కల్నల్ సంతోష్ బాబు: భయమేమీ లేదని అమ్మకు భరోసా ఇచ్చాడు.. మరుసటి రోజే చైనా సైనికుల చేతిలో చనిపోయాడు

కల్నల్ సంతోష్
ఫొటో క్యాప్షన్,

కల్నల్ సంతోష్

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణలో మరణించిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటవాసి ఒకరున్నారు.

మృతుల్లో మరొకరిది తమిళనాడు రాష్ట్రం రామనాథపురం.

సూర్యాపేట విద్యానగర్‌కు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు ఈ ఘటనలో మృతిచెందారు.

ఆయన పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో పనిచేస్తున్నారు. 16-బిహార్ రెజిమెంట్‌కు చెందిన ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులకు సైనికాధికారులు సమాచారం అందించారు.

సంతోష్‌కు భార్య సంతోషి, కుమారుడు అభిజ్ఞ(9), అనిల్(4) ఉన్నారు.

దిల్లీలో ఉంటున్న సంతోష్ భార్యకు భారత సైన్యం నుంచి సమాచారం అందగా తమకు సోమవారం మధ్యాహ్నం తెలిపిందని సంతోష్ తల్లి మంజుల చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

సంతోష్ బాబు తల్లి మంజుల

సూర్యాపేటలోనే ప్రాథమిక విద్యాభ్యాసం

సంతోష్ బాబు ప్రాథమిక విద్యాభ్యాసం సూర్యాపేటలోనే సాగింది. 6 నుంచి 12 తరగతులు విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక స్కూలులో చదివారని తల్లిదండ్రులు మంజులు, ఉపేందర్‌లు చెప్పారు.పుణెలోని ఎన్డీయేలో డిగ్రీ, అనంతరం డెహ్రడూన్ ఐఎంఏలో పీజీ చదివారని తెలిపారు.

ఆదివారం రాత్రి తమతో మాట్లాడి క్షేమ సమాచారం పంచుకున్నారని.. ఆందోళన చెందవద్దని చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సంతాపం

కల్నల్ సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు.

సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు.

సంతోష్ అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

16బిహార్ రెజిటెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు మృతికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విచారం వ్యక్తంచేశారు.

సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాల్పించారని కొనియాడారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా సంతోష్ బాబు మృతికి సంతాపం తెలిపారు.

మరోవైపు తమిళనాడులోని రామనాథపురానికి చెందిన పళని(40) కూడా ఈ ఘటనలో మరణించినట్లు పళని సోదరుడు యథయక్కాని ‘బీబీసీ తమిళ్’కు తెలిపారు.

సోమవారం రాత్రి తనకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు.

రెండు వైపులా ప్రాణ నష్టం

భారత్ - చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగిందని.. ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని భారత సైన్యం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

లద్ధాఖ్‌లోని గాల్వాన్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో మొత్తం 20 మంది భారత సైనికులు మరణించారని సైన్యం ప్రకటించింది.

తొలుత ఒక కల్నల్ సహా ముగ్గురు మరణించారని ప్రకటించిన సైన్యం.. ఆ తరువాత ఎత్తయిన ప్రాంతంలో చోటుచేసుకున్న ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడి అతి శీతల వాతావరణంలో చిక్కుకున్న మరో 17 మంది సైనికులూ మరణించారని వెల్లడించారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కి పెరిగిందని అధికారికంగా వెల్లడించింది.

భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సైన్యం కట్టుబడి ఉందని తెలిపింది.

ఈ హింసాత్మక ఘర్షణలో 43 మంది చైనా సైనికులూ మరణించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)