ఆంధ్రప్రదేశ్: వైఎస్ జగన్ ఏడాది పాలనలో అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకరరెడ్డిలతో పాటు టీడీపీకి చెందిన ఇంకా ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి

  • శంకర్.వి
  • బీబీసీ తెలుగు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతల అరెస్టుల పర్వం ప్రారంభమయ్యింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలు అరెస్టయ్యారు.

వారిలో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తో పాటుగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వారిపై నమోదయిన కేసుల్లో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ, ప్రభాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అచ్చెన్నాయుడుని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని స్వగృహంలో అరెస్ట్ చేసి మంగళగిరిలో ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించి ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రభుత్వాసుపత్రికి తరలించాలని కోర్ట్ ఆదేశించింది.

ఇక ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు, గత సాధారణ ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయిన జేసీ అస్మిత్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.

అనంతపురంలో కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

గత 12 నెలల్లో..

గడిచిన 12 నెలలకు పైగా కాలంలో రాష్ట్రంలోని 13 జిల్లాలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తల మీద వివిధ కేసులు నమోదయ్యాయి.

వాటిలో కొన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించినవి కాగా, మరికొన్ని వివిధ ఆందోళన సందర్భంగా నమోదయిన కేసులున్నాయి.

తెలుగుదేశం పార్టీ నేతలపై ఈకాలంలో నమోదయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

ఫొటో సోర్స్, facebook/nara chandrababu naidu

నారా చంద్రబాబు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆయనపై కృష్ణా జిల్లా కంచికచర్లలో మే నెలలో కేసు రిజిస్టర్ అయ్యింది.

హైదరాబాద్ నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో వస్తున్న సమయంలో కంచికచర్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు గుమికూడేందుకు దోహదపడ్డారన్నది అభియోగం.

ఫొటో సోర్స్, FACEBOOK/PALANATIPULI.DRKODELASIVAPRASADARO

కోడెల శివ ప్రసాదరావు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్: అసెంబ్లీ కి సంబంధించిన ఫర్నీచర్ ని పక్కదారి పట్టించారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

తుళ్లూరు పీఎస్ లో కేసు రిజిస్టర్ అయ్యింది. ఆగష్ట్ 2019లో కోడెల శివప్రసాద రావుతో పాటుగా ఆయన తనయుడు శివరామ్‌ను కూడా నిందితుడిగా పేర్కొంటూ సెక్షన్ 409, 411 ల కింద కేసు పెట్టారు.

ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో కేసు ముందుకు సాగలేదు.

ఫొటో సోర్స్, facebook/Kinjarapu Atchannaidu

కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి: ఈఎస్ఐ లో సామాగ్రి, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలపై అచ్చెన్నాయుడుతో పాటుగా 19 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదైంది.

విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నివేదిక ఆధారంగా ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది.

ఫిబ్రవరి 2020లో కేసు నమోదు కాగా తాజాగా అచ్చెన్నాయుడు తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో అచ్చెన్నాయుడు మినహా మిగిలిన వారంతా అధికారులే.

ఫొటో సోర్స్, facebook/ayyannapatrudu

చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి:

పోలీసుల విధుల నిర్వహణలో అడ్డుకున్నారనే అభియోగాలపై నర్సీపట్నం పీఎస్ లో ఆయనపై కేసు నమోదయ్యింది.

353, 500 మరియు 504 కింద కేసు పెట్టారు. డిసెంబర్ 2019లో జరిగిన ఈ కేసులో తదుపరి ఆయన బెయిల్ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Prathipati Pullarao

ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి:

అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు కాగా వారిలో పుల్లారావు ఒకరు. ఈ కేసును సీఐడీ నమోదు చేసింది.

ఐపీసీ సెక్షన్లు 420, 506 మరియు 120 (b) తో పాటుగా సెక్షన్ 3 ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు రిజిస్టర్ అయ్యింది.

ఎస్సీలు సహా పలువురు రైతులను మోసగించి ల్యాండ్ ఫూలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఈ కేసు జనవరి 2020లో నమోదు చేశారు.

పి.నారాయణ, మాజీ మంత్రి:

అమరావతి ల్యాండ్ ఫూలింగ్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో మంత్రి నారాయణ కూడా నిందితుడుగా ఉన్నారు.

ఈ కేసులో సీఐడీ విచారణ సాగుతోంది. ఇప్పటికే సిట్ రంగంలో దిగి ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను అరెస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, jc diwakarreddt

జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే:

అనంతపురంలో సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. దివాకర్ ట్రావెల్స్ లో పనిచేసిన నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది.

బీఎస్ 3 వాహనాలను, బీఎస్ 4 వాహనాలుగా మార్చి అమ్మకాలు సాగించారన్నది అభియోగం.

66 లారీలను నకిలీ ధృవపత్రాలతో అమ్మకాలు సాగించారని ఫిర్యాదులు రావడంతో కేసు రిజిస్టర్ చేశారు.

ఈ కేసులో ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి , కుమారుడు అస్మిత్ రెడ్డి తో పాటు పలువురు అనుచరులు కూడా సహా నిందితులుగా ఉన్నారు.

ఫిబ్రవరి 2020 లో నమోదయిన ఈ కేసులో తాజాగా ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.

ఫొటో సోర్స్, Koona Ravi Kumar

కూన రవికుమార్, ప్రభుత్వ మాజీ విప్:

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రవికుమార్ పై ఐపీసీ సెక్షన్లు 143, 149, 353, 427 మరియు 506 కింద కేసు నమోదు చేశారు.

విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీవోని దూషించారంటూ సరిబుజ్జిలి పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఆగష్ట్ 2019 లో నమోదయిన ఈ కేసులో ఆ తర్వాత అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Chintamaneni Prabhakar

చింతమనేని ప్రభాకర్, ప్రభుత్వ మాజీ విప్:

ఏలూరు చింతమనేని ప్రభాకర్‌ను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేసి రిమాండు పంపించారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన చింతమనేని ప్రబాకర్ పై వివిధ సందర్భాల్లో నమోదయిన 26 కేసులున్నాయి.

2016 లో నమోదయిన కేసులో ఆయన్ని సెప్టెంబర్ 2019లో అరెస్ట్ చేశారు. రిమాండ్ కి తరలించగా ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు.

ఎస్సీలను దూషించిన కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. విడుదలయిన తర్వాత కూడా వివిధ సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Tdp

యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి:

మాజీ ఆర్థిక మంత్రి స్వగ్రామంలో జరిగిన వివాహంపై వచ్చిన ఆరోపణలతో యనమల రామకృష్ణుడు పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద తూర్పుగోదావరి జిల్లా తొండంగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణ తనను పెళ్లి చేసుకుని మోసగించి రెండో పెళ్లికి సిద్దమవుతున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త టీడీపీ నాయకుడు పిల్లి సత్యన్నారాయణ మూర్తి కూడా నిందితులుగా ఉన్నారు.

యనమల సోదరుడు, తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడి పై కూడా కేసు నమోదైంది.

నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి

మాజీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి విషయంలో నమోదయిన కేసులో యనమలతో పాటుగా పెళ్ళికి హాజరయిన నేపథ్యంలో చినరాజప్ప మీద కూడా ఫిర్యాదు వచ్చింది.

దాంతో ఆయనపైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్టు తూర్పు గోదావరి పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Bhuma Akhila priya

భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి:

అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులో కూడా నోటీసులు జారీ అయ్యాయి.

బొండా ఉమామహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే:

మాచవరం పీఎస్‌లో జనవరి 2020న ఆయనపై కేసు నమోదైంది. 356,506,188 సెక్షన్ల కింద ప్రభుత్వ సిబ్బంది విధుల నిర్వహణకు అడ్డుపడ్డారనే అభియోగాలపై కేసు పెట్టారు.

యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే:

హైకోర్ట్ ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభమయ్యింది. లైమ్ స్టోన్ మైనింగ్ లో అక్రమాలపై డిసెంబర్ లో కేసు నమోదయ్యింది. పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లోని 18 మైన్స్ లో అక్రమాలు జరిగినట్టు హైకోర్టులో వేసిన పిల్ పై విచారణ కూడా సాగింది.

గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అద్దంకి:

గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆయనకు మైనింగ్ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. ఏపీ మైనింగ్ యాక్ట్ -1996 కింద నోటీసులు జారీ అయ్యాయి.

సోషల్ మీడియా పోస్టులు, అమరావతి ఆందోళనల సందర్భంలో..

వివిధ సందర్భాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన ఉదంతాలున్నాయి. అందులో ఎక్కువగా అమరావతి పరిరక్షణ పేరుతో సాగించిన ఉద్యమంలో అనేక మంది జైళ్లకు వెళ్లారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చేసిన పోస్టుల విషయంలో కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కొందరిని రిమాండ్ కి కూడా తరలించారు.

ఇక స్థానిక ఎన్నికల సందర్భంలోనూ కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో టీడీపీ సహా వివిధ పార్టీల నేతలు కేసుల్లో ఇరుక్కున్నారు.

తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా: మంత్రి పేర్ని నాని

చంద్రబాబు ప్రభుత్వ హయంలో అవినీతి , అక్రమాలు యథేచ్ఛగా సాగించి, ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే లబోదిబోమంటున్నారని ఏపీ సమాచార ప్రసారాల శాఖా మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘తప్పులు చేస్తే ఈ ప్రభుత్వం సహించదు. ఎవరయినా ఊరుకునేది లేదు. ఐదేళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించారు. అనేక విధాలా అవినీతికి పాల్పడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా వాటిని వెలుగులోకి తెచ్చాం. అయినా చర్యలు లేవు. ఏడాది కాలంగా వివిధ కోణాల్లో కమిటీలు ఆధారాలు సేకరించాయి. ఇప్పుడు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి కులం కోణం ఆపాదించడం అవివేకం. తప్పులు చేస్తున్న వాళ్లను వదిలేయాలా..చూస్తూ ఊరుకోవాలా. చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నాం. వ్యవస్థలను సరిదిద్దుతున్నాం’’ అన్నారు.

ప్రతీకారేచ్ఛతోనే కేసులు: టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఏపీలో ప్రభుత్వ పెద్దలు ప్రతీకారంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతీకారంతో వ్యవహరించడం తగదు. కానీ తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేతల నోళ్లు నొక్కాలని చూస్తున్నారు. చట్టం ప్రకారం పాటించాలని పద్ధతిని కూడా విస్మరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేయడం చూస్తుంటే ఏపీలో పాలన గాడి తప్పిందని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితి నాలుగు దశాబ్దాల నా రాజకీయ జీవితంలో చూడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మూలంగా వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టుకుపోతున్నాయ’’న్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)