాల్లో ‘పనపి అగ్నిహోత్ర’ సంస్కృతి(అగ్ని ఆహుతి చేయడం) గుర్తింపు కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వెనుక ఎంతోమంది ‘భరత్’లు
పురాణ యుగంలో భరత్ పేరుతో ఎందరో వ్యక్తులు ఉండేవారు. దుష్యంతుడి కొడుకుతోపాటు దశరథ పుత్రుడు భరతుడు కూడా ప్రముఖుడే. ఆయన రాముడి పాదుకలతోనే పాలించాడు.
నాట్యశాస్త్రంలో భరతముని కూడా వీరిలో ఒకరు. ఒక రాజర్షి భరత్ ప్రస్తావన కూడా ఉంది. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిన జాతీయాలు కూడా ఉన్నాయి.
మగధ రాజ్యంలో ఇంద్రద్యుమ్నుడి సభలో కూడా ఒక భరత రుషి ఉండేవారు. పద్మపురాణంలో క్రూరుడైన భరత్ అనే బ్రాహ్మణుడి ప్రస్తావన ఉంది.
దుష్యంతుడి కొడుకు భరత్ పేరునే భారత్ అనే పేరు వచ్చిందని ‘ఐతరేయ బ్రాహ్మణం’లో కూడా ఉంది. ఈ గ్రంథంలోని వివరాల ప్రకారం భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని విశాల సామ్రాజ్యం స్థాపించాడు. అశ్వమేథ యజ్ఞం చేశాడు. అందుకే ఆయన రాజ్యానికి ‘భారతవర్ష్’ అనే పేరు వచ్చింది.
అలాగే మత్స్యపురాణంలో మనువును ప్రజలకు జన్మనిచ్చిన వరుడు అని, వారి పోషణ చూసుకోవడం వల్ల ‘భరత్’ అని చెప్పారు. ఆయన పాలించిన భూభాగాన్ని ‘భారతవర్ష్’ అన్నారు.
ఈ పేరు పెట్టడం వెనుక జైన సంప్రదాయ సూత్రాలు కూడా కనిపిస్తాయి. భగవాన్ రుషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరునే ఈ దేశానికి ‘భారతవర్ష్’ అనే పేరు వచ్చిందని చెబుతారు. సంస్కృతంలో ‘వర్ష్’ అంటే ‘ప్రాంతం’ అనే అర్థం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దుష్యతుడు-శకుంతల కొడుకు భరతుడు
సాధారణంగా ‘భారత్’ అనే పేరు వెనుక మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. మహర్షి విశ్వామిత్రుడు, అప్సరస మేనకల కూతురు శకుంతల, పురువంశ రాజు దుష్యంతుడికి గాంధర్వ వివాహం జరుగుతుంది. వీరిద్దరికీ పుట్టిన కొడుకు పేరు భరతుడు.
కణ్వ ముని ఆశీర్వాదంతో భరతుడు తర్వాత చక్రవర్తి అవుతాడు. ఆయన పేరుతోనే ఈ భూభాగం పేరు భారత్‌గా ప్రసిద్ధి కెక్కుతుంది.
భారత్ అనే పేరు వినగానే ఎక్కువ మందికి శకుంతల-దుష్యంతుల ప్రేమకథే గుర్తొస్తుంది. ఆదిపర్వంలో వచ్చే ఆ సందర్భం గురించి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే మహాకావ్యం రచించారు. నిజానికి అది ముందే ఉన్నా, ఈ కావ్యం తర్వాత ఈ కథ జనాదరణ పొందింది.
ఇద్దరు ప్రేమికుల అమర ప్రేమ కథకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఈ దేశానికి పేరు పెట్టడం వెనుక శకుంతల-దుష్యంతుడి కొడుకు అంటే మహా సాహసి అయిన భరతుడి గురించి మనకు వేరే ఎలాంటి వివరాలూ లభించవు.
దుష్యంతుడి కొడుకు భరతుడికి ముందే ఈ దేశంలో భరతజనులు ఉన్నారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా, ఆ జాతి సమూహాల పేరున ప్రాచుర్యం పొందిందనే వాదన ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భరత గణం నుంచి భారత్
భరతజనులు అగ్నిపూజకులు, అగ్నిహోత్రులు లేదా యజ్ఞప్రియులు. వైదికిలో భరత్/భరథ్ అంటే అగ్ని, లోకపాలకుడు లేదా విశ్వరక్షకుడు(మోనియర్ విలియమ్సన్) అయిన ఒక రాజు పేరు ఉంది.
ఈ రాజు సరస్వతి, ఘగ్ఘర్ తీరాలను పాలించిన అదే భరతుడు. సంస్కృతంలో ‘భర్’ అంటే యుద్ధం, సమూహం లేదా జనగణం, నిర్వహణ అనే అర్థాలు ఉన్నాయి.
