లాక్‌డౌన్ మళ్లీ విధించబోతున్నారా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏమంటున్నారు

లాక్‌డౌన్ మళ్లీ విధించబోతున్నారా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏమంటున్నారు

ప్రధాని మోదీ ప్రభుత్వం కరోనా విపత్తు సమయంలో సమర్థంగానే వ్యవహరించిందా? వలస కార్మికుల సమస్యను ఎలా హ్యాండిల్ చేశారు.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారా.. మళ్లీ కట్టుదిట్టమైన లాక్‌డౌన్ విధించబోతున్నారా?

కేంద్ర రవాణా శాఖ మంత్రి ఈ విషయాలపై ‘బీబీసీ హిందీ’ ఎడిటర్ ముకేశ్ శర్మ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..

‘‘ప్రధానమంత్రి జన్‌ధన్ పథకంలో 33 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. డబ్బులు తక్కువే అయ్యుండొచ్చు. కానీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. మేము రైతులకు నిరంతరాయంగా సాయం అందిస్తున్నాం. ధాన్యం గిడ్డంగులను తెరిచాం. ధాన్యాన్ని పూర్తిగా పేదలకు పంచేశాం. పెద్ద మొత్తంలో ధాన్యం ఇచ్చాం. ఒకరకంగా డైరక్ట్‌గా, ఇన్‌డైరెక్టుగా మేం చెప్పింది చేశామని నా అభిప్రాయం’’ అన్నారు నితిన్ గడ్కరీ.ముఖేశ్: బదిలీ చేస్తోన్న 5 వందల రూపాయలు నగదు చాలా కుటుంబాలకు సరిపోవడం లేదు. ఆ మొత్తాన్ని మరికొంత పెంచాలంటున్నారు. కుటుంబాల దగ్గర డబ్బులు కాస్త ఎక్కువగా ఉంటే ఎకానమీకి కూడా మంచిదే కదా.గడ్కరీ: ఉపాధి హామీ పథకంలో ఆ కటుంబాలకే పని కల్పించాలని ఆదేశాలిచ్చాం. వలస కార్మికులకు వాళ్ల సొంత రాష్ట్రాల్లోనే వసతి కల్పించే పథకాలు రూపొందించాం. వివిధ రకాల పథకాల నుంచి కచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. ముఖేశ్ : విదేశాల్లో చిక్కుకున్న వారికి వందేభారత్ కార్యక్రమం ప్రారంభించారు. వారు విమానాల్లో స్వదేశానికి వస్తున్నారు. భారత్‌లో సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికులకు సదుపాయాలు కల్పించడంలో లోపం ఉందని లేదా ఇంకాస్త మెరుగైన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని మీకు అనిపిస్తోందా? గడ్కరీ : నేను అలా అనుకోవడం లేదు. కరోనా సమస్య మనకూ.. ప్రపంచం మొత్తానికీ మొదటిసారి వచ్చింది. ప్రతి దశలోనూ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. నాలాంటి మంత్రులకు మా సొంత రాష్ట్రాల నుంచి రిపోర్ట్ పంపించే బాధ్యత అప్పగించారు. తర్వాత కేబినెట్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలతో మట్లాడారు. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకున్నారు. ముఖేశ్ : మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు తమను సంప్రదించలేదని, తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు సమయంలో తమని సంప్రదించారని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. గడ్కరీ : మీరిలా అనడం వాస్తవం కాదు.ముఖేశ్ : నేను కాదు అంటున్నది.. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. ఉదాహరణకు మాతో ఎటువంటి చర్చా జరపలేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. మొదటి లాక్‌డౌన్ అకస్మాత్తుగా విధించారు. ప్రజల్ని ఎలా సిద్ధం చెయ్యాలి, ముఖ్యంగా వలసకార్మికుల విషయాన్ని చర్చించలేదన్నారు. గడ్కరీ: మొదటి లాక్‌డౌన్ సమయంలోనూ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారని నాకు కచ్చితమైన సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వివాదాలు తీసుకురావడం సమంజసం కాదని నా అభిప్రాయం. ముఖేశ్ : వైరస్ సోకుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్యలో భారత్ స్థానం కూడా పైకి ఎగబాకింది. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. లాక్‌డౌన్ విజయవంతం అయిందా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? గడ్కరీ: ప్రతి విషయానికీ రెండు పార్శ్వాలుంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంతమంది సరైనదంటారు, ఇంకొందరు కాదంటారు. వాళ్ల అభిప్రాయంలో నిజాయితీ కూడా ఉండొచ్చు. నేను మీకు ముందు చెప్పినట్లు కరోనా సంక్షోభం మొదటిసారి వచ్చింది. ఇంకా దీనికి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ఈ సంక్షోభం మొదట తలెత్తిన చోట కూడా వాక్సీన్ తయారు కాలేదని నేను అనుకుంటున్నాను. మన దగ్గర సంక్షోభం ఆ స్థాయికి చేరుకునే లోపే మనకు వాక్సీన్ లభిస్తుంది. వాక్సీన్ వాడకంలోకి రాగానే సమస్య తీవ్రత ఒక్కసారిగా తగ్గుతుందని నాకనిపిస్తోంది. ముఖేశ్ : చివరగా.. మళ్లీ లాక్‌డౌన్ విధించాలన్న ఆలోచన ప్రభుత్వానికుందా? గడ్కరీ : నాకైతే దానికి సంబంధించిన సమాచారం లేదు. ప్రస్తుతానికైతే అవి వదంతులే. ప్రజలు వీటిని విశ్వసించకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)