మహేశ్ బాబు: ఒక్క రోజు అభిమానుల ట్వీట్లతో ‘వరల్డ్ రికార్డ్’ - ప్రెస్ రివ్యూ

మహేశ్ బాబు

ఫొటో సోర్స్, facebook/urstrulyMahesh

టాలీవుడ్ హీరో మహేశ్‌ బాబు ట్విటర్‌లో కొత్త రికార్డు సృష్టించినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఆదివారం మహేశ్‌ బాబు పుట్టినరోజు కావడంతో ట్విటర్‌లో 24 గంటల్లోనే ఆయన అభిమానులు 60.2 మిలియన్ల (6 కోట్ల 2 లక్షల) ట్వీట్లు చేశారు.

#HBDMaheshBabu అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇది వరల్డ్ రికార్డ్ అంటూ మహేశ్ బాబు పీఆర్ టీమ్ ప్రకటన కూడా చేసింది.

ప్రస్తుతం మహేశ్ బాబు పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు.

ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

కరోనా శవాన్ని కుక్కలు తినేశాయ్

కరోనావైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దహనం చేయడంలో నిరక్ష్ల్యంగా వ్యవహరించడంతో కుక్కలు తినేసినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తినాలుగు రోజుల క్రితం కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని రిమ్స్అధికారులు మున్సిపాలిటీ వారికి అప్పజెప్పారు.

మృతదేహానికి నిప్పంటించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తరువాత మంటలు ఆరిపోవడంతో శవం పూర్తిగా కాలలేదు. అలా మిగిలిపోయిన మృతదేహాన్నికుక్కలు కొంత దూరం ఈడ్చుకెళ్లి తినేశాయి.

ఈ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై పరిశీలన చేయాలని ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి నేతృత్వంలో కమిటీ వేశారు.

743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా

ఇప్పటివరకు 743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ప్రస్తుతం 402 మంది కోలుకున్నారని, 338 మంది చికిత్స పొందుతున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్‌ తెలిపారు. ముగ్గురు మృత్యువాత పడ్డారని వెల్లడించారు.

కోలుకున్న ఉద్యోగుల్లో కొందరు మళ్లీ విధులకు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు.

మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు మూడు వారాల్లోనే రూ. 2.61 కోట్ల విరాళాలందాయని అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో ప్రైవేటు రంగంలో కొలువుల భర్తీకి కొత్త ప్రణాళిక

తెలంగాణలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించినట్లు సాక్షి ఓ కథనం ప్రచురించింది.

ఇప్పటికే డీట్‌ పేరుతో మంత్రిత్వ శాఖ ఓ వెబ్‌సైట్‌ సిద్ధం చేసింది. దీని సాయంతో త్వరలో కార్పొరేట్‌ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది.

ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి.

మరోవైపు గ్రామీణ యువత ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)