కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రాజేశ్ పెదగాడి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలోని పెద్దవాల్తేరుకు చెందిన 69ఏళ్ల కాంతమ్మకు జులై 17న కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఇంటికి సమీపంలోని మార్కెట్‌లో ఆమెకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమెకు వైరస్ సోకినట్లు తెలిసినవెంటనే ఆరోగ్య సిబ్బంది ఆమెను విమ్స్‌కు తరలించారు.
ఆమె ఇంటిలో ఆమెతోపాటు ఆమె చిన్న కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటారు. వీరెవరికీ ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు.
15 రోజుల తర్వాత కాంతమ్మ ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె ఎప్పటిలానే కుటుంబ సభ్యులతోపాటు రెండు గదుల ఇంటిలో కలిసి ఉంటున్నారు.
కొన్ని రోజులకు ఆమెతోపాటు ఇంటిలోని ఐదుగురిలోనూ దగ్గు, జలుబు, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపించాయి.
అంతేకాదు కాంతమ్మ ముగ్గురు కుమార్తెలతోపాటు పెద్ద కుమారుడి కుటుంబంలోని సభ్యుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయి. వీరిలో కొందరు వరలక్ష్మీ వ్రతం వేడుకలు నిర్వహించుకునేందుకు కాంతమ్మ చిన్న కుమారుడి ఇంటికి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
"అవగాహన లేదు"
"మా అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మాలో ఎవరికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. మేం ఆమెకు ఫోన్‌తోపాటు బట్టలు, పళ్లు ఇవ్వడానికి విమ్స్‌కు వెళ్లేవాళ్లం. ఆమె ఆసుపత్రిలో చేరిన మూడో రోజు నుంచే నేను పనికి వెళ్లడం మొదలుపెట్టాను. కరోనావైరస్ వ్యాప్తి నడమ మూడు నెలలు మాకు పనుల్లేవు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే నేను పనికి వెళ్లడం మొదలుపెట్టాను"అని కాంతమ్మ చిన్న కుమారుడు కేదారేశ్వర్ తెలిపారు.
మరోవైపు కాంతమ్మ పెద్ద కుమార్తె ఆదిలక్ష్మి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో జులై 20న మున్సిపల్ ఆఫీస్‌లోని కోవిడ్-19 కేంద్రానికి వెళ్లారు. అయితే ఐదు రోజుల తర్వాత రావాలని అక్కడి వైద్యులు సూచించారు.
"ఐదు రోజుల తర్వాత మళ్లీ మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్లాను. అయితే అక్కడ వైద్యుడికి కరోనావైరస్ సోకడంతో కేజీహెచ్‌కు వెళ్లమని సూచించారు. కానీ కేజీహెచ్‌లో అప్పటికే చాలా మంది కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్నారని మా అబ్బాయి చెప్పాడు. అక్కడకు వెళ్తే.. నాకు వైరస్ సోకే ముప్పు ఎక్కువ ఉంటుందని అన్నాడు. దీంతో ఇంటికి తిరిగి వచ్చేశాను"అని ఆదిలక్ష్మి వివరించారు.
కాంతమ్మకు కరోనావైరస్ సోకిన తర్వాత వీరి ఇంటిని శానిటైజ్ చేయలేదు. వీరెవరికీ హోమ్ ఐసోలేషన్‌లో కూడా పెట్టలేదు. ఆమెకు వైరస్ ఎలా సోకిందో కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేయడానికి ఇంటికి ఎవరూ రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
"మాకు ఐసోలేషన్ గురించి ఎవరూ ఏమీ చెప్పలేదు. పరీక్షలూ కూడా నిర్వహించలేదు" అని కేదారేశ్వర్ అన్నారు.
నేడు వైరస్ సోకిన చాలా మందికి హోమ్ ఐసోలేషన్ ఉండాలని ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెబుతున్నాయి.
