విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదానికి బాధ్యులెవరు? హోటల్‌లో ఆస్పత్రికి అనుమతులు ఎలా ఇచ్చారు?

 • బళ్ల సతీశ్
 • బీబీసీ ప్రతినిధి
స్వర్ణ ప్యాలస్

కోవిడ్ చికిత్సలో ప్రైవేటు రంగంలో పడకల కొరత, హోటెళ్లను ఆసుపత్రులుగా మార్చింది. ప్రభుత్వ పడకలు ఖాళీ ఉన్నా, వాటిపై నమ్మకం లేని, స్తోమత ఉన్న వర్గాలు ప్రైవేటు చికిత్సకు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో చాలా ప్రైవేటు ఆసుపత్రులు హోటళ్లతో పొత్తు పెట్టుకుని, వారితో కలసి కోవిడ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.

అందుకోసం కొందరు డాక్టర్లు, నర్సులను ఆ హోటెళ్లలో ఉంచుతున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో ఉంటామన్న ధీమా, ఇంట్లోని మిగతా వారికి వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చన్న ఆలోచనతో వీటివైపు వెళ్తున్నారు రోగులు, అనుమానితులు.

ఆదివారం నాడు విజయవాడలో ఇలాంటి ఒక హోటల్లోనే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై రెండు కమిటీలు పనిచేస్తున్నాయి. ఒకటి వైద్య నిపుణులతో వేసిన కమిటి కాగా, రెండోది కరెంటు, ఫోరెన్సిక్, ఫైర్ నిపుణులతో వేసింది. వీరి నివేదిక రావాల్సి ఉంది.

అయితే, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వర్ణ పాలెస్ హోటల్ యాజమమాన్యం పాటించలేదని మాత్రం సాధారణ వ్యక్తులు పరిశీలించినా అర్థమమవుతుంది. అంతేకాదు, హోటల్‌ని ఆసుపత్రి అవసరాల కోసం తీసుకున్నప్పుడు పాటించాల్సిన నిబంధనలు కూడా అటు ఆసుపత్రీ, ఇటు హోటల్.. రెండూ పాటించలేదు. దీంతో పోలీసులు రెండిటి యాజమాన్యాల మీద కేసు పెట్టారు.

సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాలకు కారణమైన సంస్థ, ప్రదేశం లేదా వాహనానికి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వారిపై నేరుగా కేసు పెడతారు. కానీ విజయవాడ ఘటనలో మాత్రం పోలీసులు కేవలం యాజమాన్యాలపై కేసులు పెట్టారు తప్ప ఎక్కడా వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్టూ చేయలేదు.

ఈ క్రమంలో అసలు తప్పెవరిది? కోవిడ్ కేర్ సెంటర్‌గా ఉపయోగించడానికి అన్ని అర్హతలూ ఉన్నాయా లేదా అన్నది చూడకుండా హోటల్‌లో కోవిడ్ సెంటర్ ఎలా ప్రారంభించారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు.

సరిగ్గా నాలుగు రోజుల క్రితమే అహ్మదాబాద్ లో కూడా ఒక కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది మరణించారు. ఐసీయూలో పీపీఈ కిట్ ధరించిన సిబ్బంది ఒకరికి మొదటగా మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మొదట పీపీఈ కిట్ కి అంటుకున్న మంటలు తరువాత ఒకరి నుంచి ఒకరికి పాకాయి. అక్కడ ప్రమాదం ఐసీయూలోనే జరిగింది.

తాత్కాలిక ఆసుపత్రులకు మార్గదర్శకాలేవీ?

ప్రభుత్వం ఏఏ ఆసుపత్రులు కోవిడ్ చికిత్స అందించవచ్చో కొన్ని నిబంధనలు ఇచ్చింది. అలాగే రేట్ల విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. కానీ, ఆ ఆసుపత్రులు వేరే భవనాలను లీజుకు తీసుకుని తాత్కాలిక ఏర్పాట్లు చేస్తే ఏం చేయాలన్న మార్గదర్శకాలు ఏవీ అందుబాటులో లేవు. ఆంధ్ర, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ఈ వివరాలు లేవు. కేవలం అందుబాటులో ఉన్న ప్రాథమిక వివరాలతో, అదనపు నిబంధనలేం లేకుండానే అనుమతులిచ్చారు.

అంటే మొత్తానికే రూల్స్ లేవా? అంటే అలా కాదు.

ఈ సందర్భంలోనే అసలు భవనాలకు అగ్నిమాపక నిబంధనల రూల్స్ తెరమీదకు వచ్చాయి. ఆంధ్ర, తెలంగాణల్లో అగ్నిమాపక వ్యవస్థకు సంబంధించి పేజీల కొద్దీ రూల్స్ ఉన్నాయి.

బహుళ అంతస్తుల భవనాల నిబంధనలు 1981, ఆంధ్రప్రదేశ్ అగ్నిమమాపక సేవల చట్టం 1999, ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, అత్యవసర సేవల నిర్వహణ, ఫీజుల విధింపు నియమమావళి 2006, వీటికి అదనంగా జాతీయ భవనాల నియమావళి (నేషనల్ బిల్డింగ్స్ కోడ్ 2016) ఉన్నాయి.