ప్రముఖ భాషావేత్త డాక్టర్ రామవిలాస్ శర్మ “ఈ అర్థాలు పరస్పరం భిన్నంగా, విరుద్ధంగా అనిపిస్తాయి. ‘భర్’ అనే దానికి యుద్ధం, నిర్వహణ అనే రెండు అర్థాలూ వస్తే అది ఈ పదం లక్షణం కాదు. భర్ అంటే మూలార్థం గణం, అంటే జనం. గణంలాగే జనం కోసం కూడా దానిని ఉపయోగించుకోవచ్చు. దానితోపాటూ భరత్ పేరుతో ప్రసిద్ధి చెందిన జన విశేషణానికి కూడా అది సూచకం” అన్నారు.
దాని అర్థం ఏంటి?
నిజానికి భరత జనుల వృత్తాంతం ఆర్య చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది. ఇది ఎంత పురాతన కాలం నుంచి వస్తోందంటే ఒక్కోసారి యుద్ధం, అగ్ని, సంఘం లాంటి మాటలకు సమానంగా భారత్ అనే అర్థాన్ని కుదించి దానిని ఒక నామవాచకంగా ఉంచేశారు. అందుకే ఒక్కోసారి అది దశరథ పుత్రుడు భరతుడితో, ఇంకోసారి సందర్భంలో దుష్యంత పుత్రుడు భరతుడిని గుర్తు చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారతి, సరస్వతి భరతుల బంధం
కానీ వేల ఏళ్ల క్రితం అగ్నిప్రియులైన భరతజనులు శుచి, శుభ్రత, సదాచారాలకు ప్రాధాన్యం ఇచ్చి చూపించారు. నిరంతర యజ్ఞకర్మలు చేయడం వల్ల భరత్, అగ్ని అనే పదాలు ఒకదానికొకటి కలిసిపోయాయి. భరత్, భారత్ మాటలు అగ్నికి విశేషణాలుగా మారిపోయాయి.
కొన్ని సందర్భాలు దేవశ్రవ, దేవవ్రత అనే ఇద్దరు భరతులు అంటే భరతజనులైన ఇద్దరు రుషులు చిలకడం వల్లే అగ్ని పుట్టిందని చెబుతున్నాయి.
భరతులకు అగ్నికి సంబంధించిన చరిత్ర, సంప్రదాయం గురించి తెలుసు అని రుగ్వేదంలో కవి చెప్పారని రామవిలాస్ శర్మ చెప్పారు..
భరతులతో నిరంతర పరిచయం వల్ల అగ్నిని భారత్ అన్నారు. అలాగే యజ్ఞాలలో నిరంతరం కవితాపాఠాలు చదవడం వల్ల అక్కడ కవులు చెప్పినదానిని భారతి అన్నారు. ఆ కవితా పాఠం సరస్వతి తీరంలో జరిగేది. అందుకే ఆ పేరు కూడా కవులకు సంబంధించినదే.
ఎన్నో వైదిక మంత్రాల్లో భారతి, సరస్వతి ప్రస్తావన ఉంది.
దశరాజ్ఞ్ యుద్ధం లేదా పది రాజుల యుద్ధం
ప్రాచీన గ్రంథాల్లో వైదిక యుగంలో ఒక ప్రముఖ జాతి పేరు చాలా సందర్భాల్లో వస్తుంది. అది సరస్వతి నది లేదా ఇప్పటి ఘగ్ఘర్ ఒండ్రునేలల్లో నివసించే సమూహం. వారు యజ్ఞప్రియులు, అగ్నిహోత్రులు.
ఇదే భరత జనుల పేరుతో ఆ కాలంలో మొత్తం భూభాగానికి ‘భరతవర్ష్’ అనే పేరు పెట్టారు. పండితులు చెబుతున్నదాని ప్రకారం భరత జాతికి అధిపతి సుదాసుడు.
వైదిక యుగం నుంచి కూడా మొదట నైరుతి భారతంలో నివసించే వారిలో ఎన్నో సమాజాలు ఉండేవి. వారిని జన్ అనేవారు.
అలాగే భరతుల ఈ సమాజాలను భరతజనులు అనే పేరుతో పిలిచేవారు. మిగతా ఆర్య సమాజాలు కూడా చాలా రకాల జనాలుగా విభజనకు గురయ్యారు. వారిలో పురు, యదు, తుర్వసు, త్రత్సు, అను, ద్రుహ్యు, గాంధార, విషాణిన్, పక్థ్, కేకయ్, శివ్, అలిన్, భలాన్, త్రిత్సు, సంజయ్ లాంటి సమూహాలు ఉండేవి.
ఆ జనాల్లోని పది జనాలతో సుదాస్, అతడి తృత్సు వంశం యుద్ధం చేసింది.
