కనిమొళి ట్వీట్‌తో కలకలం: హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు

కనిమొళి

ఫొటో సోర్స్, GETTY IMAGES

దిల్లీకి బయలుదేరుతూ చెన్నై విమానాశ్రయానికి వచ్చిన డీఎంకే ఎంపీ కణిమొళిని 'మీరు భారతీయులేనా' అని అక్కడ పనిచేసే ఒక సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి ప్రశ్నించడం వివాదాస్పదమైంది.

విమానాశ్రయంలో తన అనుభవాన్ని కనిమొళి ట్విటర్‌లో షేర్ చేశారు.

"నాకు హిందీ తెలియకపోవడంతో ఇంగ్లిష్ లేదా తమిళంలో నాతో మాట్లాడాలని ఈరోజు విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారిని అడిగాను. ఆమె నన్ను 'మీరు భారతీయులేనా' అని అడిగారు. భారతీయలుగా ఉండడమంటే, హిందీ తెలిసుండడమేనా అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా"అని ఆమె అన్నారు.

తర్వాత కనిమొళి విమానాశ్రయంలో అసలేం జరిగిందో వివరంగా చెప్పారు.

విమానాశ్రయంలో నాకు హిందీలో కరోనా సూచనలు చేశారు. నేను వారితో నాకు హిందీ తెలియదని, ఇంగ్లిష్ లేదా తమిళంలో చెప్పాలని అడిగాను. కానీ, వాళ్లు నాతో హిందీలోనే మాట్లాడుతూ వచ్చారు.

అందరికీ హిందీ తెలిసుండాల్సిన అవసరం లేదని, దయచేసి ఇంగ్లిష్‌లో వివరించాలని నేను ఆ అధికారిని అడిగాను. దానికి ఆమె నాతో, 'మీరు భారతీయులేనా' అన్నారు.

నేను ఆ అధికారితో "నేను ఎవరన్నది మీరు నిర్ణయించలేరు. దీనిపై ఫిర్యాదు చేస్తాను"అన్నా. కానీ, ఆ అధికారి అసలు ఏదీ పట్టించుకోనట్టు కనిపించారు.

"ఆలస్యం అవుతుండడంతో, నేను అక్కడినుంచి వచ్చేశాను. అక్కడ జరిగినదాని గురించి ట్వీట్ చేశాను" అని కనిమొళి చెప్పారు.

"దిల్లీలో ల్యాండ్ అవగానే సీఐఎస్ఎఫ్ అధికారులు నన్ను కలిశారు. ఒక ప్రత్యేక భాష గురించి చెప్పడం తమ ఉద్దేశం కాదన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాళ్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా" అని కనిమొళి తెలిపారు.

"కానీ, భారతీయ వ్యక్తి ప్రతి ఒక్కరికీ హిందీ తెలిసుండాలనే ఆలోచన ఇంకా అలాగే ఉంది. ఇది ఇక్కడే కాదు, అన్నిచోట్లా ఉంది. ఇది దేశ ఐక్యతకు భంగం కలిగించబోతోంది" అని కనిమొళి అన్నారు.

"ఒక భాష, లేదా ప్రాంతం, మతం లేదా భావజాలానికి చెందిన ఒక వ్యక్తి మాత్రమే ఈ దేశానికి చెందినవాడు, మిగతావారంతా బయటివారు అనే ఆలోచన ఉంది. ఇలాంటి ఆలోచనలను అమలు చేయడాన్ని లేదా భాషను రుద్దడాన్ని మనం అంగీకరించలేం" అని అభిప్రాయపడ్డారు.

కనిమొళి ట్వీట్‌తో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. భాషను బలవంతంగా రుద్దకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కనిమొళి చెన్నై విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.30కు విస్టారా ఎయిర్ లైన్స్ విమానంలో దిల్లీ చేరుకున్నారు.

ఆమె దిల్లీలో సోమవారం జరిగే ఒక పార్లమెంటరీ సలహా సంఘం సమావేశంలో పాల్గొననున్నారు.

ఫొటో సోర్స్, CISF

దర్యాప్తు చేస్తున్నాం

చెన్నై విమానాశ్రయం అధికారులను బీబీసీ దీనిపై ప్రశ్నించింది.

కనిమొళి ట్విటర్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని వారు చెప్పారు. మహిళా అధికారి ఆమెను అలా ఎందుకు అన్నారో దర్యాప్తు చేస్తున్నామని విమానాశ్రయం సెక్యూరిటీ అధికారి చెప్పారు.

కనిమొళి ఎంపీ కాబట్టి సంబంధిత ఫార్మాలిటీ ప్రకారం ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడంలో ఏవైనా లోపాలు జరిగాయేమో మేం విచారణకు ఆదేశించాం అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)