మోదీకి చంద్రబాబు లేఖ: ‘ప్రతిపక్ష నాయకులు, లాయర్లు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు’ - ప్రెస్ రివ్యూ

చంద్రబాబు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారని సాక్షి కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులోని వివరాలివీ..

‘‘ఏపీలో రాజకీయ నాయకులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్‌ రూపంలో వాటిల్లిన తీవ్రమైన ముప్పును మీ దృష్టికి తెస్తున్నా. వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు.

గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై, విధానాలపై దాడి చేయడం ద్వారా పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్‌ చేయడం అధికార పార్టీ దినచర్యగా మారింది.

వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో చట్టబద్ధమైన ఎటువంటి విధానాన్ని రాష్ట్రప్రభుత్వం పాటించడంలేదు. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్‌ 19, 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే.

ఏ కారణాలు లేకుండానే అధికార పార్టీ తన రాజకీయ లాభాలకోసం చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తోంది. ఇల్లీగల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్‌ జరుగుతోందని ఆందోళన చెందుతున్నాం.

ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమేగాక అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్‌ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుంది.

ఏ విధంగానైనా అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార పార్టీ దారుణంగా బెదిరిస్తోంది. తమ చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో న్యాయవ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఇల్లీగల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.

ఏపీలో అధికార పార్టీ, ప్రైవేటు వ్యక్తులతో ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.’’

ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని కోరుతున్నాను అని చంద్రబాబు లేఖలో రాశారని పత్రిక చెప్పింది.

దీనికి స్పందించిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఏపీలో జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారనేది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారని కూడా సాక్షి తెలిపింది.

ఏపీ, తెలంగాణల్లో 94 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేవు -'క్రై' సర్వే

ఏపీ, తెలంగాణల్లో 94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదని, వారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమేనని తాజా సర్వేలో వెల్లడైనట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు లు.

ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఈనాడు రాసింది.

మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల మధ్య ఉండే 5,987 విద్యార్థులతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. కొవిడ్‌-19 కారణంగా పాఠశాలల మూతపడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్‌ విద్య ఎంత మందికి అందుబాటులో ఉందో.. వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే నిర్వహించినట్లు తెలిపింది.

సర్వేలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పరిస్థితే గుడ్డిలో మెల్ల. ఆ రాష్ట్రం నుంచి స్పందించిన 1145 మంది విద్యార్థుల్లో తొమ్మిది శాతం మందికి వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి.

తమిళనాడులో అత్యల్పంగా మూడు శాతం మందికే ఈ ఫోన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆందోళన కలిగించే విషయమేంటంటే సర్వే చేసిన విద్యార్థుల కుటుంబాల్లో 95 శాతం మంది వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువేనని చెప్పారు.

ఆ ఆదాయంతో వారు స్మార్ట్‌ఫోన్‌ కొనడం.. పిల్లలను ఆన్‌లైన్‌ చదివించడం కష్టమేనని సర్వే అభిప్రాయపడిందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా

జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఊపిందని ఆంధ్రజ్యోతి సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణపై కొంత కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు తెరదించింది. పరీక్షల నిర్వహణకు పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు కరోనా ఉధృతి కారణంగా జేఈఈ(మెయిన్‌), నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం కొట్టివేసింది.

పదకొండు రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు... సెప్టెంబరులో నిర్వహించనున్న జెఈఈ(మెయిన్‌), నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

‘‘ కరోనా పేరుతో జీవితం ఆగిపోకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. మరో ఏడాది దాకా కరోనా పోయే పరిస్థితులు లేవు. అప్పటి వరకు పరీక్షలను వాయిదా వేయాలంటే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టలేం, విద్యా సంవత్సరాన్ని వృథా చేయడం ఇష్టం లేదు’’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను బెంచ్‌ కొట్టివేసింది.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తరపున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది. జేఈఈ(మెయిన్‌)ని సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్‌ను సెప్టెంబరు 13న నిర్వహించనున్నారని కథనంలో వివరించారు.

ఫొటో క్యాప్షన్,

కీసర తాసిల్దార్ నాగరాజు

కీసర తాసిల్దార్ అక్రమాలు ఎన్నో: దర్యాప్తు అధికారులు

తెలంగాణలో భారీ లంచం తీసుకుంటూ ఏపీబీకి దొరికిన నాగరాజు చాలా అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

తెలంగాణలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన కీసర తాసిల్దార్‌ నాగరాజు కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే నాగరాజు సహా మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

రెండు రోజులపాటు కాప్రా, అల్వాల్‌, కీసరల్లో నాగరాజు ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న పలు కీలక భూ దస్ర్తాలను ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నారు.

వీటిలో పదుల సంఖ్యకు పైగా కీలక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మరేమైనా ఆస్తులు కూడబెట్టాడా? అన్నది కూపీ లాగుతున్నారని పత్రిక చెప్పింది.

సోదాల్లో భాగంగా నాగరాజుకు సంబంధించిన ఓ బ్యాంకు లాకర్‌ తాళం చెవిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకర్‌ను ఓపెన్‌ చేస్తే మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని ఏసీబీ అధికారుల భావిస్తున్నారు.

భూరికార్డుల నిబంధనలను తుంగలోతొక్కిన తాసిల్దార్‌ నాగరాజు నిర్ణీత సర్వే నంబర్‌లో స్థలవిస్తీర్ణం అధికంగా లేకున్నా.. డబుల్‌ ఎం ట్రీస్‌ లేకు న్నా వాటిని బ్లాక్‌ చేసి ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేస్తాడని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఆన్‌లైన్‌ పహాణీలు రాకపోవడం, డిజిటల్‌ సంతకం లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ తాసిల్దార్‌ను సంప్రదిస్తారని, అదే సమయంలో అతడు డబ్బు డిమాండ్‌ చేస్తాడని వివరించింది.

నాగరాజు కీసర మండలంలో 30% భూములను బ్లాక్‌ చేసినట్టు తెలిసిందని కథనంలో రాశారు.

నాగరాజు తన అక్రమ ఆస్తులను అమెరికాలో ఉన్న మిత్రుల పేరునా కొనుగోలు చేసినట్టు సమాచారం ఉందని పత్రిక చెప్పింది.

నగదు మర్వాడీ సేట్ల దగ్గర పెట్టారని, అమెరికాలో ఉంటున్న మిత్రుల పేరిట మీద ఏఎస్‌రావునగర్‌, అల్వాల్‌, బొల్లారం, కొంపల్లి ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం ఉందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)