పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది? దెబ్బకు దెబ్బ తీయవచ్చా? అడ్డంకులేంటి?
- జుగల్ ఆర్ పురోహిత్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కపక్క చైనా వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తోంది. మరి భారత్ ఎందుకు దానిని తిప్పికొట్టలేకపోతోంది? ఎందుకు ఎదురు దాడికి దిగలేకపోతోంది? చైనాను దెబ్బకు దెబ్బ తీయడం పెద్ద సమస్య కాదంటోంది సైన్యం. చైనా భూభాగాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది సైన్యంకాదని, ప్రధానమంత్రి కార్యాలయమని అంటున్నారు సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జనరల్ బిక్రమ్ సింగ్.
''చైనా నుంచి ఆక్రమించగల ప్రాంతాలు చాలా మనకు తెలుసు. అయితే అలా చేసే ముందు వాటి పరిణామాలు కూడా ఆలోచించాలి. దీనిపై నిర్ణయం తీసకోవాల్సింది రాజకీయ నాయకత్వమే. ఎందుకంటే ఇది పెద్ద వివాదంగా మారే ప్రమాదముంది'' అని జనరల్ బిక్రమ్ సింగ్ బీబీసీతో అన్నారు.
భారత్ తన పొరుగుదేశం పాకిస్థాన్‌తో వ్యవహరిస్తున్న తీరుకు చైనాతో వ్యవహరిస్తున్నతీరు పూర్తిగా విరుద్దం. ''పాకిస్తాన్‌తో ఆధీన రేఖ వెంబడి ఉన్న పరిస్థితులు భిన్నం. ఇక్కడ పాకిస్తాన్ తరచూ కాల్పులు జరుపుతూ ఉంటుంది. దీన్ని తిప్పికొడుతూనే ఉంటాం. బాలాకోట్లాంటి ఆపరేషన్లకు తప్ప ఇలాంటి వాటికి రాజకీయ నిర్ణయాలు అక్కర్లేదు. కానీ చైనాతో వ్యవహారాలు చాలా సున్నితమైనవి'' అన్నారు బిక్రమ్ సింగ్.
మే మొదటి వారం నుంచి భారత్ చైనాల మధ్య సరిహద్దులలో వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు నెలకొన్నాయి. మొదట్లో రెండు దేశాలు తీవ్రమైన ప్రకటనలు చేసినా, ఇప్పుడా వాయిస్‌లో మృదుత్వం పెరిగింది. ‘‘రెండు దేశాల సైనికాధికారులు మధ్య జూన్ 6న సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఇరుదేశాలు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు'' అని భారత విదేశాంగశాఖ జూన్ 7న ఒక ప్రకటన చేసింది.
అటు చైనా విదేశాంగ శాఖ కూడా '' పశ్చిమాన సరిహద్దుల్లో ఏర్పడ్డ సమస్య పరిష్కారంలో ఇరుదేశాల మధ్య సామరస్యపూర్వక చర్చలు జరిగాయి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మిలిటరీ, రాయబార కార్యాలయ అధికారులు అంగీకరించారు'' అని జూన్ 10న ఒక ప్రకటన చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌ది అశక్తతా, నిరాసక్తతా ?
''సరిహద్దుల్లో నిత్యం చైనా నుంచి భారత సైన్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. చైనాకు ప్రయోజనం కలక్కుండా భారత్ సైన్యం సంయమనం పాటిస్తోంది. చైనా కవ్వింపు చర్యలను మనం అర్దం చేసుకోవాలి. దానికి తగినట్లు వ్యూహాన్ని రూపొందించాలి. వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న సందిగ్దతను మనం సొమ్ము చేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించేలా చూడాలి'' అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్యామ్ శరణ్ జూన్ 2న హిందూస్థాన్ టైమ్స్ పత్రికు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
''మనకు కావాల్సిందేమిటి? యుద్దమా? అదే కావాలనుకుంటే ఈ టిట్ ఫర్ టాట్ ఎత్తులు వేయవచ్చు. కానీ సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేలా ఉంటే, ఆ ఎత్తుగడలు అనవసరం''అన్నారు బిక్రమ్ సింగ్. ''అక్కడి నుంచి చైనా కదలకుండా, నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగితే మనం దెబ్బకు దెబ్బ తీసే ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మనమే ముందుగా ఆక్రమణ చర్యలను మొదలు పెట్టకూడదు. అలా చేయాలంటే మనకు సరిపడా మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. మనం ఇప్పుడు ప్రారంభించిన పనులు పూర్తయితేనే అక్కడికి సులభంగా చేరుకుంటాము. అక్కడ మన ఉనికి ఇంకా లేదు'' అని జనరల్ బిక్రమ్ సింగ్ అన్నారు.
