కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- సౌతిక్ బిశ్వాస్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, AFP
భారత్‌లో కోవిడ్-19 మరణాల సంఖ్య 50,000 దాటింది. మృతుల సంఖ్యలో బ్రిటన్ను దాటేసిన భారత్ అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది.
కానీ, భారత్‌లో పది లక్షల మందికి మృతుల సంఖ్య మాత్రం 34 దగ్గరే ఉంది. ఇది యూరప్, ఉత్తర అమెరికాలో నమోదైన దానికంటే చాలా తక్కువ.
“కోవిడ్-19 రోగుల్లో మరణాల రేటు (సీఎఫ్ఆర్) దాదాపు 2 శాతమే ఉంది. కరోనాకు ఘోరంగా ప్రభావితమైన మహారాష్ట్రలో కూడా మరణాల సంఖ్య దాదాపు 40 రోజులకు రెట్టింపు అవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా, మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది” అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీనాథ్ రెడ్డి నాకు చెప్పారు.
మరణాల రేటు తక్కువగా ఉండడానికి యువ జనాభా కారణమని చాలా మంది ఎపిడెమాలజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధులు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్కు గురవుతారని అంటున్నారు. మిగతా కరోనావైరస్ల ద్వారా గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడిన రోగనిరోధకశక్తి లాంటి ఇతర అంశాలు కూడా దీనికి కారణమా అనేది స్పష్టంగా తెలీడం లేదు.
అలాగే, యువత ఎక్కువగా ఉన్న దక్షిణాసియా దేశాల్లో కూడా మరణాలు తక్కువగా ఉన్నాయని వారు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పది లక్షల మందికి మరణాల సంఖ్య 22గా ఉంటే, పాకిస్తాన్‌కో అది 28గా ఉంది.
భౌగోళికంగా పోల్చేటపుడు ఆ విలువలకు కొన్ని పరిధిలు ఉంటాయని ప్రొఫెసర్ బసు నాతో అన్నారు.
“చైనాలో పది లక్షల జనాభాకు కోవిడ్-19 మరణాలు మూడు మాత్రమే నమోదవుతున్నాయి. భారత్‌లో ఆ సంఖ్య 34గా ఉంది. అది తెలీగానే.. మనకు భారత్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనిపిస్తుంది. దక్షిణాసియాలో భారత్ కంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది అఫ్గానిస్తాన్ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే భారత్ అఫ్గానిస్తాన్‌ను కూడా దాటేస్తుందని అనిపిస్తోంద”ని చెప్పారు.
“జనాభా పరిమాణం ప్రకారం చూస్తే, యూరప్, అమెరికాల కంటే భారత్ స్పష్టంగా మెరుగ్గా ఉంది. అయినా, దీనిని ఊరటగా భావించడం బాధ్యతారాహిత్యం” అని ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు అన్నారు.
తక్కువ చేసి చెబుతున్నారా?
“కేసుల సంఖ్య తగ్గకుండా ఉన్న కొన్ని దేశాల్లో భారత్ కూడా ఉంది. మార్చి చివరి నుంచి ఇప్పటివరకూ కేసులు, మరణాలు పెరగడం మాత్రమే కాదు, వాటి రేటు కూడా పెరుగుతోంది” అని బసు అంటున్నారు.
భారత్‌లో తక్కువగా ఉన్న మరణాల రేటు మొత్తం వాస్తవాలను చెప్పడం లేదని, చాలా రాష్ట్రాల్లో ఈ లెక్కలు తక్కువ చేసి చెబుతున్నారని కొందరు భావిస్తున్నారు.
ఒకటి: చాలా రాష్ట్రాల్లో డబ్ల్యుహెచ్ఓ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుమానిత కేసులను ఈ లెక్కలో చేర్చడం లేదు.
రెండు: కొన్ని రాష్ట్రాలు చాలా కోవిడ్-19 మరణాలను, అంతకు ముందే ఉన్న వ్యాధుల వల్ల లేదా వేరే కారణాలతో చనిపోయారని చెబుతున్నాయి. గుజరాత్, తెలంగాణ ఈ కేసులను చాలా తక్కువ చేసి చెబుతున్నాయని హెల్త్ జర్నలిస్ట్ ప్రియాంక పుల్లా పరిశోధనలో తేలింది. ఉదాహరణకు గుజరాత్‌లోని వడోదరలో కేస్ లోడ్ భారీగా 329 శాతం పెరిగినా, మరణాలు మాత్రం గత రెండు నెలల్లో 49 శాతమే పెరిగాయి.
మూడు: కరోనా మృతుల అధికారిక లెక్కలు, శ్మశాన వాటికల నుంచి అందుతున్న గణాంకాల మధ్య కొన్ని నగరాల్లో తేడా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే భారత్‌లో చాలా మరణాలు లెక్కలోకి రావడం లేదు.