వాటిలో ఒక కీలక నిబంధనను ప్రస్తుత ఘటనలో బాధ్యులైన ఆసుపత్రి, హోటెల్ ఇద్దరూ విస్మరించారు.

ఆయా భవనాలను ఎందుకు వాడుతున్నారు అనే అంశం ఆధారంగా గ్రూపులుగా వర్గీకరిస్తుంది అగ్నిమాపక శాఖ. ఆ మేరకు గ్రూప్ ఏ - 5 కింద హోటళ్లని నివాస ప్రాంతాలుగా వర్గీకరించారు. గ్రూప్ సీ - 1 కింద హాస్పిటళ్లు ఉంటాయి.

''ఆక్యుపెన్సీ (భవనంలో ఉండే సమూహం) మారినప్పుడు ఫైర్ నిబంధనలూ మారతాయి. హోటల్‌ అనేది నివాస ప్రాంతం. అంటే ప్రమాదం తక్కువగా ఉండేది (లో హజార్డ్). కానీ హాస్పిటల్ అనేది ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతం (హై హజార్డ్). రెసిడెన్షియల్‌ భవనాన్ని హాస్పిటల్‌గా మార్చకూడదు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు కావల్సిన సరంజామా, ప్రమాదం జరిగాక అందులోని వ్యక్తులను బయటకు తప్పించే ప్లాన్ ఈ రెండు సందర్భాల్లోనూ వేర్వేరుగా ఉంటాయి. హోటల్‌లో అందరూ ఒకేలా ఉంటారు. ఆసుపత్రుల్లో పరిస్థితులు వేరు. మామూలు పేషెంట్లు, ఐసీయూ అంటే కదల్లేని పేషెంటలూ, వారి అటెండర్లు, సిబ్బందీ.. ఉంటారు. కాబట్టి ఆ రెండు వేర్వేరు లైసెన్సింగ్ కిందకు వస్తాయి. పొగ బయటకు వెళ్లడానికి, మనుషులను దింపడానికీ పద్ధతులు మారతాయి'' అని నిబంధనల గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జయరామ్ నాయక్.

అయితే ఇక్కడో తిరకాసు ఉంది. ఈ నిబంధనల గురించి అగ్నిమాపక శాఖకు తెలుసు కానీ, మిగతా వారికి తెలుసా లేదా అన్నది ప్రశ్న. ఎందుకంటే, హోటళ్లను కోవిడ్ సెంటర్లుగా మార్చుకోవడానికి పెట్టిన అప్లికేషన్లను జిల్లా యంత్రాంగం స్వయంగా పరిశీలించి అనుమతించింది.

జిల్లా కలెక్టర్ కార్యాలయం, డీఎంహెచ్ఓ కార్యాలాయలు ఒప్పుకున్న తరువాతే హోటెల్స్ కోవిడ్ కేంద్రాలుగా మారాయి. వారు కూడా ఆయా హోటళ్లకు ఉన్న ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించారు. కాకపోతే అవి హోటల్‌కే పనికొస్తాయి కానీ, ఆసుపత్రికి పనికిరావన్న విషయం వారికీ తెలిసినట్టు లేదు. దీనిపై అధికారులు బీబీసీకి ఇంకా సమాధానం చెప్పలేదు.

ఇలా జిల్లా యంత్రాంగం అనుమమతితోనే, స్వర్ణా పాలెస్‌తో కలిపి మొత్తం విజయవాడలో 20 హోటళ్లను ప్రస్తుతం కోవిడ్ అవసరాల కోసం వివిధ ప్రైవేటు ఆసుపత్రులు వాడుతున్నాయి.

పోనీ ఆసుపత్రో, హోటలో ఏదో ఒక ఫైర్ ఎన్ఓసీ ఉన్నప్పటికీ, అసలు అక్కడ వాస్తవ పరిస్థితి అగ్నిప్రమాదాలను తట్టుకునేలా ఉందా అన్నది మరో ప్రశ్న. నిజానికి అగ్నిమాపక శాఖ దీనిపై తనిఖీలు జరపాల్సి ఉంటుంది. హోటల్ యాజమాన్యాలు దీనిపై బోర్డులు పెట్టాలి, డ్రిల్స్ నిర్వహించాలి.

కానీ వాస్తవంగా అలాంటి వాటిని పాటించే వారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున్న దానిపై స్పందించడానికి నిరకారించారు అగ్నిమాపక శాఖ అధికారులు.

''హెటళ్లన్నీ రూల్స్ పాటిస్తాయి. నిబంధనల ప్రకారమే వెళ్తాం. నిన్న జరిగిన ప్రమాదం కూడా, అక్కడ రోజుకు 3 సార్లు శానిటైజ్ చేస్తున్నారు. అందులో వాడే స్పిరిట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని మేం భావిస్తున్నాం'' అన్నారు విజయవాడ హోటల్ యజమానుల సంఘం కార్యదర్శి సంజయ్ కుమార్ మెహతా జైన్.