అయితే, అసలు చాలా మందికి ఇంటిలో ఉండేటప్పుడు ఏం చేయాలో స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. కొన్నిసార్లు వైద్యులు సూచనలు సరిగా ఇవ్వలేకపోతుంటే... మరికొన్నిసార్లు వారు ఇచ్చే సూచనలను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఇంతకీ కరోనావైరస్ సోకిన తర్వాత ఇంటిలో ఉండేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఐసోలేషన్‌లో ఉండటం ఎలా? వీధిలో కరోనా రోగులు ఉండే ఏం చేయాలి?.

ఫొటో సోర్స్, Getty Images
హోమ్ ఐసోలేషన్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వమూ మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిలోని వివరాల ప్రకారం..
- చక్కగా వెలుతురు, గాలి వచ్చే గదిలో కరోనావైరస్ సోకినవారిని ఉంచాలి. వారికి ఉపయోగించే మరుగుదొడ్డిని వేరెవరూ వాడకూడదు.
- రోగులను చూసుకోవడానికి ఒక సహాయకుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. లేని పక్షంలో సాయం కోసం 18005994455 (తెలంగాణ), 104 (ఆంధ్రప్రదేశ్) నంబరును సంప్రదించాలి.
- 55ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలుండేవారు, క్యాన్సర్, ఆస్థమా, శ్వాస సంబంధిత వ్యాధులు, రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యలు ఉండేవారిని వేరే ఇంటికి పంపించాలి.
- ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్, బ్లూటూత్‌లను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది రోజూ ఫోన్ చేస్తారు. వారికి పూర్తి సహకారం అందించాలి.
"ఇంటిలో విడిగా గదులు ఉండేవారు మాత్రమే ఐసోలేషన్‌లో ఉండగలుగుతున్నారు. ఒకే గదిలో ఉండాల్సినవారు, పేదవారు కుటుంబాలు మొత్తంగా వైరస్ బారిన పడుతున్నాయి. అందుకే చాలా హోటల్స్ ఇప్పుడు క్వారంటైన్ గదులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అన్నింటికంటే మరుగుదొడ్డి విడిగా ఉండటం ముఖ్యం. తక్కువ గదుల్లో నివసించే కుటుంబాలు నేడు పెద్ద సమస్యగా మారాయి. ప్రభుత్వం నేడు ఎలాంటి క్వారంటైన్ సదుపాయాలు అందించడం లేదు. డబ్బులు ఉండేవారు మాత్రం హోటల్స్‌ను ఎంచుకొంటున్నారు"అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ డా. సంజీవ్ సింగ్ అన్నారు.
"కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఇదివరకటిలా జరగడం లేదు. ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది. సామూహిక వ్యాప్తి కచ్చితంగా జరుగుతోంది. వైరస్ చెలరేగుతోంది. దీన్ని సామూహిక వ్యాప్తి కాకపోతే.. మరేమంటారు? అయితే ఐసీఎంఆర్ దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు"అని సంజీవ్ సింగ్ అన్నారు.

రోగులకు సూచనలు ఇవీ..
- నీళ్లు ఎక్కువగా తాగాలి.
- గోరు వెచ్చటి నీరు మంచిది.గది నుంచి బయటకు ఎప్పుడు వచ్చిన మాస్క్ ధరించడం తప్పనిసరి.
- దగ్గే టప్పుడు లేదా తుమ్మే టప్పుడు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉపయోగించాలి.
- వాడిన కర్చీఫ్, టిష్యూ, బట్టలను గాలి చొరబడలేని కవర్లు, చెత్త బుట్టల్లో వేయాలి. వీలైతే ఇంటిబయట వీటిని కాల్చేయాలి. ఇతర చెత్తలో వీటిని కలపకూడదు.
- మరుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత చేతులను 40 నుంచి 60 సెకన్లపాటు కడుక్కోవాలి. తడి చేతుల్ని తుడుచుకోవడానికి క్లాత్ ఉపయోగించొద్దు.