జనాభాలో చాలా తక్కువ శాతం (1 శాతం లోపే) మందికి పరీక్షలు జరగడాన్ని బట్టి చూస్తుంటే, భారత్‌లో చాలా మరణాలు మిస్ అవుతున్నాయి. అంటే, చాలా మృతులను వైద్యపరంగా రిపోర్ట్ చేయడం లేదా?
“మనకు బలహీనమైన ఆరోగ్య నిఘా వ్యవస్థలు ఉండడం వల్ల, ఆ లెక్కలు తక్కువచేసి చెబుతున్నారు” అని దిల్లీకి చెందిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కి చెందిన ఊమెన్ సి.కురియన్ అన్నారు.
“చారిత్రక గణాంకాలు, కరోనా సమయంలో అదనంగా ఎంతమంది చనిపోయారు అనే లెక్కలు లేకుండా, వారు ఎంత తక్కువ చేసి చెబుతున్నారో, తెలుసుకోవడం కష్టం” అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ఎమిడెమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ చెప్పారు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
భారత్ లెక్కలు తక్కువ చేసి చెప్పడం కొత్త కాదు. జూలైలో 28 దేశాల మరణాల రేటుపై జరిగిన ఒక సమీక్షలో.. మహమ్మారి సమయంలో కోవిడ్-19 అధికారిక మృతుల సంఖ్య కంటే అదనంగా మరో 1,61,000 మంది చనిపోయినట్లు గుర్తించారు. ఆ సర్వే చేసిన దేశాల్లో భారత్ లేదు.
అదనపు మరణాలు ఎన్ని?
‘అదనపు మరణాలు’ అంటే మృతుల సంఖ్య సాధారణ స్థాయికి మించి ఉండడం. వాటిలో కొన్ని కోవిడ్-19 వల్ల కూడా ఉండచ్చు.
ఈ అదనపు మరణాలను లెక్కించడానికి కనీసం గత మూడేళ్ల మరణాల గణాంకాలను విడుదల చేయాలని 230 మందికి పైగా భారతీయులు అధికారులను కోరారు. వీరిలో డాక్టర్లు, పరిశోధకులు, విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి లెక్కలు కూడా అడిగారు. దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షన్నర మంది చనిపోతున్నారు. వాటిని వేరు చేస్తే.. భారత్‌లో వ్యాధుల వల్ల ఏటా ఎంతమంది చనిపోతున్నారనేదానిపై మరింత స్పష్టత వస్తుంది.
“మంచి వైద్య వ్యవస్థ, సామర్థ్యం అధికాదాయ దేశాలు కూడా మరణాల సంఖ్యను 30 నుంచి 60 శాతం తక్కువ చేసి చెబుతున్నట్లు తెలుస్తోంది” అని ప్రపంచంలో అకాల మరణాలపై జరిగిన అతిపెద్ద అధ్యయనాల్లో ఒకటైన మిలియన్ డెత్ సర్వేను లీడ్ చేసిన టొరంటో యూనివర్సిటీకి చెందిన ప్రబా ఝా నాకు చెప్పారు.
“లాక్డౌన్ సమయంలో వివిధ నగరాల్లోని లక్షలాది భారతీయులు తమ పనులు వదులుకుని ఎక్కడికెళ్లారో తెలుసుకోడానికి టెలీకాం సంస్థలు మార్చి నుంచి కాల్ రికార్డుల డేటా విడుదలచేయాలి” అని డాక్టర్ ఝా చెప్పారు. (లాక్డౌన్ వల్ల నగరాల్లో ఉద్యోగాలు పోవడంతో వీరంతా రైళ్లలో, కాలినడకన వెళ్లారు. ఇన్ఫెక్షన్ వ్యాపించేలా చేశారు.)
“ప్రభుత్వం ఈ టెలికాం డేటాను ఉపయోగించి.. లెక్కలోకి రాని వయోజనుల మరణాలను నమోదు చేయడానికి తమ బృందాలను హాట్‌స్పాట్ ప్రాంతాలకు పంపించవచ్చు. అదనపు మరణాల గురించి తెలుసుకోడానికి మునిసిపాలిటీలు కూడా అంతకుముందు సంవత్సరాల్లో అన్ని కారణాలతో చనిపోయిన వారి గణాంకాలు విడుదల చేయాలి” అని ఆయన సూచించారు.
“మరణాలను సరిగా గుర్తించనప్పుడు, కోవిడ్-19 మరణాలు తగ్గాయని భారత్ ఎలా చెప్పగలదు?” అంటారు డాక్టర్ ఝా.
ఈ మహమ్మారి అంతమైనపుడు, ఆ వ్యాధిని ఎదుర్కోవడంలో ఏ దేశం పనితీరు ఎలా ఉందో సూచించేది ఆయా దేశాల కరోనా లెక్కలు మాత్రమే.
చార్టులు-షాదాబ్ నజ్మీ
ఇవి కూడా చదవండి:
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)