సుదాసుడి తృత్సు వంశానికి వ్యతిరేకంగా పది ప్రముఖ జాతుల గణం లేదా జనాలు యుద్ధం చేశారు. వారిలో పంచజన్(దీనిని అవిభక్త పంజాబ్‌గా భావించాలి) అంటే పురు, యదు, తుర్వసు, అను, ద్రుహ్యుతోపాటూ భాలానస్(బోలాన్ పాస్ ప్రాంతం), అలిన్(కాఫిరిస్తాన్), శివ్(సింధ్), ప్రక్థ్(పస్తూన్) విషాణిని వంశం వారూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహాభారతానికి 2500 ఏళ్ల క్రితమే మొదటి భారత్
అప్పుడు జరిగిన ఈ మహాయుద్ధం మహాభారతం కంటే రెండున్నర వేల ఏళ్ల క్రితమే జరిగిందని చెబుతున్నారు. అయితే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగుంటుంది.
చరిత్రకారుల వివరాల ప్రకారం క్రీ.పూర్వం సుమారు 2500 ఏళ్ల క్రితం కౌరవులు-పాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగి ఉండచ్చు.
అలా అనడానికి కారణం, ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దులో వచ్చే దాదాపు అన్ని సామ్రాజ్యాలూ పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు.
దశరాజ్య యుద్ధాలు ఆ యుద్ధం కంటే 2500 సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు. అంటే ఇప్పటికి సుమారు 7500 ఏళ్ల క్రితం అప్పటి యుద్ధం జరిగింది.
అందులో తృత్సు జాతి ప్రజలు పది రాజ్యాల సమాజాలపై అఖండ విజయం సాధించారు. తృత్సు జనులను భరతుల సమాజం అనేవారు. ఈ యుద్ధానికి ముందు ఈ ప్రాంతం ఎన్నో పేర్లతో ప్రసిద్ధి చెందింది.
ఆ విజయం తర్వాత అప్పటి ఆర్యావర్తనంలో భరతజనుల ప్రతిష్ట అంతకంతకూ పెరిగింది. అప్పటి జిల్లాల మహాసమాఖ్య పేరు భారత్ అయ్యింది. అంటే భరతుల రాజ్యం అని అర్థం.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో కచ్ జిల్లా ధొలవిరాలోని సింధూ లోయ నాగరికతకు చెందిన స్థలం
భారత్-ఇరాన్ సంస్కృతి
మహాభారతంలో ప్రస్తావించిన శకుంతల పుత్రుడు మహాబలుడు భరతుడి ప్రస్తావన ఒక ఆసక్తి కలిగించే విషయం అనేది అందరికీ తెలిసిందే.
ఇక హింద్, హిందుస్తాన్ విషయానికి వద్దాం.
ఇరానీ-హిందుస్తానీలకు పురాతన సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ మొదట పర్షియా. అంతకు ముందు దానిని ఆర్యనమ్, ఆర్యా, లేదా ఆర్యాన్ అనేవారు. అవెస్తాలో ఈ పేర్ల గురించిన ప్రస్తావన ఉంది.
హిందూకుష్ అవతల ఉన్న ఆర్యులు వారి సమాజాన్ని ఇరాన్ అన్నారు. తూర్పున ఉన్న సమాజాలను ఆర్యవర్తులు అన్నారు. ఈ రెండు సమూహాలూ చాలా గొప్పవి, ప్రభావవంతమైనవి.
నిజానికి భారత్ అనే పేరును సుదూరతీరాలకు.. పశ్చిమం వరకూ చేర్చింది ఇరానీయులే.
కుర్దు సరిహద్దుల దగ్గర ఉన్న బెహిస్తూన్ శిలాఫలకంపై చెక్కిన హిందుష్ అనే మాట దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది.
పర్షియన్లు అరబిక్ కూడా నేర్చుకున్నారు. కానీ తమదైన శైలిలో..
ఒక సమయంలో అగ్నిని పూజించే జొరాస్ట్రియన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అందుకే అక్కడ ఇస్లాం ఆవిర్భావం కూడా సాధ్యం కాలేదు. ఇది ఇస్లాం కంటే శతాబ్దాల ముందు, క్రీస్తు కంటే ముందు నాలుగు శతాబ్దాల క్రితం మాట.
సంస్కృతం-అవెస్తాకు బొడ్డుపేగు బంధం ఉంది. హిందూకుష్-బమియాన్ ఈ వైపు యజ్ఞాలు జరుగుతుంటే ఆ వైపు యష్న్ ఉండేది. ఆర్యమన్, అథర్వన్, హోమ, సోమ, హవన్ లాంటి సమానార్థకాలు ఇక్కడా, అక్కడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TAPI Collection of Praful and Shilpa Shah, Surat
క్రీస్తు పూర్వం 35-28 శతాబ్దాల మధ్య కాలం నాటి పాత్ర
హింద్, హిందష్, హింద్వాన్
హిందుష్ మాట క్రీస్తు పూర్వం 2 వేల ఏళ్ల క్రితమే అక్కాదీ నాగరికతలో ఉంది. అక్కద్, సుమేర్, ఈజిఫ్టియన్ అన్నిటితో భారత్‌కు బంధాలు ఉండేవి. అది హరప్పా శకం నాటి మాట.
