కరోనావైరస్: వలస కార్మికుల వల్ల కోవిడ్ కేసులు గ్రామాలు, పట్టణాలకు చేరాయా? ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?
- సమీరాత్మజ్ మిశ్రా
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC
వలస కార్మికులు తిరిగి సొంత ఇళ్లకు చేరిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వైరస్ పరిధి ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా చేరింది.
వలస కార్మికులు, మిగతా వారు భారీ సంఖ్యలో సొంత రాష్ట్రానికి తిరిగి రాకముందు గ్రామాల్లో ఎలాంటి వైరస్ కేసులు లేవు.
ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలకు దగ్గరగా చేరుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 257 మంది చనిపోయారు.
ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య వందలకు చేరుకుంది. శుక్రవారం రాష్ట్రంలో 500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పటివరకూ సుమారు ఆరు వేల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు.
ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో కరోనా తొలి కేసు మార్చి 30న నమోదైంది. అతడు గోరఖ్‌పూర్ బీఆర్సీ మెడికల్ కాలేజీలో చనిపోయాడు. ఆ తర్వాత ఒక నెల వరకూ కేసులు నెమ్మదిగానే ఉన్నాయి. కానీ మే నెలలో వైరస్ వ్యాప్తి పెరగడమే కాదు, పాజిటివ్ కేసులు గ్రామాలకు కూడా విస్తరించాయి.
బస్తీలో శుక్రవారం నాటికి కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 218కి చేరుకుంది. ఇప్పటివరకూ అక్కడ ఏడుగురు చనిపోయారు. ముగ్గురికి నెగటివ్ రావడంతో ఇళ్లకు కూడా పంపించేశారు.
బస్తీ కలెక్టర్ అశుతోష్ నిరంజన్ “కేసుల సంఖ్య పెరిగినప్పటికీ జిల్లాలో కల్లోల పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసులన్నీ వలసదారులవే” అన్నారు.
అమేఠీ లాంటి చిన్న జిల్లాలో లాక్డౌన్-3 వరకూ ఎలాంటి పాజిటివ్ కేసులూ లేవు. దానిని గ్రీన్ జోన్‌గా కూడా ప్రకటించారు. కానీ, మే 5న ఇక్కడ మొదటి కేసు నమోదవడం నుంచి ఇప్పటికి ఆ సంఖ్య 150కి పైనే చేరుకుంది.
వీటిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. జిల్లాలో చాలా గ్రామాలను కంటైన్మెంట్లుగా మార్చేశారు. అక్కడ అత్యవసర వస్తువుల సరఫరాను అధికార యంత్రాగమే చూసుకుంటోంది.
ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
2700కు పైగా వలస కార్మికులకు కరోనా
ఇప్పటివరకూ, రాష్ట్రానికి చెందిన దాదాపు 25 లక్షల మంది వలస కార్మికులు ముంబయి, దిల్లీ, గుజరాత్, పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సుల్లో వచ్చారు. వీరు కాకుండా జనం పెద్ద సంఖ్యలో కాలినడకన, సైకిళ్లు, ట్రక్కుల్లో కూడా స్వగ్రామాలకు చేరుకున్నారు.
ఇప్పటివరకూ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 2,719 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అది రాష్ట్రంలోని మొత్తం కరోనా రోగుల్లో 30 శాతం.
ప్రయాగరాజ్‌ను యూపీలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా చెబుతారు. కానీ కరోనా మొదటి కేసు అక్కడ ఏప్రిల్ 5న బయటపడింది.
అయితే ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్ కేసులు మిగతా ప్రాంతాల్లో ఉన్నంత వేగంగా పెరగలేదు. ప్రస్తుతానికి అక్కడ 113 కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులవే.
“మా జిల్లాకు దాదాపు లక్షా 35 వేల మంది కార్మికులు బయట నుంచి వచ్చారు. గ్రామీణ స్థాయిలో నిఘా కమిటీలు ఏర్పాటు చేశాం. నిఘా లేకుండా ఎవరూ స్థానికులను కలవకుండా జాగ్రత్త తీసుకున్నాం. బయటి నుంచి వచ్చేవారిని పరీక్షలు చేశాకే వారి గ్రామాల్లోకి పంపిస్తున్నాం. పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నాం” అని ప్రయాగరాజ్ జిల్లా కలెక్టర్ భానుచంద్ర గోస్వామి చెప్పారు.
ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
వలస కార్మికులపై ప్రభుత్వం కన్ను
అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో వలస కార్మికుల వల్ల వారిని కలిసిన కుటుంబ సభ్యులకు, మిగతా వారికి కూడా కరోనా వ్యాపించింది.
రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి పేరు వెల్లడించవద్దనే షరతుతో “ఇప్పటివరకూ కష్టంగా మూడున్నర లక్షల మందికి పరీక్షలు చేశాం. రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు 25 లక్షలకు పైనే ఉన్నారు. అలాంటప్పుడు గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలు అందరూ ప్రభుత్వ నిఘాలో ఉన్నారని చెప్పడం కష్టం” అన్నారు.
దారుణంగా క్వారంటైన్ కేంద్రాల పరిస్థితి
శ్రామిక రైళ్లలో, ప్రభుత్వ బస్సుల్లో, ఇతర వాహనాల్లో చట్టబద్దంగా వచ్చిన వారికంటే చాలా మంది తమకు తాముగా మిగతా రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. వీరిలో కొంతమంది క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లినా, ఎక్కువ మంది నేరుగా తమ ఇళ్లకు, గ్రామాలకు వెళ్లిపోయారు.
వీరిలో ఎక్కడా అసలు పరీక్షలు చేయించుకోని వారు, ఎక్కడా క్వారంటైన్ కేంద్రాల్లో ఉండని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అలాంటి వారికి వైరస్ ఉంటే, కచ్చితంగా మిగతా వారికి కూడా అది సులభంగా వ్యాపిస్తుందని నిపుణలు చెబుతున్నారు. ఎందుకంటే వచ్చినవారిలో ఎక్కువమంది కార్మికులు ముంబయి, దిల్లీ, గుజరాత్ నుంచే ఉన్నారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది.
అంతే కాదు, వలస కార్మికులను క్వారంటైన్ చేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపించడమే కాదు, చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వాటి నుంచి జనాలు పారిపోతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాల నుంచి కొందరు పారిపోయారని లేదా ఏర్పాట్లు సరిగా లేవని ఫిర్యాదు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఫొటో సోర్స్, DM Prayagraj
ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్ భానుచంద్ర గోస్వామి
నిబంధనలు గాలికి వదిలేశారు
లఖ్‌నవూ సీనియర్ జర్నలిస్ట్ యోగేష్ మిశ్రా “గ్రామీణ స్థాయిలో పాజిటివ్ వచ్చినవారు ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో ఉంటున్నారు. కానీ, వారు ఎలాంటి నిబంధనలూ పాటించడం లేదు. కొందరు స్కూళ్ల బయట కూర్చుని పేకాడుకుంటుంటే, కొందరు క్వారంటైన్లో ఉండకూండా రోజంతా గ్రామాల్లో తిరుగుతున్నారు. కొన్ని చోట్ల సామాజిక దూరం అనే నిబంధనే కనిపించడం లేదు” అన్నారు.
యూపీలో కరోనా కేసుల పర్యవేక్షణ కార్యక్రమ గణాంకాల ప్రకారం యూపీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో వైరస్ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం 74,237 మంది వలస కార్మికులకు పరీక్షలు చేస్తే వారిలో కేవలం 2404 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ గణాంకాలు సుమారు 3 శాతం.
“దీనిని బట్టి వలస కార్మికులు రాష్ట్రానికి వైరస్ తీసుకుని రాలేదని, వారు ఏదో ఒక విధంగా విదేశాల్లో ఉన్న వారి కాంటాక్టులోకి వెళ్లడం వల్ల స్వయంగా వ్యాధికి గురయ్యారనే వాదనకు ఈ గణాంకాల నుంచి బలం ఇస్తోందని” నిపుణులు చెబుతున్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్: మాస్కు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు జరిమానా విధించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)