Mi నోట్‌బుక్స్ ల్యాప్‌టాప్‌లు విడుదల.. చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రభావం ఈ కంపెనీపై లేదా?
- నిధి రాయ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, facebook/XiaomiIndia
చైనా టెక్ సంస్థ షావోమీ గురువారం రెండు నోట్‌బుక్స్ ఐదు వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటి ధర 41,999 నుంచి 59,999 వరకూ ఉంది. ఈ సంస్థ మొదటిసారి పీసీ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
కోవిడ్-19 మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం, చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతుండడంతో ల్యాప్టాప్స్ డిమాండ్ పెరుగుతుందని భావించిన సంస్థ వీటిని తయారు చేసింది.
లద్దాఖ్‌లో భారత-చైనా సైన్యం మధ్య ఉద్రిక్తతలతో దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న సమయంలో, రైట్ వింగ్ మద్దతుదారులు ఎంతోమంది చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తున్న తరుణంలో, సంస్థ ఈ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది.
45 కోట్ల మందికి పైగా వినియోగదారులతో, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడు సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. దాని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.
బీబీసీ ప్రతినిధి నిధి రాయ్ స్కైప్ ద్వారా షావోమీ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్‌ను ఇంటర్వ్యూ చేశారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా, అది ఇంకా తమ వ్యాపారంపై ప్రభావం చూపించలేదని ఆయన చెప్పారు.
ఈ ఏడాది మూడు, నాలుగు త్రైమాసికాల్లో మళ్లీ పుంజుకుంటామని కూడా షావోమీ ఆశతో ఉంది.
ఇంటర్వ్యూ సారాంశం
షావోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్
1. మీ వ్యాపారం మీద చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రభావం ఏమైనా ఉందా. దానివల్ల భవిష్యత్తులో మీ వ్యాపారం దెబ్బతింటుందని మీరు భావిస్తున్నారా?
చైనా వ్యతిరేక సెంటిమెంట్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నది నిజమే. సోషల్ మీడియాలో మేం స్పందనలను చూశాం. కానీ మా వ్యాపారంపై దాని ప్రభావం పడుతుందని నేను అనుకోవడం లేదు.
‘షావోమీ ఇండియా’ భారతీయులదే అని నేను చెప్పాలనుకుంటున్నా. స్థానిక అవసరాలకు తగ్గట్టు ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి ఒక బ్రాండ్ నిబద్ధత చూపిస్తుంది. దానిని దేశానికే అందించడం, దేశంలో పెట్టుబడులు పెట్టడం, ఇతర అంశాలతో పాటు ఒక స్థానిక టీమ్ కూడా ఉంటుంది.
మేం వీటితోపాటు, ఇంకా చాలా చేస్తాం. ప్రధాని మేక్ ఇన్ ఇండియా చొరవను మొదట స్వీకరించిన షావోమీ కంపెనీ భారత అభివృద్ధికి కట్టుబడి ఉంది.
ఇప్పుడు మాకు భారత్‌లో 7 స్మార్ట్ ఫోన్ తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. చెన్నైలో పీసీబీఏ యూనిట్లను స్థానికంగా తయారు చేసేందుకు అంకితమైన మొదటి ఎస్ఎంటీ ప్లాంట్ కూడా ఉంది.
పీసీబీఏలను స్థానికంగా అసెంబ్లింగ్ ప్రారంభించేందుకు దేశంలో దారి చూపిన సంస్థల్లో షావోమీ ఒకటి. ప్రస్తుతం మేం స్థానికంగా 99 శాతం స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నాం.
మా నాయకత్వ బృందంలో ఉన్న వారందరూ భారతీయులే. మేం భారత మార్కెట్, వారి అవసరాలు, డిమాండును దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులు సృష్టిస్తున్నాం. మేం భారత్‌లో మా వ్యాపారాన్ని విస్తరించడంపైనే కాదు, ఉద్యోగాల కల్పన కూడా పెంచడంపై దృష్టి పెట్టాం.
మేం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించాం.
ఇప్పటివరకూ మా వ్యాపారంపై సెంటిమెంట్ ప్రభావం ఏదీ మేం చూడలేదు.
ఈ బ్రాండ్ దేశానికి ఎంత కట్టుబడి ఉందో మా ఎంఐ అబిమానులు నిజంగా అర్థం చేసుకోవడమే దానికి కారణం అని మేం అనుకుంటున్నాం.
2. షావోమీపై లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంది?
కోరనా మహమ్మారి వల్ల టెక్నాలజీ రంగంపై గణనీయమైన ప్రభావం ఉంది. లాక్డౌన్ పొడిగించడంతో ఉత్పత్తి, తయారీ ఆగిపోయింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఒక పెద్ద సవాలుగా నిలిచింది.
లాక్‌డౌన్‌తో రవాణా పరిమితులు విధించడంతో రెండో త్రైమాసికంలో అమ్మకాలు కాస్త తగ్గాయి. కానీ మా ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ కనిపించింది.
లాక్డౌన్ సడలించిన తర్వాత మేం పరిశ్రమలో గణనీయమైన డిమాండ్ చూస్తున్నాం.
సాధారణ పరిస్థితులు నెలకొంటే, మూడు, నాలుగు త్రైమాసికాల్లో మార్కెట్ కోలుకుంటుందని, మేం మళ్లీ పుంజుకుంటామని భావిస్తున్నాం.
3. మీ వ్యాపారంపై కార్మికుల సంక్షోభం ప్రభావం ఎలా ఉంది?
లాక్డౌన్ వల్ల తయారీలోనే కాదు, చాలా కార్యకలాపాలపై ప్రభావం పడ్డం మనం చూడచ్చు. మాకు దాదాపు 50 వేల మంది కార్మికులు ఉన్నారు.
ఇలాంటి సమయంలో మా ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, కాల్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లు, మా ఆఫీసుల్లో ఎక్కువ మంది ఉండేలా చేయగలిగాం.
ఆ సమయంలో వారికి అత్యున్నత ప్రమాణాలతో రక్షణ, పరిశుభ్రత, పరీక్షల సౌకర్యాలు కల్పించాం.
మా పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 95 శాతం మహిళలే. మా ఉపాధి అవకాశాలు వారిలో సాధికారత కల్పించడమే కాదు, ప్రస్తుత సమయంలో మనం చూస్తున్న ఆర్థిక స్వేచ్ఛను, కుటుంబానికి ఆర్థికంగా మద్దతును కూడా అందిస్తాయి.
4. మధ్యరకం, ప్రీమియం సెగ్మెంట్లలోని స్మార్ట్ ఫోన్లకు పోటీగా అఫర్డబుల్ సెగ్మెంట్లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ల డిమాండ్ పెరగడం మీరు చూస్తున్నారా?
ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఛానెళ్లలో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. అఫర్డబుల్ విభాగంలో వినియోగదారులు సాధారణం కంటే తక్కువ ఖర్చు చేసేలా ఉంటుంది.
అఫర్డబుల్ విభాగంలో బడ్జెట్ ఫోన్లతోపాటూ 12 వేల కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లకు కచ్చితంగా డిమాండ్ కచ్చితంగా పెరిగింది.
మనం మిడ్ ప్రీమియం సెగ్మెంట్ డిమాండ్‌లో మార్పు రావడం కూడా చూడచ్చు. ప్రీమియం సెగ్మెంట్‌తో పోలిస్తే సబ్ 15 వేల సెగ్మెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉండచ్చు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
- ప్రపంచ 5జీ నెట్‌వర్క్‌ను చైనా కబ్జా చేస్తోందా?
- ప్రపంచ అందగత్తెలు వీళ్లు!!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)