తెలంగాణలో కుల అహంకార హత్య: 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశార'ని తేల్చిన పోలీసులు

తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. వేరే కులానికి అంటే వారి దృష్టిలో తమకంటే తక్కువ కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించినందుకు కన్న తల్లితండ్రులే సొంత కుమార్తెను హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట్లకు చెందిన భాస్కర శెట్టి, వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తె (20 ఏళ్లు) ఏపీలోని కర్నూలు పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది.
తోటి విద్యార్థి అయిన ఓ యువకుడిని ప్రేమించింది. మార్చి నెలలో లాక్డౌన్కు రెండు రోజుల ముందు ఇంటికి వచ్చింది. ఆ యువతిని తల్లిదండ్రులు శనివారం నాడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
ఆమె గర్భంతో ఉందని పరీక్షలో నిర్ధారణ కావటంతో అబార్షన్ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో వారు ఆమెను తీసుకొని ఇంటికి వచ్చేశారు.
ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక యథావిధిగా మిగిలిన ఇద్దరు కుమార్తెలతో ఆరు బయట నిద్రపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల సమయంలో.. భాస్కర శెట్టి, వీరమ్మలు తమ కూతురిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత ఆమె గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కానీ, పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందటంతో దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి గొంతు మీద గాయాలు కనపడ్డాయి. దీంతో హత్యోదంతం వెలుగు చూసింది.
"మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానంతో దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారు తమ నేరాన్ని అంగీకరించారని శాంతినగర్ ఎస్ఐ కె. శ్రీహరి చెప్పారు.
''తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించడం, అబార్షన్ చేసుకోవాలని కోరితే నిరాకరించడం, మిగిలిన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆ దంపతులు పోలీసుల విచారణలో తెలిపారు" అని ఆయన వివరించారు.
తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. దాన్ని హత్య కేసుగా మార్చారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆ యువతి ప్రేమించిన యువకుడి వివరాలు తెలియదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఆగని కుల అహంకార హత్యలు
తక్కువ కులం వారిని ప్రేమించారని, పెళ్లి చేసుకున్నారనే ఆగ్రహంతో కన్నబిడ్డలనే చంపుకునే ఈ ధోరణి ఆందోళనకరంగా పెరుగుతోంది. కొందరు తమ బిడ్డలనే చంపేస్తుంటే, మరికొందరు తమ బిడ్డలు ప్రేమించిన వారిని అంతం చేస్తున్నారు. రెండేళ్ల కిందట తెలంగాణలో జరిగిన ప్రణయ్ హత్య కూడా ఇలాంటిదే.
దేశంలో హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో ఇలాంటి కుల అహంకార హత్యలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు.
లాక్ డౌన్ కారణంగా దేశంలో జనజీవనం స్తంభించిపోయిన వేళ ఏప్రిల్ మొదటివారం తమిళనాడులో ఎం.సుధాకర్ అనే పాతికేళ్ల దళిత యువకుడిని చంపేశారు. ఆ పని చేసింది ఆర్నెళ్ల కిందట ఆయన్ను ప్రేమించి పెళ్లాడిన అగ్రకుల అమ్మాయి తండ్రి, అతడి బంధువులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఏపీలో గత ఏడాది అక్టోబరులో చిత్తూరు జిల్లా కుప్పం మండలం రెడ్లపల్లిలో చందన అనే 17 ఏళ్ల అమ్మాయిని కూడా తల్లిదండ్రులే హతమార్చి దహనం చేసేసిన ఘటన వెలుగుచూసింది. దళితుడిని పెళ్లాడినందునే ఆమెను హత్య చేశారన్న ఆరోపణలున్నాయి.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు
తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చినవి.. వెలుగు చూడనవి ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2015లో అత్యధికంగా ఇలాంటి 251 హత్యలు జరిగాయి. 2016లో 77 జరిగాయి. అయితే, ఈ సంస్థ లెక్కల ప్రకారం 2018లో మాత్రం ఇలాంటి హత్యలు 29 జరిగాయి.
అయితే, మదురైకి చెందిన ఎవిడెన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నిత్యం ఇలాంటి హత్యలను ట్రాక్ చేస్తూ గత అయిదేళ్లలో ఒక్క తమిళనాడులోనే 195 కుల అహంకార హత్యలు జరిగినట్లు తేల్చింది.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల్లో ఇలాంటి హత్యలను ఇతర కారణాలతో జరిగే హత్యలుగా చూపిస్తున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. అయితే, ప్రేమ కారణంతో జరుగుతున్న హత్యలు దేశంలో పెరుగుతున్నట్లు మాత్రం ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి.2001 నుంచి 2017 మధ్య ప్రేమ కారణాలతో జరిగిన హత్యలు 28 శాతం పెరిగాయి. 2001 నుంచి 2017 మధ్య ప్రేమ వ్యవహారాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి సగటున 384 హత్యలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ సగటు 395గా ఉంది.
ఇవి కూడా చదవండి:
- తమిళనాడు 'పరువు' హత్య: తండ్రికే మరణశిక్ష పడేట్లు చేసిన యువతి
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?
- కరోనావైరస్: 'లాక్డౌన్లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)