చైనాతో తరచూ మనకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు జనరల్ బిక్రమ్ సింగ్ తన అనుభవాన్ని వివరించారు. ''నేను తూర్పు ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న సమయంలో మనం ఎన్నిసార్లు చైనా భూభాగంలోకి వెళ్లగలిగాం అని నా బృందాన్ని అడిగాను. నాకు అర్దమైనదేంటంటే..చైనాకన్నా మూడు నాలుగింతలు ఎక్కువగా మనం వారి భూభాగంలోకి వెళ్లగలిగాం. మనం వివాదాస్పద ప్రాంతాలలోకి కూడా వెళ్లాం. అనేకసార్లు ఒప్పందాలు కూడా చేసుకున్నాం. కాకపోతే మనం చేసినట్లు చైనా ఇలాంటి వాటిని ఇష్యూగా మార్చదు'' అన్నారు బిక్రమ్ సింగ్.'' ఇదో పరిష్కారం లేని సమస్యని, ఇది ఇలాగే కొనసాగుతుంది'' అన్నారాయన.
ఫొటో సోర్స్, Getty Images
వైఫల్యాల సంగతేంటి?
చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చిందంటే అది మన నిఘా లోపమేనా? అంటే కాదంటున్నారు బిక్రమ్ సింగ్. మనం ప్రతి అంగుళాన్ని కాపలా కాయలేం. శాటిలైట్లతోని కాపలా ఉన్నా, నిఘా కెమెరాలు ఉన్నా, కొన్నిసార్లు మిస్సవుతాం. ఎల్ఓసీతో పోలిస్తే ఎల్ఏసీలో విశాలమైన ప్రాంతాలు చాలా ఎక్కువ. అణువణువునా సైన్యాన్ని నింపడం సాధ్యం కాదు. అయినా మన సైన్యం బాగా పని చేస్తోంది'' అన్నారు బిక్రమ్.
భారత్ చైనాల మధ్య కొత్త ఒప్పందం అవసరమా?
''1993 నుంచి వస్తున్న సమస్యలను గుర్తిస్తూ 2013లో మనం చైనాతో బోర్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బీడీసీఏ)కుదుర్చుకున్నాం. ఇది సరిపోతుంది. ఇందులో హాట్లైన్లాంటి కొన్నింటిని చైనా నెరవేర్చాల్సి ఉంది. అవి నెరవేరిస్తే సరిపోతుంది. ఇది చక్కగా పని చేస్తుంది'' అన్నారు బిక్రమ్ సింగ్.
ఇరు దేశాల్లో మౌలిక వసతులు
''మొత్తంగా చూస్తే చైనా మౌలిక సదుపాయాలు మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. గతంలో చైనా 22 డివిజన్ల సైన్యాన్ని అక్కడ దింపగలిగేది. ఇప్పుడు 32 డివిజన్ల సైన్యాన్ని దింపగలదు (ఒక్క డివిజనల్లో 10వేలమంది సైనికులు ఉంటారు). నిర్మాణరంగంలో వారు ముందున్నారు. మనం ఇంకా 75శాతం మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది'' అని బిక్రమ్ సింగ్ వివరించారు. ముఖ్యమైన రోడ్లు, రైలు లింక్‌లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు బిక్రమ్ సింగ్. '' వ్యూహాత్మకంగా మనం రోడ్లు, రైల్ లింకులను ఏర్పాటు చేసుకుంటున్నాం. విమానాల ద్వారా సైన్యాలను వేగంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెండో ప్రపంచ యుద్దకాలంనాటి ఏడు ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను రీ-యాక్టివేట్ చేస్తున్నాం. రాబోయే ఐదారేళ్లలో మన పరిస్థితి మరింత మెరుగుపడుతుంది'' అని బిక్రమ్ సింగ్ అన్నారు.
''సరిహద్దుల్లో 3812 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 3418 కిలోమీటర్ల పొడవైన రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)కు అప్పజెప్పాం'' అని భారత రక్షణ శాఖ 2018-19 సంవత్సరానికి తయారు చేసిన నివేదికలో పేర్కొంది.
మీడియాకు సమాచారం ఎందుకు అందడం లేదు?
