పెట్రోలు, డీజిల్ ధరలు: వరుసగా తొమ్మిదో రోజు పెంపు
- నిధిరాయ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో వరుసగా తొమ్మిదో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 48 పైసలు, డీజిల్ ధర లీటరుకు 23 పైసలు పెంచారు.
దీంతో గత తొమ్మిది రోజులుగా పెట్రోల్‌పై మొత్తం రూ.5, డీజిలుపై రూ.4.87 పెంచినట్లయింది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 83.17 ఉండగా, డీజిల్ ధర 73.21కు చేరింది. దిల్లీలో పెట్రోల్ 76.26, పెట్రోల్ 74.62కు పెరిగింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పెట్రోల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు?
ముడి చమురు ధరలు, రీఫైనరీల ఖర్చు, మార్కెటింగ్ కంపెనీల మార్జిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్, వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిర్ణయిస్తారు.
ఇవన్నీ కలిపిన తర్వాతే అది సామాన్యుడు భరించాల్సిన రిటైల్ ధర అవుతుంది.
దేశంలో తయారయ్యే వస్తువులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది.
విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఒక ఉత్పత్తి వివిధ దశల్లో విధిస్తారు. ఈ రెండూ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు. ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తే, వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి.
ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా, పన్నులు ఎక్కువగా ఉంటే, రిటైల్ ధరలు కూడా ఎక్కువ ఉంటాయి. జనవరి 30న ముడి చమురు ధర ఒక బారెల్ 57 డాలర్లు ఉంది. ఈరోజు అది ఒక బారెల్ 40 డాలర్లకు పడిపోయింది. కానీ, పన్నుల వల్ల దేశంలో రిటైల్ ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి.
సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం చెల్లిస్తున్న రిటైల్ ధరలో 70 శాతం పన్నులే ఉన్నాయి.
రిటైల్ ధరలపై ప్రభావం చూపించే మరో అంశం, కరెన్సీ చెలామణి. మన రూపాయి అమెరికా డాలర్ కంటే బలంగా ఉంటే రిటైల్ ధరలపై పెద్దగా ప్రభావం ఉండదు.
ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల పెరిగిన ఇంధన ధరలు (సుమారుగా)
- మార్చి 14: పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు 3 రూపాయలు పెంచారు.
- మే 6: లీటరు పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 13 రూపాయలు పెంచారు.
- జూన్ 7: పెట్రోల్, డీజిల్ మీద 60 పైసలు పెంచారు.
- జూన్ 8: పెట్రోల్ డీజిల్ మీద 52 పైసలుపెంచారు.
- జూన్ 9: పెట్రోల్‌పై 52 పైసలు, డీజిలుపై 55 పైసలు పెంచారు
- జూన్ 10: పెట్రోల్‌పై 40 పైసలు, డీజిల్‌పై 45 పైసలు పెంచారు
- జూన్ 11: పెట్రోల్, డీజిల్ ధరలు 60 పైసలు పెంచారు.
- జూన్ 12: పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంచారు.
- జూన్ 13: పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచారు.
- జూన్ 14: పెట్రోల్‌పై 60 పైసలు, డీజిల్‌పై 62 పైసలు పెంచారు.
15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్, పెంచాయి.
“ప్రస్తుతం పెట్రోల్ మూల ధర మీద కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాపు 254 శాతం పన్నులు(ఎక్సైజ్, వాట్) రాబడుతున్నాయి” అని కేర్ రేటింగ్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఉర్విషా హెచ్ జగదీశ్ చెప్పారు.
ఇటీవల రిటైల్ ధరలను భారీగా పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనమవడంతో జూన్ 6 వరకూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. 82 రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) ధరలు పెంచడం ప్రారంభించాయి.
ఫొటో సోర్స్, Getty Images
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఈ ప్రశ్నకు సింపుల్‌గా సమాధానం చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్రంగా ఆధారపడి ఉన్నాయి.
“లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి ఇంధనం డిమాండ్, వినియోగం పడిపోయింది. దాంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది” అని ఇంధన వనరుల నిపుణుడు నరేంద్ర తనేజా బీబీసీకి చెప్పారు.
ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో మిగతా ఆదాయ మార్గాలు అడుగంటాయి. దాంతో ఖజానాపై తీవ్ర ప్రభావం చూపించింది.
“మిగతా ప్రత్యక్ష, పరోక్ష పన్ను వనరుల నుంచి వచ్చే ఆదాయం కోల్పోయినప్పుడు, ఇంధనంపై విధించే పన్నులు ఆర్థికవ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరు అవుతాయి.” అని యాక్సిస్ బ్యాంక్ ఆర్థికవేత్త సౌగతా భట్టాచార్య బీబీసీకి చెప్పారు.
“ఇంధనంపై పన్నులను విధించడంలో కొన్నిప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ధరల తగ్గుదల్ల వల్ల రవాణా ఇంధనాలను వృథా చేయడాన్ని ఇది తగ్గిస్తుంది. ముడి చమురు, ఇంధనం భారీగా దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలు దాన్ని భరించలేవు. రెండోది, ఇది ఇంధన సామర్థ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది” అని భట్టాచార్య చెప్పారు.
“ఆదాయం రాబట్టుకోవాలా, లేక ద్రవ్యోల్బణం గమనిస్తూ ఉండాలా అనేదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇది రెండు వైపులా పదునున్న ఒక కత్తిలాంటిది” అని భట్టాచార్య అభిప్రాయపడ్డారు.
“డిమాండ్ పడిపోతోందనే ఆందోళన, కౌంటర్ సైకిల్ ఆర్థిక ఉద్దీపనను అందించాల్సిన అవసరం కూడా ఉండడంతో ఈ రిస్క్ తీసుకోదగినదే” అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?
అవును, పెంచుతుంది. పెట్రోల్ ధరలపై వాణిజ్య ప్రభావం లేదు, కానీ డిజిల్ ధరలపై ఉంటుంది. సరకు రవాణా కంపెనీలు డీజిల్ ఉపయోగిస్తుంటాయి. వారు ఇంధనానికి అధిక ధరలు చెల్లించాల్సినప్పుడు, వాటిని ఆటోమేటిగ్గా వినియోగదారులపైకి నెట్టేస్తారు. ద్రవ్యోల్బణ సూచికకు పెట్రోల్, డీజిల్ రెండూ ముఖ్యమైన బాగాలు.
“పెట్రోల్, డీజిల్ రెండింటి వాటా డబ్లుపీఐ ఇండెక్స్ లో 4.69 శాతం, సీపీఐ ఇండెక్స్ లో 2.34 శాతం ఉంటుంది. వాహన ఇంధన ధరల్లో ఎలాంటి పెరుగుదల వచ్చినా డబ్లుపిఐ, సీపీఐ కంటే ఎక్కువ ఉంటుంది” అని ఉర్విషా చెప్పారు.
ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ ధరల పెరుగుదల వినియోగదారుల జేబులపై ప్రతికూల ప్రభావం చూపబోతోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లోప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలు
- ముంబయి: లీటరు పెట్రోల్ రూ.83.17, డీజిల్ రూ.73.21
- దిల్లీ: లీటరు పెట్రోల్ రూ.76.26, డీజిల్ రూ.74.62
- హైదరాబాద్:లీటరు రూ.పెట్రోల్ 79.17, రూ.డీజిల్ 72.93
- బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.78.73, డీజిల్ రూ.70.95
- కోల్‌కతా: లీటర్ పెట్రోల్ రూ.78.10, డీజిల్ రూ.70.33
- చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.79.96, డీజిల్ రూ.79.96
ప్రస్తుత ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 40 డాలర్లు ఉంది. ఇది ఆగస్టు 2004తో సమానం. కానీ అదే సమయంలో(ఆగస్టు 2004లో) భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.36.81, డీజిల్ 24.16, ఉంది.
ఇవి కూడా చదవండి:
- డిప్రెషన్ సమస్యకు వేడినీళ్ల సమాధానం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)