కరోనావైరస్‌: మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...

  • శ్రుతీ మేనన్‌
  • బీబీసీ రియాల్టీ చెక్‌
ముంబయిలోని ఓ టెస్ట్‌ సెంటర్‌లో స్వాబ్‌ శాంపిల్‌ సేకరిస్తున్న సిబ్బంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ముంబయిలోని ఓ టెస్ట్‌ సెంటర్‌లో స్వాబ్‌ శాంపిల్‌ సేకరిస్తున్న సిబ్బంది.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా రోజుకు 10 లక్షల టెస్టులు నిర్వహిస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ కొన్నివారాల కిందట ప్రకటించారు. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకున్నారా ? జరుగుతున్న టెస్టులన్నీ ప్రామాణికమైనవేనా?

భారత్‌లో ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి?

అంతర్జాతీయంగా వివిధ దేశాలు చేస్తున్న టెస్టుల వివరాలు సేకరిస్తున్న అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా అనే వెబ్‌సైట్‌కు అందిన సమచారం ప్రకారం ఆగస్టు మొదటినాటికి భారతదేశ వ్యాప్తంగా రోజుకు సరాసరిన 5లక్షల పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడటానికి ఇది పెద్ద సంఖ్యలాగే కనిపిస్తున్నా, దీన్ని జనాభా ప్రకారం చూడాల్సి ఉంది.

ప్రతి లక్షమందిలో రోజూ 36మందికి మాత్రమే టెస్టులు జరుగుతున్నట్లు లెక్క. అదే దక్షిణాఫ్రికాలో ప్రతి లక్షకు 69మందికి, పాకిస్థాన్‌లో 8మందికి, అదే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 192మందికి పరీక్షలు జరుగుతున్నాయి.

సుమారు 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతిరోజూ 10లక్షల టెస్టులు జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇండియాలో ఎలాంటి టెస్టులు జరుగుతున్నాయి ?

కరోనా వైరస్‌ను అడ్డుకట్ట వేయడంలో టెస్టులు కీలకమైనప్పుడు అవి ఎలాంటి టెస్టులు అన్నది కూడా కీలకమే. ప్రపంచవ్యాప్తంగా బాగా పరిచయమున్న పరీక్ష పీసీఆర్‌ టెస్ట్‌ (పాలిమెర్స్‌ చైన్‌ రియాక్షన్‌). ముక్కు, గొంతు నుంచి శాంపిల్‌ను తీసుకునే పద్ధతి ఇది. తీసుకున్న శాంపిల్‌లో ఉన్న ప్రొటీన్‌లు, కొవ్వు పదార్ధాలను రసాయనాల ద్వారా తొలగిస్తారు. ఆ తర్వాత వీటిని మెషిన్‌ ద్వారా పరిశీలిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జర్మనీలోని పీసీఆర్ టెస్ట్ మెషీన్

ఇవి చాలా ప్రామాణికమైనవని చెబుతున్నా చాలా ఖరీదైనవి కూడా. ఇండియాలో ఈ పరీక్షను ప్రాసెస్‌ చేయడానికి 8 గంటల సమయం తీసుకుంటోంది. ఫలితం రావడానికి 24 గంటలు పడుతోంది. అయితే శాంపిల్స్‌ను లేబరేటరీకి తరలించడానికి తీసుకునే సమయం కూడా దీనిపై ప్రభావం చూపుతుంది.

టెస్టుల సంఖ్యను పెంచడానికి అధికారులు చవకైన, త్వరగా ఫలితాలు వచ్చే ర్యాపిట్‌ యాంటీజెన్‌ టెస్టులవైపు మొగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని ర్యాపిడ్‌ టెస్ట్‌ లేదంటే డయాగ్నస్టిక్‌ టెస్టు అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ టెస్టుల్లో 15 నుంచి 20 నిమిషాలలో ఫలితాలు వస్తాయి.

కానీ, ఇవి అంత నమ్మకమైన టెస్టులు కావని, వీటిలో ఒక్కోసారి ప్రాణికత రేటు 50శాతమే ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా హాట్‌స్పాట్‌ ఏరియాలలో వీటిని ఉపయోగించి టెస్టులు చేస్తుంటారు.

గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురైన విషయాన్ని చెప్పగలిగే టెస్టులకు భిన్నంగా ఇవి ప్రస్తుతం శరీరంలో వైరస్‌ ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రమే చెప్పగలుగుతాయి.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

యాంటిజెన్‌ టెస్టులు పీసీఆర్‌ టెస్టుకన్నా ఫలితాల్లో వేగమే కానీ ప్రామాణికతపై సందేహాలున్నాయి.