కశ్మీర్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సైన్యం దానికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందజేస్తుంది. కానీ అదే ఎల్ఏసీలో చైనా దురాక్రమణలకు దిగిన విషయం ఎందుకు మీడియా దృష్టికి రావడం లేదు?
''ప్రస్తుత తరుణంలో ఊహజనితమైన రిపోర్టులు మీడియాలో ప్రచారం కావడంవల్ల ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్యలకు ఏ మాత్రం ఉపయోగపడదు. మీడియా ఇలాంటి వార్తల విషయంలో సంయమనం పాటించాలి'' అని జూన్ 5న సైన్యం ఒక స్టేట్మెంట్ను విడుదల చేసింది. ''కొన్సిసార్లు సమాచారాన్ని ఎక్కువ చేసి ప్రచారం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. చైనా అధికారులు కూడా ఇండియన్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల ఇరు దేశాల మధ్య సాగబోయే చర్చలకు విఘాతం కలగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రేటింగ్స్ కోసం నడిపించే ఇలాంటి వార్తల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఎలాంటి ఉపయోగం లేదు '' అన్నారు బిక్రమ్ సింగ్.
సమాచారం ఇవ్వడంలో దూరదృష్టి ఉండాలని ఆయన అన్నారు. కానీ అసలు సమాచారం ఇవ్వకపోవడం కూడా ఇలాంటి అపోహలు, ప్రచారం కావడానికి కారణం కాదా? అన్నప్పుడు '' సమాచార యుద్దంలో సమాచారానికి కొంత గోప్యత అవసరం ఉంది. అవసరాన్నిబట్టి దాన్ని బయటకు ఇవ్వాలి. జూన్ 6న జరిగిన చర్చలపై ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చామా? లేదు. అందరినీ లోపలికి వదిలినట్లయితే ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాళ్లం. కానీ ఈ చర్చల్లో అధికారుల మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయి'' అన్నారాయన. మరి చైనా మీడియా కూడా అలాగే వ్యవహరిస్తోంది కదా అని ప్రశ్నించినప్పుడు ''మన మీడియా సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. అవి చూసుకుంటాయి. మీడియా బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయాలి. చైనా అక్కడి మీడియాను కట్టడి చేస్తోంది'' అని అన్నారు బిక్రమ్ సింగ్.
ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ విషయంలో...
జూన్9న నేపాల్ దిగువ పార్లమెంట్ లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలను తమ దేశంలోవిగా చూపుతూ ఒక మ్యాప్‌ను అధికారికంగా ప్రకటించింది. అయితే ఇండియా నేపాల్ వాదనను తోసి పుచ్చుతోంది. సరిహద్దుల్లో భారత్ చేపడుతున్న కార్యకలాను వ్యతిరేకిస్తున్న నేపాల్ గురించి ప్రస్తావించినప్పుడు '' గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. వారు ఎవరి కోసమో ఇలాంటి చర్యలకు దిగుతున్నారు'' అని వ్యాఖ్యానించారు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎం.ఎం. నారవానే.
అయితే జనరల్ బిక్రమ్ సింగ్ మాత్రం దీనిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. ''భారత్ నేపాల్ మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవి. దాదాపు 32,000మంది గూర్ఖాలు భారత సైన్యంలో పని చేస్తున్నారు. సరిహద్దులకు సంబంధించి ఇది చిన్న సమస్యే. చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆర్మీ చీఫ్ సమర్దులు. ఆయన చేసిన కామెంట్లపై నేను వ్యాఖ్యానించబోను. ఒక మిలిటరీ వ్యక్తిగా నేను మిలిటరీ వ్యవహారాలకే పరిమితమవుతాను. ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్లకు వేరే కారణం ఏదో ఉండి ఉండవచ్చు'' అన్నారు బిక్రమ్ సింగ్.
ఇవి కూడా చదవండి:
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 8 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ మహమ్మారి కాలంలో డిజిటల్ డిటాక్స్ చేయటం ఎలా?
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలు సామాన్య జీవితం గడపడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ‘రూ.6 లక్షలు బిల్లు.. మొత్తం కట్టి, శవాన్ని తీసుకెళ్లండి..’ కరోనా రోగి బంధువులకు ఓ ప్రైవేటు ఆస్పత్రి అల్టిమేటం
- కరోనావైరస్: గుజరాత్ మోడల్ విఫలమైందా? రాష్ట్రంలో మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉంది?
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి జనరల్(రిటైర్డ్) వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో భాగంగా రెండు దేశాల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. అయినప్పటికీ చైనా వాటిని ఉల్లంఘిస్తూనే వస్తోంది.