కరోనావైరస్: లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కోవిడ్-19 అంటించారు
- పర్విన్ ముధోల్కర్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Reuters
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లాక్ డౌన్ సడలింపుల సందర్భంగా ఓ వ్యక్తి పార్టీ ఇచ్చారు. కానీ ఆ పార్టీ కారణంగా ఏకంగా 180 మందికి కరోనావైరస్ సోకింది.
ఫలితంగా నాయక్ తలావ్ ప్రాంతంలోని సుమారు 700 మందిని క్వారంటైన్లో ఉంచారు. ఒక్క వ్యక్తి అత్యుత్సాహానికి లభించిన ఫలితం ఇది.
పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి నుంచి 180 మందికి కరోనా వ్యాపించిందని, ఆ 180 మందిని కలిసినవారు మరో 700 మంది వరకు ఉన్నారని దీంతో వారిని కూడా క్వారంటైన్‌కి తరలించామని నాగ్‌పూర్ మున్సిపల్ కమిషనర్ తుకారామ్ ముండే బీబీసీకి తెలిపారు.
అసలు ఏం జరిగింది?
నిజానికి నాగ్‌పూర్‌లో సతరాంజిపుర, మొమిన్పుర ప్రాంతాలను మాత్రమే కరోనా హాట్ స్పాట్లుగా గుర్తించారు. కానీ ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్ల ఉత్తర నాగ్‌పూర్‌లోని నాయక్ తలావ్ ప్రాంతం ఇప్పుడు ఆ రెండింటిని మించిపోయింది. ప్రస్తుతం నగరంలో నాయక్ తలావ్ ప్రాంతం సరికొత్త హాట్ స్పాట్. గడిచిన ఆరు రోజుల్లోనే అక్కడ ఏకంగా 180 కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి.
నాయక్ తలావ్ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయో పరిశీలించిన నాగ్‌పూర్ మున్సిపాలిటీ అధికారులు ఒకే కుటుంబంలో 16మందికి పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు.
దీనిపై లోతుగా విచారణ చేపట్టగా అదే కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టు తేలింది. రెండున్నర మాసాల లాక్ డౌన్ ముగియడంతో నాయక్ తలావ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఆ యువకుడు విందును ఏర్పాటు చేశారని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. తన ఐదుగురు స్నేహితులతో కలసి కరోనా హాట్ స్పాట్లలో ఒకటైన మొమిన్ పుర ప్రాంతానికి మాంసం కొనేందుకు ఆ యువకుడు వెళ్లారని కూడా తెలిసింది.
పార్టీ జరిగిన తరువాత ఆ యువకుడు ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను మయో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది.
ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంతకీ ఈ కేసు ఎలా బయటపడింది?
ఇదే విషయమై నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ పర్విన్ ఘంటావర్తో బీబీసీ మాట్లాడింది. “ఒక్కసారిగా నాయక్ తలావ్ ప్రాంతంలో పాజిటివ్ కేసులు బయటపడటంతో అధికారవర్గాలు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డాయి. ఒకే కుటుంబంలో 16మందికి పాజిటివ్ అని రావడంతో ఆ కుటుంబంలో మొదట ఎవరికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయో మేం విచారించాం. అతను ఓ యువకుడని తేలింది. ఆయన్ను ప్రశ్నించగా పార్కులో మార్నింగ్ వాక్ వెళ్లినప్పుడు తనకు ఈ వ్యాధి సోకిందని అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేశారు.
కానీ మరింత లోతుగా విచారించేసరికి లాక్ డౌన్ తర్వాత తాను తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నామని, ఆ పార్టీ తర్వాతే తనకు అనారోగ్యం మొదలయ్యిందని అసలు విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు మాంసం కొనేందుకు కరోనా హాట్ స్పాట్లలో ఒకటైన మొమిన్ పుర కూడా వెళ్లినట్టు స్పష్టం చేశారు. సాధారణంగా జనం ఇలాంటి విషయాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అదే ఎంతో మంది వ్యాధి బారిన పడేందుకు కారణమవుతుంది. ప్రస్తుతం మన ముందు ఉన్న అతి పెద్ద ముప్పు ఇదే” అని డాక్టర్ ఘంటావర్ చెప్పారు.
ఫొటో సోర్స్, FACEBOOK
తుకారం ముండే, నాగపూర్ మున్సిపల్ కమిషనర్
ప్రస్తుతం నాగ్‌పూర్ మున్సిపాలిటీ ముందున్న సవాళ్లేంటి?
తాజా పరిణామాలపై నాగ్‌పూర్ మున్సిపల్ కమిషనర్ తుకారామ్ ముండేను బీబీసీ సంప్రదించింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా లాక్ డౌన్‌ను సడలించడం కచ్చితంగా స్వాగతించదగ్గ పరిణామం, అంత మాత్రాన సడలింపుల్ని సాకుగా తీసుకొని విలాసంగా తిరగమని, పార్టీలు చేసుకోమని కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
“నాయక్ తలావ్ ప్రాంతంలో కేవలం ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతమంతా ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారిపోయింది. దీంతో ఆ ప్రాంతానికి లాక్ డౌన్ సడలింపులు లేకుండా పోయాయి. ఒక్కరు చేసిన తప్పు వల్ల ఎంతో మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది” అని తుకారామ్ ముండే అన్నారు.
కరోనావైరస్ బయటపడిన మొదటి రోజుల్లో సతరాంజిపురాలోని ఓ వ్యక్తికి వైరస్ సోకింది. కానీ ఆ విషయాన్ని ఆయన దాచి పెట్టడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో 120 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. ఇక మొమిన్ పురా విషయానికి వస్తే అక్కడ కూడా ఓ వ్యక్తి కోవిడ్-19 కారణంగా మరణించారు. అయితే కోవిడ్ కారణంగానే చనిపోయారన్న విషయాన్ని వారు కూడా దాచి పెట్టారు. ఫలితంగా అక్కడ ఇప్పటి వరకు 200 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా నాయక్ తలావ్ ప్రాంతంలో ఓ యువకుడు ఇచ్చిన పార్టీ కారణంగా మరో 180 మంది కరోనాబారిన పడ్డారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత?
- పీజీలూ, పీహెచ్‌డీలూ, టీచర్లూ, లెక్చరర్లనూ ఉపాధి హామీ కూలీలుగా మార్చేసిన కరోనా మహమ్మారి
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనా లాక్డౌన్: కష్టకాలంలో డిజిటల్ వైపు మళ్లి, లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు
- ఆరు వసంతాల తెలంగాణ: ఉద్యమం నాటి ఆశలు, ఆకాంక్షలు ఎంతవరకూ నెరవేరాయి?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- లాక్ డౌన్‌తో దేశంలో ఆకలి చావులు పెరుగుతాయి: 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
వీడియో: దక్షిణాఫ్రికా కరోనావైరస్ను ఈ మారుమూల గ్రామం ఎలా ఎదుర్కొంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)