- ఐసోలేషన్ గదిని రోగులే శుభ్రం చేసుకోవాలి. వారికి కష్టమైతే.. దాన్ని తుడిచేవారు మూడు లేయర్ల వైద్య మాస్కులు, గ్లవ్స్, ఫేస్ షీల్డ్ అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంటికి శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌లను ఉపయోగించాలి. రోజుకు రెండు సార్లు గదిని శుభ్రం చేయాలి.
- ఇంట్లో వయసు పైబడినవారు, గర్భిణులు, పిల్లలు, ఇతర జబ్బులు ఉండేవారి నుంచి ఆరు అడుగులు లేదా రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ తాగకూడదు. ఎందుకంటే వైరస్ శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది.వాడిన బట్టలను 30 నిమిషాలపాటు వేడినీళ్లలో పెట్టి తర్వాత ఉతకాలి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
- దగ్గు, తుమ్ములు ఎక్కువగా వచ్చేటప్పుడు
- బాగా బలహీనంగా అయినప్పుడు
- రొమ్ములో ఎడతెగని నొప్పి వచ్చినప్పుడు
- గందరగోళంగా అనిపిస్తున్నప్పుడు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు
- విపరీతంగా జ్వరం వచ్చినప్పుడు
- పెదవులు, ముఖం లేదా నిలం రంగులో కనిపించేటప్పుడు
"స్వల్ప లక్షణాలున్న రోగులను ప్రభుత్వం ఆసుపత్రుల్లోకి తీసుకోవట్లేదు. కేవలం సీరియర్ కేసులను మాత్రమే తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో 100 బెడ్లు ఉంటే కేవలం 20 మాత్రమే కోవిడ్-19కు కేటాయిస్తున్నారు. కేవలం గాంధీ ఆసుపత్రి మాత్రమే మొత్తం బెడ్లను కోవిడ్-19 రోగులకు కేటాయించింది. అందుకే స్పల్ప లక్షణాలు ఉండేవారు ఇంటిలో ఉంటే మంచిది"అని సంజీవ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోగులు ఏం చేయాలి?
- రోజూ రెండు పుటలా థెర్మామీటర్‌తో శరీర ఉష్ణోగ్రత చూసుకోవాలి. రీడింగ్ వందకుపై ఉంటే వెంటనే కోవిడ్-19 హెల్ప్ లైన్‌కు సంప్రదించాలి.
- పల్స్ రేటును రెండు పూటలా చూసుకోవాలి. మణికట్టుపై చూపుడు, మధ్య వేళ్లను పెట్టి బొటన వెలును దన్నుగా పెట్టి 60 సెన్లపాటు నాడి కొట్టుకోవడాన్ని లెక్కపెట్టాలి. అది వంద దాటితే వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.
- 17 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి. పది రోజుల పాటు జ్వరం లేకపోతే అప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు.
"హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రోగులతోపాటు వారి సంరక్షకులు వేసుకోవాలని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి మార్గదర్శకాలను ఏమీ విడుదల చేయలేదు. ఈ ఔషధాన్ని ఆరోగ్య సిబ్బందికి మాత్రమే ఇస్తున్నారు. గుండె జబ్బులు, బీపీ ఉండేవారు దీన్ని వేసుకుంటే చనిపోయే ముప్పుంది"అని సంజీవ్ సింగ్ అన్నారు.
ఏం తినొచ్చు? ఏం తినకూడదు?
- బ్రౌన్ రైస్, మిల్లెట్స్, గోధుమ, ఓట్స్, బీన్స్, పప్పులు ఒంటికి మంచిది.
- తాజా పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- ఎర్ర క్యాప్సికమ్, క్యారెట్, బీట్‌రూట్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి.
- రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాస్‌ల నీళ్లు తీసుకోవాలి.
- సిట్రస్ పళ్లు.. ఆరెంజ్, బత్తాయి, నిమ్మకాయ రసాలను తీసుకోవాలి.
- అల్లం, వెళ్లుల్లి, పసుపును వాడాలి.
- ఇంటిలో వండిన ఆహారమే మంచిది.
- కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.పాలు, పెరుగు తీసుకోవచ్చు.
