ఫేస్‌బుక్‌: అంఖీ దాస్ ఎవరు? ఆమె ఎందుకు రాజీనామా చేశారు?

  • అపూర్వ కృష్ణ
  • బీబీసీ ప్రతినిధి
అంఖీ దాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం అధిపతి అంఖీ దాస్ రాజీనామా చేశారు. భారత్‌లో విద్వేష పూరిత వ్యాఖ్యల వివాదంలో ఫేస్‌బుక్ ఆరోపణలు ఎదుర్కొన్న రెండు నెలలకు తాజా పరిణామం చోటుచేసుకుంది.

ముస్లిం వ్యతిరేక పోస్టులతో నిబంధనలు ఉల్లంఘిస్తూ, అధికార పార్టీకి మద్దతునిచ్చే వారు చేసే విద్వేష పూరిత వ్యాఖ్యలను ఫేస్‌బుక్ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది.

ఫేస్‌బుక్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వెనకున్నది అంఖీ దాసేనని, ఆమె ఒక పార్టీకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆ పత్రిక ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలను ఫేస్‌బుక్ ఖండించింది. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని పేర్కొంది.

ఆ తర్వాత కొన్ని రోజులకు పార్లమెంటరీ కమిటీ ముందు ఫేస్‌బుక్ ఇండియా బిజినెస్ విభాగం అధిపతి అజిత్ మోహన్ హాజరై వివరణ కూడా ఇచ్చారు.

తాజా వివాదంపై మోహన్ స్పందించారు. ప్రజాసేవ చేయాలనే అభీష్టం మేరకు అంఖీ దాస్ తన పదవికి రాజీనామా చేశారని వివరించారు.

భారత్‌లో ఫేస్‌బుక్ తొలినాటి ఉద్యోగుల్లో ఒకరైన అంఖీ దాస్.. సంస్థ ఎదుగుదలలో క్రియాశీల పాత్ర పోషించారని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANKHID

ప్రధాని మోదీకి నరేంద్రమోదీ.ఇన్ అనే వ్యక్తిగత వెబ్‌సైట్, నమో అనే వ్యక్తిగత యాప్ ఉన్నాయి.

నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌లోని న్యూస్ సెక్షన్‌లోని రిఫ్లెక్షన్స్ విభాగంలో, నమో యాప్‌లోని ఎక్స్‌క్లూజివ్ సెక్షన్‌లోని ఓ విభాగంలో కొందరి వ్యాసాలు ప్రచురితమవుతుంటాయి.

ఆ వ్యాస రచయితల జాబితాలో అంఖీ దాస్ పేరు కూడా ఉంది.

2017 మార్చిలో నరేంద్రమోదీ.ఇన్‌కు ఆమె వ్యాసం రాశారు. వెబ్‌సైట్‌లో ఆమె పేరిట ఈ ఒక్క వ్యాసమే కనిపిస్తుంది. ‘ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ద న్యూ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ గవర్నెన్స్’ అనే శీర్షికతో అంఖీ ఆ వ్యాసం రాశారు.

‘‘అంఖీ దాస్ భారత్, దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాలకు ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్. ఆమెకు టెక్నాలజీ రంగంలో పబ్లిక్ పాలసీ, రెగ్యులేటరీ వ్యవహారాలకు సంబంధించి 17 ఏళ్ల అనుభవం ఉంది’’ అని నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఆమె గురించి పరిచయ వాక్యాలు ఉన్నాయి.

అంఖీ దాస్ ఇతర మీడియా సంస్థలకు కూడా వ్యాసాలు రాశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లిష్ పత్రిక, అమెరికన్ వార్తా వెబ్‌సైట్ హఫింగ్టన్ పోస్ట్ భారత ఎడిషన్‌లకు కూడా ఆమె ఇదివరకు వ్యాసాలు రాశారు.

ఆమె 2011 నుంచి ఫేస్‌బుక్ కోసం పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్ కన్నా ముందు మైక్రోసాఫ్ట్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా పనిచేశారు. ఆ సంస్థలో ఆమె 2004 జనవరిలో చేరారు. అక్కడ దాదాపు ఎనిమిదేళ్లు పనిచేశాక ఫేస్‌బుక్‌లో చేరారు.

ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రపంచంలోనే శక్తివంతమైన సోషల్ మీడియా సంస్థగా భావించే ఫేస్‌బుక్‌లో భారత్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అధికారుల గురించి ఫేస్‌బుక్ ఇండియా పేజీలోగానీ, వెబ్‌సైట్‌లో గానీ ఎలాంటి సమాచారమూ లేదు.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో అంఖీ దాస్ అంతర్జాతీయ వ్యవహారాలు, రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. ఆమెది 1991-94 బ్యాచ్‌.

ముంబయి దాడులు జరిగి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు అంఖీ ఓ వ్యాసం రాశారు.

‘‘ఛాందసవాదాన్ని ప్రోత్సహించేవారిని ఫేస్‌బుక్‌ వేదికను వాడుకోనివ్వం. ఈ విషయానికి ఫేస్‌బుక్ కట్టుబడి ఉంది. ఈ ఏడాది ఉగ్రవాదంతో సంబంధమున్న 1.4 కోట్ల పోస్టులను మేం తొలగించాం’’ అని ఆమె అందులో పేర్కొన్నారు.

