కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎంతమంది రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారంటే..
- వి శంకర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, NELSON ALMEIDA/AFP via Getty Images
లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది.
తాజాగా రాజకీయ ప్రముఖులను కూడా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కొందరు మంత్రులు క్వారంటైన్లోకి వెళ్లారు. కీలక నేతల సన్నిహితుల్లో పాజిటివ్ లక్షణాలు బయటపడడంతో కొంత కలవరపడుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాపిస్తున్న వైరస్ తాకిడికి తల్లడిల్లుతున్నారు.
కోవిడ్ 19 కేసులు నమోదయిన తొలినాళ్లలోనే ఏపీలో కొందరు ఎమ్మెల్యేల ఇళ్లలో పాజటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చట్టసభల సభ్యుల్లో టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేనే మొదటి పాజిటివ్ కేసు.
ఆయనతో పాటుగా పలువురు కీలక నేతల సంబంధీకుల్లో పాజిటివ్ నమోదు కావడంతో అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మంత్రి జాగ్రత్త పడాల్సి వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతుండగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్, పేషీలోని అటెండర్ కూడా వైరస్ బారిన పడ్డారు. దాంతో మేయర్ కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్ పాటిస్తున్నారు. కోవిడ్ 19 టెస్టులు నిర్వహించగా మొదట పాజిటివ్ అని భావించినప్పటికీ రెండోసారి టెస్ట్ చేసి నెగిటివ్ అని నిర్ధరించారు.
ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సహాయకుడు ఒకరు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో మంత్రితో పాటుగా మరో 16 మంది సిబ్బంది హోం క్వారంటైన్ పాటిస్తున్నారు. హరీష్ రావుకి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.
జనగాం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనతో పాటు భార్య, గన్‌మేన్, వంట మనిషి, డ్రైవర్ కూడా వైరస్ పాజిటివ్ అని నిర్ధారించారు.
హైదరాబాద్‌లో కుటుంబంతో నివసిస్తున్న ఎమ్మెల్యే ఇటీవల నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆయనకు వైరస్ సోకినట్టు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే తో పాటుగా ఆయన భార్య కి కూడా హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. దీంతో ఆయన కుటుంబీకులు, సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే కరోనా వైరస్ కారణంగా ప్రజా ప్రతినిధులు కలవరపడ్డారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడి కుటుంబంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఎమ్మెల్యే కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
కర్నూలులో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువులకు కరోనా బారిన పడ్డారు. వారికి వైద్యం అందించే విషయంలో ఎమ్మెల్యే తీరుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఒకేసారి ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పట్లో ఎంపీ సోదరుడు, బంధువులుండడంతో ఎంపీ కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయనకు మాత్రం నెగిటివ్ గా పరీక్షల్లో తేలింది.
అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సోదరుడు కరోనా బారిన పడ్డారు. వారి సమీప బంధువు కరోనాతో మరణించిన నేపథ్యంలో వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు. మంత్రికి కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మత్రి ఆళ్ల నాని పేషీలో కూడా సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలింది. తర్వాత మంత్రి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు మాత్రం నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ కూడా సమీప వ్యక్తులు కరోనా బారిన పడడంతో క్వారంటైన్ పాటించాల్సి వచ్చింది.
ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నివాసం హైదరాబాద్ లో సెక్యూరిటీ విధులు నిర్వహించేందుకు వెళ్లిన బాపట్లకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కూడా తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఏపీ రాజ్ భవన్ లో ఆరుగురు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సందర్భంగా గవర్నర్ కూడా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది.
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యే సిబ్బందిలో మరో ఏడుగురుకి పాజిటివ్ అని తేల్చారు. తనకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ఎమ్మెల్యే ప్రకటించారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
అమరావతి
అసెంబ్లీలో కరోనావైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేతల సమీప వ్యక్తులు కరోనాకి గురవుతున్న తరుణంలో నాయకులంతా మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగా ఏపీ అసెంబ్లీ అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఎమ్మెల్యేలు తమ సిబ్బందిని వెంట పెట్టుకురావద్దని ఆదేశాలు విధించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంటపెట్టుకుని అసెంబ్లీకి రావద్దని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణాచార్యులు ఆదేశాలు విడుదల చేశారు.
"కరోనా నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. భౌతికదూరం పాటించేందుకు ప్రత్యేక నిబంధనలు పెడుతున్నాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ వరకూ అనుమతి ఉంటుంది. ఎమ్మెల్యే తమ కార్లకు కారు పాస్ కచ్చితంగా అతికించాలి. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతి ఉండదు. గన్మేన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీకి విజిటర్లను అనుమతించడం లేదు. సభ్యులు తమ వెంట విజిటర్లను, సిబ్బందిలో పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను వెంట తీసుకురావొద్దని కూడా చెప్పాం. మీడియా పాయింట్ లో కార్యకలాపాలు ఉండవు. లాబీల్లోకి పాత్రికేయులకు అనుమతి లేదు" అని బీబీసీకి వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘కేసులు పెరుగుతున్న తరుణంలో మరింత అప్రమత్తత’
కరోనా కేసుల సంఖ్య ఏపీలో స్థిరంగానే ఉందని, అయినా అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహార్ రెడ్డి సూచిస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "కరోనా టెస్టుల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాన్నిస్తున్నాయి.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దోహదపడుతున్నాయి. సగటున 10లక్షల మంది జనాభాకి చూస్తే దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. కొత్త కేసులు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోంది. దానికి తగ్గట్టుగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజా ప్రతినిధులు వివిధ కార్యక్రమాల కోసం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తగిన రీతిలో వ్యవహరించాలి. సహజంగా వాతావరణం మారే సమయంలో కొన్ని రకాల ఫ్లూ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున అంతా అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి
- ఈఎస్ఐ అక్రమాలు: మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ
- లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత న్యూజీలాండ్‌లో జీవనం ఇలా ఉంది..
- లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కరోనావైరస్ అంటించారు
- మెడికల్ కాలేజీల్లో 50 శాతం ఓబీసీ కోటా పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు
- దిల్లీ హింసాత్మక దాడులతో ఆగిన పెళ్లి... కరోనా మహమ్మారి భయం నీడలో ఇలా జరిగింది
- డారెన్ సామీ 'ఆగ్రహం' భారత్‌లో సామాజిక వాస్తవాలను బయటపెట్టిందా
- నోట్‌బుక్స్ విడుదల చేసిన షావోమీ.. చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రభావం ఈ కంపెనీపై లేదా
- తిరుమలలో లాక్డౌన్ తరువాత దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? - కొండ పైనుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కరోనావైరస్: ఇదే చివరి మహమ్మారి కాదా.. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)