సింధు అంటే నది మాత్రమే కాదు, దానికి సముద్రం, ప్రవాహం, జలం అనే పర్యాయపదాలు ఉన్నాయి. సింధ్ అనే ఏడు నదులున్న ‘సప్త సింధు’ ప్రాంతాన్ని ప్రాచీన ఫారసీలో ‘హఫ్త హిందు’ అనేవారు.
హిందూకు వేరే అర్థాలు ఉన్నాయా?
హింద్, హిందూ, హింద్వాన్, హిందుష్ లాంటి ఎన్నో మూలాలు అత్యంత ప్రాచీనమైనవి.
‘ఇండస్’.. ఇదే ‘హిందిష్’ మాటకు గ్రీకు సమరూపం. ఇది ఇస్లాం కంటే శాతాబ్దాల పురాతన విషయం.
నిజానికి హింద్ అత్యంత పురాతన పదం భారత్‌కు గుర్తింపు తీసుకొచ్చింది అనేదానికి గ్రీకులో భారత్‌కు ‘ఇండియా’, సింధుకు ‘ఇండస్’ అనే మాటల ప్రయోగాలు ప్రామాణికంగా నిలుస్తాయి. సంస్కృతంలోని ‘స్థానం’ ఫారసీలో ‘స్తాన్’ అవుతుంది.
అలా, ‘స్తాన్’ అనే మాట ‘హిందు’కు జతకలిసి ‘హిందుస్తాన్’ అయ్యింది. అంటే హిందువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అని అర్థం.
భారత-యూరోపియన్ భాషల్లో ‘హ’ అనే అక్షరం ‘అ’ గా రూపాంతరం చెందుతుంది. ‘స’ అనేది ‘అ’ అవదు.
మెసపటోమియా సంస్కృతులతో హిందువులకు పరిచయం ఉంది. హిందూ నిజానికి గ్రీకు ఇండస్, అరబ్, అక్కాద్, పర్షియన్ సంబంధాల ఫలితంగా వచ్చింది.
మనం భారతీయులం
‘ఇండికా’ అనే మాటను మెగస్తనీస్ ప్రయోగించారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాటలీపుత్రలో ఉన్నారు. కానీ అక్కడికి చేరుకునే ముందు బఖ్త్ర్, బఖ్త్క్రీ(బైక్ట్రియా), తక్షశిల(టెక్సల) ప్రాంతాల గుండా ప్రయాణించారు. అక్కడ హింద్, హింద్వాన్, హిందూ లాంటి మాటలు ప్రాచుర్యం పొందాయి.
ఆయన గ్రీకు ఉచ్ఛారణ ప్రకారం వాటికి ‘ఇండస్’, ‘ఇండియా’ లాంటి పదాలు రాసుకున్నారు. ఇది క్రీస్తు శకం 3, మహమ్మద్ నుంచి 10వ శతాబ్దం మొదట్లో జరిగిన విషయం.
ఇక ‘జంబూద్వీపం’ అనే మాటకు వస్తే, అది మన దేశానికి అత్యంత పురాతన పేరు. అది భారత్, ఆర్యవర్త, భరతవర్ష్ అనే పేర్ల కంటే పాతది.
కానీ ఈ వివరణలన్నింటికీ చాలా వివరాలు అవసరం అవుతాయి. వీటిపై ఇప్పటికీ చాలా లోతుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
నేరేడిపండును సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. ఈ కేంద్ర భూమిలో అంటే నేటి భారత్‌లో ఒకప్పుడు నేరేడు చెట్లు చాలా ఎక్కువగా ఉండేవని ప్రస్తావన ఉంది. అందుకే దీనిని ‘జంబూద్వీపం’ అనేవారు.
ఏదేమైనా, మన స్ఫూర్తి జంబూద్వీపంతో కలిసి లేదు, భారత్ అనే పేరుతోనే ఉంది. భరత్ అనే మాట వినిపించిన అన్ని చరిత్ర పొరల్లోనూ ఈ భూమి భారతదేశంగా మారిన కథలు ఇమిడిపోయి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- వలస కార్మికుల వల్ల కరోనావైరస్ గ్రామాలు, పట్టణాలకు చేరిందా?
- కృత్రిమ మేధస్సు: కరోనావైరస్ను ఈ అధునాతన సాంకేతికత అడ్డుకోగలదా?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)