''స్వర్ణ పాలెస్ కట్టి 45 ఏళ్లు అవుతుంది. ఫైర్ అనుమతి ఉంటేనే వారు హోటల్ నడపగలరు. అప్పటి నిబంధనల ప్రకారం హోటల్ కట్టారు. కానీ తరువాత నిబంధనలు అప్డేట్ అవుతూ వచ్చాయి'' అని ఆయన వివరించారు.

ప్రభుత్వ అధికారులు అన్నీ పరిశీలించిన తరువాతే కోవిడ్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లుగా హోటెళ్లను మలచడానికి అనుమతులిచ్చారని ఆయన గుర్తు చేశారు.

సాధారణంగా ఏదైనా అంశంపై ప్రభుత్వ అనుమతులు రావడానికి చాలా కాలం పట్టేస్తుంది. కానీ కరోనా తొందరతో, హోటళ్లకు అనుమతులు చకచకా ఇచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగే సరికి ప్రభుత్వాలు ఒక్క క్షణం జాగ్రత్త పడ్డాయి. విజయవాడ ఘటనతో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం కదిలింది.

''మీ పెషెంట్లను పెట్టిన హోటెల్స్ అన్నీ అగ్నిమాపక నిబంధనలు పాటించేలా చూసుకోవాలనీ, అలాంటి వాటిలో లోపాలు ఉంటే, తీవ్రంగా పరిగణిస్తామనీ'' తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters

అగ్నిమాపక నిబంధనలు:

 • అగ్నిమాపక వ్యవస్థకు సంబంధించీ ఆయా భవనాలను బట్టి వందలాది నిబంధనలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇవి:
 • ఫైర్ ఇంజిన్ ఒక భవనానికి కనీసం మూడు వైపులా వెళ్లగలిగేలా ఉండాలి.
 • భవనం పైన నీటి నిల్వ ఏర్పాట్లు ఉండాలి. పొగ బయటకు వెళ్లే ఏర్పాట్లు ఉండాలి.
 • మంటలను ఆర్పే పరికరాలు, బకెట్లు, పైపులు, నీటిని చల్లేవి ఉండాలి.
 • బయటకు వెళ్లే దారులు, కారిడార్లు, మెట్ల దారులు, అత్యవసర వెలుతురు కోసం బ్యాటరీ బల్బులు, వాటికి సంబంధించిన బోర్డులు ఉండాలి.
 • ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. దానిపై నిరంతరం ప్రాక్టీసు (ఆరు నెలల కోసారి) ఉండాలి.
 • కిటికీలు తెరుచుకునేలా ఉండాలి. అగ్ని ప్రమాదం జరిగితే మోగే అలారంలు, ప్రకటనలు వినిపించే స్పీకర్లు ఉండాలి.
 • మోటార్లు పనిచేయాలి. అగ్నిమాపక ద్రావణం ఉండాలి. అత్యవసర మార్గాలు తెరిచేలా ఉండాలి. నాజిల్స్ తాళాలు పక్కనే ఉండాలి.
 • అగ్నిమాపక సిబ్బందికి అదనంగా వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలి. వారు ఆపత్కాలంలో సాయపడతారు.
 • అగ్నిమాపక సిబ్బంది నుంచి లైసెన్సు పొందాలి. సిబ్బంది తనిఖీ చేసి సర్టిఫై చేయాలి. (కానీ చాలా సంస్థల్లో తనిఖీలు చేయడం లేదని, కనీసం సగం సంస్థల్లో కూడా తనిఖీలు జరగడం లేదని ఉమ్మడి రాష్ట్రంలోని ఆడిటింగ్ నివేదికలు చెబుతున్నాయి.)
 • స్థలాలు, భవనాల ఆస్తి పన్నులో ఒక శాతం (సర్ చార్జీలాగా) అగ్నిమాపక సేవల పన్ను వసూలు చేయాలి. (దీని ద్వారా అగ్నిమాపక వ్యవస్థలు మెరుగుపర్చవచ్చు)

ఇవి కాక నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016లో ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 లో అగ్ని ప్రమాదాల వల్ల 445 మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 90 శాతం ప్రమాదాలు కరెంటు వల్ల లేదా సిగరెట్ ఆర్పకుండా పారేయడం వల్లే జరిగాయి అని అధికారిక నివేదిక. ఇక ప్రమాదాల సంఖ్య వేలల్లో ఉంది. పెద్ద ప్రమాదాల సంఖ్య కూడా వందల్లో ఉంది.

స్వర్ణ పాలెస్ ఘటన ఆ జాబితాలో కలసిపోతుందో, లేకుంటే ఆ జాబితా పెరగకుండా ఉండేలా ప్రయత్నించే పునాది అవుతుందో అనేది ప్రభుత్వం తీసుకునే చర్యలపై, యాజమాన్యాల బాధ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)