భారత్‌తోపాటు బెల్జియం, దక్షిణ కొరియాలలో రూపొందించిన మూడు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లకు మాత్రమే ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) దేశంలో టెస్టులకు అనుమతి ఇచ్చింది.

అయితే వీటి మీద ఐసీఎంఆర్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్) సంస్థలు స్వతంత్రంగా జరిపిన పరిశీలనలో వాటి ప్రామాణికత 50 నుంచి 84శాతం వరకు మాత్రమే ఉందని తేలింది.

“యాంటీజెన్‌ టెస్టు నిజంగా ఇన్‌ఫెక్షన్లకు గురైన కేసుల్లో 50 శాతం కేసులను గుర్తించలేక పోతోంది’’ అని పబ్లిక్‌ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రొఫెసర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు.

అయితే దీనికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. ఒక్కోసారి స్వాబ్‌ శాంపిల్స్‌ సరిపడినంత రాకపోవచ్చు. మనిషిలో వైరస్‌ తీవ్రత, కిట్‌ క్వాలిటీలాంటి అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.

యాంటీజెన్‌ టెస్టుల్లో ఒక్కోసారి తప్పుడు నెగెటివ్‌ ఫలితాలు కూడా రావచ్చని, అందువల్ల నెగెటివ్‌ వచ్చిన వారు పీసీఆర్ టెస్టు కూడా చేయించుకుని వైరస్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలని ఐసీఎంఆర్‌ సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images

ర్యాపిడ్ టెస్టులను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారా ?

ర్యాపిడ్‌ టెస్టులు లేదా డయాగ్నాస్టిక్‌ టెస్టులు వైరస్‌ను అన్ని సందర్భాలలో గుర్తించలేక పోవచ్చు. యూకేలో ఈ ర్యాపిడ్‌ టెస్టుల్లో 20శాతం వరకు తప్పుడు నెగెటివ్‌ నివేదికలు వస్తున్నాయని తేలింది.

ఆక్స్‌ఫర్డ్‌ నానోపోర్‌ రూపొందించిన కిట్‌ 98% పాజిటివ్‌ కేసులను పట్టుకోగలుగుతున్నాయని , తేలింది. అయితే వీటి మీద వైద్యనిపుణులు, పరిశోధకులు స్వతంత్ర పరిశీలన జరపాల్సి ఉంది. ఈ సంస్థ తయారు చేసే రెండు రకాల కిట్లు జెనెటిక్‌ మెటీరియల్‌ను ఉపయోగిస్తాయని అందువల్ల ప్రామాణికతా శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్‌ వస్తే పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుఎస్ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థలు సూచించాయి.

గర్భ నిర్ధారణ పరీక్షల్లాగా ఇంట్లోనే సొంతంగా కరోనా టెస్టులను జరుపుకునేలా ప్రత్యేక కిట్లను రూపొందిచే పనిలో ఉంది అమెరికా. వీటిని మెడికల్ షాపుల్లో కొనుక్కుని లాలాజలం ఉపయోగించి టెస్ట్‌ చేసుకోవచ్చు.

అయితే వీటి ఫలితాలు ల్యాబ్‌ టెస్టుల మాదిరిగా సక్రమంగా ఉండాలని ఎఫ్‌డిఏ గైడ్‌లైన్స్‌ సూచిస్తున్నాయి. బీడీ, క్విడెల్‌ అనే సంస్థలు తయారు చేసిన ర్యాపిడ్‌ కిట్లను అమెరికా యాంటీజెన్ పరీక్షల కోసం వాడుతోంది. వీటి ఫలితాలలో ప్రామాణికత వరసగా 71శాతం, 81శాతంగా ఉంది. ఇండియా వాడే కిట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

Delhi's changing testing strategy. .  .

ఇండియా రాష్ట్రాలలో కరోనా కేసులు మిస్సవుతున్నాయా?

ఇండియాలో సొంత గైడ్‌లైన్స్‌ రూపొందించుకుంటున్న రాష్ట్రాలు క్రమంగా యాంటీజెన్‌ టెస్టులను పెంచుతున్నాయి. ఆగస్టు 4 నాటికి దేశంలో జరిగిన మొత్తం టెస్టుల్లో దాదాపు 30శాతం టెస్టులు యాంటీజెన్‌ టెస్టులేనని ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

జూన్‌లోనే ఢిల్లీ ప్రభుత్వం యాంటీజెన్ టెస్టులను ప్రారంభించింది. మిగతా రాష్ట్రాలు కూడా క్రమంగా దాన్ని అనుసరించాయి. జూన్‌ 29 నుంచి జూలై 28 వరకు జరిగిన టెస్టుల డేటాను పరిశీలించినప్పుడు ఢిల్లీ ప్రభుత్వం 587,590 టెస్టులు జరిపినట్లు, మొత్తం టెస్టుల్లో ఇవి 63శాతమని తేలింది.

