రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన... 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, NurPhoto

ఫొటో క్యాప్షన్,

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత రక్షణశాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదంలో భాగంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వావలంబన సాధించేలా చేస్తామని అన్నారు.

రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఆంక్షలు విధించే ఉత్పత్తుల జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం, భవిష్యతులో దేశీయంగా యుద్ధ సామగ్రి తయారీ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు సాయుధ బలగాలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలతోనూ చర్చించినట్లు చెప్పారు.

దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న జాబితాలో దేశ రక్షణ అవసరాలు తీర్చే ఆర్టిలరీ గన్, అసాల్ట్ రైఫిల్స్, రవాణా విమానాలు, ఎల్‌సీహెచ్‌ఎస్ రాడార్ల లాంటి కొన్ని ఆధునిక సాంకేతికత కలిగిన సామగ్రి, వస్తువులు కూడా ఉన్నాయని అన్నారు.

వచ్చే 6-7 ఏళ్లలో దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అంశం గురించి కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, YAWAR NAZIR

ఫొటో క్యాప్షన్,

స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వావలంబన సాధించేలా చేస్తామని‌ రాజ్‌నాథ్ అన్నారు

ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశీయ రక్షణ పరిశ్రమలకు రూ.52 వేల కోట్ల ప్రత్యేక కేటాయింపులను ఆయన ప్రకటించారు.

అయితే, దిగుమతులపై ఆంక్షలు వెంటనే కాకుండా... 2020 నుంచి 2024 మధ్యలో దశలవారీగా అమల్లోకి వస్తాయని రాజ్‌నాథ్ వివరించారు.

ఈ ఉత్పత్తుల్లో సైన్యం, వాయుసేన కోసం రూ.1.3 లక్షల కోట్ల మేర విలువైన సామగ్రి, నావికాదళం కోసం రూ.1.4 లక్షల కోట్ల విలువైన సామగ్రి తయారవుతుందని ఆయన అన్నారు.

ఆంక్షలు విధించిన పరికరాల ఉత్పత్తి అనుకున్న సమయంలో జరిగేలా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని రాజ్‌నాథ్ అన్నారు. ఇందుకోసం రక్షణ విభాగాలు, పరిశ్రమల మధ్య సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

భవిష్యతులోనూ సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరుపుతూ, మరిన్ని ఉత్పత్తులను ఆంక్షల జాబితాలోకి తీసుకువస్తామని కూడా రాజ్‌నాథ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)