కరోనావైరస్: వలస కూలీలను 15 రోజుల్లో వారి ఇళ్లకు పంపించండి: సుప్రీంకోర్టు ఆదేశం

వలస కూలీలు

ఫొటో సోర్స్, JEWEL SAMAD/GETTY IMAGE

అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఉన్న వలస కూలీలను వారి వారి రాష్ట్రాలకు 15 రోజుల లోగా పంపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం 24 గంటల్లో శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

రాష్ట్రాలలో చిక్కుకు పోయిన వలస కూలీల వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం దీనిపై తన ఆదేశాలను వెలవరించింది.

వలస కూలీల రవాణాకు సమస్యకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నామని, వాటిని అనుసరించాలని తన ఆర్డర్లలో పేర్కొంది. అవసరాన్ని బట్టి రైల్వే శాఖ 24 గంటల్లో శ్రామిక్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు సంబంధించి వలస కూలీలపై నమోదైన కేసులను డీఎంఏ 2005 చట్టం ప్రకారం వెనక్కి తీసుకోవాలంది. వలస కూలీలను గుర్తించడానికి కేంద్రం, రాష్ట్రాలు ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.

అలాగే వలస కూలీలలో వివిధ నైపుణ్యాలను గుర్తించాలని కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. వలస కూలీలకు ఏయే పథకాలు అందుబాటులో ఉన్నాయో బహిరంగంగా చెప్పాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

ఏం చేస్తున్నారు?: సుప్రీం ప్రశ్నల వర్షం...

అంతకుముందు వలస కార్మికుల కష్టాలపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గురువారం నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఆహారం, నిధులు, వసతి, రవాణా సదుపాయాలకు సంబంధించిన మొత్తం ఏర్పాట్ల గురించి శరపరంపరలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దాదాపు 50 ప్రశ్నలు అడిగింది. ''తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికి రిజిస్ట్రేషన్, రవాణా, ఆహారం, తాగునీరు అందించటంలో పలు లోపాలను మేం గుర్తించాం'' అని ధర్మాసనం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా వివరణ ఇస్తూ.. మే1వ తేదీన ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభించినప్పటి నుంచీ మే 27వ తేదీ వరకూ 3,700 ప్రత్యేక రైళ్లు నడిపామని, దాదాపు కోటి మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించామని చెప్పారు. గత కొన్ని రోజులుగా రైల్వే విభాగం వలస కార్మికులకు 84 లక్షల భోజనాలు అందించిందన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరూ తమ స్వస్థలాలకు వెళ్లేవరకూ తమ కృషిని, రైలు సర్వీసులను ఆపబోమని పేర్కొన్నారు.

''ప్రభుత్వం పెద్ద సంఖ్యలో చర్యలు చేపట్టింది.. వాటిపట్ల సుప్రీంకోర్టు ఇంతకుముందు సంతృప్తి చెందింది'' అని మెహతా ఉటంకించారు. ''అంతామునిగిపోతోందని జోస్యం చెప్పేవారు దీనిని రాజకీయ ప్రసంగాలకు వేదికగా వాడుకోవటానికి'' కోర్టు అనుమతించరాదని కేంద్రం పేర్కొంది. ''తమ వాదన వినాలని అంటున్నవారు వలస కార్మికుల కోసం ఏం చేశారో అఫిడవిట్లు సమర్పించమనండి'' అని వ్యాఖ్యానించారు.

కాలినడకన ప్రయాణిస్తున్న వలస కార్మికులను తక్షణమే షెల్టర్లకు తీసుకెళ్లి వారికి ఆహారంతో పాటు కనీస సదుపాయాలన్నీ కల్పించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.

వలస కార్మికులు తమ వంతు ప్రయాణం కోసం వేచిచూస్తున్నంత కాలం వారికి వసతి కల్పిస్తున్న ప్రాంతం వివరాలను నోటిఫై చేసి ప్రచారం చేయాలని చెప్పింది. వారికి సహాయం అందించటానికి చేపట్టిన చర్యలతో అఫిడవిట్లు సమర్పించాలని కూడా నిర్దేశించింది.

వలస కార్మికుల్లో 80 శాతం మందికి పైగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారేనని మెహతా చెప్పారు. ''రోజుకు సగటున 187 రైళ్లలో 1.85 లక్షల మంది వలస కార్మికులను రవాణా చేస్తున్నాం. ప్రారంభ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలిస్తున్నాం'' అని వివరించారు.

