కరోనావైరస్ టెస్టుల విషయంలో వాస్తవాలు దాస్తున్నారు: తెలంగాణ ఆరోగ్యశాఖపై హైకోర్టు సీరియస్‌ - ప్రెస్‌ రివ్యూ

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం, అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనాన్ని ప్రముఖంగా ఇచ్చింది.

ఆ కథనం ప్రకారం.. టెస్టులకు సంబంధించి ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఎన్ని శాంపిల్స్‌ తీసుకున్నారు, ఎన్ని టెస్టులు చేశారు, పాజిటివ్‌ ఎన్ని, నెగెటివ్‌ ఎన్ని, క్వారంటైన్‌ సెంటర్లకు ఎంతమందిని పంపారు అనే విషయాలు వెల్లడించాలని ఆదేశించింది.

ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కారంగా తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు ఈ కథనం పేర్కొంది. తమ ఆదేశాలంటే ఆరోగ్య శాఖకు లెక్కలేనట్లుగా ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మృతదేహాల పరీక్షలపై సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే కరోనాను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సమగ్ర వివరాలతో మళ్లీ విచారణకు రావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images

మాంసాన్ని ఉప్పుతో కడగాల్సిందే: ఎన్‌ఐఎన్‌

కరోనా ప్రబలుతున్న సమయంలో మాంసంపై కొందరు అపోహలు పెంచుకుంటున్నారని, అలాంటివి అవసరంలేదని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొన్నట్లు 'నమస్తే తెలంగాణ' పత్రిక ఒక కథనం రాసింది.

మాంసం వల్ల మనిషి శరీరానికి పోషకాలు లభిస్తాయని, కాకపోతే మాంసం కొన్నాక దానిని ఉప్పుతో కడిగి వండుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

వండిన తర్వాత బ్యాక్టీరియా చనిపోతుందని, అందువల్ల ప్రమాదం ఉండదని వారు ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చికెన్‌, మటన్‌, చేపలు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచిదని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు సూచించారు. అయితే కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తున్న షాపుల నుంచి మాత్రమే మాంసం కొనుగోలు చేయాలని కూడా వారు సూచించారు.

ఫొటో సోర్స్, @Nara Lokesh

ఇది విధ్వంస పాలన: లోకేశ్‌

'విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌' పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రజా ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారని 'ఈనాడు' పత్రిక ప్రధాన వార్తగా రాసింది.

ఆ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాది పాలనలో నవమోసాలు, నవభారాలు, నవస్కామ్‌లు, నవఅబద్ధాలు, నవరాజ్యాంగ ధిక్కరణలు, నవమళ్లింపులే జరిగాయని, ప్రజలకు ఏం ఒరగలేదంటూ ప్రభుత్వం పైనా, సీఎం తీరుపైనా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు.

ఇంత దారుణమైన పాలనను ప్రజలు ఇంత వరకు చూడలేదని, వైసీపీ కార్యకర్తలే అసంతృప్తితో రగిలిపోతున్నారని లోకేశ్‌ విమర్శించినట్లు ఈ కథనంలో పేర్కొంది.

వీఆర్వోలను ఏం చేద్దాం?: తెలంగాణ సర్కారు ప్రయత్నాలు

గ్రామ రెవిన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు 'సాక్షి' పత్రిక ఒక కథనం ప్రచురించింది. ప్రక్షాళనలో భాగంగా వీఆర్వోల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ కథనం ప్రకారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం లేదంటే , వారి విధులను, అధికారాలను మార్చడం, వీటిని పంచాయితీరాజ్‌, వ్యవసాయ శాఖలకు బదిలీ చేయడంలాంటి అంశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. భూ వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకాల జారీలో వీఆర్వోల వల్లనే సమస్యలు పెరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.

ఒక్కసారి వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేస్తే ఉద్యోగా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి... వారి విధుల్లో మార్పులతో ప్రక్షాళనను మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ మార్పులు చేర్చులు ఎలా ఉండాలి అన్న విషయంలో ఇప్పటికే అంతర్గతంగా ఒక రిపోర్టు సిద్దమయిందని, ఈ మేరకు తుది నిర్ణయం ముఖ్యమంత్రి చేతిలో ఉన్నట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)