Karnataka's testing strategy. .  .

ఇప్పటి వరకు అందుతున్న డేటానుబట్టి ఢిల్లీలో నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన యాంటీజెన్‌ టెస్టులను మళ్లీ పీసీఆర్‌ టెస్టుకు పంపగా వాటిలో 18శాతం కేసులు పాజిటివ్‌లుగా తేలింది.

గత కొన్ని వారాలుగా ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుతోందని సమాచారం అందుతుండగా, ఈ టెస్టుల్లో చాలా తప్పులు దొర్లుతున్నాయని, కొన్ని మిస్సవుతున్నాయని నిపుణులు అంటున్నారు. పీసీఆర్‌ టెస్టులు పెంచాల్సిందిగా టెస్టింగ్ సెంటర్లకు ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.

కానీ ఇప్పటి వరకు అందుతున్న డేటాలో 50శాతం టెస్టులు యాంటీజెన్ టెస్టులేనని తేలింది. కేవలం హాట్‌స్పాట్‌లలోనే ఇలాంటి టెస్టులను జరపాలని హైకోర్టు సూచించినా, పరిస్థితిలో మార్పులేదు.

జులై నెల నుంచి కర్ణాటక యాంటీజెన్‌లు టెస్టులు నిర్వహిస్తోంది.30 జిల్లాలకు కలిపి రోజుకు 35,000 టెస్టులు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నా యాంటీజెన్‌ టెస్టులు పెరిగిపోతూనే ఉన్నాయి. పీసీఆర్‌ టెస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

గ్రాఫిక్స్‌ హెడ్డింగ్‌: కర్ణాటకలో పెరిగిన యాంటీజెన్‌ టెస్టులు

గత నెల చివరివారంలో జరిగిన టెస్టుల్లో ప్రాథమికంగా నెగెటివ్‌ అని తేలిన కేసుల్లో 38శాతం కేసులు తర్వాత పీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా గత నెల నుంచి యాంటీజెన్‌ టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం రోజూవారి వివరాలను అందించడం లేదు. అయితే ప్రస్తుతం 31 ప్రభుత్వ, ప్రైవేటు టెస్టు సెంటర్లలో పీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. 320 ప్రభుత్వ కేంద్రాలలో యాంటీజెన్‌ టెస్టులు జరుగుతున్నాయి.

కోవిడ్‌-19కు తీవ్రతలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్ర దేశంలోనే తొలిసారిగా ముంబయిలో యాంటీజెన్‌ టెస్టులను ప్రారంభించింది. కరోనా లక్షణాలున్న వారికి మున్సిపల్ కార్పొరేషన్‌ నిర్వహించిన టెస్టుల్లో 65శాతం కేసులు నెగెటివ్‌ కేసులు తర్వాత పీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌ అని తేలింది.

ర్యాపిడ్‌ టెస్టుల వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయన్నారు వైద్య నిపుణులు డాక్టర్‌ అనుపమ్‌ సింగ్‌. “అతి తీవ్రస్థాయిలో వైరస్‌ బారిన పడిన వారిని వేగంగా గుర్తించడానికి ఈ టెస్టు బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వారిలో ఎక్కువ వైరస్‌ లోడ్ ఉంటుంది. వారే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతారు’’ అన్నారు అనుపమ్‌ సింగ్‌. అయితే ఈ టెస్టుల్లో చాలామందిని గుర్తించలేకపోయే ప్రమాదం కూడా ఉందని అన్నారాయన.“ పీసీఆర్‌ టెస్టుకు ఖర్చు ఎక్కువ. ఈ కారణంతోనే ప్రభుత్వ యంత్రాంగం మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఎక్కువ వైరస్‌ ఉన్న వారిని గుర్తించే పనిలో ఉంది. వారిలోనే మరణాలకు అవకాశం ఎక్కువ” అన్నారు డాక్టర్‌ సింగ్‌.

ర్యాపిడ్‌ టెస్టులతో లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తగ్గించే అవకాశం ఉంది. కానీ వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి మాత్రం ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. దీనికి అనుబంధంగా పీసీఆర్‌ టెస్టులను చేసుకుంటూ వెళ్లాల్సిందే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)