వలస కార్మికుల ప్రయాణం, వారికి ఆహారం అందించటం ప్రధాన సమస్య అని కోర్టు చెప్పింది. ''మొదటి సమస్య ప్రయాణం. వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా వారాల తరబడి వేచి ఉంటున్నారు. ఏ దశలో అయినా వీరు డబ్బులు చెల్లించాలని అడుగుతున్నారా? ప్రయాణ ఖర్చులను ఎవరు భరిస్తున్నారు?'' అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images

దీనికి మెహతా బదులిస్తూ.. రైలు చార్జీలను వలల కూలీలు ప్రయాణం ప్రారంభించే రాష్ట్రం కానీ, వారిని స్వీకరించే రాష్ట్రం కానీ భరించాలని నిర్ణయించటం జరిగిందని.. వలస కార్మికుల నుంచి మాత్రం వసూలు చేయబోమని చెప్పారు.

వలస కూలీలు ఉన్న రాష్ట్రం వారిని రైల్వే స్టేషన్లకు తీసుకువస్తుందని.. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే వారికి స్క్రీనింగ్ నిర్వహించి, భోజనం అందిస్తుని తెలిపారు.

''రైలు మొదలైన తర్వాత రైళ్లలోని వారికి రైల్వే విభాగం ఆహారం అందిస్తుంది. ప్రయాణం తక్కువగా ఉంటే ఒక భోజనం, ఎక్కువగా ఉంటే రెండు భోజనాలు అందిస్తున్నాం. వారు తమ రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని బస్సుల్లో వారి వారి గ్రామాలకు తరలిస్తుంది'' అని వివరించారు.

ప్రభుత్వం ఏమీ చేయటం లేదని కాదని.. కానీ చిక్కుకుపోయి ఉన్న వలస కూలీల సంఖ్యను చూస్తే.. నిర్మాణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరముందని కోర్టు వ్యాఖ్యానించింది.

''ఒకేసారి అందరినీ రవాణా చేయటం సాధ్యం కాదని మేం అంగీకరిస్తాం. కానీ వారిని రవాణా చేసే వరకూ ఆహారం, వసతి తప్పని సరిగా అందించాలి'' అని ధర్మాసనం స్పష్టంచేసింది.

కొందరు కార్మికులు తమ స్వస్థలాలాకు వెళ్లకుండా పనులు తిరిగి ప్రారంభమవటం కోసం వేచివుండాలని కోరుకుంటున్నట్లు మెహతా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. ఒక రాష్ట్రం కూలీలను పంపిస్తే, వారిని తీసుకోవటానికి మరొక రాష్ట్రం తిరస్కరించిన ఉదంతాలు ఉన్నాయంటూ.. ఈ విషయంలో ఒక విధానం ఉండాల్సిన అవసరముందని కోర్టు ఉద్ఘాటించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. అన్నిటికీ రాష్ట్రాలు అంగీకరించాయని, ఇందులో వివాదమేదీ లేదని బదులిచ్చారు.

వలస కూలీల రాకను తిరస్కరిస్తున్న రాష్ట్రమేదీ లేదన్నారు.

ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.ఎస్.నరసింహ.. రాష్ట్రం అసాధారణ చర్యలు చేపట్టిందని, 18 లక్షల మందిని తరలించిందని చెప్పారు. అందుకోసం ప్రతి దశలోనూ ఒక వ్యవస్థను నెలకొల్పినట్లు చెప్పారు. శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నామన్నారు.

బిహార్ తరఫున హాజరైన న్యాయవాది మనీష్ కుమార్.. రోడ్డు మార్గంలో 10 లక్షల మందిని తరలించామని, వారు వచ్చిన రాష్ట్రాలను బట్టి సహాయ కేంద్రాల్లో ఉంచి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దిల్లీ శ్రామిక్ సంఘటన్ తరఫున హాజరవుతూ.. విపత్తు నిర్వహణ చట్టం కింద ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

''హిందీ మాట్లాడని జనం ఉన్నారు. సంభాషించలేని ఇతర రాష్ట్రాల వలసలు ఉన్నారు. వారికి ఎటువంటి ఆహారం అందిస్తున్నారు? పప్పులు అనేది సమాధానం కాదు. వారు ఎక్కడ వండుకుంటారు?'' అని సిబల్ ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు ఈ విచారణలో తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)