‘‘ఇమేజ్ మ్యాచింగ్, ఇతర ఏఐ మెషీన్ లెర్నింగ్ టూల్స్‌ను ఉపయోగించుకుని అల్ ఖైదా, దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించి, దాన్ని మా వేదికపై లేకుండా చేస్తున్నాం. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదాలకు సంబంధించిన దాదాపు 99 శాతం కంటెంట్‌ను ఎవరూ రిపోర్ట్ చేయకముందే గుర్తించి, మేం తొలగించాం’’ అని అందులో రాశారు.

‘‘మా సంస్థలో ఉగ్రవాద వ్యతిరేక బృందం ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవమున్న నిపుణులు ఇందులో ఉంటారు. టెక్నాలజీతో పాటు కంటెంట్‌ను పరిశీలించేందుకు వివిధ భాషల్లో నిపుణులైనవారిని కూడా మేం నియమించుకున్నాం’’ అని చెప్పారు.

ప్రస్తుతం ఫేస్‌బుక్ విషయమై భారత్‌లో ఓ వివాదం నడుస్తోంది. భారత్‌లో విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను గుర్తించినప్పటికీ, వాటిని తమ వేదిక నుంచి తొలగించవద్దని అంఖీ దాస్ చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/ANKHID

ఫొటో క్యాప్షన్,

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జకర్‌బర్గ్‌తో అంఖీ దాస్

ఫేస్‌బుక్‌పై ఆరోపణలు ఏంటి?

భారత్‌లో అధికార బీజేపీ నేతలు ఫేస్‌బుక్‌లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను.. ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని, చర్యలు తీసుకోవడం లేదని ‘ద వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఇటీవల ఓ కథనం రాసింది. భారత్‌లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో రాశారు.

అంఖీ దాస్‌ ఫేస్‌బుక్‌ ఉద్యోగులతో మాట్లాడినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తన కథనంలో ఉటంకించింది.

బీజేపీ నాయకుల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో ఫేస్‌బుక్ వ్యాపారం‌ దెబ్బతినే ప్రమాదముందని అంఖీ దాస్‌ తమ సంస్థ ఉద్యోగులతో అన్నట్లు ఆ కథనంలో ఉంది.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ సంస్థ ప్రస్తుత ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కూడా గుర్తించారని.. అయినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది.

ఆ నలుగురు నేతల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నాయని అందులో రాసుకొచ్చారు.

వాల్ స్ట్రీట్ కథనం గురించి రాజాసింగ్‌ బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు.

తన పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం ఖాతాలు నడుస్తున్నాయని.. అయితే, వాటిలో తాను చెప్పినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు, అందులో వాడిన భాష మీద తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్‌ అన్నారు.

‘‘నా భాషలో ఎలాంటి తప్పూ లేదు. నా దేశం పట్ల, నా ధర్మం పట్ల కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను సమాధానం ఇవ్వక తప్పదు. అది నా బాధ్యత. వారు మాట్లాకపోతే నేను కూడా మాట్లాడను. నేను దీని కోసం కేసులు ఎదుర్కొంటున్నాను. కోర్టులకు తిరుగుతున్నాను. మేం చేసిన వ్యాఖ్యలకు వివరణ కూడా ఇస్తున్నాం. ఇందులో మా వైపు నుంచి తప్పేమీ లేదు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

‘ఆర్ఎస్ఎస్ అదుపులో ఫేస్‌బుక్, వాట్సాప్’

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

"ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్‌ అదుపులో ఉన్నాయి. ఫేక్‌ న్యూస్‌ను, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి'' అని ట్విటర్‌ వేదికగా ఆరోపించారు.

"చివరకు అమెరికా మీడియాయే ఫేస్‌బుక్‌పై అసలు నిజాలను బయటపెట్టింది'' అని రాహుల్ తన ట్వీట్‌లో విమర్శించారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌లో స్పందించారు.

"తమ సొంతవారిని కూడా ప్రభావితం చేయలేని వారు.. ప్రపంచం మొత్తాన్నీ బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రభావితం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు'' అని ఆయన విమర్శించారు.

"కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం తీసుకుని ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా?'' అని రవిశంకర్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

ఈ వివాదంపై ఫేస్‌బుక్ కూడా స్పందించింది.

వ్యక్తుల రాజకీయ హోదాలు, పార్టీలతో వారి అనుబంధాలతో సంబంధం లేకుండా తాము అంతర్జాతీయ స్థాయిలో విధానాలను అమలు చేస్తుంటామని, హింసను ప్రేరేపించే విద్వేష పూరిత ప్రసంగాలను, సమాచారాన్ని నిషేధిస్తామని ప్రకటించింది.

''హింసను ప్రేరేపించే విద్వేష పూరిత ప్రసంగాలను, సమాచారాన్ని మేం నిషేధిస్తాం. వ్యక్తుల రాజకీయ హోదా, పార్టీ అనుబంధంతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా విధానాలను అమలు చేస్తాం. అయితే, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మాకు తెలుసు. నిష్పక్షపాతాన్ని, కచ్చితత్వాన్ని పాటించేలా ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహిస్తున్నాం'' అని ఫేస్‌బుక్ సంస్థ అధికార ప్రతినిధి బీబీసీకి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)