- చికెన్, చేప, ఎగ్ వైట్‌లు తీసుకోవాలి.
- మైదా, డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్‌ను తీసుకోకూడదు.
- చక్కెర ఎక్కువగా ఉండేవి, కూల్ డ్రింక్స్ ను దూరం పెట్టాలి.
- చీజ్, కొబ్బరి, పామ్ ఆయిల్, బటర్ వద్దు.
- మటన్, లివర్, ప్రాసెస్డ్ మీట్ దూరం పెట్టాలి.
- మాంసాహారం వారానికి రెండు, మూడు సార్లకు మించి తీసుకోవద్దు.

ఫొటో సోర్స్, Reuters
ఇరుగుపొరుగు వారు ఏం చేయాలి?
- మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనావైరస్ సోకితే ఆందోళన పడొద్దు.
- మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- అపార్ట్‌మెంట్లో ఉండే లిఫ్ట్, మెట్లు తదితర ఎక్కువ మంది ఉపయోగించే ప్రాంగణాలను డిస్ఇన్ఫెక్టెంట్‌లతో కడగాలి.
- రోగులు, రోగుల కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు.
- ఐసోలేషన్ ఉండేవారు బయట తిరిగితే వెంటనే కోవిడ్-19 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలి.
- బయటకు వెళ్లిన ప్రతిసారీ సబ్బునీళ్లతో చేతిని 60 సెకన్లపాటు కడుక్కోవాలి.
- వీలైతో రోగులకు సాయం చేయాలి. వారికి అవసరమైన ఔషధాలు, కురగాయలు, రేషన్ సరకులు అందించేందుకు ప్రయత్నించండి.
- రోగులు కోలుకునేవరకూ వారి నుంచి డబ్బులు తీసుకోవడం, వారికి డబ్బులు ఇవ్వడం తగ్గించాలి.
కరోనావైరస్ వ్యాక్సీన్ మనకెప్పుడు వస్తుంది? - వీక్లీ షో విత్ జీఎస్
"చాలాచోట్ల హోమ్ ఐసోలేషన్‌కు అపార్ట్‌మెంట్లు, చుట్టుపక్కల వారు వ్యతిరేకిస్తున్నారు. చివరకు కోవిడ్-19 రోగులను తీసుకుంటున్న పరిసరాల్లోని ఆసుపత్రులపైనా ఒత్తిడి తెస్తున్నారు"అని సంజీవ్ సింగ్ వివరించారు.
''హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవారిపై మానసిక ఒత్తిడి, ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులపైనా ఒత్తిడి ఉంటుంది. అందుకే ఇరుగుపొరుగువారు వారికి సహకరించాలి. లేకపోతే ఈ మానసిక సమస్యలు మరింత తీవ్రమయ్యే ముప్పుంది''అని మానసిక నిపుణురాలు జీసీ కవిత చెప్పారు.
''ఇదివరకే మానసిక సమస్యలు ఉండే రోగులకు కోవిడ్-19 సోకితే తీవ్రమైన మానసిక సమస్యలు వచ్చే ముప్పంటుంది. ముఖ్యంగా పీటీఎస్‌డీ, ఎక్యూట్ స్ట్రెస్ డిజార్డర్ లాంటివి తిరగబెట్టొచ్చు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే ఇంటిలో ఉంటే ఈ ముప్పు తక్కువ. ఎందుకుంటే చుట్టు పక్కల కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ ఇంటిలో ఉండేవారికి ఇరుగుపొరుగు వారి వేధింపుల వల్ల ముప్పు ఉంటుంది''.
‘‘అందుకే ఇరుగుపొరుగు వారు ఇబ్బంది పెట్టకుండా ఐసోలేషన్‌లో ఉండేందుకు వీలైనంత సాయం అందించాలి. అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారు. వైరస్ వ్యాప్తి ముప్పు కూడా తగ్గుతుంది’’.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: ‘భారత్ మూడు కరోనావైరస్ వ్యాక్సీన్లను తయారు చేస్తోంది’
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)